పిత్తాశయంలో రాళ్లు: లక్షణాలు, కారణాలు మరియు ప్రమాద కారకాలు
పిత్తాశయం అంటే ఏమిటి? దీని యొక్క పనితీరు
నేటి కాలంలో ఈ పిత్తాశయంలో రాళ్ల సమస్య బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. గాల్‌బ్లాడర్‌ను తెలుగులో పిత్తాశయం అని అంటారు. ఇది కడుపులో కుడి వైపు పై భాగంలో కాలేయంతో పాటు పియర్-ఆకారంలో ఉండే చిన్న అవయవం. కాలేయంలో ఉత్పత్తి అయ్యే పైత్యరసంను (బైల్ జ్యూస్) పిత్తాశయం నిలువ ఉంచుతుంది. ఆహారంలోని కొవ్వులు మరియు ప్రోటీన్ పదార్థాలను జీర్ణం చేయడం ఈ పిత్తాశయం యొక్క ప్రధాన పని.
మనం తిన్న ఆహారం నాళం ద్వారా పేగుల్లోకి చేరుకోగానే బైల్ డక్ట్ అనే పైప్ ద్వారా చిన్నపేగుకు పైత్యరసంను సరఫరా అయ్యేలా చూస్తుంది. అక్కడ కొవ్వు పదార్థాలు జీర్ణం కావడం కోసం ఈ పైత్యరసం ఉపయోగపడుతుంది. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ సమస్య ఎక్కువగా అధిక కొవ్వు గల వారిలోనూ మరియు ఆడవారిలో (3:1) నిష్పత్తుల్లో ఉంటుంది. చాలా మందిలో ఇది సర్వసాధారణం కానీ, కొద్దిమందిలోనే ఇవి అధిక సమస్యలను తెచ్చిపెడుతుంటాయి. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఇసుక రేణువంత సైజు దగ్గర నుంచి గోల్ఫ్ బంతి సైజు వరకూ ఏర్పడతాయి.
పిత్తాశయ రాళ్లు రకాలు
పిత్తాశయంలో నిల్వ ఉండే పైత్యరసం గట్టిపడిన పదార్థంగా మారినప్పుడు పిత్తాశయంలో రాళ్లు ఏర్పడతాయి. ఇవి కాలేయం కింద ఉంటాయి. పిత్తాశయంలోనే పిత్తాశయ రాళ్లు ఉంటే దానిని కోలిలిథియాసిస్ అని, పిత్తాశయ రాళ్లు పిత్త వాహికలలో ఉంటే కోలెడోకోలిథియాసిస్ అంటారు.
పిత్తాశయ రాళ్లు 3 రకాలు:
కొలెస్ట్రాల్ రాళ్లు: శరీరంలో కొలెస్ట్రాల్ గడ్డకట్టడంతో ఏర్పడే రాళ్లను కొలెస్ట్రాల్ రాళ్లు అంటారు. ఇవి సాధారణంగా పెద్ద సైజులో పసుపు-ఆకుపచ్చ రంగులో ఉంటాయి.
పిగ్మెంటెడ్ రాళ్లు: బైలురుబిన్ అనే ద్రవం అధికంగా ఉన్నప్పుడు కాల్షియం యొక్క స్ఫటికీకరణ నుంచి పిగ్మెంటెడ్ రాళ్లు ఏర్పడతాయి. ఇవి చిన్న సైజులో ఎక్కువ సంఖ్యలో ఏర్పడతాయి. ఇవి నలుపు మరియు గోధుమ రంగులో ఉంటాయి. పిగ్మెంటెడ్ రాళ్లతో ఇన్ఫ్ క్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ.
మిశ్రమరాళ్లు: కొలెస్ట్రాల్ మరియు పిగ్మెంటెడ్ రాళ్ల కలయిక ద్వారా ఇవి ఏర్పడతాయి. మిశ్రమ రాళ్లు సన్నని ఇసుక రేణువు పరిమాణం నుంచి పెద్ద నిమ్మకాయ సైజు పరిమాణం వరకు ఏర్పడతాయి.
