టాన్సిలిటిస్: రకాలు, కారణాలు, లక్షణాలు మరియు చికిత్స విధానాలు

టాన్సిలిటిస్: రకాలు, కారణాలు, లక్షణాలు మరియు చికిత్స విధానాలు

టాన్సిల్స్ అనేవి నోటి వెనుక మరియు గొంతు పై భాగంలో ఇరువైపులా రెండు బాదం గింజ ఆకారంలో ఉండే చిన్న గ్రంథి లాంటి నిర్మాణాలు. టాన్సిల్స్ శోషరస వ్యవస్థలో ఒక భాగం. మనం తీసుకునే ఆహారం, పీల్చుకునే గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశించే వైరస్ లు, బాక్టీరియా, సూక్ష్మక్రిములు మరియు కాలుష్య కారక పదార్థాలను ఈ టాన్సిల్స్ ఎదుర్కొంటాయి. సూక్ష్మక్రిములను వాయుమార్గాల్లో ప్రవేశించకుండా టాన్సిల్స్ ఫిల్టర్‌లుగా పనిచేయడం వల్ల మన శరీరం పలు రకాల ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటుంది. అయితే శరీరానికి రక్షణ వ్యవస్థగా ఉండే ఈ టాన్సిల్స్ కొన్ని సార్లు వివిధ రకాల ఇన్ఫెక్షన్ ల బారిన పడి అనారోగ్యానికి గురవుతాయి, ఈ పరిస్థితినే టాన్సిలిటిస్ అంటారు.

వైరల్ లేదా బాక్టీరియల్ (అడెనో, ఇన్ఫ్లుఎంజా, ఎప్స్టీన్-బార్, పారాఇన్‌ఫ్లుఎంజా, ఎంటిరో వైరస్లు, హెర్పెస్ సింప్లెక్స్ వైరస్లు మరియు స్ట్రెప్టోకోకస్ పైయోజెనెస్) ఇన్ఫెక్షన్‌లతో సహా వివిధ కారణాల వల్ల టాన్సిల్స్ అనేవి ఇన్ఫెక్షన్ లు లేదా వాపుకు గురవుతుంటాయి. ఈ సమస్య వయస్సుతో సంబంధం లేకుండా అందరికి  వస్తుంది, ముఖ్యంగా 3-7 సంవత్సరాల మధ్య పిల్లలకు (వైరల్ టాన్సిలిటిస్), 5-15 సంవత్సరాల మధ్య పిల్లలకు (బాక్టీరియల్ టాన్సిలిటిస్) ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.

టాన్సిల్స్ వాపుకి గల కారణాలు

సాధారణ జలుబు వల్ల టాన్సిల్స్ వాపుకు గురవుతాయి, జలుబు తో పాటుగా:

  • పలు రకాల వైరస్‌లు మరియు స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ లు సోకడం
  • చల్లటి పదార్థాలు తినడం
  • నోటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం
  • నోరు లేదా గొంతులో గాయాలవ్వడం
  • పరిశుభ్రత లేని అనారోగ్యకరమైన ఆహారాలు తినడం 

ఇవే కాకుండా చాలా అరుదుగా క్యాన్సర్‌, టీబీ వ్యాధి వల్ల కూడా టాన్సిల్స్ వాపు వచ్చే అవకాశం ఉంటుంది.

టాన్సిలిటిస్ యొక్క లక్షణాలు

Tonsillitis Types, Symptoms & Treatment_Body 1

టాన్సిలిటిస్ యొక్క లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

  • టాన్సిల్స్ వాపు 
  • గొంతు వాపు మరియు నొప్పి
  • చెవి నొప్పి
  • తల నొప్పి
  • నోరు తెరిచినప్పుడు నొప్పి
  • నీరసం మరియు చికాకు
  • నోటి దుర్వాసన
  • తినడం మరియు మింగడంలో ఇబ్బంది 
  • గొంతులో ఏదో అడ్డుపడుతున్నట్లు ఉండడం 
  • శ్వాస సరిగా తీసుకోకపోవడం
  • మెడ గట్టిపడటం
  • శోషరస కణుపులు వాపుకు గురికావడం
  • టాన్సిల్స్ ఎరుపు రంగులోకి మారడం
  • కొంత మంది పిల్లల్లో జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది

టాన్సిలిటిస్ రకాలు

టాన్సిలిటిస్ మఖ్యంగా 3 రకాలు. అవి,

  1. అక్యూట్ టాన్సిలిటిస్: టాన్సిలిటిస్ యొక్క లక్షణాలు 10 లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉన్నట్లయితే ఆ పరిస్థితిని అక్యూట్ టాన్సిలిటిస్ గా చెప్పవచ్చు. 
  2. దీర్ఘకాలిక టాన్సిలిటిస్: ఈ టాన్సిలిటిస్ సంవత్సరం పొడవునా సంభవిస్తుంటుంది. ఈ పరిస్థితి అక్యూట్ టాన్సిలిటిస్ కంటే ఎక్కువ కాలం ఉంటుంది.
  3. పెర్సిస్టెంట్ టాన్సిలిటిస్: ఒక వ్యక్తి సంవత్సరానికి 5-7 సార్లు గొంతు నొప్పితో బాధపడుతుంటే ఆ సమస్యను నిరంతర టాన్సిలిటిస్ గా చెబుతారు. అనేక సార్లు టాన్సిలిటిస్ బారిన పడినప్పుడు మాత్రమే ఈ పరిస్థితి వస్తుంది. ఈ రకమైన టాన్సిలిటిస్ సమస్యతో బాధపడుతున్న వారు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించడం తప్పనిసరి. 

