Oncology

అండాశయ తిత్తి: రకాలు, కారణాలు, లక్షణాలు, వ్యాధి నిర్ధారణ మరియు చికిత్స పద్ధతులు

అండాశయ తిత్తులు అనేవి అండాశయాల లోపల లేదా వాటి ఉపరితలంపై ద్రవంతో నిండిన సంచి లాంటి నిర్మాణాలు. ఆడవారికి రెండు అండాశయాలు ఉంటాయి. గర్భశయానికి ఇరువైపులా అండాశయం ఉంటుంది, ఈ అండాశయం అనేది బాదంపప్పు ఆకారంలో ఉంటుంది. అండాశయ తిత్తులు అనేవి స్త్రీలు వారి పునరుత్పత్తి సమయాల్లో ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్యలలో ఒకటి. ముఖ్యంగా బహిష్టు ఆగిపోయే సమయం గనుక నిర్ణీత సమయంలో రాకపోతే ఇవి సంభవిస్తాయి. అండాశయ తిత్తులు ఎక్కువగా నొప్పి రహితమైనవి మరియు హానిరహితమైన (బినైన్) ట్యూమర్స్ గా ఉంటాయి. అండాశయాలలో గుడ్లు అభివృద్ధి చెంది పరిపక్వం చెందుతాయి. అండాశయ తిత్తులు సహజంగా ఎక్కువగానే సంభవిస్తాయి మరియు ఇవి ఎటువంటి చికిత్స అవసరం లేకుండానే కొన్ని నెలల్లో అదృశ్యమవుతాయి. ఈ సమస్య అన్ని వయసుల స్త్రీలలో సంభవించవచ్చు, అయితే 50 ఏళ్లు వయస్సు పై బడిన స్త్రీలు లేదా రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో క్యాన్సర్ వంటి తిత్తులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.

అండాశయ తిత్తుల రకాలు

అండాశయ తిత్తులు రెండు రకాలు, అవి 1. ఫంక్షనల్ తిత్తులు 2. పాథలాజికల్ తిత్తులు:

రుతుక్రమం సమయంలో శరీరంలో కలిగే మార్పులకు అనుగుణంగా ఈ అండాశయ తిత్తులు ఏర్పడతాయి. 

ఫంక్షనల్ తిత్తులు: ఇవి చాలా సాధారణ రకం మరియు తరచుగా సాధారణ ఋతు చక్రం వలన ఏర్పడతాయి. ఇవి అండోత్పత్తి (అండాశయం నుండి అండం విడుదల కావడం) వలన కలుగుతాయి. ప్రత్యేకమైన చికిత్స లేకుండానే ఫంక్షనల్ తిత్తులు అనేవి సమయంతో పాటు సాధారణంగా 2 నుంచి 3 ఋతు చక్రాలలో స్వయంగా వాటతంట అవే తగ్గిపోతాయి. ఫంక్షనల్ తిత్తులు సాధారణంగా ప్రమాదకరం కావు. ఇవి చాలా అరుదుగా నొప్పిని కలిగిస్తాయి. వీటిని ఫోలిక్యులర్ తిత్తులు మరియు కార్పస్ లుటియం తిత్తులు అనే రెండు రకాలుగా వర్గీకరిస్తారు.

  1. ఫోలిక్యులర్ తిత్తులు: ఋతు చక్రం సమయంలో, అండాశయాల లోపల ఉండే సాక్ లో గుడ్డు పెరుగుతుంది, దీనిని ఫోలికల్ అంటారు. సాధారణంగా, ఈ ఫోలికల్ గుడ్డును విడుదల చేయడానికి విరిగిపోతుంది. అయితే ఇది జరగకపోతే, ఫోలికల్ లోపల ఉండే ద్రవం అండాశయం మీద తిత్తిని ఉత్పత్తి చేస్తుంది.
  2. కార్పస్ లుటియం తిత్తులు: సాధారణంగా, గుడ్డు విడుదలైన తర్వాత ఫోలికల్ సాక్స్ కరిగిపోతాయి. ఒకవేళ సాక్ కరిగిపోకుండా ఉంటే, అప్పుడు అదనపు ద్రవం సాక్ లోపల అభివృద్ధి చెందుతుంది, దీని వలన కార్పస్ లుటియం తిత్తి ఏర్పడుతుంది.

పాథలాజికల్ తిత్తులు: ఈ రకమైన తిత్తులు చాలా అసాధారణమైనవి మరియు మీ ఋతు చక్రం యొక్క సాధారణ పనితీరు కంటే అసాధారణ కణాల పెరుగుదల వల్ల ఏర్పడతాయి.

