మెదడులో కణితి సర్జరీ చిన్న కోత కూడా లేకుండా మెదడును ఆపరేట్‌ చేయడం ఇప్పుడు సుసాధ్యమవుతోంది

మెదడులో కణితి సర్జరీ చిన్న కోత కూడా లేకుండా మెదడును ఆపరేట్‌ చేయడం ఇప్పుడు సుసాధ్యమవుతోంది

ట్యూమర్‌ చాలా ముఖ్యమైన భాగంలో ఉంది.. సర్జరీ చేసినా సమస్య మరింత పెద్దది కావొచ్చు..’

మెదడులో కణితి ఏర్పడితే గతంలో అయితే డాక్టర్ల దగ్గరి నుంచి ఇలాంటి మాటలు వినాల్సి వచ్చేది. బ్రెయిన్‌లో ట్యూమర్‌ ఉందంటే ఇక వాళ్ల పని అయిపోయిందనుకునేవాళ్లు. కానీ ఆధునిక వైద్యరంగ ఆవిష్కరణలతో మెదడుకు సంబంధించిన సర్జరీలంటే కూడా భయం నెమ్మదిగా పోయింది. ఎంఆర్‌ఐ, సిటి స్కాన్‌, బ్రెయిన్‌ ఆంజియోగ్రామ్‌ లాంటి పరీక్షలు వచ్చిన తరువాత మెదడు, వెన్నుపాముల్లో ఏముంది, ఏమవుతోంది అనే విషయాలు తెలిశాయి. దాంతో సర్జరీ కూడా సురక్షితం అయింది.

పెద్ద కోత నుంచి కోత లేని దశకు..

మెదడు చాలా సున్నితమైన భాగం. అందుకే మెదడులో ఏమైనా అయిందంటే ఇక ప్రాణాలతో బయటపడడం కష్టం అనే దశ ఉండేది. దానికి ఆపరేషన్‌ చేయాలన్నా దాని తరువాత పరిణామాలు ఎలా ఉంటాయోననే భయం ఉండేది. మళ్లీ కాళ్లూ చేతులు సవ్యంగా ఉండేట్టు పనిచేస్తాయా లేదా, ఆరోగ్యంగా బయటపడతారో లేదోనన్న ఆందోళన ఉండేది. బ్రెయిన్‌ ని తెరిచి సర్జరీ చేయడం చాలా సంక్లిష్టంగా ఉండేది. కాని కీహోల్‌ సర్జరీ వచ్చిన తరువాత పరిస్థితి కొంత మెరుగయింది. పెద్ద కోత పెట్టాల్సిన అవసరం పోయింది. మైక్రోస్కోప్‌, ఎండోస్కోప్‌ వచ్చిన తరువాత కోత చిన్నది అయింది. ఓపెన్‌ సర్జరీకి 10సెం.మీ. కోత పెట్టాల్సి వస్తే దీనికి 1 నుంచి 1.5సెం.మీ. కోత చాలు. ఆ తరువాత కీహోల్‌ సర్జరీ కన్నా కూడా మెరుగైన నాన్‌ ఇన్వేసివ్‌ పద్ధతి వచ్చింది. అదే రేడియోసర్జరీ. దీనిలో గామా నైఫ్‌ రేడియో సర్జరీ ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు దానికన్నా కూడా ఆధునికమైన స్టీరియోటాక్టిక్‌ రేడియోసర్జరీ అందుబాటులోకి వచ్చింది.

స్టీరియోటాక్టిక్‌ రేడియోసర్జరీ అంటే..?

