టమటా ఫ్లూ..వ్యాధి లక్షణాలు, నిర్ధారణ, నివారణకై తీసుకోవాల్సిన చర్యలు
ఈ వ్యాధి గుర్తింపు లక్షణాలు
- ఇది తేలికపాటి జ్వరం, ఆకలి లేకపోవటం, అనారోగ్యం, తరచుగా గొంతు నొప్పి ఉంటాయి.
- టమటా ఫీవర్ వచ్చిన పిల్లల్లో చర్మంపై ఎర్రటి పొక్కులు, బొబ్బలు వస్తాయి. ఇవి పొక్కులుగా, తరువాత కురుపులుగా మారుతాయి.
- పుండ్లు సాధారణంగా నాలుక, చిగుళ్లు, బుగ్గల లోపల, అరచేతులు, అరికాళ్లపై వస్తాయి. ఆ దదుర్లు వారికి చికాకును తెప్పిస్తాయి.
- ఈ వ్యాధి సోకిన పిల్లలు ఎక్కువగా డీ హైడ్రేషన్ కు గురవ్వడంతో డయేరియా, వాంతులు, నీరసం అయిపోవడం, ఒళ్లు నొప్పులు జ్వరం వంటివి సాధారణంగా వస్తాయి.
టమటా వ్యాధి నిర్ధారణ, నివారణ చర్యలు
పై లక్షణాలతో ఉన్న పిల్లలలో డెంగ్యూ, చికున్ గున్యా, జికా వైరస్, వరిసెల్లా-జోస్టర్ వైరస్, హెర్పెస్ నిర్ధారణ కోసం మాలిక్యులర్, సెరోలాజికల్ పరీక్షలు చేస్తారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్లు మినహాయించిన తర్వాత.. టొమాటో ఫ్లూ నిర్ధారణ చేస్తారు.
- ప్రస్తుతానికి ఈ వ్యాధికి సరైన మందులు అందుబాటులో లేవు, స్వీయ నియంత్రణ ఒక్కటే పరిష్కారం.
- శిశువులు, చిన్నపిల్లలపై ఈ వ్యాధి ప్రభావం ఎక్కువ కావున వారిపై తల్లిద్రండులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
- పిల్లలు అపరిశుభ్రమైన ఉపరితలాలను తాకడం, నేరుగా నోటిలోకి వస్తువులను, చేతులను పెట్టుకోవడం వంటి వాటికి చేయకుండా చూడాలి.
- దీనికి చికిత్స ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటుంది కాబట్టి ఐసోలేషన్ లో ఉండటం, విశ్రాంతి తీసుకోవడం, ఎక్కువగా డాక్టర్లు సూచించిన పళ్ల రసాలు, ద్రవ పదార్ధాలు తీసుకోవాలి.
- ఇతర పిల్లలకు లేదా పెద్దలకు వ్యాధి సోకకుండా నిరోధించడానికి ఏదైనా లక్షణం కనిపించినప్పటి నుంచి ఐదు నుంచి ఏడు రోజుల పాటు రోగిని ఐసోలేషన్‌లో ఉంచాలి.
- నివారణకు ఉత్తమ పరిష్కారం సరైన పరిశుభ్రత. చుట్టు పక్కల పరిసరాలను శుభ్రపరచడం, అలాగే వ్యాధి సోకిన పిల్లలకు చెందిన బొమ్మలు, బట్టలు, ఆహారం ఇతరులు ఉపయోగించకుండా చూడాలి.
- జ్వరం లేదా దద్దుర్లు ఉన్న పిల్లలను ఇతర పిల్లలు తాకరాదు.
- నోట్లో వేలు వేసుకునే అలవాటు, లేదా బొటనవేలు చప్పరించే అలవాట్లను పిల్లలతో మాన్పించాలి.
- ముక్కు కారుతున్నప్పుడు లేదా దగ్గు వచ్చినప్పుడు రుమాలు ఉపయోగించమని పిల్లలకు చెప్పాలి.
- ఒంటిపై ఏర్పడిన పొక్కును గీసుకోవడం లేదా రుద్దడం చేయకూడదు. పిల్లలను హైడ్రేటెడ్‌గా ఉంచాలి.
- చర్మాన్ని శుభ్రం చేయడానికి లేదా పిల్లలను స్నానం చేయించడానికి ఎల్లప్పుడూ వేడి నీటిని ఉపయోగించాలి.
