ACL Knee Surgery

వర్షాకాలంలో పసిపిల్లల ఆరోగ్య పరిరక్షణ

వేసవికాలపు ఎండలతో విసుగుచెంది ఉన్న సమయంలో తొలివర్షం ఎంతో ఉపశమనం ఇస్తుంది. వర్షాలు కొనసాగితే వాతావరణం పూర్తిగా చల్లబడటంతోపాటు చుట్టూ ఆకుపచ్చదనం పెరిగి కళ్లకు, మనస్సకు ఆహ్లాదంకలుగుతుంది. కానీ పసిపిల్లలు ఉన్న కుటుంబాలకు ఇప్పుడే ఒక్కింత క్లిష్ఠసమయమూ మొదలవుతుంది. వర్షాల వల్ల వాతావరణంలో తేమ పెరగటం, వర్షపు నీటి ప్రవాహంతో కొట్టుకువచ్చే చెత్తాచెదారం, చిన్నచిన్న గుంతలు – లోతట్టు ప్రాంతాలలో నిలిచే వర్షపు నీరు వ్యాధులకు కారణమైన వైరసులు, బాక్టీరియాల పెరుగుదల – వ్యాప్తికి కారణం అవుతాయి. వీటితో వర్షాకాలంలో పసిపిల్లలకు రాగల వ్యాధులు, ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను గూర్చి తెలుసుకుని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోగలిగితే పసిప్రాణాలను ఇబ్బందులు పెట్టే, కొన్నిసార్లు తీవ్రమైన వ్యాధులకు దారితీయగల పరిస్థితిని విజయవంతగా ఎదుర్కోగలుగుతాం.

రాష్ట్రంలోని వేలాది గ్రామాలు, చిన్న పట్టణాలలో మహిళలు ఆస్పత్రిలో ప్రసవం తరువాత కొద్ది రోజుల్లోనే ఇంటికి వచ్చేస్తారు. డాక్టర్లు ఈ వర్షాకాలంలో వ్యాధులు ఎక్కువ. జాగ్రత్తగా ఉండమని సూచించి పంపుతారు. అయితే వర్షాలో వ్యాధులు ఎక్కువ అవుతాయా? ఎందువల్ల? అన్న సందేహం చాలా మంది మహిళలు, ప్రత్యేకించి పెద్దవాళ్లకు దూరంగా ఉండే ఒంటరి దంపతుల కుటుంబాలలో వారికి కలుగుతుంటాయి. వర్షాకాలంలో అనేక వ్యాధులు విజృంభిస్తాయి. డయేరియా, టైఫాయిడ్, కామెర్ల వంటి వ్యాధులు అపరిశుభ్రమైన నీళ్లు, ఆ నీళ్లు వాడి తయారుచేసిన వంటకాల ద్వారా సంక్రమిస్తాయి. వర్షాకాలంలో మంచినీటి సరఫరా వ్యవస్థ ద్వారా అందే నీరు కలుషితం కావచ్చు.  పక్కనే ఉండే మురుగునీటి పైపుల నుంచి మురుగు నీరు మంచినీటిని సరఫరా చేసే పైపుల్లోకి చేరవచ్చు లేదా వర్షపు వరదనీటితో పొంగిపొ ర్లే డ్రయినేజీల నీరు మంచి నీటి వనరులను కలుషితం చేయవచ్చు.

