ఆపరేషన్‌ అంటే ఆందోళన వద్దు!

ఆపరేషన్‌ అంటే ఆందోళన పడని పేషెంటు ఉండరు. అందుకే సర్జరీ తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలెన్నో వెదుకుతుంటారు. శస్త్రచికిత్స తరువాత అనేక రకాల దుష్పరిణామాలు కలుగుతాయనో, కోలుకోవడానికి ఎక్కువ టైం పట్టడం వల్ల పనిదినాలు నష్టపోతామనో, నొప్పి భరించడం కష్టమనో, సర్జరీ ఫెయిలైతే ఇంతకుముందులాగా నార్మల్‌ కాలేమనో.. ఇలా రకరకాల భయాలుంటాయి. కాని ఇప్పుడు కొత్తగా వచ్చిన సర్జరీ విధానాలు ఈ భయాలన్నింటినీ పోగొడుతున్నాయి. పేషెంట్‌ సేఫ్టీగా ఉంటున్నాయి. సున్నితమైన థొరాసిక్‌ (thoracic) వ్యాధుల చికిత్సలను ఇవి సులభతరం చేశాయి.

ఊపిరితిత్తులకు సేఫ్‌గా థొరాసిక్‌ (Thoracic) సర్జరీలు

రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటాం. అందుకోసం ద్విచక్ర వాహనాన్ని వాడొచ్చు. ఆటోలో లేదా కారులో వెళ్లొచ్చు. ఎలా వెళ్లినా చేరే గమ్యం ఒకటే. కాని ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా జరిగిందనేది ముఖ్యం. ఇందుకు ఏ ప్రయాణ సాధనం సహకరిస్తుందో దాన్నే ఎంచుకుంటాం. సర్జరీ విషయంలో కూడా అంతే. చేసే చికిత్స అదే. జబ్బును తగ్గించడమే చేరాల్సిన గమ్యం. కాని ఏ చికిత్సా విధానం సౌకర్యవంతంగా, పేషెంట్‌ సేఫ్టీగా ఉందనేది ముఖ్యం. అందుకే ఒకప్పుడు ఓపెన్‌ సర్జరీ ద్వారా చేసే చికిత్సలన్నీ ఇప్పుడు మినిమల్లీ ఇన్వేసివ్‌ (minimally invasive)గా మారాయి. రోబోటిక్స్‌ (robotics) కూడా సర్జరీలో కీలకం అయిపోయింది. థొరాసిక్‌ కేవిటీ (thoracic cavity) లో సమస్యలకు చేసే ఈ చికిత్సలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఊపిరితిత్తులు, గుండె, వెన్నుపూసలు, నరాలు, రక్తనాళాలు.. ఇలాంటి సున్నితమైన భాగాలుండే ఛాతి భాగాన్నే థొరాసిక్‌ కేవిటీ అంటారు. ఈ ఛాతి కుహరాన్ని తెరిచి సర్జరీ చేసేవాళ్లు ఇంతకుముందు. ఇప్పుడా అవసరం లేకుండా అటు డాక్టర్‌కూ, ఇటు పేషెంటుకూ సౌకర్యవంతంగా ఉంటున్నాయి ఆధునిక చికిత్సలు.

ఏ సమస్యలకు ?:

డీకార్టికేషన్‌(Decortication):