ఆరోగ్యకరమైన కణజాలాన్ని కాపాడుతూ అసాధారణమైనదాన్ని తొలగించడమే సర్జరీ లక్ష్యం. అందుకే రేడియోసర్జరీ సక్సెస్‌ అయింది. గామా నైఫ్‌ రేడియోసర్జరీ కన్నా మెరుగైన ఫలితాలను ఇస్తుంది స్టీరియోటాక్టిక్‌ రేడియోసర్జరీ (ఎస్‌ఆర్‌ఎస్‌). దీనిలో ఎక్స్‌రేల నుంచి ఫొటాన్‌ శక్తిని ట్యూమర్‌ పైకి పంపిస్తారు. మెదడుకు 2 గ్రేల రేడియేషన్‌ని మాత్రమే తట్టుకునే శక్తి ఉంటుంది. కాని ట్యూమర్‌ని చంపాలంటే అంతకన్నా ఎక్కువ రేడియేషన్‌ కావాలి. అందుకే స్టీరియోటాక్టిక్‌ రేడియోసర్జరీలో ఒక ప్రత్యేకమైన ఫిల్టర్‌ గుండా రేడియేషన్‌ కిరణాలన్నీ ట్యూమర్‌ పైన మాత్రమే కేంద్రీకృతం అయ్యేలా చేస్తారు. ఇందుకోసం 13 నుంచి 22 గ్రే ల రేడియేషన్‌ని వాడుతారు. ఇది హైడోస్‌ రేడియేషన్‌ అయినప్పటికీ రేడియేషన్‌ అంతా ప్రతి కిరణంలోనూ వందోవంతుకు విభజించబడి, ట్యూమర్‌ పైకి మాత్రం మొత్తం రేడియేషన్‌ టార్గెట్‌ అవుతుంది. కాబట్టి ట్యూమర్‌ మాత్రమే రేడియేషన్‌కి లోనవుతాయి. మిగిలిన కణాలపై దీని ప్రభావం ఉండదు. దీనిలో ట్రిపుల్‌ ఎఫ్‌ టెక్నాలజీని ఉపయోగిస్తారు. దీనికి ప్రత్యేక ఫిల్టర్‌ ఉపయోగిస్తారు. ఈ రేడియోసర్జరీలో ఫ్రేమ్‌ వాడరు. అందుకే ఫ్రేమ్‌లెస్‌ స్టీరియోటాక్టిక్‌ రేడియోసర్జరీ అంటారు. అయితే ఈ సర్జరీ చేయాలంటే ట్యూమర్‌ పరిమాణం 3 సెం.మీ. కన్నా తక్కువగా ఉండాలి. కాని అంతకన్నా ఎక్కువ సైజులో ఉంటే సర్జరీ చేసి దాన్ని తగ్గించి ఆ తరువాత రేడియోసర్జరీ ద్వారా మొత్తం ట్యూమర్‌ని తీసేయవచ్చు. రేడియేషన్‌ పంపించిన తరువాత రెండేళ్లకి కణితి పూర్తిగా కుంచించుకుపోతుంది. 3 నుంచి 5 ఏళ్లలో 60నుంచి 70 శాతం తగ్గుతుంది. చివరికి మచ్చలాగా మిగుల్తుంది. రెండు లేదా అంతకన్నా ఎక్కువ ట్యూమర్లు ఉన్నప్పుడు కూడా ఒకే సిట్టింగ్‌లో రేడియోసర్జరీ ద్వారా తొలగించవచ్చు. 5 ట్యూమర్లను ఒకేసారి తొలగించవచ్చు. ఈ రేడియేషన్‌ 1 మి.మీ. కన్నా తక్కువ కచ్చితత్వంతో ట్యూమర్‌ని చంపేస్తుంది.

Consult Our Experts Now

లాభాలేంటి?

– స్టీరియోటాక్టిక్‌ రేడియోసర్జరీ కోసం హాస్పిటల్‌లో చేరాల్సిన అవసరం లేదు. దీన్ని ఔట్‌ పేషెంట్‌గా చేయొచ్చు. – రేడియోసర్జరీ పూర్తిగా నాన్‌ ఇన్వేసివ్‌ ప్రక్రియ. దీనికోసం కోత పెట్టాల్సిన అవసరం ఉండదు. – ఆపరేషన్‌ అంటే సాధారణంగా రక్తస్రావం జరుగుతుంది. కానీ ఈ రేడియోసర్జరీలో కోత ఉండదు కాబట్టి దీని వల్ల రక్త స్రావం ఉండదు. – ఈ చికిత్స చేసేటప్పుడు ట్యూమర్‌ కణాలు తప్ప, దాని చుట్టుపక్కల ఉండే ఆరోగ్యకరమైన మెదడు కణాలకు ఎటువంటి ప్రమాదమూ ఉండదు. – చికిత్స చాలా కచ్చితత్వాన్ని కలిగివుంటుంది. – సాధారణ సర్జరీతో చికిత్స అందించలేని ట్యూమర్లను కూడా దీని ద్వారా నాశనం చేయవచ్చు. – ఒకేసారి రెండు కన్నా ఎక్కువ కణుతులను తీసేయొచ్చు. – ఓపెన్‌ సర్జరీ ద్వారా చికిత్స చేసేటప్పుడు కణితిలోని కణాలు పక్కకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. కాని ఇందులో ఆ రిస్కు ఉండదు. – కోత ఉండదు కాబట్టి ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉండదు. – సంప్రదాయిక సర్జరీలో పొరపాటున మిగిలిపోయిన ట్యూమర్‌ కణాలను కూడా దీనిద్వారా నాశనం చేయవచ్చు. – వృద్ధులకు, సర్జరీ చేయలేని పేషెంట్లకు కూడా ఈ రేడియోసర్జరీ చేయవచ్చు.

