కిడ్నీ ఫెయిల్యూర్ కారణాలు మరియు డయాలసిస్ వివరాలు
డయాలసిస్ అనగానే గుండె గుభేలుమంటుంది! మరణానికి చేరువైపోయామోననే భావన కలుగుతుంది! అందరికీ తెలిసిపోతుందేమోననే బాధ మొదలవుతుంది! నిజంగానే డయాలసిస్ అంత భయంకరమైనదా? దాని అవసరం ఎంత మేరకు?
మూత్రపిండాలు మొరాయిస్తే, వాటి పనిని యంత్రాలకు అప్పగించడమే డయాలసిస్! చిటికేసినంత త్వరగా, తేలికగా డయాలసిస్ గురించి చెప్పేసుకోవచ్చు. కానీ ఆ స్థితికి చేరుకోవడానికి మాత్రం మూత్రపిండాలు చాలాకాలంపాటు ఇబ్బంది పడతాయి. దాదాపు 80 శాతం పాడయ్యేవరకూ కిడ్నీలు తమ విధిని సక్రమంగానే నిర్వహిస్తాయి. ఆ తర్వాత నుంచి క్రమక్రమంగా పని చేయడానికి మొండికేస్తాయి. దాన్నే ‘కిడ్నీ ఫెయిల్యూర్’ అంటారు. ఆ సమయంలో ‘డయాలసిస్’ తప్ప వేరే ప్రత్యామ్నాయం ఉండదు.
రెండు రకాల ఫెయిల్యూర్లు!
కొంతమందిలో కిడ్నీలు తాత్కాలికంగా పని చేయడం మానేసి, మూల కారణాన్ని సరిచేస్తే, తిరిగి శక్తి పుంజుకుని పూర్వస్థితికి చేరుకుంటాయి. ఈ స్థితిని ‘టెంపరరీ కిడ్నీ డ్యామేజ్’ అంటారు. మరికొందరిలో కిడ్నీలు పూర్తిగా పాడైపోయి పనికిరాకుండా పోతాయి. ఈ స్థితిని ‘పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్’ అంటారు. ఈ రెండు పరిస్థితులకూ వేర్వేరు కారణాలుంటాయి.
టెంపరరీ కిడ్నీ డ్యామేజ్
- డీహైడ్రేషన్: వరుస వాంతులు, విరేచనాల కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గి ‘డీహైడ్రేషన్’కు గురయినప్పుడు మూత్రపిండాలు తాత్కాలికంగా పని చేయడం మానేసే అవకాశం ఉంటుంది.
- పెయిన్ కిల్లర్స్: నొప్పి తగ్గించే మందులు విపరీతంగా వాడినా ఈ స్థితి వచ్చే అవకాశం ఉంటుంది.
- ఇన్‌ఫెక్షన్లు: మూత్రాశయ, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు శరీరంలో విస్తరించినా ఈ పరిస్థితి వస్తుంది.
- గుండెకు రక్తప్రసరణ: కొన్ని కారణాల వల్ల గుండెకు రక్తప్రసరణ కుంటుపడినా, మూత్రపిండాలకు కూడా రక్తప్రసరణ తగ్గి డ్యామేజ్ అవుతాయి.
పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్
- మధుమేహం: దీర్ఘకాలంపాటు సక్రమంగా మందులు వాడకుండా, ఆహార నియమాలు పాటించకుండా రక్తంలో చక్కెర స్థాయులు అదుపు తప్పినప్పుడు మూత్రపిండాలు శాశ్వతంగా పని చేయడం మానేస్తాయి.
- అధిక రక్తపోటు: దీర్ఘకాలం పాటు అధిక రక్తపోటు సమస్యకు మందులు వాడకపోయినా ఆ ప్రభావం మూత్రపిండాల మీద పడి అవి శాశ్వతంగా పాడైపోతాయి.
- ఆటో ఇమ్యూన్ డిసీజ్: శరీర రక్షణ వ్యవస్థ తన మీద తానే దాడి చేసుకునే రుగ్మత వల్ల కూడా కిడ్నీలు శాశ్వతంగా పాడయ్యే అవకాశం ఉంటుంది.
- జన్యుపరమైన కారణాలు: కొన్ని రకాల జన్యుపరమైన కారణాల వల్ల కూడా మూత్రపిండాలు శాశ్వతంగా పాడవుతాయి.