న్యుమోనియా, టిబి, మాలిగ్నెన్సీ ఉన్నప్పుడు డీకార్టికేషన్‌ చేస్తారు. ఈ సమస్యలున్నప్పుడు ఊపిరితిత్తుల బయట ఛాతిలో ఫ్లూయిడ్‌ చేరుతుంది. సాధారణంగా ఈ ఫ్లూయిడ్‌ 20 మి.లీ.కు మించి ఉండదు. ఊపిరితిత్తుల చుట్టూ ఉండి వాటిని లూబ్రికేట్‌ చేస్తుంది. సమస్య ఉన్నప్పుడు ఊపిరితిత్తుల లైనింగ్‌ పొరలు ఈ ద్రవాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. దీన్ని ప్లూరల్‌ ఎఫ్యూజన్‌ (pleural effusion) అంటారు. ఊపిరితిత్తుల చుట్టూ ఎక్కువ మొత్తంలో ద్రవం చేరినప్పుడు అవి కుంచించుకుపోతాయి. ఈ ద్రవం గట్టిగా మారుతుంది. దీనివల్ల దగ్గు, ఊపిరాడకపోవడం వంటి ఇబ్బందులుంటాయి. ఈ ద్రవం పేరుకుపోయినప్పుడు ఎక్స్‌రేలో అసలు ఊపిరితిత్తి అసలు కనిపించదు. డీకార్టికేషన్‌ చికిత్స ద్వారా ఈ ద్రవాన్ని తొలగిస్తారు. న్యుమోనియా వల్ల ఊపిరితిత్తుల చుట్టూ చీము ఏర్పడినప్పుడు కూడా వ్యాట్స్‌ ద్వారా తొలగిస్తారు.

లోబెక్టమీ (Lobectomy)

లంగ్‌ క్యాన్సర్‌, టిబి (కాంప్లికేటెడ్‌) లాంటి సమస్యల్లో ఊపిరితిత్తి ఒక లోబ్‌ను తీసేయాల్సి వస్తుంది. దీన్నే లోబెక్టమీ అంటారు. పదే పదే ఇన్‌ఫెక్టన్ల వల్ల బ్రాంకియెక్టేసిస్‌ వస్తుంది. అంటే ఊపిరితిత్తి డ్యామేజ్‌ అవుతుంది. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల ట్యూమర్‌ (ఆస్పర్‌గిల్లోమా)లాగా ఏర్పడుతుంది. మ్యూకర్‌ మైకోసిస్‌ కూడా ఫంగల్‌ ఇన్‌ఫెక్షనే. టిబి వల్ల ఊపిరితిత్తి మళ్లీ బాగుచేయలేనంతగా పాడవ్వొచ్చు. ఇలాంటప్పుడు లోబెక్టమీ చేస్తారు. ఈ సమస్యలున్నప్పుడు ఎడతెరిపిలేని దగ్గు 2 వారాలకు మించి ఉంటుంది. తెమడలో రక్తం పడుతుంది (హెమటైటిస్‌). బరువు తగ్గిపోతారు. ఆకలి తగ్గిపోతుంది. అందుకే 2 వారాలైనా దగ్గు తగ్గకుంటే అశ్రద్ధ చేయొద్దు. డాక్టర్‌ దగ్గరికి వెళ్లాలి.

ట్యూమర్‌ (Tumor)

ఛాతి లోపల మధ్య భాగాన్ని మీడియాస్టెనమ్‌ అంటారు. అక్కడ చాలా అవయవాలుంటాయి. వీటిలో ఏర్పడే ట్యూమర్లే మీడియాస్టెనల్‌ ట్యూమర్లు. ఉదాహరణకు థైమస్‌ గ్రంథిలో కణుతులు ఏర్పడితే థైమోమాస్‌ అంటారు. ఒక్కోసారి థైరాయిడ్‌ పెద్దగా ఛాతిలోకి పెరగొచ్చు. ఇది స్టెర్నమ్‌ వెనుక పెరుగుతుంది. దీన్ని రెట్రో స్టెర్నల్‌ థైరాయిడ్‌ అంటారు. రెట్రో స్టెర్నల్‌ గాయిటర్‌ అంటే థైరాయిడ్‌ వాచిపోయి స్టెర్నమ్‌ వెనుకకు రావడం. ఈ సమస్యలను వ్యాట్స్‌తో తొలగిస్తారు.