ఇవి 3 రకాలు: డెర్మాయిడ్ తిత్తి, సిస్టాడెనోమాస్ మరియు ఎండోమెట్రియోమాస్.

  1. డెర్మాయిడ్ తిత్తులు: ఇవి పిండ కణాల నుంచి ఏర్పడతాయి, అందుకే ఇది పిండం కణజాలాలను కలిగి ఉంటాయి.
  2. సిస్టాడెనోమాస్: ఈ తిత్తులు అండాశయం యొక్క బయటి ఉపరితలంపై ఉన్న కణాల నుంచి అభివృద్ధి చెందుతాయి మరియు నీరు లేదా శ్లేష్మం లాంటి పదార్థంతో నిండి ఉంటాయి.
  3. ఎండోమెట్రియోమాస్: ఎండోమెట్రియోసిస్ ఉన్న మహిళల్లో ఈ తిత్తులు అభివృద్ధి చెందుతాయి. గర్భాశయం యొక్క లైనింగ్‌ను పోలి ఉండే కణాలు గర్భాశయం వెలుపల పెరిగినప్పుడు ఎండోమెట్రియోసిస్ కలుగుతుంది.

అండాశయ తిత్తులకు గల కారణాలు

చాలా వరకు అండాశయ తిత్తులు రావడానికి ఖచ్చితమైన కారణం తెలియదు. కానీ, ఈ క్రింది కారణాల ద్వారా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.

  • మానసిక ఒత్తిడి: తరచుగా నిరాశ, ఆందోళన మరియు మానసిక కల్లోలం వల్ల స్త్రీలలో అండాశయ తిత్తుల సమస్య వచ్చే అవకాశం పెరుగుతుంది
  • హార్మోన్లలో మార్పులు: హార్మోన్ స్థాయిలలో హెచ్చుతగ్గులు, ముఖ్యంగా ఋతు చక్రంలో, తిత్తులు ఏర్పడటానికి ప్రేరేపిస్తాయి
  • ఎండోమెట్రియోసిస్: ఎండోమెట్రియోసిస్ ఉన్న మహిళల్లో అండాశయ తిత్తులు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి
  • పీఐడి (పెల్విక్‌ ఇన్ ఫ్లమేటరి డిసీజ్): పీఐడి సమస్య కూడా అండాశయాలలో అనేక చిన్న తిత్తులు ఏర్పడటానికి కారణం అవుతుంది

అండాశయ తిత్తి యొక్క లక్షణాలు

చాలా మంది స్త్రీలలో అండాశయ తిత్తులు గుర్తించదగిన లక్షణాలను కలిగి ఉండవు. అయితే కొందరిలో తిత్తులు పెద్ద పరిమాణంలో పెరిగి చీలిపోయినప్పుడు లేదా అండాశయాలకు రక్త సరఫరాను అడ్డుకున్నప్పుడు మాత్రమే ఖచ్చితమైన లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో:

  • కటి (పెల్విక్) నొప్పి
  • పొత్తి కడుపు ఉబ్బరం మరియు నొప్పి
  • మూత్రాశయం లేదా పురీషనాళంపై ఒత్తిడి
  • సెక్స్‌ సమయంలో నొప్పి లేదా అసౌకర్యం
  • వికారం మరియు వాంతులు
  • రొమ్ము నందు సున్నితత్వం
  • బరువు పెరగడం
  • గర్భం దాల్చడంలో ఇబ్బంది
  • తరచుగా మూత్ర విసర్జన చేయడం
  • క్రమరహిత రుతుక్రమం

అండాశయ తిత్తి నిర్ధారణ & చికిత్స పద్ధతులు

అండాశయాలలో ఏదైనా తిత్తులు ఉన్నాయా అని ప్రసూతి మరియు గైనకాలజీ (OB/GYN) వైద్యులు నిర్ధారిస్తారు. తిత్తులు రావడానికి దోహదపడే ఏవైనా హార్మోన్ల అసమతుల్యతను గుర్తించడానికి హార్మోన్ల పరీక్షలు మరియు వివిధ రకాల రక్త పరీక్షలను చేస్తారు. వీటితో పాటు అవసరమైన శారీరక పరీక్ష, కటి పరీక్ష నిర్వహించిన తరువాతనే ఏ రకమైన సర్జరీ అవసరమవుతుందో వైద్యులు నిర్ణయిస్తారు. అండాశయంలో తిత్తులు వల్ల సంభవించే వివిధ లక్షణాలు లేదా వాటి యొక్క పరిమాణాన్ని బట్టి సర్జరీ తప్పనిసరి కావచ్చు.