డయాలసిస్ ఇలా!
తాత్కాలికం, శాశ్వతం… మూత్రపిండాలు ఎలా పని చేయడం మొరాయించినా వాటికి ప్రత్యామ్నాయ మార్గంగా డయాలసి్‌సను అనుసరించక తప్పదు. అయితే ఇందుకోసం కిడ్నీలు పాడయిన తీరునుబట్టి రెండు రకాల డయాలసి్‌సలను ఎంచుకోవచ్చు.అవేంటంటే…
హీమో డయాలసిస్: ఈ డయాలసి్‌సను ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే చేయించుకోవాలి. ఇందుకు నాలుగు గంటల సమయం పడుతుంది. ఈ డయాలసి్‌సను వారంలో మూడు సార్లు చేయించుకోవడం తప్పనిసరి. రోగి రక్తాన్ని వడపోసే మిషన్ ఆధారంగా శరీరం నుంచి వ్యర్థాలను తొలగించే ప్రక్రియ ఇది. ఇందుకోసం రోగి ఆస్పత్రికి వచ్చి నాలుగు గంటలపాటు మిషన్ దగ్గరే బెడ్ మీద పడుకునే ఉండాలి.
పెరిటోనియల్ డయాలసిస్: ఆస్పత్రికి రాలేని వృద్ధులు, ఆస్పత్రి సౌకర్యం లేని గ్రామాల్లో ఉండే రోగులు ఇంటి దగ్గరే స్వయంగా చేసుకోగలిగే డయాలసిస్ ఇది. పొట్ట లోపలికి అమర్చిన రెండు ట్యూబ్‌ల ద్వారా డయాలసిస్ ద్రవాన్ని పంపించి, వ్యర్థాలను బయటకు రప్పించే ప్రక్రియ ఇది. ఈ డయాలసిస్ రోజుకు మూడు సార్లు చేసుకోవాలి. ఒక్కో డయాలసి్‌సకు నాలుగు గంటల సమయం పడుతుంది. అయితే అంత సమయంపాటు రోగి పడుకునే ఉండవలసిన అవసరం లేదు.
డయాలసిస్ ఎప్పుడంటే
కిడ్నీలు ఇన్‌ఫెక్షన్‌కు గురై తాత్కాలికంగా పని చేయడం మానేస్తే, అందుకు దారితీసిన కారణాలను సరిదిద్దడం ద్వారా తిరిగి మూత్రపిండాలను పని చేయించవచ్చు. అయితే ఆ లోగా కిడ్నీలకు విశ్రాంతినివ్వాలి. ఈ కోవకు చెందిన టెంపరరీ కిడ్నీ డ్యామేజ్‌కు గురయిన వారు హీమో డయాలసిస్ చేయించుకోవలసి ఉంటుంది. శాశ్వతంగా మూత్రపిండాలు పాడయిన వారు నొప్పి కలిగించని, హీమో డయాలసిస్, కానీ పెరిటోనియల్ డయాలసిస్ కానీ జీవితాంతం చేయించుకుంటూ ఉండాలి.
డయాలసిస్ చేయించుకోకపోతే?
డయాలసిస్ చేయించుకోకుండా ఉండిపోతే మూత్రపిండాలు నీటిని వడగట్టలేక, నీరు ఊపిరితిత్తుల్లోకి చేరి ‘పల్మనరీ ఎడీమా’ తలెత్తవచ్చు. ఆయాసం, ఊపిరి ఆడకపోవడం లాంటి సమస్యలతో అత్యవసర వైద్య చికిత్స అవసరం పడవచ్చు. రక్తంలో పొటాషియం స్థాయులు పెరిగిపోయి, హఠాత్తుగా గుండె ఆగిపోవచ్చు. మెదడు ఇన్‌ఫెక్షన్‌కు గురై మూర్ఛలు మొదలవవచ్చు. రోగి కోమాలోకి కూడా వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.
పదేళ్లు ఎక్కువ బతకచ్చు!
వైద్యులు సూచించిన మేరకు ఆరోగ్య పరిస్థితిని బట్టి డయాలసిస్ చేయించుకుంటే 60ు నుంచి 70ు మంది జీవితకాలం పదేళ్లు పెరుగుతుంది. మూడు సార్లకు బదులు రెండుసార్లే చేయించుకుంటూ ఉండడం వల్ల అనారోగ్యానికి గురవడంతోపాటు జీవితకాలం తగ్గిపోతుంది.
