థైరాయిడ్ వ్యాధి: రకాలు, లక్షణాలు, కారణాలు & నియంత్రణ చర్యలు

థైరాయిడ్ వ్యాధి: రకాలు, లక్షణాలు, కారణాలు & నియంత్రణ చర్యలు

థైరాయిడ్ గ్రంథి అనేది మెడ మధ్య స్వరపేటిక క్రింద భాగాన, కాలర్ ఎముక పైన సీతాకోక చిలుకను పోలిన ఆకారంలో ఉంటుంది. ఇది మన శరీరం పనితీరుకు అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ గ్రంథి ద్వారా స్రవించే హార్మోన్ల కారణంగానే మానవ శరీరంలో జీవక్రియలు, అభివృద్ధి సక్రమంగా జరుగుతాయి. థైరాయిడ్‌ గ్రంథిలో ఏదైనా సమస్య ఏర్పడితే అది మొత్తం శరీర విధులను ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ వ్యాధి ఒక దీర్ఘ కాలిక సమస్య. ఈ వ్యాధితో బాధపడే వారు అనేక ఆరోగ్య సమస్యలను (హృదయ స్పందన రేటు, మానసిక స్థితి, శరీరంలో శక్తి స్థాయిలు, జీవక్రియలు, ఎముకల ఆరోగ్యం, గర్భధారణ, శరీర ఉష్ణోగ్రత, కొవ్వు నియంత్రణ) ఎదుర్కోవాల్సి ఉంటుంది. థైరాయిడ్ వ్యాధి అనేది లింగం మరియు వయస్సుతో సంబంధం లేకుండా ఎవరికైనా రావచ్చు. అయితే ఈ సమస్య మగవారి కంటే ఆడవారిలోనే దాదాపు రెండింతలు ఎక్కువగా కనిపిస్తుంది.

థైరాయిడ్ గ్రంధి ముఖ్యంగా రెండు ప్రధాన హార్మోన్లను థైరాక్సిన్ (T-4) మరియు ట్రైయోడోథైరోనిన్ (T-3) ని తయారు చేస్తుంది. T3, T4 హార‌్మోన్లు అనేవి మన శరీరంలోని అవయవాల జీవక్రియలకు సంబంధించిన హార్మోన్లు. ఈ హార్మోన్లు శరీరంలోని ప్రతి కణాన్ని ప్రభావితం చేస్తాయి. T3, T4 తయారీకి TSH (థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్) అనేది అవసరం. ఎప్పుడైతే శరీరంలో T3, T4 తగ్గుతాయో, అప్పుడు వీటి ఉత్పత్తిని పెంచడానికి TSH విడుదల అవుతుంది. ముఖ్యంగా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ల స్థాయిని తెలుసుకోవడానికి TSH పరీక్ష నిర్వహిస్తారు. TSH సాధారణ స్థాయి 0.4 mU/L నుండి 4.0 mU/L వరకు ఉంటుంది. 4.0 కంటే ఎక్కువ ఉండే TSH స్థాయిని హైపోథైరాయిడ్‌గా పరిగణిస్తారు. అదేవిధంగా TSH స్థాయి 0.4 mU/L కంటే తక్కువగా ఉంటే హైపర్ థైరాయిడ్‌గా పరిగణిస్తారు.

థైరాయిడ్‌ వ్యాధి రకాలు & వాటి యొక్క లక్షణాలు

శరీరంలో థైరాయిడ్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు ‘హైపర్ థైరాయిడిజం’, అదేవిధంగా థైరాయిడ్ హార్మోన్ తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అయినప్పుడు ‘హైపోథైరాయిడిజం’ సమస్యల బారిన పడతారు. 

  1. హైపోథైరాయిడిజం: థైరాయిడ్ హార్మోన్ తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అయినప్పుడు ‘హైపోథైరాయిడిజం’ సమస్య వస్తుంది. నీరసం, మలబద్ధకం, చర్మం పొడిబారడం, ఆకలి మందగించడం, బరువు పెరగడం, నిద్రలేమి, నెలసరిలో ఇబ్బందులు, చలిని తట్టుకోలేక పోవడం, గుండె సాధారణం కంటే తక్కువ సార్లు కొట్టుకోవడం, థైరాయిడ్ గ్రంథి వాపు (goitre) వంటి హైపోథైరాయిడిజం లక్షణాలు కనబడతాయి. సరైన మందులు మరియు జీవనశైలి మార్పులతో ఈ సమస్యను నియంత్రించవచ్చు.
  2. హైపర్ థైరాయిడిజం: థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తి అయినప్పుడు ‘హైపర్ థైరాయిడిజం’ సమస్య వస్తుంది. ఆకలి ఎక్కువగా అవ్వడం, బరువు తగ్గడం, చెమటలు ఎక్కువ పట్టడం, చిరాకు మరియు స్థిమితం లేకపోవడం, నిద్ర లేమి, నీరసం, ఎక్కువసార్లు విరోచనాలు అవ్వడం, నెలసరిలో రక్తస్రావం, థైరాయిడ్ గ్రంథి వాపు, గుండె దడ అనిపించడం, కళ్ళు పెద్దవిగా అవ్వడం, చేతులు వణకడం వంటివి హైపర్ థైరాయిడిజం యొక్క ముఖ్య లక్షణాలు. సరైన మందులు మరియు రేడియోయాక్టీవ్ అయోడిన్ చికిత్సతో ఈ సమస్యను నయం చేయవచ్చు.
  3. థైరాయిడ్ క్యాన్సర్: ఇది థైరాయిడ్ గ్రంధిని ప్రభావితం చేసే ఒక అరుదైన క్యాన్సర్. మెడ భాగంలో ముద్దలా ఉండడం, గొంతు బొంగురుపోవడం, మింగడంలో ఇబ్బంది మరియు ఊపిరి ఆడకపోవడం వంటివి థైరాయిడ్ క్యాన్సర్ యొక్క ప్రధాన లక్షణాలు. ఈ క్యాన్సర్‌ను సర్జరీ, రేడియేషన్ థెరపీ లేదా కీమోథెరపీ వంటి ఆధునిక చికిత్సలతో నయం చేయవచ్చు.