ఎప్పుడవసరం?

చిన్న చిన్న కణితులు, మెదడులో చాలా లోపలికి ఏర్పడిన వాటికి చికిత్స చేయడం కోసం ఈ స్టీరియోటాక్టిక్‌ రేడియోసర్జరీ అభివృద్ధి చేశారు. అయితే క్రమంగా బ్రెయిన్‌ ట్యూమర్లతో పాటుగా ఆర్టరియోవీనస్‌ మాల్‌ ఫార్మేషన్స్‌ లాంటి రక్తనాళాల్లో ఏర్పడే సమస్యలకు కూడా దీన్ని వాడుతున్నారు. హెమాంజియోబ్లాస్టోమా, కావర్‌నోమా లాంటి వాటికి ఎస్‌ఆర్‌సితోనే చికిత్స చేస్తున్నారు. అంతేకాదు కొన్ని రకాల తీవ్రమైన బ్రెయిన్‌ డిజార్డర్లకు కూడా ఈ చికిత్స మంచి ఫలితాలను ఇస్తోంది. ట్రైజెమినల్‌ న్యూరాల్జియా ఉన్నప్పుడు కూడా స్టీరియోటాక్టిక్‌ రేడియోసర్జరీ ద్వారా పరిష్కరించవచ్చు. మెదడులోని సంక్లిష్టమైన, కీలకమైన భాగాల్లో కణుతులు ఏర్పడితే గతంలో సర్జరీ చేస్తే తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగేందుకు అవకాశం ఉండేది. మాట, చూపు దెబ్బతినడం, కాళ్లూ చేతులు పడిపోవడం లాంటి సమస్యలు కూడా వచ్చేవి. అందుకే అలాంటి పరిస్థితి ఉంటే సర్జరీ చేయకుండా వదిలేసేవాళ్లు. ఏం చేయలేక బతికినన్నాళ్లు బతుకుతారన్న నిస్పృహతో ఉండేవాళ్లు. కాని స్టీరియోటాక్టిక్‌ రేడియోసర్జరీ వచ్చిన తరువాత మెదడులో చాలా లోపల ఏర్పడిన కణుతులైనా, ముఖ్యమైన అవయవాలకు సంబంధించిన నరాలున్న భాగంలో కణితి ఏర్పడినా, కంటికి సంబంధించిన నరాలు, మాటకు సంబంధించిన భాగాల్లో ఏర్పడినా, చిన్నమెదడులో ఏర్పడిన కణుతులకు కూడా స్టీరియోటాక్టిక్‌ రేడియోసర్జరీతో చికిత్స చేయవచ్చు. పుర్రె మూల భాగంలో మాట్లాడడం, తినడం లాంటి పనులకు సంబంధించిన నరాలుంటాయి. ఇక్కడి కణితిని తీసేయడం ఒకప్పుడు కష్టంగా ఉండేది. కాని ఎస్‌ఆర్‌సితో ఇప్పుడిది సాధ్యమవుతున్నది. కావెర్నస్‌ సైనస్‌ ట్యూమర్లు, బ్రెయిన్‌ స్టెమ్‌ భాగంలో ట్యూమర్లు ఉన్నప్పుడు సంప్రదాయిక సర్జరీ చేస్తే ప్రాణాపాయం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా క్లిష్టమైనది. అంతేగాక ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి యాంటిబయాటిక్స్‌ వాడాల్సి ఉంటుంది. సర్జరీ తరువాత కనీసం 16 గంటలు ఐసియులో పెట్టాల్సి వస్తుంది. ఇక వయసు ఎక్కువగా ఉన్నవాళ్లయితే రిస్కు మరింత ఎక్కువ. సర్జరీ చేయడమే రిస్కు అనుకుంటే వాళ్లకు మత్తుమందు ఇవ్వడంలో కూడా ఇబ్బందులుంటాయి. అనెస్తీషియా వల్ల దుష్ప్రభావం కలిగేందుకు ఆస్కారం ఉంటుంది. కణితి క్రిటికల్‌ భాగంలో అంటే రక్తనాళాల దగ్గర ఉన్నా, చిన్నమెదడు దగ్గరున్నా సర్జరీ చేసి ట్యూమర్‌ను తీయలేము. దీనివల్ల పేషెంటు కోమాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు స్టీరియోటాక్టిక్‌ రేడియోసర్జరీ మంచి ఫలితాలను ఇస్తుంది.

