గర్భధారణ: లక్షణాలు మరియు గర్భిణీలు పాటించాల్సిన ఆహార నియమాలు
ప్రతీ మహిళకు మాతృత్వం అనేది ఒక వరం. వివాహం అయినప్పటి నుంచి అమ్మ అనే పిలుపు కోసం ఎంతో ఆరాట పడిపోతుంటారు. ఇక తను గర్భం దాల్చానన్న విషయం తెలియగానే ఆమె ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి. ప్రతి స్త్రీకి గర్భధారణ సమయం చాలా ప్రత్యేకమైనది. సాధారణంగా ఓ బిడ్డ తల్లి కడుపులో గరిష్ఠంగా 38 వారాల పాటు ఉన్న మొత్తం గర్భవధి కాలాన్ని మాత్రం 40వారాలుగా పరిగణిస్తారు. ఎందుకంటే గర్భం యొక్క మొదటి వారం చివరి ఋతుస్రావం తేదీని బట్టి నిర్ణయించబడుతుంది.
గర్భధారణ సమయంలో మహిళల శరీరం అనేక మార్పులకు లోనై శిశువుకు జన్మనిస్తుంది. ఈ సమయంలో మహిళలు మనసును ఎంత ప్రశాతంగా, జాగ్రత్తగా మరియు ఆనందంగా ఉంటే పుట్టే పిల్లలు అంత ఆరోగ్యంగా జన్మిస్తారు. గర్భధారణ సమయంలో స్త్రీలందరూ ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉండరు. ముఖ్యంగా మొదటి నెల గర్భవతిగా ఉన్నప్పుడు ఈ కింది లక్షణాలను కలిగి ఉంటారు.
గర్భధారణ యొక్క లక్షణాలు
ఋతుస్రావం ఆగిపోవడం: గర్భధారణ సమయంలో మహిళల్లో కనిపించే అత్యంత సాధారణ లక్షణం ఋతుస్రావం ఆగిపోవడం. నెలకొకసారి క్రమంగా వచ్చే పీరియడ్స్ ఆగిపోవడం లేదా ఆలస్యంగా రావడం కూడా గర్భధారణ మొదటి దశగా భావించాల్సి ఉంటుంది.
స్పాటింగ్ (ఇంప్లాంటేషన్ బ్లీడింగ్): స్పాటింగ్ అంటే చిన్నపాటి రక్తపు మరక అని అర్ధం. అండం ఫలదీకరణ చెంది గర్భాశయానికి అతుక్కుంటున్నప్పుడు 6-12 రోజుల మధ్యలో ఇలా జరుగుతుంది.
వికారం, వాంతులు (మార్నింగ్ సిక్‌నెస్): గర్భధారణ సమయంలో వికారం, వాంతుల సమస్యను దాదాపు 60-70 శాతం మంది మహిళలు ఎదుర్కొంటుంటారు. ఈ సమస్య రోజులో ఎప్పుడైనా (ఉదయం, సాయంత్రం) రావచ్చు. శరీరంలో గర్భధారణ హార్మోన్ల స్థాయిలు పెరగడం వల్ల ఈ వాంతులవుతాయి.
అలసట: గర్భం యొక్క ప్రారంభ దశలో హార్మోన్ల మార్పుల కారణంగా మహిళలు చాలా అలసిపోతారు. ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ శరీరంలో గణనీయంగా పెరగడం కూడా దీనికి కారణం.
రొమ్ములలో మార్పులు: గర్భం దాల్చిన మొదటి వారాల్లోనే మహిళల్లో రొమ్ములు బరువుగా, వాపుగా ఉన్న అనుభూతికి లోనవుతారు. గర్భదారణ సమయంలోనే చనుమొనలు రోజురోజుకు నల్లబడడం మరియు రొమ్ములోని సిరలు ఎక్కువగా కనిపించడం వంటివి జరుగుతాయి.
తరచూ మూత్రవిసర్జన: గర్భధారణ లక్షణాల్లో గమనించవలసిన మరొక ముఖ్య లక్షణం తరచుగా మూత్రవిసర్జన అవ్వడం. గర్భధారణ సమయంలో శరీర ద్రవాలు పెరగడం వల్ల కిడ్నీలు చాలా వేగంగా మూత్రాన్ని విడుదల చేస్తాయి.
మలబద్ధకం: మహిళలు గర్భం దాల్చినప్పుడు మొదటి కొన్ని వారాలలో పెరుగుతున్న హార్మోన్ స్థాయిలు జీర్ణవ్యవస్థను నెమ్మదిస్తాయి. దీని ఫలితంగా వీరిలో జీర్ణ సమస్యలు మరియు మలబద్దక సమస్యలు తలెత్తుతాయి.