ప్రస్తుత కాలంలో ఈ టాన్సిలిటిస్ ను తొలగించడానికి అనేక అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది టాన్సిలెక్టమీ చికిత్స. ఒక వ్యక్తి దీర్ఘకాలికంగా టాన్సిలిటిస్ బారిన పడి శ్వాస తీసుకోవడం లేదా మింగడంలో ఇబ్బంది ఉన్నట్లయితే సాధారణంగా టాన్సిలెక్టమీ చికిత్స సిఫార్సు చేస్తారు. టాన్సిలిటిస్ తరచుగా సంభవించినప్పుడు లేదా యాంటీబయాటిక్స్‌తో నయం కానప్పుడు అదే విధంగా పిల్లలు దీర్ఘకాలిక టాన్సిలిటిస్ బారిన పడి శ్వాస సమస్యలకు దారితీసినప్పుడు లేదా వారి సాధారణ నిద్ర మరియు మ్రింగడం లేదా జీర్ణక్రియ విధానాలకు భంగం కలిగించినప్పుడు కూడా వైద్యులు టాన్సిలెక్టమీ సర్జరీనే సూచిస్తారు. ఈ ప్రక్రియ ఇతర సర్జరీ విధానాలతో పోలిస్తే తక్కువ నొప్పిని కలిగి వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది. 

ఈ చికిత్సతో పాటు టాన్సిలిటిస్ కు

  1. లేజర్ టాన్సిలెక్టమీ
  2. కోబ్లేషన్ టాన్సిలెక్టమీ
  3. రోబోటిక్ టాన్సిలెక్టమీ
  4. ట్రాన్సోరల్ రోబోటిక్ సర్జరీ (TORS) వంటి చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి.

టాన్సిలిటిస్ నివారణ చర్యలు

టాన్సిలిటిస్ ను పూర్తిగా నిరోధించలేనప్పటికీ ఈ నివారణ చర్యలు పాటించడం ద్వారా కొంత మేర నివారించుకోవచ్చు. 

  • వ్యక్తిగత శుభ్రత పాటించడం
  • నోటిని శుభ్రంగా ఉంచుకోవడం
  • ఆవిరి పట్టడం
  • ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కొత్త టూత్ బ్రష్‌లను వాడడం
  • గదిలో గాలిని శుద్ధి చేయడానికి హ్యూమిడిఫైయర్లను ఉపయోగించడం
  • గొంతు నొప్పిని తగ్గించడానికి స్ట్రెప్సిల్స్ వంటి లాజెంజ్‌లను తీసుకోవడం
  • గొంతు నొప్పిని తగ్గించడానికి వెచ్చని మరియు మృదువైన ఆహారాన్ని తినడం
  • అన్నం తినడం కష్టంగా అనిపించినప్పుడు ఫ్రూట్‌ జ్యూస్‌, మిల్క్ షేక్‌లు వంటివి తీసుకోవడం 
  • ఆహారం, తాగే గ్లాసులు లేదా పాత్రలను ఇతరులతో పంచుకోకపోవడం
  • తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మరియు తినడానికి ముందు & మలమూత్ర విసర్జన తరువాత శుభ్రత పాటించడం
  • బాక్టీరియల్ లేదా వైరల్ ఇన్‌ఫెక్షన్‌లు సోకినప్పుడు ఆరుబయట ప్రదేశాల్లో తిరగకపోవడం

టాన్సిలిటిస్ అనేది పిల్లలు మరియు యుక్తవయస్కులలో ఉన్న వారికి సాధారణ సమస్య అయినప్పటికీ, చికిత్స చేయకుండా వదిలేస్తే అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే ఆరోగ్యం మరియు పరిశుభ్రతను అలవాటు చేయడం చాలా అవసరం. టాన్సిలిటిస్ సమస్యను సకాలంలో గుర్తిస్తే చాలా సులభంగా చికిత్స చేయించుకోవచ్చు. అదే ఆలస్యమైతే సర్జరీ వరకూ వెళ్లే పరిస్థితి రావొచ్చు. అందుకే టాన్సిలిటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే మందుల ద్వారా సమస్య పరిష్కారమయ్యే ఆస్కారం ఉంటుంది.

About Author –

About Author

Dr. Raghu Kumar s CH | yashoda hospitals

Dr. Raghu Kumar. S CH

MBBS, MS

Consultant ENT, Head & Neck Surgeon