Consult Our Experts Now

ఏ కణుతులకు అవసరం?

– పిట్యూటరీ గ్రంథి నుంచి మొదలయ్యే ట్యూమర్లు – మెనింజియోమాస్‌ – మెదడు, వెన్నుపాముల పైన ఉండే పొరలను మెనింజెస్‌ అంటారు. ఈ మెనింజెస్‌ నుంచి పెరిగే కణుతులను మెనింజియోమాస్‌ అంటారు. ఇవి క్యాన్సర్‌ కణుతులు కాదు. ఇవి నెమ్మదిగా పెరుగుతాయి. వీటివల్ల ఏ లక్షణాలూ కనిపించవు. – అకాస్టిక్‌ షావనోమాస్‌ – వెస్టిబ్యులార్‌ నరం నుంచి పెరిగే కణుతులివి. బ్రెయిన్‌ స్టెమ్‌, క్రేనియల్‌ నరాల వంటి సున్నితమైన భాగాలకు ఇవి దగ్గరగా ఉంటాయి. – హెమాంజియోబ్లాస్టోమాస్‌ – కేంద్రనాడీవ్యవస్థ అంటే మెదడు, వెన్నుపాములకు సంబంధించిన రక్తనాళాల దగ్గర పెరిగే కణుతులు. – కావెన్‌నోమాస్‌ – అసాధారణ రక్తనాళాలన్నీ కలిసి గుంపుగా కణితిగా ఏర్పడుతాయి. వీటివల్ల ఫిట్స్‌ వస్తాయి. – ఆర్టరియోవీనస్‌ మాల్‌ఫార్మేషన్స్‌ – రక్తనాళాలన్నీ చిక్కుకుపోయి, రక్తం లీక్‌ అవుతుంది. ఇది సాధారణ రక్తప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. – సర్జరీతో పూర్తిగా పోకుండా మిగిలిపోయిన కణుతులు, సర్జరీ తరువాత మళ్లీ ఏర్పడిన కణుతులు – ట్రైజెమినల్‌ న్యూరాల్జియా లాంటి న్యూరలాజికల్‌ సమస్యలకు కూడా స్టీరియోటాక్టిక్‌ రేడియోసర్జరీ అవసరం అవుతుంది.

క్యాన్సర్‌ కణుతులకు పనికొస్తుందా?

స్టీరియోటాక్టిక్‌ రేడియోసర్జరీ ద్వారా రేడియేషన్‌ కిరణాలన్నీ కేవలం కణితిపైనే ఫోకస్‌ అవుతాయి. కాబట్టి కణితి నాశనం అయిపోతుంది. క్యాన్సర్‌ కణితి ఏర్పడినప్పుడు ఈ చికిత్స వాడలేము. ఎందుకంటే క్యాన్సర్‌ కణితి చుట్టుపక్కల కొన్ని కణాల వరకు కూడా క్యాన్సర్‌ కణాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాన్సర్‌ కణితిపై మాత్రమే రేడియేషన్‌ ఫోకస్‌ అయ్యేలా చేయడం కష్టం. అందువల్ల క్యాన్సర్‌ కణితికి రేడియోసర్జరీ పనికిరాదు. క్యాన్సర్‌ కణితిని నాశనం చేయడానికి రేడియోథెరపీ ఉపయోగిస్తారు.

ఏది బెస్ట్‌?

– గామా నైఫ్‌ రేడియోసర్జరీ – గామా నైఫ్‌ రేడియోసర్జరీలో కోబాల్ట్‌ నుంచి కిరణాలను పంపిస్తారు. – దీనిలో ఫ్రేమ్‌ ఉంటుంది. దీన్ని తలకు ఫిక్స్‌ చేస్తారు. – సర్జరీకి 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది. అంతసేపూ ఈ ఫ్రేమ్‌ని అలా పెట్టుకునే ఉండాలి. – ఇది న్యూరో సమస్యలకి మాత్రమే పనికొస్తుంది. – దీనికి ఖర్చు ఎక్కువ.

