క్యాన్సర్ రకాలు, కారణాలు, లక్షణాలు మరియు చికిత్స విధానాలు

క్యాన్సర్ రకాలు, కారణాలు, లక్షణాలు మరియు చికిత్స విధానాలు

మారిన జీవనశైలి మరియు వివిధ రకాల ఆహారపు అలవాట్ల వల్ల ఫురుషులు, మహిళలు అనే లింగభేధం లేకుండా ప్రస్తుతం చాలా మంది అనేక రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు. క్యాన్సర్‌ ఎవరికి ఎప్పుడు, ఎందుకు, ఎలా వస్తుందో చెప్పలేము. క్యాన్సర్ శరీరంలోని ఏ భాగంలోనైనా రావొచ్చు. నోరు, ఛాతీ, ఊపిరితిత్తులు, గొంతు, స్వరపేటిక, రొమ్ము, శ్వాసకోశ, ప్రోస్టేట్‌, పేగు, జీర్ణశయ, కాలేయ క్యాన్సర్ ల వంటి దాదాపు 100కు పైగా క్యాన్సర్‌ రకాలు ఉన్నాయి. అయితే గడిచిన 30 సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా 50 ఏళ్ల లోపు వయస్సు గల వారిలో క్యాన్సర్‌ కేసులు ఏకంగా 79 శాతం పెరిగాయంటే ఈ వ్యాధి ప్రభావం ఏ మేర వ్యాపిస్తుందో తెలుస్తుంది.

సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. అయితే, కొన్ని కారణాల వల్ల, ఆ కణాలు నియంత్రణ కోల్పోయి, చాలా వేగంగా, అనియంత్రితంగా (నియంత్రణ లేకుండా) విభజన చెంది కణ సమూహాలుగా ఏర్పడే స్థితినే క్యాన్సర్ అంటారు. ఈ కణ సమూహాలను ‘కణితి’ (ట్యూమర్) అని పిలుస్తారు. క్యాన్సర్ కణాలు ముందుగా స్థానిక కణజాలం పైన దాడి చేసి వాటిని నాశనం చేయడమే కాకుండా మన శరీరంలోని రక్తం మరియు శోషరస వ్యవస్థ (lymphatic system) ద్వారా ఇతర బాగాలకు కూడా వ్యాపిస్తాయి. ఇలా వ్యాపించే క్యాన్సర్‌నే మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటారు. అయితే క్యాన్సర్ బారిన పడిన చాలా మందిలో నిరక్షరాస్యత మరియు క్యాన్సర్ పై సరైన అవగాహన లేకపోవడంతో వ్యాధి తీవ్ర‌త పెరిగి ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.

క్యాన్సర్ రకాలు

క్యాన్సర్‌ ప్రారంభమయ్యే కణ రకాన్ని బట్టి వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు.

  • కార్సినోమా (Carcinoma): క్యాన్సర్‌లలో కార్సినోమాలు అత్యంత సాధారణ రకం. ఈ క్యాన్సర్ చర్మంలో లేదా శరీరం లోపలి అవయవాలని కప్పి ఉంచే కణజాలంలో ప్రారంభమవుతుంది. ఇందులో బేసల్ సెల్ కార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా మరియు ట్రాన్సిషనల్ సెల్ కార్సినోమా అనే వివిధ ఉప రకాలు ఉంటాయి.
  • సార్కోమా (Sarcoma): కనెక్టివ్ లేదా సపోర్టివ్ టిష్యూల్లో (ఎముక, మృదులాస్థి, కొవ్వు, కండరాలు లేదా రక్త నాళాలలో) ప్రారంభమయ్యే క్యాన్సర్ ను సార్కోమా అంటారు. సార్కోమా  క్యాన్సర్ లో లియోమియోసార్కోమా, కపోసి సార్కోమా, ప్రాణాంతక ఫైబరస్ హిస్టియోసైటోమా, లిపోసార్కోమా మరియు డెర్మాటోఫైబ్రోసార్కోమా ప్రొటుబెరాన్స్ అనే ఉప రకాలు ఉంటాయి.
  • లుకేమియా (Leukaemia): ఇది తెల్ల రక్త కణాలలో ఏర్పడే క్యాన్సర్. ఇది ఎముక మజ్జలో (బోన్ మ్యారో) రక్త కణాలను తయారు చేసే కణజాలంలో వస్తుంది.
  • లింఫోమా మరియు మైలోమా (Lymphoma and Myeloma): ఈ క్యాన్సర్‌లు రోగనిరోధక వ్యవస్థ కణాల్లోప్రారంభమవుతాయి.
  • మెదడు మరియు వెన్నుపాము క్యాన్సర్‌లు: ఇవి కేంద్ర నాడీ వ్యవస్థలో ఉత్పన్నమయ్యే క్యాన్సర్‌లు.

