హెర్నియా: రకాలు, కారణాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు
ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందిని వేధిస్తోన్న ప్రధాన వ్యాధులలో హెర్నియా కూడా ఒకటి. శరీరం లోపలి అవయవాలు వాటి పరిధిని దాటి మరొక భాగంలోకి పొడుచుకుని వచ్చినప్పుడు బయటికి కనబడే ఉబ్బు లేదా వాపునే హెర్నియా అంటారు. ఇవి శరీరంలోని ఏ భాగంలోనైనా రావొచ్చు. అయితే కండరాలు బలహీనంగా ఉన్న భాగాల్లో ఈ హెర్నియాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. హెర్నియా సమస్య వయస్సు మరియు లింగ భేదంతో సంబంధం లేకుండా ఎవరికైనా రావొచ్చు.
సాధారణంగా హెర్నియాలు ఛాతీ మరియు తుంటి మధ్య భాగంలో ఎక్కువగా వస్తుంటాయి. అంతేకాకుండా ఇవి గజ్జల పై భాగంలో మరియు కడుపుకు సంబంధించి బొడ్డు పైన, క్రింద, పక్కన (కుడి, ఎడమ) ఎటు వైపునైనా రావొచ్చు. అయితే హెర్నియా శరీరంలో ఏర్పడే స్థానాన్ని బట్టి వీటిని అనేక రకాలుగా వర్గీకరించవచ్చు.
హెర్నియా యొక్క రకాలు
శరీరంలోని కొన్ని భాగాల్లో ఈ హెర్నియాలు వస్తుంటాయి. ఇవి చాలా రకాలుగా ఉంటాయి.
సాధారణంగా పిల్లల్లో వచ్చే హెర్నియాలను కంజెనిటల్ హెర్నియాలు అంటారు.
అంబిలికల్ (బొడ్డు) హెర్నియా: కొవ్వు కణజాలం లేదా పేగులో కొంత భాగం బొడ్డు ద్వారా బయటకు చొచ్చుకువచ్చే హెర్నియాలను అంబిలికల్ లేదా బొడ్డు హెర్నియాలు అంటారు. ఈ రకమైన హెర్నియాలు పిల్లలు మరియు శిశువులను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. పొత్తి కడుపు పైభాగం పై పదే పదే ఒత్తిడికి గురికావడం వల్ల ఇవి పెద్దలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
ఇంగ్వైనల్ హెర్నియా (గజ్జల్లో పుట్టే హెర్నియా): ఇది హెర్నియా యొక్క అత్యంత సాధారణ రకం. పేగు తనలోని కొంత భాగాన్ని పొత్తికడుపు గోడలోని బలహీనమైన ప్రాంతం నుంచి బయటికి వచ్చినప్పుడు ఈ రకమైన హెర్నియా ఏర్పడుతుంది. ఇది ఎక్కువగా పురుషుల్లో కనిపిస్తుంది.
ఇన్సిషనల్ హెర్నియా: ఉదరంపై సర్జరీ అయిన తరువాత, కొంత కాలానికి సర్జరీ జరిగిన చోట ఏర్పడే హెర్నియాలను ఇన్సిషనల్ హెర్నియా అంటారు. సాధారణంగా ఈ రకమైన హెర్నియాలు స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తాయి.
హయాటల్ హెర్నియా: ఉదరంలోని కొంత భాగం డయాఫ్రాగమ్ ద్వారా ఛాతీ కుహరంలోకి పొడుచుకుని వచ్చినప్పుడు ఏర్పడే హెర్నియాను హయాటల్ హెర్నియా అంటారు. ఈ రకమైన హెర్నియాలు ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన వారిలో వస్తుంటాయి.
ఫిమోరల్ హెర్నియా (తొడపై భాగంలో): కొవ్వు కణజాలం లేదా పేగులో కొంత భాగం గజ్జలోకి మరియు లోపలి తొడ పైభాగంలో చేరినప్పుడు ఫిమోరల్ హెర్నియాలు సంభవిస్తాయి.
