పార్కిన్సన్స్: కారణాలు, లక్షణాలు, చికిత్స విధానాలు & నివారణ చర్యలు

పార్కిన్సన్స్: కారణాలు, లక్షణాలు, చికిత్స విధానాలు & నివారణ చర్యలు

శరీరంలో మెదడు చాలా కీలకం, మెదడులో ఏ చిన్న సమస్య వచ్చినా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురువుతాయి. అయితే మన మెదడు వయసు పెరిగే కొద్దీ (Brain-ageing) దెబ్బతింటుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం తగ్గుతుంది. ఇలాంటి సమస్యలే పార్కిన్సన్స్ వ్యాధులకు దారితీస్తాయి. పార్కిన్సన్ అనేది మెదడుకు సంబంధించిన డిజార్డర్. మెదడులో ఏదైతే డొపమైన్‌ అనే మనిషిని నడిపేందుకు సహాయం చేసే హార్మోన్ మోతాదు తక్కువ కావడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ముఖ్యంగా డొపమైన్, ఎపినెప్రిన్‌ వంటి హార్మోన్లు నాడీ కణాల మధ్య సమాచారం ప్రసారం కావటానికి తోడ్పడతాయి. సామాన్యంగా ఈ సమస్య పెద్దవయస్సు (50-60 ఏళ్లు) గల వారిలో వస్తుంది. పార్కిన్సన్స్ సమస్య స్త్రీల కంటే పురుషుల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఎవరైనా పార్కిన్సన్స్‌ బాధితులుంటే వంశపారంపరంగా ఇతరులకు కూడా చిన్న వయసులోనే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. 

సాధారణంగా గాలి కాలుష్యం, విషపూరిత రసాయనాలతో పాటు మనం తినే ఆహారం మొత్తం కూడా క్రిమి కీటకాలను నాశనం చేసేందుకు ఉపయోగించే మందులను వాడి పండిస్తుంటారు. అలాంటి ఆహారాలను తినడం వల్ల కూడా క్రమంగా మెదడులో డోపమైన్ రసాయనం ఉత్పత్తి చేసే నరాలు దెబ్బతిని ఈ వ్యాధి బారిన పడుతుంటారు. సామాన్యంగా ఈ పార్కిన్సన్ వ్యాధి ఒక వైపు చేయి, కాళ్లు ప్రభావితం అయిన తరువాత రెండు వైపుల అభివృద్ధి చెందుతుంది.

పార్కిన్సన్స్ వ్యాధికి గల కారణాలు

పార్కిన్సన్స్ వ్యాధి అనేది అనేక కారణాల వల్ల సంభవించవచ్చు

  • ఒత్తిడితో కూడిన జీవనశైలి
  • వయస్సు పై బడటం
  • వంశపారంపర్యం
  • మెదడుకు దెబ్బ తగలడం 
  • మెదడు ఇన్‌ఫెక్షన్లకు గురికావడం
  • ప్రమాదవశాత్తు తలకు గాయాలు కావడం 
  • రోడ్‌ ట్రాఫిక్‌ ప్రమాదాలకు గురై మెదడుకు రక్త ప్రవాహం తగ్గడం
  • అల్కహాల్ వంటి ఇతర దురలవాట్ల వల్ల కూడా పార్కిన్సన్స్ వ్యాధి రావొచ్చు.

పార్కిన్సన్స్ యొక్క లక్షణాలు

పార్కిన్సన్స్ యొక్క వ్యాధి తీవ్రతను బట్టి లక్షణాలు వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉన్నప్పటికీ సాధారణంగా కనిపించే లక్షణాలు:

Parkinson's Symptoms

  • వణుకు
  • మాట తడబడడం
  • మనిషి నడక తగ్గిపోవడం
  • మనిషి వంగి నెమ్మదిగా నడవడం
  • ఒక వైపు చేయి వణకడం
  • తినడం కష్టమవ్వడం
  • మింగడంలో ఇబ్బంది
  • వాసన కోల్పోవడం
  • కదలికలు నెమ్మదించడం
  • కండరాలు బిగుసుకోవడం
  • ఒకరి సహాయంతో నడవడం
  • కొన్ని సార్లు చేయి, కాళ్లు కూడా స్టిప్‌ అయిపోయి నడవడం కష్టం అవుతుంది.
  • మూత్ర సంబంధమైన సమస్యలు,  మలబద్దకం మరియు రక్తపోటులో హెచ్చుతగ్గులతో పాటుగా  ఏమీ చేయలేకపోతున్నామనే నిస్పృహతో డిప్రెషన్‌ & నిద్రలేమి వంటి సమస్యలు సైతం వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

పార్కిన్సన్స్ వ్యాధి నిర్ధారణ

పేషంట్ గత చరిత్ర, 18 F ఫ్లురోడోపా, PET టెస్ట్ మరియు శారీరక పరీక్షలు చేసిన తరువాత ఈ వ్యాధిని నిర్థారించడం జరుగుతుంది. ఇమేజింగ్ (CT & MRI) టెస్ట్ లని ఉపయోగించి కుడా మెదడులో ఏమైనా గడ్డలు ఉన్నాయా, సాధారణ ఒత్తిడి హైడ్రోసెఫాలస్ లేదా వాస్కులర్ పార్కిన్సోనిజం వంటి మెదడు సంబంధ సమస్యలను ముందుగా గుర్తించడం వల్ల కూడా ఈ సమస్యను నిర్ధారించవచ్చు.

