Select Page

స్పైరస్‌ ఎంటరోస్కోపీ(Spirus Enteroscopy) అంటే ఏమిటి?

మావారి వయసు 42 ఏళ్లు. కొన్నేళ్లుగా తరచూ కడుపునొప్పి (stomachache) తో బాధపడుతున్నారు. తీవ్రమైన నీరసం(weakness), మలంతో పాటు రక్తం కారడం జరుగుతుండటంతో మాకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించాం. వారు సిటీలో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌(gastroenterologist)ను కలవమన్నారు. హైదరాబాద్‌లో చూపిస్తే అక్కడ కొన్ని పరీక్షలు చేసి, చిన్న పేగుల్లో సమస్య ఉందని చెప్పారు. కాప్సూ్యల్‌ ఎండోస్కోపీ(capsule endoscopy) కూడా చేశారు కానీ ఫలితం లేదు.

చిన్నపేగులో క్యాన్సర్‌ లేదా పాలిప్‌(small intestine polyps) ఉండవచ్చని అంటున్నారు మావారికి ఉన్న ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఎంటిరోస్కోపీ అనే పరీక్ష వీలుకాదనీ, స్పైరస్‌ ఎంటిరోస్కోపీ అవసరమనీ, దాంతో అటు పరీక్ష, ఇటు చికిత్స… రెండూ జరుగుతాయని చెప్పారు. మాకెంతో ఆందోళనగా ఉంది. ఆ పరీక్ష/చికిత్స గురించి వివరాలు చెప్పండి.

‘స్పైరస్‌ ఎంటిరోస్కోపీ’ అనేది కూడా ఒక రకమైన ’ఎండోస్కోపీ’ పరీక్ష లాంటిదే. ఇది చిన్నపేగును పరీక్షించేందుకు ఉపకరించే ఓ ప్రభావవంతమైన పరీక్షాసాధనం. మన జీర్ణవ్యవస్థ సరిగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. అది సరిగా పనిచేయకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. మీవారిలాగే చాలామంది కడుపునొప్పితో ఏళ్లతరబడి బాధపడుతూ కూడా… తమకు ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల లేదా మరో కారణం వల్ల ఇలా జరుగుతోందం టూ చిట్కావైద్యాలు చేసుకుంటూ చాలా అశ్రద్ధ చేస్తుంటారు. కానీ ఏళ్ల తరబడి తరచూ కడుపునొప్పి వస్తుంటే తప్పక డాక్టర్‌ చేత పరీక్ష చేయించుకుని, తగిన సలహా / చికిత్స తీసుకోవాలి. మీవారికి మలంతో పాటు రక్తం రావడమనే లక్షణంతో పాటు, నీరసంగా ఉండటం అనేది చిన్నపేగుల్లోని సమస్యను సూచిస్తోంది. సాధారణంగా కడుపులో సమస్య ఉంటే ‘ఎండోస్కోపీ’ అనే పరీక్ష ద్వారా నోరు, అన్నవాహిక నుంచి జీర్ణాశయం వరకు ఉన్న సమస్యలను తెలుసుకోవచ్చు.

మలద్వారం గుండా చేసే ‘కొలనోస్కోపీ’(colonoscopy) పరీక్ష ద్వారా పెద్దపేగుకు ఏవైనా సమస్యలుంటే తెలుసుకోడానికి వీలవుతుంది. అయితే చిన్నపేగుల్లో ఉండే ప్రధాన సమస్యలను గుర్తించాలంటే ప్రత్యేకమైన ఎండోస్కోపీ(endoscopy) చేయాల్సి ఉంటుంది. అందులో క్యాప్సూల్‌ ఎండోస్కోపీ ఒకటి. అయితే మీవారి విషయంలో ఆ పరీక్ష చేసినా ఫలితం రాలేదని రాశారు. సాధారణంగా క్యాప్సూల్‌ ఎండోస్కోపీతో మొత్తం జీర్ణవ్యవస్థలో ఉండే అన్ని అవయవాల సమస్యలూ తెలుసుకోవచ్చు. ఒక్కోసారి క్యాప్సూల్‌ వెళ్లే మార్గంలో ఏ భాగమైనా మూసుకుపోతే అక్కడ క్యాప్సూల్‌ ఇరుక్కుపోతుంది. మీవారి విషయంలో ఇదే జరిగి ఉంటుంది. ఇది కాకుండా చిన్నపేగులో మాత్రమే ఉండే సమస్యలను తెలుసుకోడానికి చేసే మరో పరీక్షే ‘ఎంటిరోస్కోపీ’. బెలూన్‌ సహాయంతో చేసే ఈ పరీక్ష కొంతమందికి సూట్‌ కాదు. టైమ్‌ కూడా ఎక్కువ తీసుకుంటుంది. మీవారిలాగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ పరీక్ష వీలుకాదు. అందుకే మీవారికి పవర్‌ స్పైరస్‌ ఎంటిరోస్కోపీ అనే పరీక్షను సూచించి ఉంటారు.

