కరోనా.. కల్లోలంలో నిజమెంత?
ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోన్న ఏకైక మహమ్మారి.. కరోనా(Coronavirus disease (COVID-19)). ఎవరి నోట విన్నా కరోనా మాటలే. ప్రపంచవ్యాప్తంగా లక్షా 45 వేల మందికి పైగా కరోనా పాజిటివ్‌గా నిర్ధరాణ అయ్యారు. మనదేశంలో 80 మందికి పైగా కరోనాతో బాధపడుతున్నట్టు తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ గురించి అనేక రకాల అపోహలు, భయాలు చుట్టుముట్టి ఉన్నాయి. అందుకే ఈ అపోహల్లో నిజానిజాలు వివరిస్తున్నారు సీనియర్ డాక్టర్ బి. విజయ్ కుమార్.
At a Glance:
1. కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుంది? (How Does COVID-19 Spread?)
3. కరోనా రాకుండా ఉండాలంటే మాస్కులు తప్పనిసరా?
4. కుటుంబంలో ఎవరికైనా కరోనా ఉంటే ఏం చేయాలి?
5. ఆహారం ద్వారా వ్యాపిస్తుందా?
6. మన రాష్ట్రంలో కరోనా వైరస్ టెస్ట్ ఎక్కడ చేస్తారు?
7. ఎక్కువ ఉష్ణోగ్రతల్లో కరోనా పెరగదా?
కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుంది? (How Does COVID-19 Spread?)
ఇంతకుముందు సార్స్, మెర్స్ లాంటి కరోనా వైరస్‌ల ఇన్‌ఫెక్షన్ వచ్చినప్పుడు ఇంతగా భయపెట్టలేదు. ఇది పుట్టింది జంతువుల నుంచే అయినా ఇప్పుడు మనిషి నుంచి మనిషికి వేగంగా పెరుగుతున్నది. ఇంతకుముందు కరోనా వైరస్‌లు రెండూ గబ్బిలాల నుంచే వచ్చాయి కాబట్టి ఇది కూడా వాటి నుంచే వచ్చిందని భావిస్తున్నారు. ఈ కరోనా వైరస్ ప్రత్యేకత ఏంటంటే వేగంగా వ్యాపించడం. నోటి నుంచి, ఊపిరితిత్తుల నుంచి వచ్చే తుంపరలే దీని వాహకాలు. తుంపరలు టేబుల్ మీద పడినా, చేతుల మీద పడినా, మనం వాడే తలుపులు, గొళ్లాలు, టాయిలెట్లు ఎక్కడ పడినా వాటిలో ఉండే వైరస్ 48 గంటల నుంచి కొన్నిసార్లు అయిదారు రోజుల వరకు కూడా బతికే ఉండొచ్చు. వాటిని తాకి ముక్కు, కళ్లు ముట్టుకుంటే మనకి ట్రాన్స్‌మిట్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
లక్షణాలేంటి?
ఎనభై శాతం మందిలో సాధారణ ఫ్లూ, జ్వరం, ఒళ్లునొప్పులు ఉండి వారం నుంచి పదిహేను రోజుల్లో అన్నీ తగ్గిపోతాయి. 20 శాతం మందిలో మాత్రమే కొంచెం తీవ్రంగా ఉండొచ్చు. ఊపిరితిత్తులు కూడా ప్రభావితమై దమ్ము, ఆయాసంతో ఊపిరాడక తీవ్రమైన అనారోగ్యం పాలవుతారు.
కరోనా రాకుండా ఉండాలంటే మాస్కులు తప్పనిసరా?
ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు మాస్కులు అవసరం లేదు. మాస్కులు ఇన్‌ఫెక్షన్ ఉన్నవాళ్లు ధరిస్తే వాళ్ల తుంపరలు దూరంగా పడకుండా, మరొకరికి వ్యాపించకుండా ఉంటాయి. ఇన్‌ఫెక్ట్ అయిన వాళ్లకు చికిత్స అందించేవాళ్లు, హ్యాండిల్ చేసేవాళ్లు ధరిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. హ్యాండ్ వాష్, హ్యాండ్ శానిటైజర్ వాడడం, ఎక్కడ ముట్టుకున్నా, ముఖ భాగాలను ఎక్కడా టచ్ చేయకుండా ఉండడం అవసరం.
కుటుంబంలో ఎవరికైనా కరోనా ఉంటే ఏం చేయాలి?
పేషెంట్ చేత మాస్క్ ధరింపచేయడం ముఖ్యం. తరచుగా చేతులు కడుక్కోవాలి. వాళ్లను విడిగా వేరే గదిలో ఉంచాలి. ఎవరైనా ఒకరు మాస్క్ వేసుకుని వాళ్లను చూసుకోవాలి. కనీసం 14 రోజుల పాటు అలా సెల్ఫ్ మానిటరింగ్ చేసుకోవాలి. రిస్క్ ఎక్కువగా ఉన్నవాళ్లు వాళ్ల దగ్గరికి వెళ్లొద్దు.
ఆహారం ద్వారా వ్యాపిస్తుందా?
