అధిక బరువు & బేరియాట్రిక్ సర్జరీ గురించి పూర్తి సమాచారం
ప్రస్తుత సమాజంలో ఎదుర్కొంటున్న అతి పెద్ద అనారోగ్య సమస్యలలో ఊబకాయం ఒకటి. ఇటీవల కాలంలో మారిన ఆహారపు అలవాట్లు మరియు కదలిక లేని జీవనశైలి వల్ల చాలా మందిలో ఊబకాయం సమస్య సర్వసాధారణం అయిపోయింది. అయితే అధికంగా ఆహారాన్ని తీసుకుని శారీరక శ్రమ మరియు వ్యాయామం చేయకుండా ఉన్నట్లయితే శరీరంలో శక్తి నిల్వలు పేరుకుపోయి అవి కొవ్వుగా మారి ఊబకాయానికి దారితీస్తుంది. అధిక బరువును కలిగి ఉన్న వారికి చాలా రకాల వ్యాధులు దరిచేరడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు సైతం తలెత్తుతాయి. ఈ సమస్యతో బాధపడేవారు ఎక్కువ కాలం జీవించలేరు, అదేవిధంగా దీర్ఘకాలిక అనారోగ్యానికి గురవుతుంటారు.
25.0 నుంచి 29.9 వరకు బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఉన్న వ్యక్తులను అధిక బరువు ఉన్నవారిగా గుర్తిస్తారు. బాడీ మాస్ ఇండెక్స్ అనగా శరీర ద్రవ్యరాశి సూచిక. 30 లేదా అంతకంటే ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్ కలిగి ఉన్నట్లయితే ఆ పరిస్థితిని స్థూలకాయంగా చెబుతారు. అయితే పిల్లలు మరియు కౌమార దశలో ఉన్న చిన్నారుల్లో BMIను విభిన్నంగా వివరిస్తారు. పిల్లల బాడీ మాస్ ఇండెక్స్ తరచుగా వారి వయస్సులో ఉన్న ఇతర పిల్లల సగటు బాడీ మాస్ ఇండెక్స్ తో పోల్చబడుతుంది.
అసలు అధిక బరువుకు కారణాలేమిటి? ఊబకాయం వల్ల వచ్చే ప్రమాదకరమైన వ్యాధులు మరియు ఈ సమస్యకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న నూతన చికిత్స విధానాలను గురించి తెలుసుకుందాం.
బరువు పెరగడానికి గల కారణాలు
బరువు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ, ముఖ్యంగా:
- ఒత్తిడితో కూడిన జీవనశైలి
- సగటు వయసు పెరగడం
- తగినంత నీటిని తీసుకోకపోవడం
- సరైన వ్యాయామం లేకపోవడం
- సమయానుకూలంగా నిద్రలేకపోవడం
- ఫైబర్ ఉన్న ఫుడ్స్ (పండ్లు, కూరగాయలు) తక్కువగా తీసుకోవడం
- జంక్ఫుడ్స్, పాస్ట్‌ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం
- అధిక చక్కెరలు కలిగిన (తీపి పానియాలు, కూల్ డ్రింక్స్, కుకీస్, కేక్స్, క్యాన్డ్ ఫ్రూట్ డ్రింక్స్, ఐస్ క్రీమ్) వాటిని ఎక్కువగా తీసుకోవడం
- యాంటిడిప్రెసెంట్స్ మరియు కార్టికోస్టెరాయిడ్స్ వంటి కొన్ని మందులు తీసుకోవడం
- పై వాటితోపాటు కుటుంబ చరిత్ర మరియు జన్యుపరంగా కూడా ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది
అధిక బరువు (ఊబకాయం) వల్ల వచ్చే వ్యాధులు
ఆస్టియో ఆర్థరైటిస్: అధిక బరువు కలిగి ఉండటం వల్ల మోకాళ్లపై అదనపు ఒత్తిడి కలిగి చిన్న వయస్సులోనే మోకాలి మార్పిడి అవసరం రావచ్చు.
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD): కాలేయంలో కొవ్వు పేరుకుపోయి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) సంభవిస్తుంది. ఇది మీ కాలేయానికి దీర్ఘకాలిక హాని కలిగించవచ్చు.