మైకం, కళ్లు తిరగడం: సాధారణంగా గర్భిణీ స్త్రీలలో మొదటి మూడు నెలల్లో కళ్లు తిరగడం మరియు మైకం రావడం సహజం. జస్టేషనల్ డయాబెటిస్ తో బాధపడుతున్న వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
వాసన గ్రాహక శక్తి: గర్భం ప్రారంభ దశలో వాసన గ్రహించే శక్తిని అధికంగా కలిగి ఉంటారు. ఈ సమయంలో చాలా మంది గర్భవతులు చూట్టు పక్క వచ్చే ఏ రకమైన వాసనను అయినా సరే ఇట్టే పసిగట్టేస్తుంటారు.
శరీర ఆకృతి మారడం: సాధారణంగా గర్భం దాల్చిన రెండు-మూడు వారాల్లోనే కడుపు మరియు తొడల పరిమాణం పెరగడం వంటి మార్పులను గమనించవచ్చు.
తలనొప్పి: శరీరంలో హార్మోన్ల స్థాయిలు పెరగడం వల్ల గర్భం యొక్క ప్రారంభ దశలో తలనొప్పికి కారణమవుతుంది. తలనొప్పి వివిధ దశలలో కూడా సంభవిస్తుంది.
తిమ్మిరి: గర్భాశయంలో జరిగే పలు మార్పుల కారణంగా కొంతమంది స్త్రీలు కడుపు మరియు నడుము భాగంలో తిమ్మిరిని అనుభవిస్తుంటారు.
ఆహారంపై కోరికలు, విరక్తి: సాధారణంగా ఈ సమయంలో కొన్ని ఆహారాల యొక్క వాసనలు కొంతమంది మహిళలకు వికారం కలిగించవచ్చు మరియు మరికొందరు అయితే ఒక నిర్దిష్ట ఆహారాన్ని తినాలని ఆరాటపడవచ్చు.
గర్భిణీలు తీసుకోవాల్సిన మరియు నివారించాల్సిన ఆహారాలు
గర్భిణీలు సమతుల్య పౌష్టికాహారం తీసుకోవడం తల్లికి మరియు కడుపులో పెరుగుతున్న పిండానికి చాలా అవసరం. ఈ సమయంలో గర్భణీలు ఏవి తినాలి, ఏవి తినకూడదో తెలుసుకోవటం కూడా చాలా ముఖ్యం. సాధారణంగా గర్భిణీ స్త్రీలు ఆరోగ్యకరమైన గర్భధారణను కలిగి ఉండడానికి ప్రతిరోజూ 300-500 గ్రాముల అదనపు కేలరీలు, 15 గ్రాముల ప్రోటీన్లు, 10 గ్రాముల వరకూ క్రొవ్వు పదార్థాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
- ఎక్కువ నీరు త్రాగాలి (ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది).
- గర్భధారణ సమయంలో పాల ఉత్పత్తులను సరైన మోతాదులో తీసుకోవాలి (ఎముకలు మరియు దంతాలు బలంగా మారుతాయి)
- బాదం, జీడిపప్పు, వాల్నట్స్, పిస్తా వంటి వాటిని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.
- గర్భిణీ స్త్రీలు ఎక్కువగా పండ్లను తీసుకుంటూ ఉండాలి (రక్తహీనత మరియు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది).
- పప్పుధాన్యాలు, ఆకుకూరలు, మాంసం వంటి వాటిని తప్పనిసరిగా తీసుకోవాలి.
- వేపుళ్లు, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, చిప్స్, పిజ్జా/బర్గర్ వాటికి దూరంగా ఉండడం మంచిది.
- సాధ్యమైనంత వరకు ప్రాసెస్డ్ మరియు కొన్ని రకాల ప్యాకేజ్డ్ ఆహారాలకు దూరంగా ఉండాలి.
- కొబ్బరినీళ్లు, మజ్జిగ తప్ప ఇతర పండ్లరసాలు, శీతల పానీయాలు, కాఫీ, టీలకు దూరంగా ఉండాలి.
- 30-45 నిమిషాలు నిపుణులు సూచించే వ్యాయామాలను సక్రమంగా చేసుకోవాలి అలాగే దూర ప్రయాణాలు, బరువులెత్తడం వంటివి చేయకూడదు.
గర్భం దాల్చిన మొదటి వారం నుంచి చివరి రోజు వరకు తల్లి సహనాన్ని మరియు ఓర్పును పరీక్షించే ఒక మధురమైన ప్రయాణంగా చెప్పుకోవచ్చు. గర్భదారణ కలిగి ఉన్నారనే తెలిసిన మొదటి రోజు నుంచే పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆందోళన, ఒత్తిడి వంటి వాటికి గురికాకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని అలవర్చుకోవాలి. డాక్టర్ సూచనలు లేనిదే ఎటువంటి మందులు మరియు సప్లిమెంట్లను తీసుకోకూడదు.
About Author –
Dr. Lepakshi Dasari, Consultant Gynaecologist & Laparoscopic Surgeon, Yashoda Hospital, Hyderabad