Select Page

గొంతు నొప్పి: లక్షణాలు, కారణాలు మరియు నివారణ చర్యలు

సీజన్‌ మారిందంటే చాల మందిలో జ్వరం, జలుబు మరియు దగ్గుతో పాటు సాధారణంగా వచ్చే ప్రధాన ఆరోగ్య సమస్యలలో గొంతు నొప్పి కూడా ఒకటి. ఈ సమస్య వయస్సుతో తేడా లేకుండా అందరిని వేధిస్తుంటుంది. వాతావరణంలో అనేక మార్పులు సంభవించినపుడు గొంతులో ఇన్ఫెక్షన్ కారక సూక్ష్మ క్రిములు చేరడం చేత ఈ నొప్పి మొదలవుతుంది. కొన్ని సార్లు ఏ కారణం లేకపోయినా కూడా గొంతు నొప్పి రావచ్చు. ఎక్కువగా అంటువ్యాధులు లేదా పొడి గాలి వంటి పర్యావరణ కారకాల వల్ల మరియు ఉదయం, సాయంత్రం వేళల్లో కాలుష్యం, ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా ఎక్కువ మందిలో ఈ గొంతు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. 

గొంతు నొప్పి ఏ వయసు వారికైనా రావచ్చు. చాలా సందర్భాలలో గొంతు నొప్పి వచ్చి దానంతట అదే తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఈ సమస్యకు కొన్ని సందర్భాల్లో మాత్రమే చికిత్స అవసరం. సాధారణంగా గొంతు నొప్పికి గురైన తర్వాత గొంతులో ఇన్ఫెక్షన్, మంట మరియు నొప్పి,  సరిగ్గా మాట్లాడలేకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. దీని వల్ల జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, చికాకు వంటివి కూడా వస్తాయి.

గొంతు నొప్పి లక్షణాలు

sore-throat1

  • గొంతులో మంట మరియు నొప్పి రావడం
  • గొంతు బొంగురుపోవడం
  • ఆహార పానీయాలు మింగడంలో కష్టంగా అనిపించడం
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం
  • మాట్లాడుతున్నప్పుడు నొప్పి ఎక్కువ అవ్వడం
  • పొడి దగ్గు రావడం
  • గొంతు నొప్పితో పాటు గొంతులో దురద, గొంతు మెడ చుట్టూ వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

గొంతు నొప్పికి గల కారణాలు

అనేక వైరస్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు గొంతు నొప్పికి కారణమవుతాయి. అందులో

వైరల్ ఇన్ఫెక్షన్లు:

  • కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్లు అయిన ఫ్లూ, సాధారణ జలుబు, మీజిల్స్, చికెన్‌పాక్స్, మోనోన్యూక్లియోసిస్ వంటివి కూడా గొంతు నొప్పికి దారితీస్తాయి.
  • వీటి వల్ల జ్వరం, దగ్గు మరియు ఫ్లూ వంటి ఇతర లక్షణాలతో పాటు బాధాకరమైన గొంతు నొప్పిని కలిగిస్తాయి.
  • వైరల్‌ ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే గొంతు నొప్పి ఎటువంటి చికిత్స చేయకుండానే 5-7 రోజులకు తగ్గిపోతుంది. అయితే కొన్ని సందర్భాల్లో గొంతు నొప్పితో పాటు జ్వరం కూడా వస్తే మాత్రం మీరు తప్పక డాక్టర్ ని సంప్రదించాలి.

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు:

  • అనేక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు గొంతు నొప్పికి కారణమవుతాయి. అయితే గ్రూప్ A స్ట్రెప్టోకోకస్ అనే బాక్టీరియా వల్ల తరచుగా గొంతు నొప్పి వస్తుంది.
  • ఈ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే గొంతు నొప్పికి డాక్టర్ సలహాతో యాంటీబయాటిక్స్ ను తీసుకోవడం ప్రారంభించిన రెండు మూడు రోజుల్లోనే ఉపశమనం పొందుతారు.