Consult Our Experts Now

పామోప్లాంటార్‌ హైపర్‌ హైడ్రోసిస్‌ (Palmoplantar Hyperhidrosis)

చేతుల్లో అధికంగా చెమట రావడాన్ని పామోప్లాంటార్‌ హైపర్‌ హైడ్రోసిస్‌ అంటారు. అరిచేతుల్లో అధికంగా చెమట వస్తుండడం వల్ల షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతారు. ఏదైనా పట్టుకుందామన్నా పట్టుజారిపోతుంది. పేపర్‌ మీద రాయలేరు. పేపర్‌ తడిసిపోతుంది. ఫోన్‌, రిమోట్‌ పట్టుకోలేరు. పరీక్ష రాయలేరు. లాప్‌టాప్‌పై పనిచేసుకోలేరు. చివరికి ఇదొక పెద్ద మానసిక సమస్య అవుతుంది. చెమట ఏర్పడటానికి సింపథెటిక్‌ నర్వ్‌ ట్రంక్‌ ఉపయోగపడుతుంది. ఇది మెదడునుంచి మెడ, ఛాతి, పొట్టలోకి వెళ్తుంది. దాని నుంచి చిన్న చిన్న నరాలు చేతుల్లోకి వెళ్తాయి. అలా వెళ్లే చిన్న సింపథెటిక్‌ నర్వ్‌ భాగాన్ని కట్‌ చేస్తారు. 2, 3 వెన్నుపూసల మధ్య ఈ సింపథెటిక్‌ నర్వ్‌ భాగం ఉంటుంది. దీన్ని తొలగించడాన్ని సింపథెక్టమీ అంటారు. ఇది రెండు వైపుల చేస్తారు. అందుకే బైలేటరల్‌ థొరాసిక్‌ సింపథెక్టమీ అంటారు. దీనివల్ల వంద శాతం సమస్య పోతుంది. ఆపరేషన్‌ అయిన వెంటనే రిజల్ట్‌ కనిపిస్తుంది.

జెయింట్‌ పల్మనరీ బుల్లే (Giant Pulmonary Bullae) (లంగ్‌ బుల్లే)

సబ్బునీటిలో ఏర్పడిన నీటి బుడగలాంటివి ఊపిరితిత్తుల్లో ఏర్పడుతాయి. ఈ సమస్య వల్ల దగ్గు, ఊపిరాడనట్టు ఉంటుంది. పొగతాగేవాళ్లలో ఈ సమస్య ఎక్కువ. పొగతాగడం వల్ల ఊపిరితిత్తుల్లో డీజనరేటివ్‌ మార్పులు వస్తాయి. ఏ వయసువారిలోనైనా రావొచ్చు. చిన్నవయసువాళ్లలో ఏ కారణం లేకుండా కూడా రావొచ్చు. దీనికి బుల్లెక్టమీ చేస్తారు. బబుల్‌ ఏర్పడిన శ్వాసకోశ భాగాన్ని తీసేస్తారు. అది తీసేశాక నార్మల్‌గా ఉన్న ఊపిరితిత్తి ఎప్పటిలాగా వ్యాకోచించగలుగతుంది.

Consult Our Experts Now

హెమటోమా ఇవాక్యుయేషన్‌ (Hematoma Evacuation)

యాక్సిడెంట్‌ అయినప్పుడు ఛాతికుహరంలో రక్తం చేరుతుంది. దీన్ని వ్యాట్స్‌ ద్వారా తీసేస్తారు.

డయాగ్నస్టిక్‌ బయాప్సీ (diagnostic biopsy)

టిబి, క్యాన్సర్‌, సార్కోయిడోసిస్‌ లాంటివి ఉన్నప్పుడు మీడియాస్టీనమ్‌లో లింఫ్‌ గ్రంథులు వాచిపోతాయి. దీన్ని మీడియాస్టినల్‌ లింఫ్‌ నోడ్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌ అంటారు. శ్వాసనాళాల దగ్గర ఉండే లింఫ్‌ గ్రంథులన్నీ వాచిపోతాయి. శ్వాసనాళంపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దాంతో దగ్గు వస్తుంది. ఈ సమస్య చెస్ట్‌ సిటిలో తెలుస్తుంది. మిగతా ఏ సమస్య ఉండదు. కేవలం లింఫ్‌ గ్రంథుల వాపు ఉంటుంది. ఇలాంటప్పుడు మొత్తం లింఫ్‌ గ్రంథిని తీసి డయాగ్నసిస్‌కి పంపిస్తారు.