మనం తీసుకునే ఆహారం ద్వారా ఇది వ్యాపిస్తుందనడానికి దాఖలాలేమీ లేవు. చికెన్ నుంచి వస్తుందని రూమర్లు వ్యాపించాయి. అయితే కోళ్లు కూడా ఫ్లూ వచ్చి చనిపోతాయి. అలాంటి వాటిజోలికి వెళ్లకుండా చికెన్‌ను బాగా ఉడికించి వండితే ఇది రాదు. మనదేశంలో బాగా ఉడికిస్తారు కాబట్టి దానిలో వైరస్ ఒకవేళ ఉన్నా అది బతకదు. అయితే సలాడ్స్ లాంటివి తినేటప్పుడు ముఖ్యంగా బయట ఎక్కడో హోటల్స్‌లోనో, బండిమీదో పండ్లు కట్ చేసి అమ్మే చోట తింటే మాత్రం రిస్కే. వాళ్లకి ఇన్‌ఫెక్షన్ ఉండి తుంపరలు పడితే కష్టమే. కాబట్టి బయటి ఫుడ్‌కి దూరంగా ఉండడం బెటర్.
మన రాష్ట్రంలో కరోనా వైరస్ టెస్ట్ ఎక్కడ చేస్తారు?
దేశ వ్యాప్తంగా కొన్ని సెంటర్లలోనే ఇది అందుబాటులో ఉంది. మన రాష్ట్రంలో గాంధీ హాస్పిటల్‌లో ఉంది. ఉస్మానియాలో కూడా ఓపెన్ చేస్తున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉన్నవాళ్లు, కరోనా వచ్చే రిస్క్ ఉన్నవాళ్లకు టెస్టు చేయాల్సిందే. ఫ్లూ వచ్చి తీవ్రంగా ఇబ్బంది ఉండి, అయిదారు రోజులైనా తగ్గకుండా, శ్వాసలో ఇబ్బంది అవుతుందంటే వాళ్లను పరీక్షకు పంపిస్తున్నారు.
ఎక్కువ ఉష్ణోగ్రతల్లో కరోనా పెరగదా?
దీనికి కూడా వందశాతం రుజువులేమీ లేవు. మన శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇక్కడ పెరగొచ్చు. అయితే అది బతకాలంటే చాలా అంశాలు దోహదపడుతాయి. మన శరీరం బయట తుంపరల ద్వారా పడినప్పుడు మాత్రం ఎక్కువ ఉష్ణోగ్రతల ప్రభావం వైరస్ పై ఉండే అవకాశం ఉంది. అందువల్ల అధిక ఉష్ణోగ్రత గల ప్రదేశాల్లో వ్యాపించడం కష్టం.
కరోనా వైరస్ వల్ల ఎవరికి రిస్కు?
ఇప్పటివరకు కొవిడ్-19 గురించి పూర్తి సమాచారం లేదు. ఇంతకుముందు వచ్చిన కరోనా జాతి వైరస్‌ల ప్రకారం చూస్తే వృద్ధులు, బీపీ, షుగర్, గుండెజబ్బులు, శ్వాసకోశ వ్యాధులున్నవాళ్లు, వ్యాధి నిరోధకత తక్కువ ఉన్నవాళ్లు, క్యాన్సర్ పేషెంట్లలో వైరస్ ఎక్కువ ప్రభావం చూపించొచ్చు. యువతలో కూడా ఇన్‌ఫెక్షన్ రావొచ్చు. పిల్లల్లో ఎక్కువగా కనిపించడం లేదు. అయితే ఇన్‌ఫెక్షన్‌తో తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కోకపోయినప్పటికీ, ఇన్‌ఫెక్షన్ ఉన్న పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తరువాత పెద్దవాళ్లకు రావొచ్చు. అందుకే స్కూళ్లకు సెలవులివ్వాల్సిన అవసరం ఏర్పడింది.
ఇలాంటి పరిస్థితిలో ప్రయాణాలు చేయడం మంచిదేనా?
సార్స్, మెర్స్ స్థానికంగా మాత్రమే వ్యాపించాయి. కానీ ఈ రకమైన కరోనా దాదాపు అన్ని దేశాలకూ పాకింది. అందువల్ల ప్రయాణాలు మానేయడమే మంచిది. గుమిగూడే ఫంక్షన్లు, పెళ్లిళ్లకు దూరంగా ఉండాలి. ఎంతకాలమనేది తెలీదు గానీ, కమ్యూనిటీ మొత్తంలో ఇమ్యునిటీ సాధారణంగా రావడానికి 3 నుంచి 6 నెలలు పడుతుంది. నాలుగు నుంచి ఆరు వారాల పాటు ఈ ట్రాన్స్‌మిషన్ అత్యంత వేగంగా ఉంటుంది. కాబట్టి అంతకాలం గ్రూప్ మీటింగ్స్ అవాయిడ్ చేయడం మంచిది.
-రచన
డాక్టర్ బి. విజయ్ కుమార్, సీనియర్ జనరల్ ఫిజీషియన్ యశోద హాస్పిటల్, సికింద్రాబాద్
MD (General Medicine)