Select Page

రోగనిరోధక శక్తి అంటే ఏమిటి? శరీరంలో దీని యొక్క ప్రాముఖ్యత

కరోనా మహమ్మారి సంక్రమణ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి ఒక్కరికి రోగనిరోధక శక్తి ప్రాధాన్యత లేదా అవసరం గురించి తెలుస్తోంది. రోగనిరోధ‌క శ‌క్తి మ‌‌న ఆరోగ్యానికి చాలా అవ‌స‌రం. జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం ఇలా ఏ అనారోగ్య స‌మ‌స్య‌ను అయినా రోగనిరోధ‌క శ‌క్తి ఉంటే సుల‌భంగా ఎదుర్కోవ‌చ్చు. అదే ఇమ్యూనిటీ ప‌వ‌ర్ దెబ్బ‌తింటే శ‌రీరం నీర‌సిస్తుంది. అనేక ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎద‌ర‌వుతాయి. 

మనిషికి సంక్రమించే వివిధ రకాల వ్యాధుల నుంచి కాపాడేది కూడా రోగనిరోధక వ్యవస్దే. శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనమైతే తరచూ అనారోగ్యం వెంటాడుతుంటుంది. ఈ క్రమంలో రోగ నిరోధక శక్తి అంటే ఏమిటి? శరీరంలో దీని యొక్క ప్రాముఖ్యత, ఎలాంటి అలవాట్లు మనిషి శరీరంలో రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) అంటే ఏమిటి?

సూక్ష్మజీవులు లేదా టాక్సిన్‌ల కారణంగా ఏర్పడే హానికరమైన ప్రభావాల నుంచి మనల్ని రక్షించేందుకు శరీరం కలిగి ఉండే  సామర్ద్యాన్ని రోగనిరోధక శక్తి అంటారు. రోగనిరోధక వ్యవస్ధ మన శరీరంలో వ్యాధులు రాకుండా కాపాడుతూ, ఒకవేళ వచ్చినా, వాటిని సమర్ధంగా పోరాడి ప్రారదోలే యంత్రాంగం. అందుకే ప్రతి ఒక్కరూ రోగనిరోధ‌క శక్తిని పెంచుకోవ‌డం చాలా అవ‌స‌రం.

రోగనిరోధక శక్తి తగ్గడానికి కారణాలు

Reasons for decrease immunity

శరీరంలో రోగ నిరోధక స్దాయి తగ్గడానికి అనేక కారణాలున్నాయి:

  • పంచదారను ఎక్కువగా తీసుకోకూడదు, ఇది శరీరంలో ఉన్న రోగనిరోధక వ్యవస్దను బలహీనపరుస్తుంది.
  • సాధ్యమైనంత వరకూ ఆయిలీపుడ్స్‌ను తీసుకోవడం తగ్గించాలి. 
  • ప్రాసెస్డ్ మంసాలకు దూరంగా ఉండాలి. కారణం ఇందులో ఉండే కొన్ని రకాల ఫ్యాట్స్‌ శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గించడమే కాక కొన్ని రకాల వ్యాధులు రావడానికి కూడా కారణం అవుతాయి.
  • నేటి కాలంలో మారిన జీవనశైలి విధానం, మొబైల్‌ ఫోన్‌ అధికంగా వాడడం మరియు సరిగా నిద్రపోకపోవడం వంటి వాటి వల్ల కూడా శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
  • చాలామంది రుచికి సరిపడేంత ఉప్పు లేదంటూ ఆహారంలో ఉప్పు అధికంగా వాడేస్తుంటారు. దీనివల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంటుంది. తద్వారా రోగనిరోధక శక్తి బలహీన పడుతుందని ఓ అధ్యయనంలో తేలింది.

రోగనిరోధక శక్తి ఎవరిలో ఎక్కువ?