స్టీరియోటాక్టిక్‌ రేడియోసర్జరీ

– గామా నైఫ్‌ రేడియోసర్జరీ కన్నా స్టీరియోటాక్టిక్‌ రేడియోసర్జరీ దానికన్నా ఆధునికమైనది. – స్టీరియోటాక్టిక్‌ రేడియోసర్జరీలో ఎక్స్‌రేల నుంచి ఫొటాన్‌ ఎనర్జీని పంపిస్తారు. – దీనిలో ఫ్రేమ్‌ ఉండదు. కాబట్టి కంఫర్టబుల్‌గా ఉంటుంది. – సర్జరీకి మల్టిపుల్‌ డోస్‌ అయితే 5 నిమిషాలు, సింగిల్‌ డోస్‌ అయితే 15 నిమిషాల సమయం పడుతుంది. – దీన్ని వెన్నుపాములో వచ్చిన ట్యూమర్లకు కూడా వాడొచ్చు. – ఈ సర్జరీకి అయ్యే ఖర్చు కూడా తక్కువ. – స్టీరియోటాక్టిక్‌ రేడియోసర్జరీ వల్ల సాధారణంగా సమస్యలుండవు. అంతకుముందే ఫిట్స్‌ వచ్చే సమస్య ఉన్న వాళ్లకి సర్జరీ తరువాత ఫిట్స్‌ వచ్చే అవకాశం ఉంటుంది. కాని దీనికి కూడా మందులు వాడితే సరిపోతుంది.

ట్యూమర్‌ ఎందుకు ఏర్పడుతుంది?

Consult Our Experts Now

కణాలు కంట్రోల్‌ తప్పి విభజన చెంది పెరిగితే కణితి ఏర్పడుతుంది. కణుతులు అన్నీ క్యాన్సర్‌ కాదు. క్యాన్సర్‌ కాని కణుతులను బినైన్‌ ట్యూమర్లు అంటారు. క్యాన్సర్‌ కణాలైతే కణితి ఏర్పడిన చోటి నుంచి ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. కాని బినైన్‌ కణితి కణాలు అలా వ్యాపించవు. కాని కణితి పక్కనున్న నరంపై ఒత్తిడి పడడం వల్ల ఇతర సమస్యలు రావొచ్చు. అందుకే బినైన్‌ కణితులకు కూడా చికిత్స అందించాలి. క్యాన్సర్‌ని పూర్తిగా నయం చేయలేము. కాని బినైన్‌ ట్యూమర్లను ఒకసారి తొలగిస్తే ఇక జీవితాంతం సమస్య ఉండదు. సాధారణంగా ఈ ట్యూమర్లు జన్యుపరమైన కారణాల వల్ల ఏర్పడుతాయి. వీటికి ఎన్విరాన్‌మెంటల్‌ కారణాలు తోడవుతాయి. కాలుష్యం, స్ట్రెస్‌, ఫుడ్‌ లాంటివి కణితి ఏర్పడే జన్యుతత్వాన్ని ట్రిగ్గర్‌ చేస్తాయి. అందువల్ల బ్రెయిన్‌ ట్యూమర్లు ఏర్పడకుండా నివారించలేము. మంచి ఆహారం తీసుకుంటూ, మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే కొంతవరకు మేలు.

ఎలా గుర్తించొచ్చు?

మెదడులో ట్యూమర్‌ ఉన్నప్పుడు సాధారణంగా ఎటువంటి లక్షణాలూ కనిపించవు. చాలావరకు ఇవి పరీక్షల్లో మాత్రమే బయటపడుతుంటాయి. కణితి పెరిగి మరీ పెద్దగా అయినప్పుడు చాలారోజుల తర్వాత మాత్రమే ఇబ్బందులు తలెత్తవచ్చు. పదే పదే తలనొప్పి వస్తున్నదంటే మెదడులో ఏమైనా సమస్య ఉందేమోనని అనుమానించవచ్చు. తలనొప్పితో పాటుగా వికారంగా ఉండటం, వాంతులు అయితే తప్పనిసరిగా డాక్టర్‌ను కలవాలి. ట్యూమర్‌ పెద్ద సైజులో ఉన్నా, కీలకమైన నరాల దగ్గర ఏర్పడినా ఫిట్స్‌ రావొచ్చు. మెదడులో ట్యూమర్‌ వల్ల కొన్నిసార్లు కాళ్లూ చేతులు పడిపోవడం లాంటి ప్రమాదం కూడా ఉండొచ్చు.

About Author –

Dr. Ravi Suman Reddy, Senior Neuro & Spine surgeon, Yashoda Hospitals – Somajiguda

MCH (NIMHANS), Advanced training in Stereotactic Radiosurgery (Brain Lab Academy – Germany). His expertise includes frameless stereotactic neurosurgery, minimally invasive spine surgery, spine stabilization, nerve radiofrequency ablation, cranial micro neurosurgery, cranio-spinal trauma, and endoscopic surgery.

About Author

Dr. Ravi Suman Reddy | yashoda hospitals

Dr. Ravi Suman Reddy

MBBS, MCh

Consultant Neuro & Spine Surgeon