పెరికార్డియల్‌ ఎఫ్యూజన్‌ డ్రైనేజ్‌ (Pericardial Effusion Drainage)

గుండె చుట్టూ ద్రవం పేరుకుంటుంది. టిబి, రీనల్‌ ఫెయిల్యూర్‌, మాలిగ్నెన్సీ వల్ల ఇలా అవుతుంది. చుట్టూ ద్రవం పేరుకోవడం వల్ల గుండె సరిగా రక్తాన్ని పంపు చేయలేదు. వ్యాట్స్‌తో ద్రవాన్ని తొలగిస్తారు.

Consult Our Experts Now

డయాఫ్రాగ్మెటిక్‌ ైప్లెకేషన్‌ (Diaphragmatic Reflection)

ఛాతిని, పొట్టను వేరుచేస్తూ ఊపిరితిత్తుల కింద ఉండే కండరమే డయాఫ్రమ్‌. కొందరిలో ఇది వదులుగా ఉంటుంది. ఒకవైపు వదులై పైకి వచ్చేస్తుంది. దానివల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడి పడుతుంది. ఊపిరాడకుండా అవుతుంది. నార్మల్‌గా ఉన్నప్పుడు ఇబ్బంది అంతగా ఉండదు గానీ జలుబు ఉన్నా, టిబి లాంటి ఇన్‌ఫెక్షన్లున్నా డయాఫ్రమ్‌ వదులై పైకి వస్తుంది. దీనికి వ్యాట్‌ ద్వారా వదులైన దాన్ని టైట్‌ చేస్తారు.

థైమెక్టమీ (Thymectomy)

థైమస్‌ గ్రంథిని తొలగించడాన్ని థైమెక్టమీ అంటారు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ థైమస్‌ గ్రంథి పరిమాణం తగ్గుతూ వస్తుంది. ప్యూబర్టీ నుంచి తగ్గుతూ వస్తుంది. 40 ఏళ్లు దాటేసరికి మరీ చిన్నదైపోతుంది. కొందరిలో థైమస్‌ గ్రంథి అసాధారణంగా పెద్దగా అవుతుంది. దీన్ని థైమిక్‌ హైపర్‌ప్లేషియా అంటారు. ఇందుకు థైమస్‌ గ్రంథిలో కణితి ఉండడమో, ఇతర ఆటోఇమ్యూన్‌ సమస్యలో కారణమవుతాయి. మయస్తీనియా గ్రావిస్‌ అనే ఆటోఇమ్యూన్‌ వ్యాధి ఉన్నప్పుడు థైమస్‌ పరిమాణం పెరగొచ్చు. ఇదొక న్యూరో సమస్య. నాడి జంక్షన్‌పై ఆటో యాంటిబాడీలు దాడిచేస్తాయి. దీనివల్ల కండరం బలహీనం అవుతుంది. ఉదయం బాగానే ఉన్నప్పటికీ పొద్దెక్కిన కొద్దీ ఈ వీక్‌నెస్‌ పెరుగుతూ ఉంటుంది. సాయంకాలం కల్లా ఎక్కువ అవుతుంది. దీంతోపాటు థైమస్‌ పరిమాణం కూడా పెరుగుతుంది. థైమోమా అంటే థైమస్‌లో కణితి ఏర్పడినప్పుడు సిటిలో తెలుస్తుంది. ఇలాంటప్పుడు థైమస్‌ని తొలగిస్తారు.