క్యాన్సర్: అధిక బరువు లేదా ఊబకాయం వల్ల శరీరంలో దాదాపు 18 రకాలకు పైగా క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది.
అధిక కొలెస్ట్రాల్: అధిక కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పడి స్ట్రోక్ లేదా గుండెపోటుకు గురవుతారు.
అధిక రక్త పోటు: అధిక రక్త పోటు వల్ల రక్తనాళాల ద్వారా ప్రవహించే రక్తం యొక్క ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తనాళాల గోడలను దెబ్బతీయడంతో గుండెపోటు మరియు స్ట్రోక్ వంటివి రావొచ్చు.
టైప్ 2 డయాబెటిస్: శరీరంలో కొవ్వు నిల్వ మరియు ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉన్నట్లయితే నరాలు, రక్త నాళాలు మరియు అవయవాలు దెబ్బతినడమే కాక టైప్-1, టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది.
గుండె జబ్బు: ఊబకాయం వల్ల రక్తప్రసరణ నెమ్మదించి గుండె పనితీరు బలహీనపడడంతో గుండె వైఫల్య సమస్యలు సైతం తలెత్తుతాయి.
కిడ్నీ వ్యాధి: ఊబకాయంతో సంబంధం ఉన్న మెటబాలిక్ సిండ్రోమ్‌లు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి మరియు మూత్రపిండాల వైఫల్యానికి కూడా కారణం కావొచ్చు.
పై సమస్యలతో పాటు పురుషులలో అంగస్తంభన సమస్యలు మరియు స్త్రీలలో గర్భధారణ సమస్యలు దరిచేరుతాయి.
బేరియాట్రిక్ సర్జరీ గురించి వివరణ
జీవనశైలిలో గణనీయమైన మార్పులు చేసి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా నిరంతరంగా బరువు పెరుగుతూ ఉంటే లేదా బరువు తగ్గడం కష్టంగా అనిపిస్తే మీరు ఖచ్చితంగా బేరియాట్రిక్ సర్జరీను (మెటబాలిక్ సర్జరీ) ఎంపిక చేసుకోవడం ఉత్తమం. బరువును తగ్గించుకునేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న నూతన చికిత్సా విధానాలలో బేరియాట్రిక్ సర్జరీ ఉత్తమమైనది. ఈ ప్రక్రియలో పొట్టను కుదించడం లేదా పేగును బైపాస్ చేయడంతో తినే ఆహార పరిమాణాన్ని తగ్గించడం ద్వారా బరువు తగ్గుదలకు దోహాదపడుతుంది. ఊబకాయంతో బాధపడుతున్నవారిని సాధారణ స్థాయికి తీసుకురావడమే ఈ సర్జరీ యొక్క ప్రధాన ఉద్దేశం.
ఈ సర్జరీ చేయించుకోవడం వల్ల ఒక వ్యక్తి ముందు ఉన్న బరువులో దాదాపు 75 నుంచి 80 శాతం తగ్గించుకోవచ్చు. కనిష్ట ఇన్వేసివ్ సర్జికల్ టెక్నిక్లను (లాపరోస్కోపిక్ మరియు రోబోటిక్ సర్జరీ) ఉపయోగించి దీనిని నిర్వహిస్తారు. స్థూలకాయంతో బాధపడే రోగులకు మెరుగైన జీవన నాణ్యతను అనుభవించడానికి మరియు సుదీర్ఘ జీవితకాలం గడపడానికి ఈ సర్జరీ ఎంతగానో ఉపయోగపడుతుంది.
సర్జరీ చేసే ముందు గుండె, ఊపిరితిత్తులు మరియు మిగిలిన అవయవ పనితీరు చూసుకుని జనరల్ అనస్థీషియా పర్యవేక్షణలో సర్జరీని పూర్తి చేస్తారు. అయితే హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ లో సర్జరీ అయిన తర్వాత మంచి న్యూట్రీషియన్ టీం, ఫిజియో థెరపిస్ట్, నర్సింగ్ టీం, ఇలా చాలా రకాల సపోర్ట్ టీమ్స్ అందుబాటులో ఉన్నాయి. సర్జరీ అయిన తర్వాత కూడా పేషెంట్ల పట్ల మంచి సంరక్షణను కలిగి ఉన్నట్లయితే వారు త్వరగా కోలుకోవడం జరుగుతుంది.