ఈ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- ఈ వ్యాధి బారీన పడిన వారందరినీ 5-7 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలి.
- అయితే ఈ వ్యాధి సోకిన వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండి.. వారం, పది రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది.
- ఈ వ్యాధి అంటువ్యాధి కాదు, ప్రాణాంతకం అంతకంటే కాదని ఆర్యోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ వ్యాధికి సంబంధించిన పలు విషయాల గురించి ఒడిషాలోని రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్లో వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
- ఈ వ్యాధి నివారణలో భాగంగా జ్వరం ఉంటే పారాసిటమాల్ మాత్రలు, నోట్లు పుండ్లు తగ్గడానికి నోటిపూత మలములు వాడాలి.
- ఈ సాధారణ చికిత్సలు వాడినప్పటికీ అధికమైతే మాత్రం ఎసైక్లోవిర్ వంటి యాంటీ వైరల్ మందులు మేలు చేస్తాయని వైధ్యులు చెబుతున్నారు.
ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలుః
- ఈ వ్యాధి ఎక్కువగా చేతులు, నోటి ద్వారా వ్యాప్తి చెందుతుంది.
- ఈ వ్యాధి సంక్రమించిన వారిని వేరుగా ఉంచాలి. ఎందుకంటే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. సంక్రమితులు వాడే వస్తువులను శానిటైజ్ చేయాల్సి ఉంటుంది.
- ఈ వ్యాధి ముఖ్యంగా మల, విసర్జనకు వెళ్లిన తరువాత కాళ్లు, చేతులు సరిగా కడుక్కోక పోవడం, మలం ఉన్న చోట తాకిన చేతులను నోట్లో పెట్టుకోవడం ద్వారా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రముఖ వైధ్యులు చెబుతున్నారు. లాలజలం వంటి శరీర స్రావాలతోనూ ఈ వ్యాధి వేగంగా సంక్రమిస్తుండడంతో తగు నివారణ చర్యలు పాటించాలి.
ఈ వ్యాధి దేశంలో కేరళలతో పాటు తమిళనాడు, ఒడిశా, హర్యానాలోనూ టమోటా ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. అయితే టమోటా ఫ్లూకి కరోనా వైరస్, మంకీపాక్స్, డెంగ్యూ, చికెన్ పాక్స్ లతో ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇది అంటు వ్యాధా? ఎలా వ్యాప్తి చెందుతుంది వంటి విషయాలను కనుక్కునే పనిలో ఆరోగ్యశాఖ అధికారులు నిమ్మగ్నమయ్యారు. మామూలుగా డెంగ్యూ లాంటి జ్వరం అటాక్ అయిన తర్వాత టమాట ఫ్లూ సోకే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని వారు చెప్తున్నారు.
అయితే కొంతమంది సాధారణ పౌరులు మాత్రం వ్యాధులకు ఇంటువంటి పేర్లతో నామకరణం చేయడంపై మండిపడుతున్నారు. వ్యాధులకు ఇంటువంటి పేర్లను పెట్టరాదని.. ప్రజలు ఈ పేరును విని ఈ వ్యాధి టమోట ద్వారా వస్తుందని నమ్మే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ వ్యాధిపై దేశ, విదేశాల్లోనూ అనేక మంది శాస్రవేత్తలు అనేక ప్రయోగాలు చేసి..ఈ వ్యాధి భారీనా పడినా మరణించే అవకావశాలు చాలా తక్కువని చెప్పారు. అయినప్పటికీ ప్రజలు ఎవరు కూడా చర్మంపై దద్దులు, బొబ్బర్లు కనబడితే తప్పక డాక్టర్‌ని సంప్రదించి తగు చికిత్సలు తీసుకోవాల్సిందిగా వివరించారు.
వ్యాధి తీవ్రత ఎలా ఉన్న చిన్నపిల్లలపై మాత్రం తల్లిద్రండులు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.పెద్దలు. పిల్లలు తగు జాగ్రత్తలు పాటించి ఈ వ్యాధి నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖ నిపుణులు చెబుతున్నారు
About Author –
Dr. Hari Kishan Boorugu, Consultant Physician & Diabetologist, Yashoda Hospitals, Hyderabad