పై లక్షణాలతో పాటు

  • వీర్యకణాల సంఖ్య మరియు వీర్యకణాల కదలిక తగ్గటం
  • కండరాల బలహీనత
  • ఎప్పుడు అలసటగా ఉండడం
  • ఊబకాయం
  • హై బీపీ
  • జుట్టు ఊడిపోవటం
  • సంతాన లేమి సమస్య వంటి అనేక సమస్యలు థైరాయిడ్ అసాధారణతల వల్ల కలుగుతాయి.

థైరాయిడ్ వ్యాధికి గల కారణాలు

థైరాయిడ్‌ వ్యాధి అనేది అనేక కారణాల వల్ల సంభవించవచ్చు

  • వయస్సు పై బడడం
  • వంశపారంపర్యం
  • అయోడిన్ లోపం
  • థైరాయిడ్ గ్రంధి సరిగా పని చేయకపోవడం
  • థైరాయిడిటిస్ (థైరాయిడ్ గ్రంధి వాపుకు గురవ్వడం)
  • ప్రసవానంతర థైరాయిడిటిస్ (ఇది డెలివరీ తర్వాత కొంతమంది మహిళల్లో సంభవిస్తుంది)
  • టర్నర్స్ సిండ్రోమ్
  • ఆటో ఇమ్యూన్ వ్యాధులు (హషిమోటోస్ థైరాయిడిటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, టైప్-1 మధుమేహం, లూపస్) వంటి అనేక అనారోగ్య పరిస్థితులను కలిగి ఉన్న వారిలోనూ ఈ థైరాయిడ్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.

థైరాయిడ్ వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం
  • తగినంతగా అయోడిన్ మరియు థైరాయిడ్ హార్మోన్ ను కలిగి ఉండడం (థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కావడానికి అయోడిన్ ఎంతో అవసరం. ఆహారంలో అయోడిన్ తగినంత లేకపోతే థైరాయిడ్ హార్మోన్ అనేది అవసరమైనంత విడుదల కాదు, దీంతో థైరాయిడ్ గ్లాండ్ కూడా వాపుకు గురవుతుంది)
  • థైరాయిడ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది కావున  ప్రొటీన్స్, విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉండే సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి
  • థైరాయిడ్ సమస్య ఉన్న వారు శరీర బరువును అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం
  • డాక్టర్ సూచనల మేరకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే కాక ఒత్తిడి, ఆందోళనలను అదుపులో ఉంచుకోవాలి
  • వైద్యులు సిఫారసు చేసిన ట్యాబ్లెట్లను ప్రతి రోజూ క్రమం తప్పకుండా వేసుకోవాలి
  • థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్నాక ఇతర టాబ్లెట్స్ వేసుకోవడం వంటివి చేయకూడదు
  • థైరాయిడ్ టాబ్లెట్లకు ఎండ తగలడం వలన కూడా వాటి ప్రభావం తగ్గిపోగలదు. కాబట్టి వాటిని ఎండ తగలని స్థలంలో పెట్టుకోవాలి

థైరాయిడ్ గ్రంథిలో వాపు లేదా అసౌకర్యంగా ఉన్నట్లు అయితే వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. ఒకవేళ రక్త పరీక్షలో బాగున్నప్పటికీ గొంతు ముందు భాగంలో గడ్డ లాగా, లేక వాపు లాగా ఉంటే, నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహా మేరకు వెంటనే గొంతు స్కాన్ చేయించడం వంటివి చేయాలి. అవసరమైతే ఆ వాపుకు (FNAC) పరీక్ష వంటివి కూడా తప్పక చేయించాలి. 

థైరాయిడ్ అనేది కుటుంబంలో ఎవరికైనా ఉంటే వంశపారపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది, కావున అలాంటి వారు ప్రతి 6 నెలలకు ఒక్కసారి వైద్యుల సూచన మేరకు రెగ్యులర్ స్క్రీనింగ్‌లు మరియు జన్యు పరీక్షలు వంటివి చేయించుకోవడం మంచిది. ఏది ఏమైనప్పటికీ వ్యాధి తీవ్రతరం కాకముందే వైద్యులను సంప్రదించి సరైన మందులను వాడుతూ ఉండడం వల్ల ఈ థైరాయిడ్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో పెట్టుకోవచ్చు.

About Author –

Dr. Arun Mukka, Consultant Endocrinologist, Yashoda Hospital, Hyderabad
MD, DM (Endocrinology)

About Author

Dr. Arun Mukka | yashoda hospitals

Dr. Arun Mukka

MD, DM (Endocrinology)

Consultant Endocrinologist