మరోవైపు దోమ కాటు ద్వారా డెంగ్యూ, చికన్ గున్యా, మలేరియా వ్యాధులు కూడా వర్షాకాలంలోనే  విజృంభిస్తాయి. దోమల సంతతి పెరగటానికి వర్షాకాలం చాలా అనుకూలం కావటంతో వాటి ద్వారా వ్యాపించే ఈ వ్యాధుల వ్యాప్తి అధికం అవుతుంది. వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, ఒక పద్ధతి అంటూ లేకుండా యదేశ్చగా సాగుతున్న భవననిర్మాణాలు, అవసరాలకు సరిపడే సామర్థ్యం లేని  డ్రెయినేజ్ వ్యవస్థతో వీధుల్లో – కాళీ ప్రదేశాలలో చేరుతున్న మురుగునీరు దోమలు విపరీతంగా పెరగటానికి కారణం అవుతున్నాయి. వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉండటం, ఎండ తక్కువగా వస్తుండటంతో వాతావరణం బాక్టీరియా, వైరసులు పెరగటానికి చాలా అనుకూలం. ఈ పరిస్థితుల్లో దోమల వల్ల, బాక్టీరియా-వైరసుల వల్ల వచ్చే వ్యాధులు పెచ్చుపెరుగుతాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పసిపిల్లలు తేలికగా ఈ వ్యాధులకు గురవుతారు. వర్షాకాలంలో చాలామంది పిల్లలు విరేచనాలు, జలుబు, శ్వాససంబంధమైన సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అందువల్ల వైద్యులు చెప్పిన విధంగా పసిపిల్లల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ. హెచ్. ఓ.) అంచనాల ప్రకారం విరేచనాల(డయేరియా) కారణంగా  ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏడు ఏడు లక్షల అరవై వేల మంది అయిదు సం.లకు లోపు పిల్లలు చనిపోతున్నారు. కొద్దిపాటి జాగ్రత్తలతో మరణాలను అరికట్టవచ్చు. విరేచనాలు, టైఫాయిడ్ వ్యాధులు త్రాగునీళ్లు, ఆహారం విషయంలో అపరిశుభ్రత వల్లనే వస్తాయి. అందువల్ల బాగా కాచివడబోసిన లేదా ఫిల్టర్ చేసిన మంచినీటిని మాత్రమే ఇవ్వాలి. వంటకు వాడే నీరు కూడా కలుషితంకానిది, శుభ్రమైనదిగా ఉండేట్లు చూసుకోవాలి. బయట నుంచి కొనితెచ్చిన పళ్లరసాలు, ఇతర తినుబండారాలు ఇవ్వకూడదు. పిల్లలకు సన్నిహితంగా మెలిగే పెద్దవాళ్లు  సబ్బు లేదా హాండ్ వాష్ లిక్విడ్ తో తరచూ చేతిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో డెంగ్యూ వ్యాధి ఎక్కువ ప్రమాదకరమైది. సరైన సమయంలో గుర్తించలేకపోయిన పక్షంలో ప్రాణాంతకంగా మారి  వైద్యపరంగా అత్యవసర పరిస్థితిని సృష్టిస్తుంది. ఈ వ్యాధి సోకినట్లు గుర్తించటం, అది ప్రమాదరస్థాయికి చేరుకున్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలిసి ఉండటం పసిపిల్లల ఆరోగ్యరక్షణలో కీలకం అవుతుంది. డెంగ్యూ వ్యాధి ప్రారంభ లక్షణాలు సాధారణంగా వచ్చే ఇతర వైరల్ జ్వారాల లాగానే కనిపిస్తాయి. అయితే జ్వరం తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కొంత మంది ఈ జ్వరంతో వణుకుతారు. మందులు వాడటం వల్ల జ్వరం తాత్కాలికంగా తగ్గి మళ్లీ పెరుగుతుంది. ఎముకలు, కీళ్లు, కళ్లు నొప్పిగా ఉంటాయి. కళ్లు, ముఖం ఎర్రబారుతాయి. వంటిపైన అంతటా దద్దుర్లు కనిపిస్తాయి. ఆయాసంగా ఉండటం, ఆకలి మందగిస్తుంది. ఈ సాధారణ లక్షణాలను నిర్లక్ష్యం చేసినపక్షంలో వ్యాధి ముదురుతుంది. అప్పుడు తీవ్రమైన పొట్టనొప్పి, మూత్త్రం తగ్గిపోవటం, వాంతులు – మలంలో రక్తం పడటం శరీర భాగాలలో నీరు చేరటం, విపరీతమైన బద్దకం కనిపిస్తాయి.

పసిపిల్లల్లో ఈ లక్షణాలలో ఏవైనా కనిపించినపుడు ఆలస్యం చేయకుండా శిశువైద్యనిపుణుడికి చూపించి వ్యాధి డెంగ్యూ అవునో కాదో నిర్ధారించుకోవాలి. ఇందుకోసం రక్తపరీక్షలు చేయించినపుడు రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య వేగంగా పడిపోవటం,  ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గిపోతుండటం కనిపిస్తాయి. బిడ్డకు సోకింది డెంగ్యూ అని నిర్ధారణ అయిన పక్షంలో ఆస్పత్రిలో చేర్చాలా, లేక ఇంటివద్దనే ఉంచి చికిత్సచేయగలమా అన్నది శిశువైద్యుడు నిర్ణయిస్తారు. బిడ్డ చురుకుగా ఉండి, సాధారణ స్థాయిలో తింటూ ఉన్న పక్షంలోడెంగ్యూ వ్యాధి లక్షణాలు కనిపిస్తూ వ్యాధి నిర్ధారణ అయినప్పటికీ  ఇంటివద్దనే ఉంచి శిశువైద్యుడి పర్యవేక్షణలో చికిత్స చేయించటం సాధ్యమవుతుంది. వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉండి బిడ్డ మందకొడిగా ఉన్నట్లయితే వెంటనే ఆస్పత్రిలో చేర్చుకుని నిరంతర పర్యవేక్షణతో చికిత్సచేయాల్సి ఉంటుంది.