న్యూమోనెక్టమీ (Pneumonectomy)

ఒక ఊపిరితిత్తి మొత్తాన్ని తీసేయడాన్ని న్యూమోనెక్టమీ అంటారు. క్యాన్సర్‌, టిబి, ఏదైనా కారణం వల్ల ఊపిరితిత్తి డ్యామేజ్‌ అయితే చేస్తారు. రెండో శ్వాసకోశం బావుంటే ఏం కాదు. లేకుంటే ప్రాణాపాయం. సాధారణంగా దీర్ఘకాలం స్మోకింగ్‌ చేస్తున్నవాళ్లలో ఇలా శ్వాసకోశాలు దెబ్బతింటాయి.

రోబోటిక్స్‌ (Robotics)

వ్యాట్‌ కన్నా మరింత ఆధునికమైన చికిత్స రోబోటిక్‌ సర్జరీ. రోబోతో చేసే సర్జరీ కాబట్టి సర్జన్‌ లేకుండా రోబోనే మొత్తం చేసేస్తుందని అనుకోవద్దు. రోబో లాంటి పరికరాన్ని సర్జన్‌ కంట్రోల్‌ చేస్తూ సర్జరీని నిర్వహిస్తాడు. డావిన్సీ రోబోను ఇప్పుడు వాడుతున్నారు. ఈ రోబో పరికరానికి 4 చేతులు ఉంటాయి. వీటిలో ఒక చేతికి ఎండోస్కోపిక్‌ కెమెరా ఉంటుంది. మిగిలిన మూడు చేతులు మూడు పరికరాలను పట్టుకోవడానికి అనువుగా ఉంటాయి. రోబో ద్వారా చేసే సర్జరీ సర్జన్‌కి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే దీనిలోని కెమెరా ఛాతి లోపలి అవయవాలను 3డిలో చూపిస్తుంది. దీని మాగ్నిఫికేషన్‌ 10 ఎక్స్‌. దీనిలో అవయవాలతో పాటు ట్యూమర్లు, రక్తనాళాలు కూడా మరింత స్పష్టంగా కనిపిస్తాయి. వ్యాట్‌ సర్జరీలో అయితే కెమెరా 2డిలో మాత్రమే చూపిస్తుంది. మాగ్నిఫికేషన్‌ కూడా 2.5 మాత్రమే ఉంటుంది. అంతేగాక వ్యాట్‌ సర్జరీలో వాడే పరికరాలు కేవలం పైకి, కిందకి మాత్రమే తిప్పగలిగేలా ఉంటాయి. కాని రోబో చేతులను 360 డిగ్రీల కోణంలో తిప్పవచ్చు. వ్యాట్‌లో పరికరాలు నరాలను తాకేందుకు అవకాశం ఉంటుంది. కాని రోబో చేయి మనిషి చేతిలాగానే ఉంటుంది కాబట్టి అలాంటి సమస్య ఉండదు. అందువల్ల వ్యాట్‌ కన్నా కూడా ఇది మరింత సౌకర్యవంతమైన, మేలైన చికిత్స. పేషెంట్‌ సేఫ్టీగా ఉంటుంది. రోబోటిక్‌ సర్జరీ కోసం చాలా చిన్న కోత అంటే కేవలం 8 మిల్లీమీటర్ల రంధ్రాలు సరిపోతాయి. రోబోటిక్‌ సర్జరీ తరువాత హాస్పిటల్‌లో 3 రోజులుంటే సరిపోతుంది. ఒకట్రెండు వారాల్లో కోలుకుంటారు. అయితే రోబోటిక్‌ సర్జరీకి 30 శాతం ఎక్కువ ఖర్చు ఉంటుంది. డయాగ్నస్టిక్‌ బయాప్సీ, లోబెక్టమీ, బుల్లెక్టమీ లాంటివాటికి ఉపయోగించినప్పటికీ రోబోటిక్‌ సర్జరీని మీడియాస్టెర్నల్‌ ట్యూమర్స్‌, థైమెక్టమీకి ఎక్కువగా వాడుతారు.

