మీ గుండె స్పందనలు నెమ్మదిస్తే పేస్ మేకర్ గుండె స్పందనలను ఆరోగ్యకరస్థాయిలో ఉండేట్లు నియత్రిస్తుంటుంది

మన గుండె పూర్తిగా కండరాలతో నిర్మితమైన అవయవం. అది నిరంతరాయంగా ప్రతిస్పందిస్తుండటంతో ఆరోగ్యంగా ఉండటానికి నిదర్శనం. అయితే కొన్ని రకాల వ్యాధుల కారణంగా దెబ్బదిన్న గుండె కొట్టుకోవటంలో విపరీతమైన నెమ్మదితనం వచ్చి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. అటువంటినపరిస్థితులలో పేస్ మేకర్ ప్రాణరక్షణ ఏర్పాటుగా పనిచేస్తుంది. మనదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా అరవై అయిదు సం.ల పై బడిన వారికే పేస్ మేకర్ అవసరం అవుతోంది. ఈ పరికరం అమర్చుకోవలసి వచ్చిన వారిలో 84 శాతం మంది ఈ వయస్సు వారే. ఇరవై శాతం మంది 64-42 సం.ల మధ్యవయస్సు వారుకగా అంతకంటే చిన్నవయసు వారి సంఖ్య కేవలం ఆరు శాతం మాత్రమే. పేస్మేకర్ నిర్మాణం, అది పనిచేసే విధానం, ప్రయోజనాలు, జాగ్రత్తలను గూర్చి తెలుసుకోవటం పెద్ద సంఖ్యలో మరణాలకు కారణం అవుతున్న గుండె వ్యాధులను అదుపుచేయటంలో ఆధునిక వైద్యరంగం సాధించిన అభివృద్ధిని తెలియవస్తుంది. గుండె స్పందనలకు తగ్గిపోవటానికి సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి అందుబాటులో ఉన్న ప్రాణరక్షణ విధానం గూర్చిన అవగాహన కలుగుతుంది.

హృదయస్పందన – లోటుపాట్లు

విశ్రాంతి లేకుండా శరీర భాగాలకు రక్తాన్ని సరఫరాచేస్తుండే గుండె కుడి ఎడమ భాగాలలో రెండేసి గదులు ఉంటాయి. వీటిలో పై భాగంలో ఉన్నవాటిని ఏట్రియా, కింద ఉన్న వాటిని వెంట్రికిల్స్ అంటారు. శరీర భాగాల నుంచి గుండెకు వచ్చిన రక్తం దాని కుడి ఏట్రియంలోకి చేరుతుంది. తరువాత దాని కిందనే ఉన్న కుడి వెంట్రికిల్ లోకి చేరుతుంది. అక్కడి నుంచి రక్తం ఊపిరితిత్తుల్లోకి పంప్ చేయబడుతుంది. శ్వాసకోశాలలో ఆ రక్తం ఆక్సీజన్ తో శుద్ధి అవుతుంది. ఇపుడు శుద్ధరక్తం గుండెలోని ఎడమ ఏట్రియంకు వెళుతుంది. అక్కడి నుంచి ఎడమ వెంట్రికిల్ కు చెరుకుటుంది. ఎడమ వెంట్రికిల్ శుద్దరక్తాన్ని శరీరభాగాలన్నింటికి పంప్ చేస్తుంది. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు గాను గుండె సంకోచవ్యాకోచాలు చెందాల్సి(స్పందించాల్సి)ఉంటుంది. నిర్ధిష్ట సమయానికి అందే విద్యుత్ ప్రేరణలతోనే ప్రతీసారి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రేరణ కుడి ఏట్రియంలో ‘సైనస్ నోడ్’ దగ్గర మొదలవుతుంది. దాంతో ఏట్రియా సంకోచించి రక్తాన్ని వెంట్రికిల్స్ లోకి పంప్ చేస్తాయి. ‘సైనస్ నోడ్’ నుంచి విద్యుత్ తరంగాలు తీగలాంటి ప్రవాహకాలుగా పనిచేసే ప్రత్యేక కండరాల ద్వారా గుండెలోనే ఉన్న ఏట్రియో-వెంట్రిక్యులార్ నోడ్ (ఎ.వి.ఎన్.)కు చేరుతుంది. ఇక్కిడి నుంచి విద్యుత్తు వెంట్రికిల్స్ కుప్రవహించి అవి సంకోచించేట్లు చేస్తుంది. దాంతో వాటిలోని రక్తం పంప్ చేయబడుతుంది.