ప్రతిసారి  వర్షాకాలం ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే శిశువైద్యనిపుణుల క్లినిక్స్, చిన్న పిల్లల ఆస్పత్రులకు  అనారోగ్యానికి గురయి వచ్చిన పిల్లలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఉద్యోగస్థులైన మహిళలు తరచూ సెలవులు పెడుతూ పసివాళ్లను క్లినిక్స్ – హాస్పిటల్స్- డయాగ్నాస్టిక్ సెంటర్లుకు తీసుకెళుతూ ఉంటారు.  కొన్నిసార్లు తీవ్రమైన జ్వరంతో ఆస్పత్రిలో చేర్చాల్సి వస్తుంది కూడా. అయితే ఈ వర్షాకాంలో వ్యాధుల నుంచి పసిపిల్లలను రక్షించుకోవటం ఎలా? ‘చికిత్సకంటే ముందుజాగ్రత్తలు మేలు.’ అన్న నానుడి పిల్లల ఆరోగ్యానికి చక్కగా వర్తిస్తుంది. ఇంటిల్లిపాదికి ఆందోళన, మనో వేదనను తప్పిస్తుంది. అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది స్పష్టంగా తెలుసుకోవటం ముఖ్యం. ఇందుకోసం ముందుగా  ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా, పొడిగా  ఉంచాలి. కాళీ స్థలాలలో వాననీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. వాడకం కోసం నీటిని నిలువచేసే పాత్రలు, ట్యాంకులు, డబ్బాలపైన మూతపెట్టి ఉంచుకోవాలి.

పసిపిల్లల పరిశుభ్రత విషయంలో అదనపు జాగ్రత్త అవసరం. వర్షాకాలంలో వాతావరణ ఉష్ణోగ్రత ఒక్కోరోజు ఒక్కో విధంగా ఉండే అవకాశాలు ఎక్కువ. వర్షం పడిన రోజున గాలిలో తేమ అధికంగా ఉండి చలిగా తోస్తుంది. లేని రోజున పొడిగా వెచ్చగా ఉంటుంది. ఈ అస్థిర వాతారణం పసిపిల్లలకు ఇబ్బందికలిగిస్తుంది.  వారు ఇంట్లోనే ఉంటారు కనుక వంటిపైన దుమ్మూధూళి చేరే అవకాశం ఉండదు. అందువల్ల తిరగాడే పిల్లల వలే పదేపదే వళ్లు శుభ్రం చేయాల్సిన అవసరం ఉండదు. అయితే వాతావరణంలో తేమ అధికంగా ఉండటం వల్ల  ఎక్కవచెమట పడుతుంది. అందువల్ల వీలును బట్టి వర్షం పడని సమయంలో, వాతావరణం కాస్త పొడిగా, వెచ్చగా ఉండే సమయంలో రోజుకు ఒకసారి తగినంత వేడిఉన్న నీటితో స్నానం చేయించాలి. వాతావరణం బాగా చల్లగా ఉన్న పక్షంలో వేడినీటిలో ముంచిన శుభ్రమైన బట్టతో వళ్లు తుడవాలి. మొత్తం మీద  చర్మం శుభ్రంగా, పొడిగా ఉండేట్లు చూసుకోవాలి.  పసిపిల్లలను దోమతెరలో పడుకోపెడుతుండాలి. శరీరాన్ని పూర్తిగా కప్పిఉంచగల వస్త్రాలు వేయాలి. పొగవల్ల పిల్లలు అలెర్జీకి గురయ్యే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత వరకూ మస్కిటో కాయిల్స్ ఉపయోగించవద్దు అవసరమైతే తాత్కాకిలకంగా మస్కిటో రిపలెంట్ – క్రీమ్ వాడాలి.