పార్కిన్సన్స్ చికిత్స విధానం

పార్కిన్సన్ వ్యాధిని ప్రథమ దశలో గుర్తించి చికిత్స తీసుకుంటే జీవితం మరియు జీవన నాణ్యత మెరుగుపరుచుకుని ఎలాంటి ప్రమాదం లేకుండా నివారించుకోవచ్చు. పార్కిన్సన్స్ సమస్యకు మందుల ద్వారా చికిత్స మరియు సర్జరీ అనే ఎంపికలు ఉంటాయి. ముఖ్యంగా మెదడులో డొపమైన్ అనే రసాయనం తగ్గడం వల్ల ఈ వ్యాధి వస్తుంది కావున దీనికి సంబంధించిన మందులను టాబ్లెట్‌ల రూపంలో బయట నుంచి తీసుకోవడం వల్ల నడక కొద్ది వరకు మెరుగుపడే అవకాశం ఉంటుంది. పార్కిన్సన్స్ సమస్యకు సర్జరీ ఎంపిక కూడా సరైనదిగా చెప్పవచ్చు. ఇందులో మెదడులో ఎలక్ట్రోలైట్ ఇంప్లాట్‌ చేయడం వల్ల డొపమైన్ రసాయనం తయారవుతుంది. దాని వల్ల మందుల అవసరం లేకుండానే వ్యాధి తీవ్రత తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

మెదడుకు ప్రేరణ కలిగించడం కూడా పార్కిన్సన్స్ కు సరికొత్త చికిత్స విధానాల్లో ఒకటి. పేస్‌ మేకర్ లాంటి పరికరం శరీరానికి అమర్చడం వల్ల మెదడు ప్రేరణ పొందుతుంది. పార్కిన్సన్‌ వ్యాధికి గురైన పేషంట్ లకు ఈ చికిత్స విధానం వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుంది.

మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఉన్నారా?

పార్కిన్సన్స్ వ్యాధి యొక్క నివారణ చర్యలు

కేవలం మందులు & చికిత్సల ద్వారానే పార్కిన్సన్స్  వ్యాధిని అరికట్టలేము కావున ఈ క్రింది నివారణ చర్యలను పాటించడం కూడా చాలా అవసరం..

  • పోషకాలు ఎక్కువగా ఉండే (యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్) ఆహారాలు తీసుకోవడం
  • వాకింగ్, స్విమ్మింగ్ లాంటి ఏరోబిక్ వర్కౌట్స్ చేయడం
  • మంచిగా తగినంత సేపు నిద్ర పోవడం 
  • అనవసరమైన ఆలోచనలు చేయడం మానుకోవడం
  • ఒత్తిడిలో ఉంటే బ్రెయిన్‌కు హాని కలుగుతుంది కాబట్టి యోగా, ధ్యానం లాంటివి చేయడం
  • వాహనాలు నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మ్‌ట్‌ & సీటు బెల్టు ధరించడం.
  • పంటలకు ఉపయోగించే పురుగుమందుల ప్రభావానికి గురికాకుండా ఉండడం (తప్పనిసరైతే రక్షణ దుస్తులు ధరించి పని పూర్తయ్యాక వెంటనే స్నానం చేయాలి)
  • వంట అవసరాల కోసం ఎక్కువ కాలంగా వాడుతున్న నూనెలను తిరిగి వంట అవసరాలకు వాడకూడదు. (ఇలాంటి నూనెలో ఆల్‌డిహైడ్లనే విషతుల్యాలుంటాయి)
  • పసుపులో యాంటిసెప్టిక్, కర్కుమిన్ అనే పోషకాలు ఎక్కువ ఉంటాయి కావున వంటకాల్లో పసుపు వాడుతుండడం మంచిది.
  • శారీరక వ్యాయామం, ఫిజికల్ యాక్టివిటీస్ మరియు నడవడం, ఫిజియోథెరపీ వల్ల జాయింట్ ప్లెక్సీబిలిటీ అయి వ్యాధితో సంక్రమించిన దుష్ఫలితాలతో కొంత వరకు కోలుకునే అవకాశం ఉంటుంది.

పార్కిన్సన్‌ సమస్యకు న్యూరాలజిస్ట్ ను సంప్రదించి సరైన సమయంలో సరైన చికిత్సను తీసుకున్నట్లు అయితే పార్కిన్సన్స్ వ్యాధిని నిర్మూలించుకుని సాదారణ జీవితం గడిపేందుకు అవకాశం ఉంటుంది.

About Author –

About Author

Dr. Raja Sekhar Reddy G | yashoda hospitals

Dr. Raja Sekhar Reddy G

MD, DM (Neurology)

Consultant Neurologist