ఇది చాల సరళమైన, సురక్షితమైన, ప్రభావవంతమైన వైద్యపరీక్ష. చాలా తక్కువ సమయంలోనే దీన్ని చేయవచ్చు. ఈ ఎండోస్కోపీలో బెలూన్‌కు బదులు ఓవర్‌ట్యూబ్‌ను ఉపయోగిస్తారు. ఈ ఓవర్‌ట్యూబ్‌ సహాయంతో చిన్నపేగులోని మొత్తం దృశ్యాలను క్యాప్చర్‌ చేసి అక్కడి సమస్యలను స్పష్టంగా రికార్డు చేయవచ్చు. సాధారణ ఎంటిరోస్కోపీకి మూడు గంటల సమయం పడితే దీన్ని కేవలం గంటలోనే పూర్తిచేయవచ్చు. ఈ పవర్‌ స్పైరస్‌ ఎంటిరోస్కోపీతో కేవలం పరీక్ష మాత్రమే కాకుండా, చికిత్స కూడా చేయవచ్చు. దీంతో చాలా ప్రొసిజర్లను చేసి, చాలా సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని కూడా అందించవచ్చు. ఈ విధానంలో రోగికి అనస్థీషియా(anesthesia) ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ చిన్నపేగుల్లో ట్యూమర్‌గానీ, పాలిప్స్‌గానీ, పుండుగానీ ఉన్నట్లయితే వాటిని తొలగించి, మంచి చికిత్స అందించవచ్చు.

చిన్నపేగులో ఎక్కడైనా మూసుకుపోతే, ఆ ప్రదేశంలో దీనిసాయంతో వెడల్పు చేయవచ్చు. డాక్టర్‌కు కూడా ఇది చాలా సౌకర్యవంతంగా, చికిత్స చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఒక్కోసారి సీటీ, ఎమ్మారైలలో కూడా కనుగొనలేని (మిస్‌ అయ్యే) సూక్ష్మసమస్యలను సైతం ఈ పరికరంతో గుర్తించి చికిత్స అందించడం సాధ్యమవుతుంది. మీవారి విషయంలో డాక్టర్లు క్యాన్సర్‌ లేదా పాలిప్స్‌ను అనుమానిస్తున్నారని మీరు రాశారు. ఆ రెండు సందర్భాల్లోనూ ఈ స్పైరస్‌ ఎంటిరోస్కోపీతో చాలా సమర్థమైన చికిత్సను అందించే అవకాశం ఉంది. దీనితో ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ కూడా ఉండవు. కాబట్టి మీరు ఎలాంటి భయాలు, ఆందోళనలు పెట్టుకోకుండా మీవారికి అవసరమైన చికిత్స చేయించండి.

Originally published: https://m.sakshi.com/news/family/digestive-system-functioning-properly-we-are-healthy-1256239

About Author –

Dr. B. Ravi Shankar, Consultant Medical Gastroenterologist, Yashoda Hospital, Hyderabad
MD, DNB, DM (Gastroenterology)

About Author

Yashoda Doctors

Dr. B. Ravi Shankar

MD, DNB, DM (Gastroenterology)

Consultant Medical Gastroenterologist