హెర్నియాకు గల కారణాలు
- హెర్నియా సమస్యకు వివిధ రకాల కారణాలుంటాయి
- కొంత మందిలో ఈ హెర్నియా సమస్య జన్యుపరమైన కారణాల ద్వారా పుట్టుకతోనే వస్తాయి
- పొత్తికడుపు కండరాల బలహీనత మరియు అధిక బరువును (ఊబకాయం) కలిగి ఉండటం
- శారీరక శ్రమ మరియు వ్యాయామం లేకపోవడం
- ధూమపానం, మద్యపానం అధికంగా తీసుకోవడం
- ఎక్కువసార్లు గర్భం ధరించడం
- నెలలు నిండకుండా లేదా తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం
- రోజంతా నిలబడి పనిచేసే వారిలోనూ మరియు దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఉన్న వారిలో కూడా ఈ హెర్నియా సమస్య రావొచ్చు
- ఇంతకుముందు ఉదరంపై చేసిన సర్జరీల వల్ల కూడా ఈ హెర్నియాలు వచ్చే అవకాశం ఉంటుంది
హెర్నియా లక్షణాలు
హెర్నియా రకం మరియు స్థానాన్ని బట్టి లక్షణాలు మారుతుంటాయి.హెర్నియాతో బాధపడే వారిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను మనం చాలా సులభంగా గమనించవచ్చు.
- దగ్గేటప్పుడు కడుపులో నొప్పి రావడం
- మింగడంలో ఇబ్బంది పడడం మరియు వాంతులవ్వడం
- పేగు అవరోధం ఏర్పడడం
- మూత్రవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి కలగడం
- దీర్ఘకాలిక మలబద్ధకం రావడం
- అధిక బరువులు ఎత్తినప్పుడు నొప్పి మరియు అసౌకర్యంగా అనిపించడం
- యాసిడ్ రిఫ్లక్స్ వల్ల గుండెల్లో మంట మరియు ఛాతీలో నొప్పి వంటి లక్షణాలు సైతం హెర్నియా గల వారిలో గమనించవచ్చు
హెర్నియా నివారణ చర్యలు
- ఒత్తిడిని నివారించుకోవాలి
- ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవాలి
- అధిక బరువులు ఎత్తడం మానుకోవాలి
- శరీర బరువును అదుపులో పెట్టుకోవాలి
- మరీ ఎక్కువగా అలిసిపోయే పనులేమీ చేయకూడదు
- ప్రతిరోజూ 20-30 నిమిషాలపాటు సాధారణ వ్యాయామం చేయాలి
- ధూమపానం, మధ్యపానం జోలికి వెళ్లకూడదు
- రోజు వారి ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి
- ఎట్టి పరిస్థితుల్లోనూ ఫాస్ట్ ఫుడ్, స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్ ల జోలికి వెళ్లకూడదు
- అధిక కొవ్వు, సిట్రస్ ఆహారాలు, కార్బోనేటడ్ పానీయాలకు దూరంగా ఉండాలి
హెర్నియా సమస్యను ప్రారంభదశలో గుర్తించకపోతే చాలా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. కేవలం మందులు వాడడం వల్లనే హెర్నియా సమస్య నయం అవ్వదు. సాధారణంగా హెర్నియాలను సర్జరీ ద్వారానే నయం చేస్తారు. అయితే ఇంతకు ముందు ఈ హెర్నియాలను ఓపెన్ సర్జరీతో (కోత ద్వారా వ్యాధి యొక్క దెబ్బతిన్న భాగాన్ని తిరిగి సరిచేసే పద్దతి) ఉబ్బిన అవయవం లేదా కణజాలాన్ని తిరిగి అదే స్థానంలో ఉంచేవారు. అయితే ప్రస్తుతం మారిన కాలనుగుణంగా ఈ హెర్నియా సమస్యకు లాపరోస్కోపిక్ సర్జరీనీ (టెలిస్కోప్, కెమెరా మరియు లైట్ సోర్స్ వంటి ప్రత్యేక పరికరాలతో చేసే సర్జరీ) ఉపయోగించి అతి తక్కువ తక్కువ సంక్లిష్టత రేటుతో చికిత్స చేస్తున్నారు.
ప్రస్తుత ఆధునిక కాలంలో హెర్నియా వ్యాధి యొక్క తీవ్రతను బట్టి కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఈ సమస్యకు సర్జన్లు రోబోటిక్ సర్జరీని సైతం ఉపయోగించి చికిత్స చేస్తున్నారు. ఇందులో డాక్టర్ కన్సోల్ పై కూర్చుని అక్కడ ఏదైతే కదలికలు చేస్తారో, అదే కదలికలు రోబోటిక్ చేతుల సహాయంతో పేషంట్ కడుపు లో జరుగుతుంది. దీంతో సర్జరీని మరింత నియంత్రణ మరియు ఖచ్చితత్వంతో చేయడం సాధ్యపడుతుంది. వీటితో పాటు కొన్ని రకాల సంక్లిష్టమైన హెర్నియాల కోసం వైద్యుల సలహా మేరకు తగు పరీక్షలు చేయించుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
About Author –