గాల్ బ్లాడర్ స్టోన్స్ చాలా ఇబ్బందిని గురిచేస్తాయి. ఈ సమస్యను సకాలంలో గుర్తించి చికిత్స చేయనట్లు అయితే కొన్ని సార్లు సర్జరీ కూడా అవసరం కావచ్చు.
పిత్తాశయ రాళ్లు యొక్క లక్షణాలు
దాదాపు 75 శాతం మందిలో ఈ గాల్ స్టోన్స్ ఉన్నా ఎలాంటి లక్షణాలు కనిపించవు.
అయితే సాధారణంగా కనిపించే లక్షణాలు:
- తేన్పులు, అజీర్తి మరియు వాంతులు
- గుండెలో మంట, విరోచనాలు అవ్వడం
- చలి మరియు జ్వరం రావడం
- కడుపు పైభాగంలో నొప్పి వచ్చి క్రమంగా వీపు వైపుకు వ్యాపిస్తుంది
- ముదురు రంగులో మూత్రం రావడం
- కొద్దిగా తినడంతోనే కడుపు నిండిపోయిన భావన కలగడం
- గాల్ బ్లాడర్ స్టోన్స్ కిందకు జారినప్పుడు కామెర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. వాటిని తొలగించకపోతే ఇన్‌ఫెక్షన్లకు కూడా దారితీయవచ్చు.
పిత్తాశయ రాళ్లు ఏర్పడటానికి కారణాలు
చాలా మందిలో పైత్యరసం ప్రవహించే డక్ట్‌కు (పైత్యవాహిక) అడ్డు తగిలి నొప్పి వచ్చేంత వరకు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏర్పడ్డ విషయమే తెలియదు. అయితే కొందరిలో ఇంకేదైనా సమస్య కోసం వైద్య పరీక్షలు చేయించినప్పుడు ఈ సమస్య బయటపడవచ్చు.
గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏర్పడటానికి నిర్దిష్ట వయస్సు కానీ, స్పష్టమైన కారణాలు లేవు. అయినప్పటికీ కొన్ని ప్రత్యేక రుగ్మతలను చూస్తే:
- ఊబకాయంతో ఇబ్బందిపడడం
- గర్భనిరోధక మందులు ఎక్కువ రోజులు వాడడం
- గాల్ బ్లాడర్ ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం
- పైత్యరసంలో అధికంగా కొలెస్ట్రాల్ ఉండటం
- నిత్యం తీసుకునే ఆహారంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం
- వేగంగా బరువు తగ్గాలనుకునే వారిలోనూ ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏర్పడతాయి
- కాలేయ సంబంధిత వ్యాధి, లివర్ సిర్రోసిస్, జాండీస్ వ్యాధి, బైలిరుబిన్ ఎక్కువ అవ్వడంతో పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడతాయి
- గర్భం దాల్చినప్పుడు గాల్ బ్లాడర్ సరిగా వ్యాకోచించకపోవడం మరియు డయాబెటిస్, జీర్ణ సమస్యలతో బాధపడే వాళ్లలోనూ ఈ సమస్య వస్తుంది.
పిత్తాశయ రాళ్లు యొక్క ప్రమాద కారకాలు:
- మారిన జీవనశైలి
- వ్యాయామం చేయకపోవడం మరియు అధిక బరువును కలిగి ఉండడం
- అధిక ఈస్ట్రోజన్ స్థాయిలు ఉన్న మందులను తీసుకోవడం
- యువకుల కంటే 60 ఏళ్లు పైబడిన వారిలో గాల్ స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువ
- అధిక కొలెస్ట్రాల్ ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవడం
- వంశపార్యపరంగా గాల్ స్టోన్స్ సమస్య కలిగి ఉండడం
- గర్భిణీగా ఉన్న సమయంలో ఈ సమస్య మరింత ఎక్కువ
- మధుమేహం ఉన్న వ్యక్తులు
- అధికమైన ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వు ఆమ్లాల స్థాయిలు పిత్తాశయ రాళ్ల ప్రమాదాన్ని మరింత పెంచుతాయి.