ఇంట్లో పెద్ద వాళ్లు ఎవరికైనా జలుబు చేసినట్లయితే నోటిని, ముక్కును వస్త్రంతో  కప్పుకోవాలి. బిడ్డను వర్షాకాలంలో  వీలైనంత వరకూమార్కెట్లు, సినిమాహాళ్ల వంటిజనసమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు తీసుకువెళ్లవద్దు. తప్పని సరి అయితే ఇంటికి తిరిగి రాగానే వేడినీటితో ఒళ్లు శుభ్రంగా తుడిచి బట్టలు మార్చి ఉతికిన పొడిబట్టలు వేయాలి ఈ రకమైన జాగ్రత్తల వల్ల వర్షాకాలంలో రాగల వ్యాధులు చాలా వాటి నుంచి  దూరంగా ఉండవచ్చు.

ఇక వర్షాకాలంలో పసిపిల్లల ఆరోగ్యం కాపాడుకునే ముందు జాగ్రత్త చర్యలో వాక్సినేషన్ కీలకమైనది. అంటువ్యాధులనుంచి రక్షించుకోవటానికి వాక్సిన్లూ ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ వ్యాధుల్లో కొన్నింటికి  ప్రభావశీలమైన వాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. వాక్సినేషన్ చేయించుకోవటం ద్వారా టైఫాయిడ్, ఇన్ఫ్లుయేంజా, రోటావైరస్ డయేరియా, హెపటైటిస్ -ఎ (కామెర్ల వ్యాధి) రాకుండా కాపాడుకోవచ్చు. డెంగ్యూ వ్యాధికి కూడా వాక్సిన్ తయారయ్యింది. అయతే మన దేశంలో ఇంకా అది ప్రభుత్వ అనుమతి పొందలేదు. శిశువైద్యనిపుణుడిని సంప్రదిస్తే పాపకు ఈ వ్యాధులు రాకుండా ఏ సమయంలో  ఏ వాక్సిన్ ఇవ్వాలో సిఫార్సుచేయగలుగుతారు. అదేవిధంగా జలుబు, ఫ్లూ సోకినపుడు వాడాల్సిన మందులు కూడా సిఫార్సుచేయించుకుని సిద్ధంగా ఉంచుకొని డాక్టర్ సలహా మేరకు వాడాలి.

డైపర్లు: సౌకర్యం చాటున దాగిన సమస్యలు

ప్రస్తుతం డైపర్లు లేకుండా పసిపిల్లలు ఉన్నఇళ్ల రోజువారీ జీవితాన్ని ఊహించలేం. పసిపిల్లల పెంపకశైలి వేగంగా మారిపోతున్న స్థితిలో  తల్లుల కొనుగోళ్లలో ఇవి తప్పనిసరైనవిగా తయారయ్యాయి. పశ్చిమ దేశాలలో 1970 దశకం తొలిరోజులలో ప్రారంభమైన వీటి వాడకం 1990 చివరలో మనదేశంలోకి ప్రవేశించి గడచిన దశాబ్ధ కాలంలో వేగంగా విస్తరిస్తున్నది. తరతరాలుగా  తుండుగుడ్డతో కుట్టిన తెల్లని బట్టల వాడకం అంతే వేగంతో అంతరించిపోతున్నది. ఈ సంప్రదాయ డైపర్లకు భిన్నంగా  వాడి పారవేసే డైపర్ల ఉపయోగంలో సౌలభ్యం ఉన్న మాట కాదనలేం. పైగా తడిని పీల్చుకుని పొడిగా ఉండగల ఈ డైపర్లు బిడ్డను ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లినపుడు, రాత్రిళ్లు మరింత సౌకర్యంగా తోస్తుంటాయి. అయితే డైపర్ల  విషయంలో ఇపుడు అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతున్న పూర్వరంగంలో మనదేశంలోని అనేక మంది తల్లిదండ్రులకు వీటి వాడకం పట్ల సందేహాలు కలుగుతున్నాయి. అసలు ఈ డైపర్లు ఏపదార్థాలతో తయారుచేస్తారు? వీటి వాడకపు  సౌకర్యం వెనుక సమస్యలేమైనా దాగి ఉన్నాయా? పసిపిల్లల నునులేత చర్మానికి ఇవి సురక్షితమైనవేనా?

