శరీరం ఆరోగ్యంగా ఉందనడానికి సంకేతం మన జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడం. దీని పనితీరు దెబ్బతింటే శరీర బరువు తగ్గడం దగ్గరి నుంచి రక్తహీనత వరకు అనేక రకాల సమస్యలు వస్తాయి. కడుపులో సమస్యలకు లాపరోస్కోపీ సర్జరీ (Laparoscopy Surgery) ద్వారా చికిత్స చేయవచ్చు. కడుపులోని సమస్యలను గుర్తించడానికి డయాగ్నస్టిక్ లాపరోస్కోపీ(Diagnostic Laparoscopy) కూడా ఉంది. పొట్టలోని భాగాలకు లాపరోస్కోపీ ఉన్నట్టుగానే నోరు, అన్నవాహిక దగ్గరి నుంచి జీర్ణాశయం తరువాత దాదాపు ఆంత్రమూలం (duodenum) వరకు ఉన్న సమస్యలేవో తెలుసుకోవడానికి ఎండోస్కోపీ(Endoscopy) పరీక్ష చేస్తారు. ఇకపోతే మలద్వారం నుంచి పెద్దపేగు వరకు ఏమైనా జబ్బులుంటే వాటిని నిర్ధారించడానికి కొలనోస్కోపీ(Colonoscopy) పరీక్ష చేస్తారు. అయితే ఈ పరీక్షలేవీ చిన్నపేగులోని సమస్యలను గుర్తించడానికి ఉపయోగపడవు.
ఆంత్రమూలం తరువాత jejunum మిగిలిన చిన్న పేగు భాగం అంతా చూడగలగాలంటే ప్రత్యేక ఎండోస్కోపీ పరీక్ష అవసరం అవుతుంది. ఇలాంటి స్పెషల్ ఎండోస్కోపీలలో ఒకటి క్యాప్సుల్ ఎండోస్కోపీ(capsule endoscopy). దాని తరువాత వచ్చించే power spiral enteroscopy.
క్యాప్సుల్ ఎండోస్కోపీ:
క్యాప్సుల్ ఎండోస్కోపీతో మొత్తం జీర్ణవ్యవస్థ లోపల ఉండే అన్ని అవయవాల సమస్యలను తెలుసుకోవచ్చు. నోటి ద్వారా క్యాప్సుల్‌ను తీసుకుంటే అది జీర్ణవ్యవస్థ లోపలికి వెళ్లిన కొద్దీ లోపలున్న అవయవాలను స్పష్టంగా చూపిస్తుంది. క్యాప్సుల్ లోపల కెమెరా ఉంటుంది. అది వీడియో రికార్డ్ చేస్తూ వెళ్తుంది. నడుము దగ్గర పక్కవైపు వైర్‌లెస్ రికార్డింగ్ మెషిన్ అమరుస్తారు. దీనిలో జీర్ణ అవయవాల స్థితి అంతా రికార్డు అవుతుంది. ఈ క్యాప్సుల్ ఎండోస్కోపీ ద్వారా చిన్నపేగు మాత్రమే కాకుండా జీర్ణవ్యవస్థ మొత్తం అంతటా ఎటువంటి సమస్య ఉన్నా చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. అయితే ఈ క్యాప్సుల్ ఎండోస్కోపీ కేవలం వ్యాధి నిర్ధారణకు మాత్రమే ఉపయోగపడుతుంది. లోపలున్నవి చూడగలుగుతాం. కానీ సరిచేయలేం. దీనిద్వారా చికిత్స అందించలేము. పైగా క్యాప్సుల్ వెళ్లే మార్గంలో ఎక్కడైనా ఏ భాగమైనా మూసుకుపోతే అక్కడ క్యాప్సుల్ ఇరుక్కుపోతుంది.
చిన్నపేగును చూడాలంటే…
చిన్నపేగులో మాత్రమే ఉండే సమస్యలను తెలుసుకోవాలంటే చేసే పరీక్ష ఎంటిరోస్కోపీ(enteroscopy). ఒకరకంగా చెప్పాలంటే చిన్నపేగుకు చేసే ఎండోస్కోపీనే ఎంటిరోస్కోపీ అంటారు. ఇది చాలా పాత టెక్నిక్. ఈ పరీక్షను రెండు విధానాల్లో ఏదో ఒక రకంగా చేస్తారు. ఎంటిరోస్కోపీని బెలూన్‌ను ఉపయోగించి చేస్తారు. ఒకటే బెలూన్ ఉపయోగిస్తే సింగిల్ బెలూన్ ఎంటిరోస్కోపీ(single balloon enteroscopy) అనీ, రెండు బెలూన్లు ఉపయోగిస్తే డబుల్ బెలూన్ ఎంటిరోస్కోపీ అనీ అంటారు. వీటి ద్వారా చిన్నపేగు మొత్తం స్పష్టంగా చూడవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా ఎండోస్కోపీకి ఒకటి లేదా రెండు బెలూన్స్ అమర్చి ఉంటాయి. దాని ద్వారా చిన్నపేగు లోపలికి చొచ్చుకుపోతుంది. ఒకరకంగా చెప్పాలంటే బెలూన్ ఎండోస్కోప్ మీదకి చిన్నపేగును తొడుక్కుంటూ పోతుంది. అయితే ఇది రెండు మూడు గంటల ప్రక్రియ. దీనికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి దీన్ని అధిగమించడానికి వచ్చిందే స్పైరస్ ఎండోస్కోప్.