మినిమల్లీ ఇన్వేసివ్‌ సర్జరీ (Minimally Invasive Surgery)

మొట్ట మొదటిసారిగా వచ్చిన మినిమల్లీ ఇన్వేసివ్‌ సర్జరీ లాప్రోస్కోపీ. ఇది పొట్టలోని భాగాలకు చేసే మినిమల్లీ ఇన్వేసివ్‌ సర్జరీ. పొట్ట తరువాత ఛాతి భాగంలో మినిమల్లీ ఇన్వేసివ్‌ సర్జరీ వచ్చింది. ఛాతిలో చేసే సర్జరీని థొరాసిక్‌ సర్జరీ అంటారు. ఇది మినిమల్లీ ఇన్వేసివ్‌ అయితే దాన్ని వీడియో అసిస్టెడ్‌ థొరాసిక్‌ సర్జరీ లేదా వ్యాట్‌ అంటారు. వ్యాట్‌ సర్జరీ 1992 నుంచి అందుబాటులో ఉంది. ఇండియాలో కొత్త టెక్నిక్‌ ఏమీ కాదు. వ్యాట్‌లో భాగంగా అనేక రకాల ప్రొసిజర్లు చేయొచ్చు. థొరాసిక్‌ కేవిటీలో వచ్చే అనేక సమస్యలకు వ్యాట్‌ సర్జరీ చేస్తారు. ఈ సర్జరీలో భాగంగా భుజం కింద పెద్ద కోతకు బదులుగా 3 రంధ్రాలు పెడుతారు. ఈ రంధ్రాలు ఒక్కొక్కటి 10 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటాయి. ఒక రంధ్రం నుంచి కెమెరా పంపిస్తారు. మిగిలిన రెండు రంధ్రాల నుంచి రెండు పరికరాలను పంపిస్తారు. ఈ పరికరాల సహాయంలో సర్జరీ చేస్తారు. సాధారణంగా వ్యాట్‌లో ఎండోస్టేప్లర్‌ అనే పరికరాన్ని వాడుతారు. ఇది మామూలు స్టేప్లర్‌ లాంటిదే. రక్తనాళాన్ని కట్‌ చేయాల్సి వచ్చినప్పుడు దీన్ని వాడుతారు. ఇది కట్‌ చేయడమే కాకుండా తెగిపోయిన రెండు రక్తనాళ భాగాల్ని సీల్‌ చేస్తుంది కూడా. వ్యాట్‌ సర్జరీలో పెద్ద కోతలేమీ ఉండవు కాబట్టి రక్తస్రావం పెద్దగా ఉండదు. త్వరగా కోలుకుంటారు. నొప్పి కూడా తక్కువే. ఈ సర్జరీ కోసం 5 రోజులు హాస్పిటల్లో ఉండాలి. సర్జరీ తరువాత కోలుకోవడానికి 2 వారాల నుంచి 1 నెల పడుతుంది.

Consult Our Experts Now

ఓపెన్‌ థొరాసిక్‌ సర్జరీ (Open Thoracic Surgery)

ఊపిరితిత్తుల లోబ్‌ తీసేయడం, క్యాన్సర్‌ కణితిని తొలగించడం లాంటి సర్జరీలేవైనా ఇంతకుముందు అయితే పెద్ద కోతతో ఛాతి కుహరాన్ని తెరిచి చేసేవాళ్లు. ఇందుకోసం ఎటువైపు సమస్య ఉందో అటు పక్క భుజం కింద సగం యు ఆకారంలో పెద్ద గాటు పెడ్తారు. కోత పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ సర్జరీ వల్ల నొప్పి ఎక్కువగా ఉంటుంది. రక్తస్రావం కూడా ఎక్కువే. సర్జరీ తరువాత పేషెంటు కోలుకోవడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఓపెన్‌ సర్జరీ చేయించుకున్న తరువాత వారం నుంచి 10 రోజులు హాస్పిటల్లో ఉండాలి. సర్జరీ తరువాత ఎప్పటిలా కోలుకోవడానికి 3 నెలలు పడుతుంది. పూర్తి స్థాయి రికవరీ ఉండదు. ఈ సర్జరీ ద్వారా థొరాకోటోమీ చేస్తారు. అంటే భుజం కింద పెద్ద కోత పెట్టడం. ఇందుకోసం 4 కండరాలను కట్‌ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సర్జరీ తరువాత ఈ కండరాలు బలహీనం అయ్యే అవకాశం ఉంటుంది. భుజం పనితీరు తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా భుజం ఎక్కువగా ఉపయోగించి చేయాల్సిన పనులు కష్టమవుతాయి. ఉదాహరణకు షటిల్‌, బ్యాడ్మింటన్‌ ఆడే క్రీడాకారులకు పరిమితులు ఏర్పడుతాయి.