రోగ నిరోధక శక్తి పురుషుల్లో కంటే మహిళల్లోనే అధికంగా ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకు కారణం:

  • సాధారణంగా పురుషులు, మహిళల శరీర నిర్మాణం చాలా వేరుగా ఉంటుంది. మగవారిలో మరియు ఆడవారిలో హార్మోన్లు కూడా చాలా బిన్నంగా ఉంటాయి. పురుషులతో పోలిస్తే మహిళ్లల్లోనే రోగనిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మగవారి కంటే ఆడవారిలో ఏ వ్యాధి నుంచి అయినా చాలా త్వరగా కోలుకునే శక్తి ఉంటుంది. 
  • సంతానోత్పత్తికి ప్రధాన కారణం మహిళలే కావున వారిలో రోగనిరోధక శక్తి చాలా ఎక్కువని ప్రముఖ వైద్యనిపుణులు చెబుతున్నారు.

రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

How to increase immunity

రోగనిరోధక శక్తి ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. విటమిన్లు, పోషకాలు మెండుగా లభించే కూరగాయాలు తినాలి. అప్పుడే నూతన ఉత్సాహంతో పనులు చేసుకోవచ్చు.

  • మిటమిన్ C అధికంగా ఉండే ఆరెంజ్, నిమ్మకాయ లాంటి రసాలు తప్పనిసరిగా తీసుకోవాలి.
  • ప్రతిరోజూ కనీసం ఒక గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. గుడ్డు తింటే శారీరకంగా బలం చేకూరి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కరోనా వైరస్ బాధితులకు సైతం వైద్యులు గుడ్లు అందిస్తుడడం విశేషం.
  • తాజా ఆకుకూరలు తింటే కంటిచూపు మెరుగ్గా ఉంటుందని తెలిసిందే. అయితే ఆకుకూరల్లో విటమిన్లు A, C మరియు K లభిస్తాయి. వీటితో పాటు శరీరానికి తగినంత కాల్షియం, మెగ్నీషియం తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.
  • నట్స్ పోషకాలకు పుట్టినిల్లు. ప్రతి గింజ లో అవయవాలు సమర్ధవంతంగా పనిచేయడానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. వీటితో పాటు ఒమేగా – 3 కొవ్వు ఆమ్లాలు తీసుకోవడం వల్ల కూడా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట రోజంతా సీట్లకు అతుక్కుని పనిచేయడం వల్ల చాలా మందిలో అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వ్యాయామం, యోగా వంటివి చేయడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.
  • జంగ్ ఫుడ్‌, ఫాస్ట్ ఫుడ్‌ను తినడం మానేయాలి. ఇంట్లో తయారుచేసే రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మటన్‌, చేపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి ప్రొటీన్లు, జింక్‌ వంటివి అధిక మోతాదులో అందుతాయి. 
  • వెల్లుల్లితో పాటు అల్లంను మన ఆహారంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది (వెల్లుల్లిలో ఉండే పోషకాలు యాంటీ బయాటిక్‌గా పనిచేస్తాయి). A, D, E విటమిన్లు అధికంగా ఉండే పదార్థాలు, జింక్, సెలీనియం ఉండే పోషక పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం మరింత ఆరోగ్యవంతంగా ఉంటుంది.
  • ప్రస్తుత కాలంలో అనేక సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ చలి కాలంలో చల్లటి వాతావరణం కారణంగా అనేక వైరల్ జ్వరాలు వస్తుంటాయి. వైరల్ జ్వరం బారిన పడకుండా ముందే జాగ్రత్త పడితే ఆరోగ్యంతో పాటు డబ్బు కూడా మిగులుతుంది. పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, పాలు వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొదించుకోవచ్చు. 
  • అలాగే ఆహారం ఒకేసారి ఎక్కువగా తీసుకోకుండా 3 గంటలకు ఒక్కసారి తీసుకోవడం ఉత్తమమైన విధానం. వీటితో పాటుగా ఇతర ఆహారపదార్దాలని సరైన టైంకి తీసుకుంటూ, సమయానికి నిద్రపోతూ మంచి జీవనవిధానాన్ని అలవాటు చేసుకోవాలి. అప్పుడే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి అనేక వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

About Author –

Dr. Vighnesh Naidu Y, Consultant Physician, Yashoda Hospitals – Hyderabad
M.B.B.S, M.D. (Internal Medicine)