మూత్రపిండాల సమస్యలను గుర్తించటం ఎలా ? చికిత్స విధానాల వివరాలు
మూత్రపిండాలు రోజుకు దాదాపు రెండు వందల లీటర్ల శుద్ధి చేయగలవు. ఆ నీరు 99.99 శాతం పరిశుద్ధమైనది. ఇంతటి సామర్థ్యంతో పనిచేసేవి అత్యాధునిక సాంకేతిక విజ్ణానం తాజాగా తయారుచేసిన వాటర్ ప్యూరిఫయర్ అన్న అభిప్రాయం కలగవచ్చు. కానీ ఈ అసాధారణ ఫిల్టర్లు మూడు వందల ఏభై కోట్ల సంవత్సరాల క్రితం రూపొంది ప్రకృతి సిద్దంగా మనుషులందరికీ వారి శరీరాలలో అందుబాటులో ఉన్న మూత్రపిండాలు(కిడ్నీస్).
మూత్రపిండాల సమస్యలో ఐదు దశలు ఉంటాయి. మొదటి దశ, రెండో దశలో అసలు వ్యాధి లక్షణాలు కనిపించవు. మూడో దశలో ఆకలి మందగించడం, నీరసం, ముఖం వాచినట్లుగా ఉండటం, కాళ్లలో వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నాలుగో దశ, ఐదో దశలో కన్ను చుట్టూ వాపు రావడం, జబ్బు ఎక్కువవుతున్న కొద్దీ వాపు ఎక్కువవుతుండటం, మూత్రం తగ్గిపోవడం, ఫిట్స్ రావడం, కొన్ని సందర్భాల్లో నడుము నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక ఐదో దశ వచ్చేసరికి కిడ్నీ పనితీరు బాగా తగ్గిపోతుంది. దురదృష్టవశాత్తు చాలామందిలో వ్యాధి ఈ దశకు చేరుకున్న తర్వాతనే వైద్యులను సంప్రదిస్తున్నారు. వ్యాధి ఐదో దశకు చేరిన తర్వాత మళ్లీ దానిని సాధారణ స్థితికి తీసుకురాలేము. అందువల్ల క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ చికిత్స కొనసాగించడం ఒక్కటే మార్గం.
ప్రశ్న: మూత్రం కూడా బాగా నురగతో వస్తోంది. అంతేకాకుండా రాత్రిళ్లు ఎక్కువగా మూత్రం వస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోంది?
అయితే మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీ కిడ్నీలో ఏవో అసాధారణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పవచ్చు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిలో మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించండి. మీకు తగిన పరీక్షలు నిర్వహించి చికిత్స చేస్తారు. ఆలస్యం చేయకూడదు. గుండెజబ్బులాగా కిడ్నీ సంబంధిత వ్యాధులకు కూడా సమయమే అత్యంత కీలకం. వ్యాధి మొదటి దశలో ఉంటే మీకు సులువుగా చికిత్స నిర్వహించే అవకాశం ఉంది. అలాగే మీ కిడ్నీ కూడా పదిలంగా ఉంటుంది. అలా కాకుండా పరీక్షలలో ఏదైనా సివియారిటీ కనిపిస్తే కూడా మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. అందుబాటులోకి వచ్చిన నూతన వైద్య ప్రక్రియలతో మీ కిడ్నీ సంబంధిత వ్యాధులను సమూలంగా పరిష్కరించే అవకాశం ఉంది.
ప్రశ్న : ఇంట్లోనే డయాలసిస్ చేసుకోవచ్చా?
ఆస్పత్రి లేదా నర్సింగ్‌హోమ్‌లలో నిర్వహించే డయాలసిస్‌ను హీమోడయాలసిస్ అంటారు. ఇది చాలా సాధారణమైన ప్రక్రియ. అత్యధికులు అనుసరించేది కూడా ఇదే. అయితే మీరు రెగ్యులర్‌గా డయాలసిస్ కోసం ఆస్పత్రికి రావడానికి ఇబ్బందిగా ఉన్నందున, ఇంటి దగ్గర మీరే స్వయంగా, మీ కుటుంబ సభ్యుల సహాయంతో డయాలసిస్ చేసుకునే మరో ప్రక్రియ కూడా ఉంది. ఇదే పెరిటోనియల్ డయాలసిస్. దీన్ని ఇంటిదగ్గర, ఆఫీసులో, ప్రయాణాల్లో స్వయంగా చేసుకోవచ్చు. అయితే ఇంటి దగ్గర డయాలసిస్ చేసుకోగల నేర్పు, ఓర్పు పేషెంట్‌కు ఉండాలి. లేదా దీనిని చేయగలవారు ఇంట్లో అందుబాటులో ఉండాలి. పెరిటోనియల్ డయాలసిస్ ద్వారా కడుపు లోపల అంటే ఉదర కుహరంలో ఆవరించిన పొరలలో ఉండే రక్తనాళాల్లోకి డయాలసేట్ అనే ద్రవాన్ని నింపుతూ ఎప్పటికప్పుడు రక్తంలో వ్యర్థాలను బయటకు తీయవచ్చు.