Consult Our Experts Now

వ్యాట్‌, రోబోటిక్స్‌ ప్రయోజనాలు

ఈ విధానాల్లో సర్జరీ కోసం చాలా చిన్న రంధ్రాలు పెడుతారు కాబట్టి సర్జరీ తరువాత ఇవి క్రమంగా కనుమరుగైపోతాయి. సర్జరీ అయిన 2 నెలల తర్వాత ఇక కనిపించవు. 

  • చుట్టూ ఉండే అవయవాలు డామేజ్‌ అయ్యే అవకాశం వ్యాట్‌, రోబో ద్వారా ఉండదు.
  • ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశం చాలా తక్కువ.
  • లంగ్‌ క్యాన్సర్‌ సర్జరీలో చిన్న కోత ఉంటే ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. కాబట్టి మినిమల్లీ ఇన్వేసివ్‌ (వ్యాట్‌), రోబో ద్వారా సర్జరీ చేసినప్పుడు ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్‌ మళ్లీ వచ్చే అవకాశం కూడా తక్కువ.
  • అయితే 10 సెం.మీ కన్నా పెద్దగా లంగ్‌ ట్యూమర్లుంటే ఓపెన్‌ సర్జరీ మాత్రమే చేయాల్సి వస్తుంది.

About Author –

Dr. Balasubramoniam K R, Consultant Minimally Invasive and Robotic Thoracic Surgeon, Yashoda Hospitals – Hyderabad
MS (General Surgery), MCh (CTVS)

About Author

Dr. Balasubramoniam K R

MS (General Surgery), MCh (CVTS)

Consultant Robotic and Minimally Invasive Thoracic Surgeon

Yashoda Hopsitals

Recent Posts

Understanding and Managing Heart Failure: A Comprehensive Guide

Heart failure, also called congestive heart failure, is a condition that arises when the muscles…

5 months ago

Unlocking Heart Health: A Comprehensive Guide to PTCA

Percutaneous Transluminal Coronary Angioplasty, or PTCA, is a minimally invasive surgery that opens blocked or…

5 months ago

Understanding Ankle Ligament Reconstruction Surgery

Ankle ligaments are crucial cords that link foot bones to lower leg bones, ensuring stability…

5 months ago

Which cooking oil should you use?

Supermarkets today are flooded with a variety of cooking oils, each with different characteristics, such…

5 months ago

నోటి క్యాన్సర్‌: దశలు, లక్షణాలు, కారణాలు, చికిత్స మరియు నివారణ చర్యలు

మాట్లాడటానికి, తినటానికి మరియు ముఖం అందంగా కనిపించటానికి నోరే కీలకం. శరీర పోషణకు అవసరమైన ఆహారం, పానీయాలు లోపలికి చేరేది…

6 months ago

అండాశయ తిత్తి: రకాలు, కారణాలు, లక్షణాలు, వ్యాధి నిర్ధారణ మరియు చికిత్స పద్ధతులు

అండాశయ తిత్తులు అనేవి అండాశయాల లోపల లేదా వాటి ఉపరితలంపై ద్రవంతో నిండిన సంచి లాంటి నిర్మాణాలు. ఆడవారికి రెండు…

6 months ago