కడుపులో నులిపురుగుల రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు నిర్మూలన మార్గాలు

కడుపులో నులిపురుగుల రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు నిర్మూలన మార్గాలు

పిల్లలు కొన్నిసార్లు తినమంటే ఆకలి కావడం లేదంటారు. తరుచూ విరేచనాలు చేసుకుంటారు. పోషకాహారం తినక.. బరువు తగ్గిపోతుంటారు. రక్తం తగ్గిపోయి బలహీనంగా కనిపిస్తుంటారు. ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. కడుపులో నులిపురుగులు ఉండటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈ రోజు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా వాటిని ఎలా నివారించాలో తెలుసుకుందాం! 

19 ఏళ్లలోపు పిల్లలపై నులిపురుగులు తీవ్ర ప్రభావం చూపుతాయి. తినే ఆహారం పేగుల్లోకి చేరినప్పుడు రక్తంలోకి చేరాల్సిన పోషకాలను నులిపురుగులే పీల్చుకోవడంతో చిన్నారుల్లో ఎదుగుదల నిలిచిపోయి రోగాల బారిన పడుతారు. ఆకలి మందగించి ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.

ఎందుకు వస్తాయి?

అపరిశుభ్రత వల్లే నులిపురుగులు పిల్లలకు సంక్రమిస్తాయి. చేతిగోర్లను శుభ్రంగా ఉంచుకోకపోవడం, పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, కలుషిత ఆహారం వల్ల ఇవి సంక్రమిస్తాయి. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయడం వల్ల కూడా నులిపురుగులు శరీరంలోకి ప్రవేశించి హాని చేస్తాయి.

ఎలా వ్యాపిస్తాయి?

ఇవి పరాన్న జీవులు. పేగులను ఆవాసంగా మార్చుకొని వేల సంఖ్యలో గుడ్లు పెడతాయి. మల విసర్జన ద్వారా బయటకొచ్చి మన చుట్టూ పరిసరాల్లో వ్యాపిస్తాయి. మట్టిలో కలిసిపోయిన గుడ్లు తీవ్ర వాతావరణాన్ని సైతం తట్టుకొని ఏండ్లతరబడి అలాగే ఉంటాయి. మట్టిలో ఆడుకునే 5-19 ఏండ్ల వయసున్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. చేతులను శుభ్రంగా కడుక్కోకపోవడం, మట్టిలో చేతులుపెట్టి అలాగే భోజనం చేయడం ద్వారా ఈ పరాన్నజీవులు కడుపులోకి చేరతాయి.

ఎన్ని రకాలు?

పిల్లల పేగుల్లో సాధారణంగా మూడు రకాల పురుగులు తిష్ఠ వేస్తాయి. అవి.. ఏలిక పాములు (ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్), కొంకి పురుగు (ఆంకైలోస్టోమా డియోడెనేల్), చుట్టపాములు (టీనియా సోలియం). ఇవి 55 అడుగులు పెరిగి 25 ఏండ్ల వరకు బతుకుతాయి. వీటి గుడ్లు మట్టిలో 10 ఏండ్లకు పైగా దెబ్బతినకుండా ఉంటాయి. సరిగ్గా ఉడికించని పంది, పశు మాంసాల ద్వారా చుట్టుపురుగులు కడుపులోకి చేరుతాయి. మట్టిలో ఆడితే పాదాల ద్వారా కొంకి పురుగుల లార్వాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి.

మాత్రల ప్రభావం ఎంత?

ఆల్బెండజోల్ మాత్రలు వాడటం వల్ల కడుపులోని నులిపురుగులు తగ్గిపోతాయి. వీటిని నిర్మూలించడం వల్ల రక్తహీనతను నియంత్రణలోకి వస్తుంది. పోషకాహార అవసరాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాధి నిరోధకత మెరుగవుతుంది. ఏకాగ్రత, నేర్చుకోగల సామర్థ్యం పెరుగుతుంది. పని సామర్థ్యం కూడా పెరుగుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పిల్లల చేతివేళ్ల గోర్లను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. వాటిలో మట్టి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పరిశుభ్రమైన నీటినే తాగాలి. తినే ఆహారం కలుషితం కాకుండా మూతలు పెట్టాలి. సాధ్యమైనంత వరకు వేడిగా ఉన్న పదార్థాలే తీసుకోవాలి. ఈగలు, దోమలు ఆహారంపై వాలకుండా జాగ్రత్తపడాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను శుభ్రమైన నీటితో కడిగిన తర్వాతే వండాలి. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జనను మానేసి మరుగుదొడ్ల వాడకాన్ని అలవాటు చేసుకోవాలి. ఇంటి చుట్టు పక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

నిర్మూలన ఎలా?

నులిపురుగుల నిర్మూలన కోసం ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి. 1 -2 ఏండ్ల పిల్లలు 200 మిల్లీ గ్రాముల మాత్రలు, ఆపైబడిన వారు 400 మిల్లీ గ్రాముల మాత్రను వేసుకొని బాగా నమలాలి. కడుపులో నులి పురుగులు ఉంటే మాత్రలు వేసుకున్న తర్వాత ఒకటి రెండు రోజుల్లో మల విసర్జన ద్వారా బయటకు వస్తాయి. వీటిని ప్రతి ఆరునెలలకోసారి వేసుకోవడం వల్ల నులిపురుగులు తగ్గిపోతాయి.

Consult Our Experts Now