స్పైరస్ ఎంటిరోస్కోపీ
ఎంటిరోస్కోపీ ప్రక్రియ సమయం తగ్గించడానికి స్పైరల్ ఎండోస్కోపీని తీసుకువచ్చారు. ఈ ఎండోస్కోపీలో బెలూన్ బదులుగా స్క్రూ ఉపయోగిస్తారు. ఈ స్క్రూ తిరిగిన కొద్దీ చిన్నపేగు వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఎండోస్కోప్ ముందుకు వెళ్తుంది. అలా చిన్నపేగు మొత్తాన్ని కెమెరా క్యాప్చర్ చేస్తుంది. చిన్నపేగులోని సమస్యలను స్పష్టంగా చూపిస్తుంది. సాధారణ ఎంటిరోస్కోపీ కన్నా ప్రక్రియకు టైం తక్కువ పడుతుంది. మొత్తం డయాగ్నసిస్ పూర్తవడానికి సాధారణ ఎంటిరోస్కోపీకి మూడు గంటలు పడితే స్పైరల్ ఎండోస్కోపీకి కేవలం గంట సమయం చాలు. ఇకపోతే ఎండోస్కోప్ లోపలికి వెళ్లడానికి గంట పట్టేది 20 నుంచి 30 నిమిషాలు పడుతుంది. స్పైరల్ ఎండోస్కోపీ ద్వారా డయాగ్నసిస్ మాత్రమే కాదు, చికిత్స కూడా చేయవచ్చు. దీంతో ఏ ప్రొసిజర్ అయినా చేయొచ్చు. పుండు,
ట్యూమర్ తీసేయొచ్చు. చిన్నపేగు లోపల ఎక్కడైనా మూసుకుపోయి ఉంటే బెలూన్ పెట్టి మూసుకుపోయిన దాన్ని వెడల్పు చేస్తారు. డాక్టర్‌కు కూడా సౌకర్యం. ఇబ్బంది ఉండదు. బెలూన్ జారిపోయే అవకాశం ఉండదు. ఫిక్స్‌డ్ గా ఉంటుంది. అందువల్ల ఏ టెన్షన్ లేకుండా స్థిరంగా ఉండి చేయవచ్చు. చిన్నపేగును డయాగ్నస్ చేయడానికి మొదట బేరియం టెస్టు ఉండేది. ఆ తరువాత సిటి, ఎంఆర్‌ఐ చేస్తున్నారు. వీటిద్వారా కొన్నిసార్లు లోపలున్న వ్యాధి మిస్ కావొచ్చు. పుండు, చిన్న ట్యూమర్, అల్సర్ కనిపించవు. వీటికి ఎండోస్కోపీ అవసరం. ఇలాంటి సమస్యలకు స్పైరస్ ఎండోస్కోపీ చాలా ఉపయోగపడుతుంది.
చిన్నపేగు – వ్యాధులు:
స్పైరస్ ఎండోస్కోపీ ద్వారా చిన్నపేగుకు వచ్చే జబ్బులేవైనా కనిపెట్టొచ్చు. చికిత్స చేయొచ్చు.
క్రౌన్స్ వ్యాధి ఒక ఆటో ఇమ్యూన్ సమస్య(autoimmune disease). దీనివల్ల పేగుకు పుండు పడే తత్వం పెరుగుతుంది. అందువల్ల క్రౌన్స్ డిసీజ్ ఉన్నవాళ్లలో చిన్నపేగులో మాత్రమే కాదు పెద్దపేగులో కూడా ఎక్కడైనా అల్సర్ రావొచ్చు. దీనివల్ల పుండు ఏర్పడడమే కాకుండా పేగు ముడుచుకుపోవచ్చు. కూడా. క్రౌన్స్ డిసీజ్ ఉన్నవాళ్లలో కడుపునొప్పి, నీళ్ల విరేచనాలు, మలంలో రక్తం పడడం, రక్తం తగ్గిపోయి ఎనీమియా రావడం, ప్రొటీన్ లాస్, వాంతులతో ఎమర్జెన్సీ పరిస్థితి రావొచ్చు. ఫిస్టులా కూడా ఏర్పడొచ్చు. ఈ వ్యాధిని స్పైరస్ ఎండోస్కోపీ ద్వారా తగ్గించవచ్చు.