ఈ విధంగా ఒక విద్యుత్ ప్రేరణ చక్రబ్రమణంలాగా సాగే ఈక్రియ మొత్తాన్ని ఒక సారి గుండె స్పందనగా పరిగణిస్తారు. ఈ విద్యుత్ సూచనలో ఎటువంటి ఆటంకం ఏర్పడినా అది గుండె స్పందనల్లో లోటుపాట్లకు కారణం అవుతుంది. ఈ అసాధారణ మార్పును ఎర్రైథిమియా అంటారు. గుండె విద్యుత్ వ్యవస్థలో సమస్యలు సైనస్ నోడ్, ఎ.వి.నోడ్ లేదా విద్యుత్ ప్రసారం చేసే కండరాలలో లోపాల వల్ల ఏర్పడతాయి. గుండెపోటు, గుండెకవాటాల సమస్యలు, వాల్వ్ రిప్లేస్ మెంట్ సర్జీల వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడవచ్చు. గుండె స్పందన సాధారణంగా ఉన్నప్పుడు శరీర భాగాలన్నింటికి రక్తం సజావుగా సరఫరా అవుతూ ఉంటుంది. కానీ అది అతి వేగంగా లేదా చాలా నెమ్మదిగా కొట్టుకొంటూ ఉంటే శరీర భాగాల రక్తసరఫరా తగ్గిపోతుంది. దీంతో మైకం కమ్మినట్లుగా, చాతీలో నొప్పి, శ్వాస తీసుకోవటం కష్టంగా ఉండటం, స్పృహతప్పటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇందుకు కారణం అయ్యే ఎర్రైథిమియాలకూ సాధారణంగా మందులతో చికిత్సచేస్తారు. అయితే మందులకు లొంగకుండా గుండె స్పందన భారీగా తగ్గటానికి కారణమైన ఎర్రైథిమియా కేసులలో పేస్ మేకర్ సిఫార్సుచేస్తారు.

పేస్ మేకర్

గుండె తగినంత వేగంతో కొట్టుకునేందుకు వీలుకల్పిస్తూ వ్యక్తిశరీరంలో అమర్చే పరికరమే పేస్ మేకర్. గుండె స్పందనలలో విపరీత వ్యత్యాసాలను అదుపుచేయటానికి సంబంధించి ఇది ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నది. కొన్నిరకాల గుండెవ్యాధులతో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కొత్త జీవితాన్ని అందిస్తున్నది.

ఇది చిన్న ఎలక్ట్రానిక్ పరికరం. అత్యాధునిక వైద్యసాంకేతిక విజ్ఞాన ఫలితం అయిన పేస్ మేకర్ ఎర్రైథిమియా వ్యాధిగ్రస్థుల శరీరంలో ఇమిడిపోయి గుండె స్పందనలను ఆరోగ్యకరస్థాయిలో ఉండేట్లు నియత్రిస్తుంటుంది. బ్యాటరీ పై ఆధారపడి పనిచేసే ఈ చిన్న పరికరం గుండెకు అదనపు విద్యుత్ ప్రేరణలను ఇస్తుంటుంది. దాంతో గుండె తగినన్ని సార్లు కొట్టుకుంటుంది. పేస్ మేకర్ లో పల్స్ జనరేటర్ , ఇన్సులేటెడ్ లెడ్స్ అనే రెండు భాగాలు ఉంటాయి. వీటిలో పల్స్ జనరేటర్ ఓ చిన్నలోహపు డబ్బా. దీనిలో అతిచిన్న ఎలక్ట్రానిక్ చిప్, 5-7 సం.ల పాటు పనిచేయగ బాటరీ ఉంటాయి. ఇవిరెండూ కలిసి ఓ చిన్న కంప్యూటర్ లాగా పనిచేస్తాయి. ఇది గుండె స్పందన వేగాన్ని గమనించి తగినన్ని సార్లు కొట్టుకునేందుకు అవసరమైన విద్యుత్ ప్రేరణలను పంపిస్తుంది. లెడ్స్ సన్నని కేబుల్స్. ఇవి పల్స్ జనరేటర్ నుంచి బయలుదేరి గుండెలోని కండరాల వరకూ ప్రయాణిస్తాయి. కొన్ని పేస్ మెకర్ లలో ఒక ఇన్సులేటెడ్ లెండ్ ఉంటే మరికొన్నింటిలో రెండు ఉంటాయి. ఇవి గుండె ఎంత వేగంగా స్పందిస్తుందో పల్స్ మేకర్ కు తెలియజేస్తాయి. దానికి అనుగుణంగా పల్స్ జనరేటర్ నుంచి విద్యుత్ ప్రేరణలను గుండె కండరాలకు చేరవేస్తాయి.