పిత్తాశయ రాళ్లు గుర్తింపునకు చేసే పరీక్షలు:
- రక్త పరీక్షలు (బైలిరుబిన్, కాలేయ పనితీరు, పూర్తి రక్త పరిమాణం)
- కడుపు పై భాగంలో అల్ట్రాసౌండ్ మరియు CT స్కాన్ పరీక్షలు
- మాగ్నెటిక్ రెసొనెన్స్ కోలాంగియోపాంక్రియాటోగ్రఫీ (MRCP)
- పిత్తాశయం రేడియోన్యూక్లైడ్ స్కాన్
- కోలిసిస్టోగ్రఫీ: పేగుల ద్వారా పిత్తాశయంలోకి కాంట్రాస్ట్ ఫ్లూయిడ్ ప్రవాహాన్ని చూపే ఎక్స్-రే.
- లాపరోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ (పిత్తాశయాన్ని తొలగించే సర్జరీ): పిత్తాశయ రాళ్లకు చికిత్స చేయడానికి కోలిసిస్టెక్టమీ అనే సర్జరీని చేస్తారు.
- ERCP (ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కోలాంగియోపాంక్రియాటోగ్రఫీ): పిత్త వాహిక నుంచి పిత్తాశయ రాళ్లను తొలగించడానికి ఈ విధమైన పద్దతిని ఉపయోగిస్తారు.
- EUS (ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్): జీర్ణ సంబంధిత సమస్యలైన (గ్యాస్ట్రోఇంటెస్టినల్) వ్యాధులను అంచనా వేయడానికి ఈ కనిష్ట ఇన్వేసివ్ EUS పక్రియను ఉపయోగిస్తారు.
పిత్తాశయ రాళ్లకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోవడం
- శరీర బరువును ఒకేసారి కాకుండా క్రమ క్రమంగా తగ్గడం
- విటమిన్-సీ, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్దాలను తీసుకోవడం
- అవకాడో, ద్రాక్ష, దోసకాయ, బ్రాకోలి, నారింజ, స్ట్రాబెర్రీ, ఆపిల్ వంటి పండ్లనూ తరచు తీసుకుంటూ ఉండాలి
- కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి
- శీతల పానీయాలు, జంక్ పుడ్స్, కుకీస్ వంటి వాటికి దూరంగా ఉండాలి
- వెన్న తీసిన పాలు, పెరుగును, కొవ్వు తక్కువగా ఉండే నెయ్యి, జున్ను వాటిని తీసుకోవాలి
- రోజుకు 2 కప్పులు కాఫీ తాగడం వల్ల కూడా గాల్ స్టోన్స్ సమస్యను నివారించుకోవచ్చు
- వంశపారంపర్యంగా కూడా గాల్ స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువ
40 సంవత్సరాలు దాటిన వారు తప్పనిసరిగా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ పరీక్షను చేయించుకుంటూ ఉండాలి. అలాగే మంచి జీవనశైలిని అనుసరిస్తూ సరైన సమయానికి ఆరోగ్యకరమైన ఆహార నియమాలను పాటించాలి. అంతే కాకుండా నిర్థిష్ట శరీర బరువును అదుపులో ఉంచుకోవడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ సమస్య బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
About Author –
Dr. Santosh Enaganti, Senior Consultant Gastroenterologist & Hepatologist, Advanced Interventional Endoscopist , Yashoda Hospitals – Hyderabad
MD, MRCP, CCT (Gastro) (UK), FRCP (London)