పెద్దపేగు లేదా కోలన్‌లో క్యాన్సర్ కణితులు ఏర్పడడం సాధారణంగా గమనిస్తుంటాం. అయితే చిన్నపేగులో కూడా క్యాన్సర్ ఏర్పడవచ్చు. ఇలాంటప్పుడు బరుతు తగ్గిపోతారు. కడుపునొప్పి ఉంటుంది. మలంలో రక్తం పడుతుంది. అయితే చిన్నపేగుకు క్యాన్సర్ రావడం అరుదు. ఈ క్యాన్సర్ కణుతులను స్పైరస్ ఎండోస్కోపీ ద్వారా కనిపెట్టడమే కాకుండా తొలగించవచ్చు.
ఈ వ్యాధి ఉన్నవాళ్లలో రక్తనాళాలు అసాధారణంగా ఉంటాయి. ఒకే చోట ఎక్కువ బ్రాంచ్‌లు ఏర్పడి రక్తనాళాలన్నీ ఒకదగ్గర పేరుకుపోతాయి. వాటినుంచి అంతర్గత రక్తస్రావం అవుతుంది. దాంతో రక్తహీనత వస్తుంది. ఈ వ్యాధి ఉన్నప్పుడు అధికంగా రక్తం పోవడం, బలహీనత, నడిస్తే ఆయాసం ఉంటాయి. మలంలో రక్తం కనిపిస్తే ఇక తీవ్రంగా సమస్య ఉందని అర్థం. ఈ సమస్య ఉన్నప్పుడు కూడా స్పైరల్ ఎండోస్కోపీ ద్వారా రక్తనాళాలను సరిచేస్తారు.
చిన్నపేగు కణజాలంలో అదనంగా కణజాలం ఏర్పడుతుంది. వీటిని పాలిప్స్ అంటారు. సాధారణంగా దీనికి జన్యుపరమైన కారణాలు ఉంటాయి. స్పొరాడిక్‌గా కూడా ఏర్పడొచ్చు. ఈ సమ స్య ఉన్నప్పుడు రక్తం చాలా పోతుంది. కడుపునొప్పి ఉంటుంది. మలంలో రక్తం కూడా పడొచ్చు. ఇలా చిన్నపేగులో ఏర్పడే ఈ పాలిప్ కణజాలాన్ని స్పైరల్ ఎండోస్కోపీ ద్వారా తీసేస్తారు.
అల్సర్ ఏర్పడడానికి సాధారణంగా హెలికోబాక్టర్ పైలోరి అనే బాక్టీరియా కారణమవుతుంది. జీర్ణాశయంలో ఎక్కువగా ఈ అల్సర్లు ఏర్పడుతుంటాయి. అయితే కొంతమంది తలనొప్పి అనో, ఒళ్లునొప్పులనో ఎప్పుడూ ఏదో ఒక పెయిన్ కిల్లర్ వాడుతుంటారు. ఇలా పెయిన్ కిల్లర్లు ఎక్కువగా తీసుకుంటే చిన్నపేగులో అల్సర్లు ఏర్పడుతాయి. ఈ అల్సర్లకు హెచ్.పైలోరి ఇన్‌ఫెక్షన్‌కు సంబంధం లేదు. చిన్నపేగులో అల్సర్ ఏర్పడినప్పుడు కడుపు నొప్పి ఉంటుంది. ఈ అల్సర్లకు స్పైరస్ ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేస్తారు. కడుపునొప్పి ఉందంటే ఏ అజీర్తి చేసిందనో తేలిగ్గా తీసుకుంటారు చాలామంది. అయితే ఒక్కోసారి దానివెనుక బలమైన కారణం కూడా ఏదైనా ఉండవచ్చు. అందుకే కడుపునొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు. కడుపునొప్పితో పాటు వాంతులు, విరేచనాల వంటివి ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవాలి. ఇకపోతే మలంలో రక్తం పడుతున్నా, విపరీతమైన నీరసం, రక్తహీనత వంటివి ఉన్నా అశ్రద్ధ చేయకుండా గ్యాస్ట్రో ఎంటరాలజిస్టును కలవాలి. ఎటువంటి క్లిష్ట సమస్యలనైనా స్పష్టంగా తెలుసుకోవడానికి గానీ, పూర్తిగా చికిత్స అందించడానికి గానీ ఇప్పుడు మంచి పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను కలవాలి.