చట్టప్రకారం అయితే డైపర్ల తయారీదారులు వాటిలో వాడిన పదార్థాల గూర్చి పాక్ పైన పేర్కొన వలసిన పనిలేదు. కానీ మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని చైల్డ్ డైపర్లు ఒకే ప్రాధమిక పద్దతిన తయారవుతున్నాయి. వీటి బయటి పొర (అవుటర్ లేయర్) పాలీఇథైలిన్ తో తయారవుతుంది. ఇది ఒకరకమైన ప్లాస్టిక్ పొరనే. దీని తరువాత ఉండే పీల్చుకునే భాగం క్లోరిన్తో బ్లీచ్ చేయటం వల్ల తెల్లగా కనిపించే కలప గుజ్జు, సూపర్ అబ్జార్బంట్ పాలిమర్ తో కూడినది. ఈ పాలిమర్ తన బరువుకు 30 రెట్ల పరిమాణంలో ద్రవాన్ని(మూత్రాన్ని) పీల్చుకుని పొడిగా ఉండగలదు. బయటిపొర – లోపలి పీల్చుకునే భాగం మధ్యలో పరిమళ ద్రవ్యాల్ని చేరుస్తుంటారు. దీనికి తోడు డైపర్ తడిని పీల్చుకున్న తరువాత క్రమంగా బాక్టీరియా పెరగకుండా ఉండేందుకు కొన్ని రసాయనాలను చేరుస్తున్నారు. ఈ రసాయనాలు పసిపిల్లల చర్మం పైన చూపించే ప్రభావానికి సంబంధించే వివాదం జరుగుతోంది. డైయాక్సిన్ – ఎక్రిలిక్ ఆసిడ్  లేత చర్మాన్ని ఇరిటేట్ చేస్తాయని,  దద్దుర్లు ఏర్పరుస్తున్నాయని, సోడియంపాలీఎక్రలైట్ వల్ల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకుతున్నాయని నిపుణుల ఆందోళన వ్యక్తం అవుతున్నది.

ప్రకృతి సిద్దమైన పద్దతులను అనుసరించే, అనవసర వ్యయాన్ని తగ్గించే తల్లిదండ్రులు అనేక మంది  తుండుగుడ్డతో కుట్టిన తెల్లని బట్టలు తయారుచేసుకుని ఉతికి తిరిగి వాడగల సంప్రదాయ

డైపర్లనే ఎంచుకుంటున్నారు. చదరస్త్రంలా ఉండి అంచులు కుట్టిన ఈ తెల్లబట్లలను వేడినీళ్లలో శుభ్రంగా ఉతికి ఆరిన తరువాత మళ్లీ ఇస్త్రీ చేయటం ద్వారా ఇన్ఫెక్షన్లు సోక కుండా జాగ్రత్త పడుతున్నారు. అవి బిడ్డ లేత చర్మం పై సున్నితంగా ఉండటమే కాకుండా, చర్మాన్నిపొడిగా ఉంచగలుగుతూన్నాయి. ప్రమాదకర రసాయనాల ప్రభావాన్ని పూర్తిగా నివారిస్తున్నాయి.

Yashoda Hopsitals

Recent Posts

Understanding and Managing Heart Failure: A Comprehensive Guide

Heart failure, also called congestive heart failure, is a condition that arises when the muscles…

5 months ago

Unlocking Heart Health: A Comprehensive Guide to PTCA

Percutaneous Transluminal Coronary Angioplasty, or PTCA, is a minimally invasive surgery that opens blocked or…

5 months ago

Understanding Ankle Ligament Reconstruction Surgery

Ankle ligaments are crucial cords that link foot bones to lower leg bones, ensuring stability…

6 months ago

Which cooking oil should you use?

Supermarkets today are flooded with a variety of cooking oils, each with different characteristics, such…

6 months ago

నోటి క్యాన్సర్‌: దశలు, లక్షణాలు, కారణాలు, చికిత్స మరియు నివారణ చర్యలు

మాట్లాడటానికి, తినటానికి మరియు ముఖం అందంగా కనిపించటానికి నోరే కీలకం. శరీర పోషణకు అవసరమైన ఆహారం, పానీయాలు లోపలికి చేరేది…

6 months ago

అండాశయ తిత్తి: రకాలు, కారణాలు, లక్షణాలు, వ్యాధి నిర్ధారణ మరియు చికిత్స పద్ధతులు

అండాశయ తిత్తులు అనేవి అండాశయాల లోపల లేదా వాటి ఉపరితలంపై ద్రవంతో నిండిన సంచి లాంటి నిర్మాణాలు. ఆడవారికి రెండు…

7 months ago