తలసేమియా: రకాలు, లక్షణాలు మరియు అపోహలు & వాస్తవాలు
ఎర్ర రక్త కణాలలో ఉండే హిమోగ్లోబిన్ ను శరీరం తగినంతగా ఉత్పత్తి చేయనప్పుడు ఏర్పడే రక్త వ్యాధినే తలసేమియా అంటారు. హిమోగ్లోబిన్ రక్తంలోని ఆక్సిజన్‌ను శరీరంలోని వివిధ భాగాలకు తీసుకు వెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఆల్ఫా (α) మరియు బీటా (β) అనే రెండు ప్రోటీన్లతో ఏర్పడుతుంది. తలసేమియా వ్యాధిగ్రస్తుల్లో ఎముక మజ్జ (బోన్ మ్యారో) శరీరానికి కావాల్సిన హిమోగ్లోబిన్ లేదా ఎర్ర రక్త కణాలను తయారుచేయకపోవడంతో శరీరంలోని అన్ని కణాలకు తగినంత ఆక్సిజన్ సరఫరా అందదు.
తలసేమియా ఎక్కువగా 2 సంవత్సరాల్లోపు గల వారిలో గమనించవచ్చు. మన శరీరంలో ఎర్ర రక్త కణాలు లేదా హిమోగ్లోబిన్ ఉండాల్సిన మోతాదులో లేనప్పుడు తలసేమియాతో పాటు రక్తహీనత సమస్య కూడా కలిగే అవకాశం ఉంటుంది. తీవ్రమైన రక్తహీనత సమస్య అవయవాలను దెబ్బతీయడమే కాక కొన్ని సార్లు మరణానికి కూడా దారితీయవచ్చు. కొన్ని జన్యుపరమైన మార్పుల వల్ల కూడా తలసేమియా రావొచ్చు.
తలసేమియా యొక్క రకాలు
తలసేమియా ప్రధానంగా రెండు రకాలు
- ఆల్ఫా (α) తలసేమియా
- బీటా (β) తలసేమియా
ఇందులో ఒక్కో రకానికి వేర్వేరు జన్యువులు ప్రభావితమవుతాయి.
ఆల్ఫా తలసేమియా: శరీరంలో హిమోగ్లోబిన్ తయారు చేసే నాలుగు జన్యువులు దెబ్బతిన్నప్పుడు ఆల్ఫా తలసేమియా వస్తుంది. ఈ ఆల్ఫా తలసేమియా 4 రకాలు.
- ఆల్ఫా తలసేమియా సైలెంట్ క్యారియర్: నాలుగు ఆల్ఫా-గ్లోబిన్ జన్యువులలో ఒకటి దెబ్బతిన్నప్పుడు మిగిలిన మూడు సాధారణంగా పనిచేసే స్థితినే ఆల్ఫా తలసేమియా సైలెంట్ క్యారియర్ అంటారు. ఈ దశలో ఎర్రరక్త కణాలు సాధారణం కంటే చిన్నవిగా ఉంటాయి. ఈ సమయంలో తలసేమియా వ్యాధి లక్షణాలు ఏమీ కనిపించవు.
- ఆల్ఫా తలసేమియా క్యారియర్ : ఈ దశలో రెండు జన్యువులు దెబ్బతిన్నప్పుడు మిగతా రెండు పనిచేసే స్థితిని ఆల్ఫా తలసేమియా క్యారియర్ అంటారు. ఈ రకమైన ఆల్ఫా తలసేమియా ఉన్న వారు సాధారణ రక్తహీనతతో బాధపడుతుంటారు.
- హిమోగ్లోబిన్ హెచ్ వ్యాధి: నాలుగు ఆల్ఫా-గ్లోబిన్ జన్యువుల్లో మూడు దెబ్బతిన్నప్పుడు ఒక జన్యువు మాత్రమే పనిచేసే స్థితిని హిమోగ్లోబిన్ హెచ్ వ్యాధి అంటారు. దీని ఫలితంగా తీవ్రమైన రక్తహీనత ఏర్పడుతుంది.
- ఆల్ఫా తలసేమియా మేజర్: ఈ దశలో మొత్తం నాలుగు ఆల్ఫా-గ్లోబిన్ జన్యువులు దెబ్బతింటాయి. అందువలన తీవ్రమైన రక్తహీనత కలుగుతుంది. గర్భధారణ సమయంలో ఈ వ్యాధి సోకితే కడుపులో బిడ్డకు సైతం ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది.
బీటా తలసేమియా: బీటా తలసేమియా కూడా వారసత్వంగా వచ్చే జన్యుపరమైన వ్యాధి. బీటా తలసేమియా ఉన్న వారు ఎర్ర రక్త కణాలలో సాధారణ హిమోగ్లోబిన్ (α) మరియు అసాధారణమైన హిమోగ్లోబిన్ (β) రెండింటినీ కలిగి ఉంటారు. బీటా తలసేమియాతో బాధపడుతున్న వ్యక్తుల రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం వల్ల శరీరంలోని వివిధ భాగాలకు తగినంతగా ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతుంటారు.