బేరియాట్రిక్ సర్జరీ రకాలు
బేరియాట్రిక్ సర్జరీ 3 రకాలుగా ఉన్నాయి, అవి ఏమనగా:
- గ్యాస్ట్రిక్ బైపాస్: బేరియాట్రిక్ సర్జరీలో అత్యంత సాధారణ రకం గ్యాస్ట్రిక్ బైపాస్. ఇది ఇతర విధానాల కంటే తక్కువ ప్రమాదాలను కలిగి ఉండడంతో చాలా మంది ఈ రకమైన సర్జరీని ఎంచుకుంటారు. ఇందులో పొట్టను చిన్న ఎగువ పర్సు మరియు దిగువ “అవశేషం” పర్సుగా వేరుచేసి ఆపై చిన్న ప్రేగులకు తిరిగి అమరుస్తారు. తద్వార చిన్న ప్రేగు అనేది ఆహార ప్రవాహానికి బైపాస్‌గా పనిచేస్తుంది. ఈ గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్న మొదటి సంవత్సరంలోనే దాదాపు 70-75% బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
- స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ లేదా గ్యాస్ట్రిక్ స్లీవ్: ఈ రకమైన సర్జరీలో కనీసం 80% ఉదర భాగాన్ని తొలగించడం జరుగుతుంది. తద్వార పొట్ట ఒక చిన్న అరటి పండు పరిమాణంలో ట్యూబ్ ఆకారంలో మిగులుతుంది. ఈ పక్రియలో గ్రెలిన్ అనే హార్మోన్ తగ్గడంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఈ సర్జరీ అయిన తరువాత రెండేళ్లలో 60-65% బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
- గ్యాస్ట్రిక్ బెలూన్: ఈ ప్రక్రియ ఇన్వేసివ్ సర్జరీలతో పోలిస్తే తక్కువ ప్రమాదాలను కలిగి ఉంటుంది. ఇందులో కడుపులోకి ఎండోస్కోప్ ద్వారా గాలి తీసిన బెలూన్ అమర్చి లోపల ఖాళీని తగ్గించడానికి బెలూన్ పరిమాణాన్నిపెంచబడుతుంది. దీంతో కడుపు యొక్క ఆహారం తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. ఈ సర్జరీ అయిన ఆరు నెలల తర్వాత 25-33% వరకు బరువు తగ్గవచ్చు.
బేరియాట్రిక్ సర్జరీ వల్ల కలిగే ప్రయోజనాలు
- బేరియాట్రిక్ సర్జరీ చేయంచుకోవడం ద్వారా ఒక వ్యక్తి ఉన్న బరువులో 75 నుంచి 80 శాతానికి పైగా తగ్గించుకోవచ్చు.
- ఊబకాయం అనేక దీర్ఘకాల వ్యాధుల (షుగర్, కొలెస్ట్రాల్, రక్తపోటు, కిడ్నీ వ్యాధులు, ఆర్థరైటిస్, క్యాన్సర్) తో ముడిపడి ఉంటుంది కావున చాలా వరకు వాటి నుంచి బయటపడవచ్చు.
- గుండె, కాలేయం, ఊపిరితిత్తులు లాంటి అవయవాలకు రక్త ప్రసరణ సాఫీగా జరగడంతో జీవన నాణ్యత మెరుగవుతుంది.
- ఈ బేరియాట్రిక్ సర్జరీ వల్ల మహిళల్లో సంతానలేమి సమస్యను అధిగమించి గర్భం ధరించే అవకాశాలు మెరుగుపడతాయి.
అధిక బరువు గల వారు కాంప్లెక్స్ కార్బోహైడ్రెట్స్, హై ప్రోటీన్ గింజలు (రాజ్మా, శెనగలు, పెసలు) మరియు హై ఫైబర్‌ను (పీచు పదార్థాలు) ఎక్కువగా తీసుకుంటూ శారీరక శ్రమ & వ్యాయామం వంటివి చేయడం వల్ల శరీర బరువును అదుపులో ఉంచుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.
About Author –