సాధారణంగా జీర్ణాశయం, పెద్దపేగు వంటి భాగాల్లో సమస్యలను గుర్తించడానికి స్క్రీనింగ్ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ పద్ధతులను ఉపయోగిస్తారు. ఇవి మాలిగ్నెంట్ సమస్యలైనా, క్యాన్సర్ కానివైనా వీటి ద్వారా గుర్తించవచ్చు. అయితే జీర్ణాశయం, పెద్దపేగు మధ్యలో ఉండే భాగమైన చిన్నపేగులో సమస్యలను గుర్తించడానికి సాధారణ ఎండోస్కోపీ ద్వారా సాధ్యం కాదు. చిన్నపేగు 4 నుంచి 6 మీటర్ల పొడవు ఉంటుంది. దీనిలో పరిశీలించడం చాలా కష్టతరమైన పని. రేడియలాజికల్ పద్ధతులైన ఎంఆర్‌ఐ, సిటి ల ద్వారా కూడా మ్యూకోసాకు సంబంధించిన వ్యాధులు, బ్లీడింగ్ లీజన్స్‌ని కనుక్కోవడం సాధ్యం కాదు. అదృష్టవశాత్తు చిన్నపేగుకు వచ్చే వ్యాధులు చాలా అరుదు. అందుకే చిన్నపేగుకు సంబంధించిన పరీక్షలు చాలా తక్కువ మందికి అవసరమవుతాయి. కాని ఇవి చాలా ముఖ్యం. వ్యాధి నిర్ధారణకు గానీ, చికిత్సకు గానీ చిన్నపేగు లోపలి భాగాన్ని స్పష్టంగా చూడడం చాలా ముఖ్యం.
స్మాల్ ఇంటెస్టినల్ క్యాప్సుల్ ఎండోస్కోపీ (సీఈ) చిన్నపేగు వ్యాధుల నిర్ధారణలో కీలకమైంది. ఇది చాలా సులువు. దీనికి అనెస్తీషియా అవసరం లేదు. చిన్నపేగు వ్యాధులు ప్రత్యేకించి రక్తస్రావం లాంటివి కనుక్కోవడానికి అందుబాటులోకి వచ్చిన మొదటి పద్ధతి ఇది. ఈ ఎండోస్కోపీ ద్వారా చిన్నపేగు లోపలి భాగాన్ని చాలా స్పష్టంగా చూడవచ్చు. అయితే దీని ద్వారా చికిత్స చేయరాదు. చిన్నపేగు వ్యాధులైన అంతర్గత రక్తస్రావం, స్ట్రిక్చర్, పాలిప్ లేదా ఫారిన్ బాడీ లాంటి సమస్యలకు ఎండోస్కోపిక్ థెరపీ చాలా ముఖ్యమైనది. ఈ సమస్యను అధిగమించడానికి ఎంటిరోస్కోప్‌లు అందుబాటులోకి వచ్చాయి. పుష్ ఎంటిరోస్కోప్ నుంచి మోటరైజ్డ్ పవర్ స్పైరస్ ఎంటిరోస్కోప్ వరకు ఎన్నో విధానాలు వచ్చాయి.
ఈ ఎంటిరోస్కోప్‌లో మోటార్‌తో నడిచే స్పైరల్ ట్యూబ్ ఉంటుంది. ఇది గుండ్రంగా తిరుగుతుంటుంది. దీనివల్ల స్కోప్ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ ప్రొసిజర్‌కు అనెస్తీషియా, ఫ్లోరోస్కోపీ అవసరం అవుతాయి. ఇంతకుముందు ఉన్న ఎంటిరోస్కోపీల కన్నా దీనికి తక్కువ సమయం పడుతుంది. మొత్తంగా చెప్పాలంటే క్యాప్సుల్ ఎండోస్కోపీ మంచి డయాగ్నస్టిక్ పద్ధతైతే, పవర్ స్పైరస్ ఎంటిరోస్కోపీ చికిత్సకు ఉపయోగపడే మంచి పరికరం.
Originally published: https://m.ntnews.com/article/news-detail/429331
About Author –
Heart failure, also called congestive heart failure, is a condition that arises when the muscles…
Percutaneous Transluminal Coronary Angioplasty, or PTCA, is a minimally invasive surgery that opens blocked or…
Ankle ligaments are crucial cords that link foot bones to lower leg bones, ensuring stability…
Supermarkets today are flooded with a variety of cooking oils, each with different characteristics, such…
మాట్లాడటానికి, తినటానికి మరియు ముఖం అందంగా కనిపించటానికి నోరే కీలకం. శరీర పోషణకు అవసరమైన ఆహారం, పానీయాలు లోపలికి చేరేది…
అండాశయ తిత్తులు అనేవి అండాశయాల లోపల లేదా వాటి ఉపరితలంపై ద్రవంతో నిండిన సంచి లాంటి నిర్మాణాలు. ఆడవారికి రెండు…