ఇతర కారణాలు:

  • గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లెక్స్ (GERD) అనేది జీర్ణవ్యవస్థ యొక్క రుగ్మత. దీని ద్వారా కూడా గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
  • కాలుష్యం, పొగ, ధూళికి ఎక్కువగా గురికావడం వల్ల కూడా ఈ గొంతు నొప్పి వస్తుంది.
  • ఊబకాయం (అధిక బరువు) ఉన్నవారిలో ఈ నొప్పి సాధారణంగా వస్తుంది. కారణం, ముక్కు మూసుకుపోవడంతో నోటి ద్వారా గాలిని తీసుకోవడం.
  • తక్కువ రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులు గొంతు ఇన్ఫెక్షన్‌కు ఎక్కువ గురయ్యే అవకాశం ఉంది.
  • గొంతులో అల్సర్స్‌‌‌‌‌‌ మరియు ఫంగల్‌ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఈ గొంతు నొప్పి వస్తుంది.
  • గొంతు, నాలుక లేదా స్వరపేటికలో వచ్చే అల్సర్లు కూడా గొంతు నొప్పికి కారణమవుతాయి. ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు కుడా ఈ అల్సర్స్‌‌‌‌‌‌ ఏర్పడే అవకాశం ఉంటుంది.

తరచుగా గొంతు నొప్పితో పాటు జ్వరం ఉంటే మీరు ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు అర్ధం చేసుకోవాలి. గొంతు నొప్పికి గల పరిస్థితులను తెలుసుకుని చికిత్స తీసుకుని మందులు వాడితే ఈ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు.

గొంతు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • ఆహారం విషయంలో సమయపాలన పాటించాలి.
  • కారం, పులుపు, మసాలా అధికంగా ఉన్నటువంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.
  • ధుమపానం మరియు గుట్కా వంటి వాటిని మానుకోవాలి.
  • కాలుష్యం అధికంగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా చూసుకోవాలి.
  • ఫ్రిజ్‌లోని నీళ్లు మరియు చల్లటి పానీయాలను ఎక్కువగా తీసుకోకూడదు.
  • నిద్రించేటప్పుడు వెల్లికలా కాకుండా ఒక పక్కకు తిరిగి పడుకుంటే ముక్కు తెరుచుకుని గొంతు నొప్పి రాకుండా ఉంటుంది.
  • తరచుగా నీళ్లను తీసుకుంటూ గొంతును హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం వల్ల ఈ గొంతు సమస్య బారిన పడుకుండా ఉండవచ్చు.
గొంతు నొప్పితో బాధపడే వారు పాటించాల్సిన నియమాలు:
  • గొంతునొప్పి ఉన్నప్పుడు సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్ధాలను తినాలి.
  • ఉప్పు నీటిని పుక్కిలించడం ద్వారా గొంతు నొప్పి మరియు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
  • గొంతునొప్పి గల వారు ఆవిరిని పీల్చుకోవడం వల్ల నాసిక రంధ్రాలు తెరుచుకుని శ్వాస పక్రియ సులభంగా జరుగుతుంది.

సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే గొంతు నొప్పి 5-7 రోజుల వరకూ ఉంటుంది. అయితే దీనికి ఎటువంటి వైద్య చికిత్స అవసరం లేదు. కానీ, కొన్ని సందర్భాల్లో మాత్రం డాక్టర్ సలహాతో యాంటీబయాటిక్స్ లేదా ఇతర తేలికపాటి నొప్పి నివారణ మాత్రలను తీసుకోవడం వల్ల ఈ గొంతు సమస్య తగ్గుతుంది. 

ఇదే సమస్య గనుక 2 నెలలకు ఒక సారి పునరావతం అయితే మాత్రం తప్పకుండా వైద్యున్ని సంప్రదించడం ఉత్తమం. అందుకే గొంతు నొప్పితో బాధపడుతున్న వాళ్ళు నిర్లక్ష్యం వహించకుండా పరీక్షలు చేయించుకుని రోగ నిర్ధారణ ద్వారా చికిత్స తీసుకోవడం ఉత్తమం. 

About Author –

Dr. Hari Kishan Boorugu, Consultant Physician & Diabetologist, Yashoda Hospitals, Hyderabad

About Author

Yashoda Doctors

Dr. Hari Kishan Boorugu

MD, DNB (Internal Medicine), CMC, Vellore

Consultant Physician & Diabetologist