చాలా క్యాన్సర్లలో 4 దశలు ఉంటాయి. అయితే శరీరంలో కణితి స్థానం మరియు పరిమాణం బట్టి  దశ-1, దశ-2, దశ-3, దశ-4లుగా వర్గీకరించవచ్చు.

క్యాన్సర్‌ రావడానికి గల కారణాలు

  • వ్యాయామం, శారీరక శ్రమ బొత్తిగా లేకపోవడం
  • అధిక బరువు మరియు ఊబకాయం కలిగి ఉండడం
  • రక్తంలో చెక్కర స్థాయిలు అధికంగా ఉండడం
  • ఉప్పు అధికంగా ఉండే అహారాలను తీసుకోవడం
  • పండ్లు, పాలను తగినంతగా తీసుకోకపోవడం
  • పొగాకు వాడకం మరియు మద్యం సేవించడం
  • వారసత్వంగా కూడా క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి
  • మన శరీర కణాలు పని చేసే విధానం, విభజన ప్రక్రియలని నియంత్రించే నిర్దిష్ట DNA లోని జన్యు పరమైన మార్పులు కూడా కాన్సర్ కి కారణమవుతాయి
  • రేడియేషన్‌ ప్రభావానికి గురికావడం మరియు పర్యావరణ కాలుష్యం కూడా క్యాన్సర్లకు దారితీస్తున్నాయి

Types of Cancer-telugu1

క్యాన్సర్ యొక్క లక్షణాలు

క్యాన్సర్‌తో సంబంధం కలిగి ఉండే సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు: 

  • అజీర్ణం లేదా గుండెల్లో మంట
  • రాత్రుళ్లు ఎక్కువ చెమట పట్టడం
  • గొంతు మరియు ముక్కు నుంచి రక్తం కారడం
  • దగ్గు మానకుండా రావడం
  • ఊపిరి ఆడకపోవడం
  • ఆకలి లేకపోవడం మరియు అనుకోకుండా బరువు తగ్గడం 
  • మింగడంలో ఇబ్బంది పడడం మరియు రక్త వాంతులవ్వడం 
  • మూత్రంలో రక్తం, మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది పడడం
  • శరీరంలో కొత్తగా కణితులు మరియు పుట్టుమచ్చలు ఏర్పడడం
  • నోటి లోపల చిన్నగా తెలుపు లేదా ఎరుపు బొబ్బలు రావడం
  • రొమ్ములు, చనుమొలల్లో మరియు చర్మంలో మార్పులు రావడం

క్యాన్సర్ చికిత్సలు

ఈ మధ్య కాలంలో క్యాన్సర్‌కి అధునాతన ట్రీట్‌మెంట్ విధానాలైన కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ వంటి ఉత్తమ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే సర్జరీ సక్సెస్ రేట్ అనేది ఆ క్యాన్సర్ యొక్క రకం మరియు తీవ్రతను బట్టి ఉంటుంది. 

అంతేకాకుండా జన్యు పరీక్షలు, రక్త పరీక్షలు, ఇమేజింగ్ పరీక్షలు (CXR, USG, CT, MRI, PET-CT), బయాప్సీలు వంటి క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్లను గుర్తించవచ్చు. అయితే క్యాన్సర్ కు తొలి దశలోనే చికిత్స తీసుకోవడం ద్వారా క్యాన్సర్‌ మరణాల్లో దాదాపు సగానికి పైగా మరణాల రేట్లను తగ్గించవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లను మరియు జీవనశైలిని మార్చుకోవడం ద్వారా క్యాన్సర్‌ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. 

About Author –

About Author

Dr. Soma Srikanth

MS, MCh Surgical Oncology, FMAS, FICRS, FIAGES, FALS (Oncology)

Consultant Surgical Oncologist