ప్రసవానికి (డెలివరీ) ముందు & తరువాత గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రసవానికి (డెలివరీ) ముందు & తరువాత గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

స్త్రీ తన జీవితంలో అనుభూతి చెందే అతిముఖ్యమైన సంతోష ఘట్టంలో గర్భం దాల్చడం ఒకటి. ప్రతి తల్లి గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యంగా ఉండాలని, సంతోషకరమైన బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటుంది. అయితే గర్భధారణ సమయంలో సరైన నియమాలను పాటించకపోతే తల్లి ఆరోగ్యానికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయంలో సరైన డైట్ మరియు జాగ్రత్తలను పాటించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి ప్రసవం ముందు మరియు తరువాత తల్లి, బిడ్డ ఆరోగ్యంతో ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రసవం సమయంలో గర్భిణీల శరీరంలో సంభవించే మార్పులు మరియు ప్రసవానికి ముందు & తరువాత గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను గురించి తెలుసుకుందాం.

ప్రసవ సమయంలో గర్భిణీ శరీరంలో సంభవించే మార్పులు

కడుపులో నుంచి నవజాత శిశువు బయటకు వచ్చే వరకు జరిగే పక్రియను ప్రసవం అంటారు. అయితే ఇప్పటి మహిళలకు ప్రసవ సమయంలో వచ్చే లక్షణాల గురించి సరిగా అవగాహన అనేది ఉండటం లేదు. సాధారణంగా ప్రసవానికి ముందు శరీరంలో సంభవించే లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

గర్భం దాల్చిన 12 వారాల నాటికి, గర్భాశయం విస్తరించడం వల్ల స్త్రీ ఉదరం కొద్దిగా బయటకు వస్తుంది. ఈ సమయంలో గర్భాశయం అనేది గర్భం అంతటా విస్తరిస్తుంది. 

గర్భాశయం తెరచుకోవడం: చాలా వరకు సహజ ప్రసవం జరగడానికి వారం ముందు నుంచే గర్భాశయం తెరచుకోవడం ప్రారంభమవుతుంది. డాక్టర్‌ గర్భాశయం ఎంత వరకు తెరచుకుంటుదో చూసి దానిని బట్టి ప్రసవం జరిగే రోజును నిర్ధారిస్తారు. 

తిమ్మిరి, వెన్ను నొప్పి: ప్రసవ సమయం దగ్గరపడినప్పుడు వెన్ను నొప్పి, తుంటి నొప్పి, పొత్తి కడుపులో నొప్పి పెరుగుతాయి. వీటితో పాటు తరుచూ కండరాల్లో తిమ్మిరి, నొప్పులు కూడా ఉంటాయి. 

ఎముకలు వదులు అవ్వడం: ప్రసవానికి ముందు శరీరంలోని ఎముకలన్నీ వదులుగా ఉండటం గమనించవచ్చు. 

అలసట: నెలలు నిండే కొద్ది అలసట పెరిగిపోతుంది. నడవడానికి మరియు ఎక్కువ సేపు నిలబడడానికి శరీరం సహకరించదు. 

విరోచనాలు: ప్రసవ సమయం దగ్గర పడుతున్న కొద్దీ గర్భాశయం మరింత చురుకుగా మారుతుంది. శరీరంలోని కండరాలు శిశువుకు బయటకు వెళ్లడానికి సిద్దమవడం వల్ల విరోచనాలు అవుతాయి. 

తరచూ మూత్రం రావడం: ప్రసవ సమయం దగ్గర పడుతున్న కొద్ది మూత్ర విసర్జన ఎక్కువ అవుతుంది. మూత్రంలో ఉమ్మునీరు కూడా విసర్జన అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రసవ సమయం దగ్గర పడుతున్న కొద్ది పలు మార్లు మూత్రం వస్తుంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.

గర్భధారణ సమయంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  •  గర్భం ధరించిన స్త్రీలు బరువైన వస్తువులను మోయకూడదు
  • పుట్టబోయే బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉండటానికి పాలు, పండ్లు, మాంసం, గుడ్లు మొదలైనటువంటి పౌష్టికాహారాలను తీసుకుంటూ ఉండాలి
  • నెలలు నిండిన స్త్రీలు దూరపు ప్రయాణాలు చేయడం మానుకోవాలి
  • మద్యం మరియు ధూమపానంను మానుకోవాలి
  • సుఖ ప్రసవం కోసం తేలికపాటి వ్యాయామాలు చేయాలి
  • నెలలు నిండిన తరువాత శృంగారానికి దూరంగా ఉండాలి
  • నిద్రపోయేటప్పుడు ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం శ్రేయస్కరం
  • గర్భిణి స్త్రీలు ఒత్తిడి, భయానికి లోను కాకూడదు. అది వారి కడుపులోని బిడ్డపై ప్రభావం చూపుతుంది.
  • నెలలు నిండిన స్త్రీలు హై హీల్స్ వాడక పోవడం మంచిది (ఇవి వాడటం వల్ల అదుపు తప్పి పడిపోయినప్పుడు కడుపులోని బిడ్డకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది)
  • గర్భిణి స్త్రీలు ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదిస్తూ వారు చెప్పిన మందులను క్రమం తప్పకుండా వాడాలి
  • అలాగే ప్రసవం అయిన తరువాత పుట్టిన బిడ్డకు తల్లి చనుబాలు ఇవ్వాలి (తల్లి చనుబాల వల్ల బిడ్డలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది)