పేస్ మేకర్ అమర్చుకునేందుకు ముందు

పేస్ మేకర్ అమర్చవలసిన వ్యక్తి ముందుగా కొన్ని పరీక్షలు చేయించకోవలసి ఉంటుంది. పేస్ మేకర్ అమర్చటానికి అనుకూలతను నిర్ధారించుకునేందుకు డాక్టర్లు ఈ పరీక్షలు సిఫార్సుచేస్తారు. ఎఖోకార్డియోగ్రామ్: శబ్దతరంగాలను ఉపయోగించి చేసే ఈ పరీక్ష ద్వారా గుండె కండరాల మందాన్ని గుర్తించేందుకు వీలవుతుంది. ఎలక్ట్రో కార్డియోగ్రామ్: దీనిలో శరీరంపైన కొన్ని సెన్సర్లను అమర్చటం ద్వారా గుండె నుంచి వెల్వడే విద్యుత్ సంకేతాలను గమనిస్తారు. స్ట్రెస్ టెస్ట్: వ్యాయామం చేసినపుడు గుండె కొట్టుకోవటంలో మార్పును గుర్తించుతారు. ఈ పరీక్షల తరువాత ఆ వ్యక్తి శరీరం అనకూలంగా ఉన్నట్లు ప్రకటించి పేస్ మేకర్ అమర్చటానికి ఏర్పట్లుచేస్తారు. పేస్ మేకర్ అమర్చేందుకు ముందు రోజు అర్ధరాత్రి తరువాత ఘన,ద్రవఆహారం ఏమీ తీసుకోవద్దని చెప్పటమే కాకుండా ముందుగానే సిఫార్సుచేసిన మందులను వాడాల్సిందిగా సిఫార్సుచేస్తారు.

అమరిక ఓ కీలక ప్రక్రియ

పేస్ మేకర్ ను అమర్చటం క్లిష్టమైన ఓ చిన్న వైద్య ప్రక్రియ. చాలా సందర్బాలలో డాక్టర్లు స్థానికంగా మత్తు మందు ఇచ్చి పూర్తిచేస్తారు. చాతీ పై భాగంలో కుడిభాగానో లేక ఎడమ భాగానో కాలర్ బోన్ దిగువన 2-3 అంగుళాల గాటుపెడతారు. అక్కడ పెద్ద రక్తనాళం (సిర) ద్వారా లెడ్స్ ను గుండెలోపలి భాగం వరకూ పంపిస్తారు.అక్కడ గుండె కండరాలతో సంబంధం ఏర్పడేట్లు చేస్తారు. విద్యుత్ ప్రేరణలను కొలిచి సరిచూసుకుంటారు. ఆ తరువాత పల్స్ జనరేటర్ ను అమర్చటానికి చాతీపైనే చర్మం కింద కొంత స్థలాన్ని చేస్తారు.లెడ్స్ ను అనుసంధించి దానిని అక్కడ అమర్చి చర్మం కప్పి కుట్లు వేస్తారు. దాంతో పేస్ మేకర్ వ్యాధిగ్రస్థుడి శరీరంలో నే ఉండి గుండె స్పందనలను నియంత్రించటం ప్రారంభిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు సుమారు గంట సమయం పడుతుంది.

పేస్ మేకర్ జాగ్రత్తలు

పేస్ మేకర్ అమర్చుకున్న వ్యక్తులు దాని నుంచి గరిష్ట ప్రయోజనం పొందేందుకు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రతీ ఏడాది రెండు సార్లు డాక్టరును కలిసి దాని పనితీరు వ్యాధిగ్రస్థ వ్యక్తి ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఉన్నట్లు నిర్ధారించుకోవాలి. డాక్టర్ తన దగ్గర ఉన్న కంప్యూటర్ మౌస్ లాంటి చిన్న పరికరంతో రేడియో సిగ్నల్స్ ద్వారా పేస్ మేకర్ సరిగా పనిచేస్తున్నదీ లేనిది పరిశీలించి అవసరమైన మార్పులు (ట్యూనింగ్) చేస్తారు. ఇక పేస్ మేకర్ ఉన్న వ్యక్తి క్రమం తప్పకుండా తన నాడి(పల్స్)ని పరిశీలించుకుంటూ ఉండాలి. చాలా నెమ్మదిగా లేదా అతి వేగంగా ఉన్నాఅదేవిధంగా మైకంకమ్మినట్లుండటం, చాతీలో నొప్పి, శ్వాస తీసుకోవటం కష్టంగా ఉండటం లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి పేస్ మేకర్ లో మార్పుల అవసరాన్ని అవి సూచిస్తుండవచ్చు.

తక్కువ కోతతో (మినిమల్లీ ఇన్వేసివ్) పద్దతితో పూర్తయ్యేదే అయినప్పటకీ పేస్ మేకర్ అమరిక చాలా కీలకమైన, నైపుణ్యంతో చేయవలిసిన ప్రక్రియ. అనుభవజ్ఞులైన సర్జన్లు, కార్డియాలజిస్టులతోపాటు అత్యాధునిక పరికరాలు, వసతులు ఉన్న వైద్యకేంద్రాన్ని ఇందుకు ఎంచుకోవటం ద్వారా గరిష్టఫలితాలు పొందేందుకు అవకాశం ఉంటుంది.

About Author –

Dr. V. Rajasekhar, Consultant Interventional Cardiologist, Yashoda Hospital, Hyderabad
MD, DM (Cardiology)

About Author

Dr. V. Rajasekhar | yashoda hospitals

Dr. V. Rajasekhar

MD, DM

Senior Consultant Interventional Cardiology & Electrophysiology, Certified Proctor For TAVR & Clinical Director