రక్తాన్ని శుద్ధి చేసే ద్రవాన్ని కేథెటర్ ద్వారా కడుపులోకి పంపిస్తారు. ఈ ద్రవం నిర్ణీతకాలం వరకు కడుపులో ఉంటుంది. ఈ సమయంలో రక్తంలోని వ్యర్థాలు, రసాయనాలు, ద్రవాలు… కడుపులోపలి పొరను అంటిపెట్టుకుని ఉండే రక్తనాళాల నుంచి బయటకు వచ్చి డయాలసిస్ ద్రవంలో కలుస్తాయి. నిర్ణీత సమయం తర్వాత వ్యర్థాలు కలిసిన ద్రవం పేషెంట్ శరీరం వెలుపల అమర్చిన సంచిలోకి డ్రెయిన్ అవుతుంది. కడుపులోకి ద్రవాన్ని పంపడం, కొంతసేపటి తర్వాత దాన్ని బయటకు తీయడం ప్రక్రియను ఎక్సే ్చంజ్ అంటారు. రాత్రివేళ పేషెంట్ నిద్రించే సమయంలో కూడా డయాలసిస్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆటోమేటెడ్ సైక్లర్‌ను వినియోగిస్తారు. ఈ సైక్లర్ తనంతట తానుగా డయాలసిస్ ద్రవాన్ని కడుపులోపలికి పంపించడం, నిర్ణీత వ్యవధి తర్వాత దాన్ని బయటకు డ్రెయిన్ చేయడం వంటి విధులు నిర్వహిస్తుంది. దీని వల్ల ఉదయం నిద్రలేచిన వెంటనే బ్యాగులో చేరిన వ్యర్థ ద్రవాన్ని ఖాళీ చేయవచ్చు.
ప్రశ్న : బ్లడ్ గ్రూపులు కలవడం లేదు… కిడ్నీ మార్పిడి ఎలా?
కిడ్నీ వంద శాతం పాడైపోయినప్పుడు మాత్రమే కిడ్నీ మార్పిడి ద్వారా రోగిని రక్షిస్తారు. అయితే ఇది అందరి విషయంలోనూ సాధ్యం కాదు. దీనికి దాత అవసరమవుతారు. లైవ్ డోనార్ (బతికి ఉన్న వారి నుంచి కిడ్నీ సేకరించడం), కెడావర్ డోనార్ (చనిపోయిన వ్యక్తి నుంచి కిడ్నీని సేకరించడం) అని రెండు రకాల దాతల నుంచి కిడ్నీని సేకరిస్తారు. లైవ్ డోనార్స్ విషయంలో రక్తసంబంధీకులు మాత్రమే కిడ్నీని దానం చేయాలి. అంతేగాక వీరి బ్లడ్ గ్రూపు కిడ్నీని పొందే వ్యక్తి బ్లడ్ గ్రూపుతో కలవాల్సి ఉంటుంది. కిడ్నీ దానం చేసేవారికి అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులు, మెదడు జబ్బులు, కాలేయవ్యాధులైన హెపటైటిస్–బి, సి ఉండకూడదు. దాత ఒక కిడ్నీ దానం చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదని నిర్ధారణ చేశాకే కిడ్నీ మార్పిడి చేస్తారు. రక్తసంబంధీకుల బ్లడ్ గ్రూపులు కలవకపోతే రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది… స్వాప్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్, రెండోది ఏబీఓ ఇన్‌కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్.
స్వాప్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్… తమ రక్త సంబంధీకులకు కిడ్నీ దానం చేయాలని ఉన్నాగానీ బ్లడ్ గ్రూపులు కలవకపోవడం వల్ల అది సాధ్యపడనప్పుడు… అదే సమస్యతో బాధపడుతున్న వేరొకరి రక్త సంబంధీకులలో బ్లడ్ గ్రూపు సరిపడిందనుకోండి. ఇలా ఒకరి రక్తసంబంధీకులకు మరొకరు పరస్పరం కిడ్నీలు దానం చేసుకునే ప్రక్రియను స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. ఈ విధానంలో వీరి కిడ్నీని వారి బంధువుకూ, వారి కిడ్నీని వీరి బంధువుకు అమర్చే ఏర్పాటు చేస్తారు. వీరిద్దరికీ ఒకేసారి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరుగుతుంది. బ్లడ్ గ్రూపులు కలవకపోయినా కిడ్నీ మార్పిడి చేయవచ్చు… అందివస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వైద్యులలో పెరుగుతున్న నైపుణ్యాల వల్ల ప్రస్తుతం బ్లడ్‌గ్రూపులు కలవకపోయినా కిడ్నీ మార్పిడి చేయడం వీలవుతుంది.
దీనికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు అనుసరించాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన మందులను ఉపయోగించాల్సి ఉంటుంది. బ్లడ్‌గ్రూపు సరిపడకపోయినప్పటికీ ఈ విధానంలో చేసిన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు కూడా… కంపాటబుల్ కిడ్నీ మార్పిడి సర్జరీల మాదిరిగానే విజయవంతం అవుతున్నాయి. అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నచోట, నిపుణులైన వైద్యులను సంప్రదించాలి.
About Author –
Dr. Sashi Kiran A, Consultant Nephrologist, Yashoda Hospitals – Hyderabad
MD (Pediatrics), DM (Nephrology)