ప్రసవం తరువాత మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తల్లి కావడానికి మహిళలు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, ప్రసవం అయిన తరువాత మాత్రం తమ ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ద వహించరు. దీంతో వారికి అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ప్రసవం తరువాత వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి తెలుసుకుందాం:

  • గర్భవతిగా ఉన్నప్పుడే కాకుండా ప్రసవం అయిన తర్వాత కూడా బలమైన ఆహారం (కూరగాయలు, పండ్లు మరియు ధాన్యాలు, మంసాహారం) తీసుకోవడం అవసరం
  • నీరు ఎక్కువగా త్రాగాలి తద్వారా మూత్రంలో ఇన్ఫెక్షన్ & మలబద్దకంను నివారించవచ్చు
  • జంక్‌ పుడ్‌, పాస్ట్ పుడ్‌, కారం, పచ్చళ్లు, మసాలాలు వంటి వాటికి దూరంగా ఉండాలి
  • ఐరన్‌, కాల్షియం మాత్రలను డెలివరీ తర్వాత కూడా 3 నెలలు తప్పనిసరిగా వాడాలి (దీని వల్ల రక్త హీనతను నివారించుకోవచ్చు)
  • ప్రసవం తర్వాత కలిగే అలసట విశాంత్రితోనే తగ్గుతుంది కావున తల్లికి మానసిక ప్రశాంతత అవసరం

సాధారణ కాన్పు జరిగిన నెల తరువాత వ్యాయామాలు మొదలు పెట్టవచ్చు. ఒక వేళ సిజేరియన్ ఆపరేషన్‌ అయితే తల్లి ఆరోగ్య పరిస్థితిని బట్టి 2-3 నెలల తర్వాత వ్యాయామాలు చేయడం మంచిది. వ్యాయామం చేయడం వల్ల పెల్విక్‌ కండరాలు దృఢమవుతాయి, నడుము నొప్పి తగ్గుతుంది.

గర్భధారణ సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలు

గర్భాశయంలో గడ్డలు: గర్భాశయంలో గడ్డలు పెరగడమనేది ప్రస్తుతం చాలా మంది మహిళలకు సమస్యగా మారింది. గర్భాశయంలో గడ్డలు ఉన్న వారిలో ఋతుక్రమము సరిగ్గా జరగకపోవడమే కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అయితే అన్ని రకాల గడ్డలకు చికిత్స అవసరం లేదు, అవి చిన్నగా ఉన్నప్పుడే హార్మోన్‌ థెరపీ, కొన్ని రకాల ఇంజెక్షన్లు ఇవ్వడంతో తగ్గిపోతాయి. అయితే ప్రస్తుతం ఈ సమస్యకు అధునాతన చికిత్స అయిన లాపరోస్కోపీ విధానం అందుబాటులో ఉండడంతో గర్భశయం తొలిగించాల్సిన అవసరం రాకుండానే నయం చేసుకునేందుకు వీలు అవుతుంది. దీంతో వారు తిరిగి గర్భం పొందేందుకు సాధ్యపడుతుంది.

ఎక్టోపిక్ గర్భం: సాధారణంగా అండం యొక్క ఫలదీకరణం ఫెలోపియన్ ట్యూబ్‌లో జరుగుతుంది. అలా కాకుండా గర్భాశయం వెలుపల జరిగే గర్భాన్ని ఎక్టోపిక్ గర్భం (ట్యూబల్ గర్భం) అంటారు. ఇందులో గర్భం అనేది అండాశయాలలో లేదా పొత్తికడుపులో కూడా పెరగవచ్చు. ఇది చాలా అరుదు అంటే 100 లో 1 లేదా 2 శాతమే గుర్తించబడతాయి. ఇందులో గర్భం పెరిగేకొద్దీ నొప్పి మరియు రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్టోపిక్ గర్భాన్ని సకాలంలో గుర్తించి వైద్య చికిత్సను తీసుకోకపోతే ప్రాణాంతకం కూడా అవ్వవచ్చు.

యూరినరీ ఇన్ఫెక్షన్: కొంత మంది మహిళలలో ప్రసవం తరువాత యూరినరీ ఇన్ఫెక్షన్ (మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి మరియు యూరినరీ బ్లాడర్ లో వాపు) వచ్చే అవకాశం ఉంటుంది. కావున వారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

గర్భిణీలకు ఏమైనా జబ్బులు ఉన్నా, జబ్బులు మొదలయ్యే అవకాశాలు ఉన్నా, తెలుసుకోవడానికి రక్తం & మూత్రం పరీక్షలు సహాయపడతాయి. గర్భిణీలు ఎప్పటికప్పుడు హిమోగ్లోబిన్, థైరాయిడ్‌, ఇన్ఫెక్షన్ పరీక్షలు, గ్లూకోజ్‌ ఛాలెంజ్‌ పరీక్ష, యాంటిబాడీ పరీక్షలు, రక్తం యొక్క గ్రూపు, క్రియాటిన్, కాలేయ సామర్ధ్యం, కొలెస్ట్రాల్‌ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. వీటితో పాటు మూత్రంలో ప్రొటీన్, గ్లూకోజ్‌, బిలిరుబిన్ తెలిపే పరీక్షలు చేయించుకోవడం కూడా ఉత్తమం.

About Author –

Dr. Lepakshi Dasari, Consultant Gynaecologist & Laparoscopic Surgeon, Yashoda Hospital, Hyderabad

About Author

Dr. Lepakshi Dasari | yashoda hospitals

Dr. Lepakshi Dasari

MBBS, DNB (Obstetrics and Gynaecology), DGO

Consultant Gynaecologist & Laparoscopic Surgeon