- బీటా తలసేమియా మేజర్ (కూలీస్ అనీమియా): ఇది బీటా తలసేమియా యొక్క అత్యంత తీవ్రమైన రకం. బీటా తలసేమియా మేజర్ లో రెండు దెబ్బతిన్న బీటా-గ్లోబిన్ జన్యువులను కలిగి ఉంటుంది. ఈ పరిస్ధితి ఉన్న వ్యక్తులకు తరచూ రక్తమార్పిడి అవసరం.
- బీటా తలసేమియా మైనర్: నాలుగు బీటా-గ్లోబిన్ జన్యువులలో ఒకటి దెబ్బతిన్న బీటా-గ్లోబిన్ జన్యువును మాత్రమే కలిగి ఉంటుంది. అందువల్ల తేలికపాటి రక్తహీనత లక్షణాలు కలిగి ఉంటారు.
బీటా తలసేమియా మైనర్ రెండు రకాలు
- తలసేమియా ఇంటర్మీడియా: ఈ దశలో రెండు దెబ్బతిన్న బీటా-గ్లోబిన్ జన్యువులను కలిగి ఉంటుంది. ఈ రకమైన తలసేమియా ఉన్న వారికి తరచూ రక్త మార్పిడి అవసరం ఉండదు. ఇది మధ్యస్థ నుంచి తీవ్రమైన రక్తహీనతకు కారణమయ్యే పరిస్థితి.
- తలసేమియా మినిమా: ఈ తరహా తలసేమియాతో ప్రమాదాలు తక్కువ.
తలసేమియా లక్షణాలు
తలసేమియా వ్యాధి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒకోలా ఉంటాయి. వ్యాధి దశను బట్టి కూడా లక్షణాలు మారుతుంటాయి.
అయితే సాధారణంగా తలసేమియా వ్యాధిగ్రస్తుల్లో కనిపించే లక్షణాలు:
- రక్తహీనత
- అలసట
- బలహీనత
- ఆకలి మందగించడం
- పిల్లల్లో శారీరక ఎదుగుదల లేకపోవడం
- ఎముకల బలహీనత (ఎముకలు పెలుసుగా మారి సులభంగా విరిగిపోతాయి)
- పొట్ట భాగంలో వాపు మరియు నొప్పి రావడం
- కామెర్లు (చర్మం మరియు కళ్లు పసుపు రంగులోకి మారడం)
- మూత్రం ముదురు రంగులో కనిపించడం
- తరచుగా ఇన్ఫెక్షన్లకు గురవుతుండడం
తలసేమియాకు సంబంధించిన సాధారణ అపోహలు
అపోహ 1: మేనరికాలతో తలసేమియా వస్తుంది
వాస్తవం: వంశంలో ఎవరికైనా తలసేమియా ఉంటే అది కుటుంబంలోని వారికి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా మేనరికాలు కూడా ఇందుకు కారణం కావొచ్చు.
అపోహ 2: తలసేమియా క్యారియర్లు వివాహం చేసుకోకూడదు
వాస్తవం: బీటా తలసేమియా మైనర్ ఉన్న వ్యక్తులు ఒకరికొకరు వారికున్న తలసేమియా స్థితిని గురించి తెలుసుకుని వివాహం చేసుకోవచ్చు.
అపోహ 3: తలసేమియా వ్యాధిగ్రస్తులు ఎప్పుడు నీరసంగా ఉంటారు
వాస్తవం: తలసేమియా పేషంట్లకు సరైన వైద్యం అందించినట్లయితే, వారు రక్తహీనత నుంచి త్వరగా కోలుకుని అలసటను అధిగమించుతారు.
అపోహ 4: తలసేమియాకు సరైన చికిత్స లేదు
వాస్తవం: తలసేమియాకు సరైన చికిత్స లేదనేది అపోహ మాత్రమే. ప్రస్తుత మారిన కాలానుగుణంగా ఈ సమస్యకు రక్తమార్పిడి, ఐరన్ కీలేషన్ థెరపీ మరియు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి ఆధునాతన చికిత్సలతో తలసేమియాను నయం చేసుకోవడమే కాక సుదీర్ఘమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.
తలసేమియా వ్యాధి లక్షణాలకు అనుగుణంగా చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. తలసేమియాకు ప్రస్తుతం ఎముకల మజ్జలో ఉన్న కణాలను మార్పిడి చేసే (బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్) నూతన చికిత్స ద్వారా ఈ వ్యాధిని నయం చేసుకోవచ్చు. అయితే ఈ వ్యాధిగ్రస్తులు ఎల్లప్పుడు హిమోగ్లోబిన్ కనీస స్థాయిలు 9-10 గ్రాములు ఉండేలా చూసుకోవాలి. అంతే కాకుండా ఐరన్ సంబంధిత మందులు, వంటపాత్రలను ఎట్టి పరిస్ధితుల్లో వాడకూడదు. కాల్షియం (ఎముకలను బలపరిచే) పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ తగు జాగ్రత్తలు పాటించడం వలన ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
About Author –