అధిక రక్తపోటు రూపంలో…
యుక్తవయస్కుల్లో మూత్రపిండాలు పాడయితే, రక్తపోటు పెరిగిపోతుంది. అయితే పెరిగిన రక్తపోటు అదే స్థితిలో కొనసాగకుండా తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. ఈ లక్షణం కనిపిస్తే ఆలస్యం చేయకుండా మూత్రపిండాలను పరీక్షించుకోవాలి.
అపోహలు – వాస్తవాలు
అపోహ: ఒకసారి డయాలసిస్ చేయించుకుంటే ఇక జీవితాంతం చేయించుకుంటూనే ఉండాలి.
వాస్తవం: ఇది శాశ్వతంగా కిడ్నీలు పాడయిన వారికి మాత్రమే వర్తిస్తుంది. తాత్కాలికంగా కిడ్నీలు పాడయిన వారు రెండు సార్లు డయాలసిస్ చేయించుకుని, ఆ స్థితికి కారణమయిన ఆరోగ్య సమస్యను సరిదిద్దుకుంటే, తిరిగి డయాలసిస్ అవసరం రాదు.
అపోహ: డయాలసిస్ వారానికి రెండుసార్లు చేయించుకుంటే సరిపోతుంది.
వాస్తవం: ఖర్చుకు వెనకాడి, వారానికి మూడు సార్లు చేయించుకోవలసిన డయాలసిస్ రెండు సార్లే చేయించుకోవడం సరి కాదు. ఇలా చేయడం వల్ల శరీరంలో వ్యర్థాలు పెరిగిపోతాయి.
అపోహ: దీర్ఘకాలం పాటు డయాలసిస్ చేయించుకుంటే బ్లడ్ గ్రూప్ మారిపోతుంది.
వాస్తవం: ఇది వట్టి అపోహ మాత్రమే! జన్యుపరంగా సంక్రమించిన బ్లడ్‌గ్రూప్ డయాలసిస్ వల్ల మారదు.
ఖర్చు ఎంతంటే?
హీమో డయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్… ఈ రెండింటికీ ఖర్చు ఇంచుమించు ఒకేలా ఉంటుంది. ఒక హీమో డయాలసి్‌సకు 1500 నుంచి 2 వేల వరకూ ఖర్చు అవుతుంది. ఇంట్లో చేసుకునే పెరిటోనియల్ డయాలసిస్ కోసం వాడే ద్రవం ధర కూడా అంతే ఉంటుంది. ఏ డయాలసిస్ సెంటర్‌లోనైనా వైద్యులు మూడు సెషన్లలో డయాలసిస్ చేస్తారు. ఉదయం 8 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 12 నుంచి 4, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు…ఈ సమయాల్లోనే రోగులు పేరు నమోదు చేయించుకోవాలి. ఆ సమయాల్లో మాత్రమే డయాలసిస్‌కు అవసరమైన వైద్యులు, టెక్నీషియన్లు అందుబాటులో ఉంటారు. ఒకవేళ ఎవరైనా రోగి అత్యవసరంగా ఆ సమయాల్లో కాకుండా అర్ధరాత్రి వస్తే, వైద్యులతోపాటు, టెక్నీషియన్లు రావలసి ఉంటుంది. డయాలసిస్ కోసం ఉపయోగించే మిషన్లను సిద్ధం చేయవలసి ఉంటుంది. ఇందుకోసం అదనంగా ఖర్చు అవుతుంది కాబట్టి నియమిత వేళల్లో కాకుండా సమయం దాటిన తర్వాత వస్తే రోగికీ అదనపు ఖర్చు తప్పదు. ఇలా జరగకుండా ఉండాలంటే వైద్యులు సూచించిన విధంగా ముందుగానే పేర్లు నమోదు చేయించుకోవాలి.
About Author –
Dr. Dilip M Babu, Nephrologist, Yashoda Hospitals – Hyderabad
MD (Internal Medicine), DM (Nephrology)
He specialized in treating Kidney Transplantantion, Glomerular diseases, Diabetic and hypertensive kidney diseases, Critical care nephrology, Interventional nephrology.