ప్రస్తుతం యశోద హాస్పిటల్స్ లో అన్ని రకాల అండాశయ తిత్తులకు సురక్షితమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. చిన్న తిత్తులు గనుక ఉంటే, స్త్రీ జననేంద్రియ నిపుణులు గర్భనిరోధక మాత్రలతో కూడిన చికిత్సను సిఫార్సు చేస్తారు. పెద్ద మరియు బహుళ అండాశయ తిత్తులకు కూడా లాపరోస్కోపిక్ సర్జరీ ద్వారా సురక్షితంగా చికిత్స చేయవచ్చు. 

నిర్ధారణ పద్ధతులు:

  • అల్ట్రాసౌండ్: అధిక-శక్తి ధ్వని తరంగాలను ఉపయోగించి శరీరంలోని కణజాలాలు మరియు అంతర్గత అవయవాలను ఈ పక్రియ ద్వారా పరిశీలించి తిత్తి యొక్క పరిమాణం, ఆకారం మరియు స్థానాన్ని గమనించి చికిత్స చేయడం జరుగుతుంది.
  • మాగ్నెటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్ (MRI): ఇది తిత్తి ఉన్న ప్రాంతం యొక్క వివరణాత్మక చిత్రాన్ని ఇవ్వడం వల్ల దీనిని ఉపయోగించి కంప్యూటర్‌ ఆధారిత చికిత్సను చేయడం జరుగుతుంది.
  • గర్భ పరీక్ష: గర్భం తిత్తులకు కారణమా, కాదా అని తెలుసుకోవడానికి ఈ పరీక్ష చేయడం జరుగుతుంది.

చికిత్స పద్ధతులు:

  • లాపరోస్కోపిక్ ఓవేరియన్ సిస్టెక్టమీ: లాపరోస్కోపీ సర్జరీని మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ అని కూడా పిలుస్తారు. ఇది శరీరంలోని ప్రక్రియలను నిర్వహించడానికి చిన్న కోత ద్వారా డాక్టర్ కడుపులోకి కెమెరాను ఉంచి సర్జరీ చేసే ఆధునిక చికిత్సా విధానం. ఈ సర్జరీలో చిన్న కోతలతో (అండాశయం సిస్టెక్టొమీ) అండాశయం తిత్తి తొలగించబడుతుంది.
  • లాపరోటోమీ: తిత్తి ప్రత్యేకించి పెద్దగా ఉండి ఇతర సమస్యలు గనుక కలిగి ఉన్నట్లయితే డాక్టర్ తప్పక ఈ ఈ సర్జరీని చేస్తారు.

అండాశయ తిత్తుల నియంత్రణ చర్యలు

  • అధిక ఫైబర్ ఆహారాలు (బేరి, నారింజ, కాయధాన్యాలు మరియు బఠానీలు) వంటి వాటిని తీసుకోవాలి (వాటిలోని ఫైటోకెమికల్స్ మీ శరీరంలో ఈస్ట్రోజెన్ శోషణను నివారిస్తాయి మరియు గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి సహాయపడతాయి)
  • శరీర బరువును అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం
  • అండాశయ తిత్తుల వల్ల సంభవించే హార్మోన్ల అసమతుల్యత నియంత్రణకు మాంసకృత్తులను (చేపలు, చికెన్) ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి
  • మొలకెత్తిన ధాన్యాలు, కాలీఫ్లవర్, క్యాబేజీ మరియు బ్రోకలీ వంటి ఇండోల్-3 పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరం నుంచి అదనపు హార్మోన్లను బయటకు పంపించవచ్చు
  • అండాశయ తిత్తుల వల్ల కలిగే కండరాల తిమ్మిరిని తగ్గించడానికి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు (అరటి, జీడిపప్పు, బాదం, అవోకాడో మరియు పచ్చి కూరగాయలు) తీసుకోవాలి
  • హార్మోన్స్ ఉన్న మందులు తీసుకోవడం (కాంట్రాసెప్టివ్స్ వంటి మాత్రలు) వల్ల కూడా అండోత్పత్తిని నివారించుకోవచ్చు.
  • వదులైన మరియు సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి (బిగువైన మరియు అసౌకర్యమైన దుస్తులు పొత్తి కడుపుపై ఒత్తిడిని కలిగించి నొప్పికి దారితీయవచ్చు)
  • మానసిక ఒత్తిడి మరియు అందోళన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి, కావున వాటిని నివారించుకోవాలి
  • స్టెరాయిడ్‌ మందులు హార్మోన్ల అసమత్యులను దెబ్బతీస్తాయి కావున వాటిని వాడకూడదు
  • పొగ తాగే మహిళల్లో అండాశయ తిత్తులు ఏర్పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కావున ఎట్టి పరిస్ధితుల్లోనూ ధూమపానం మరియు మద్యపానం వంటివి చేయకపోవడం మంచిది.

మహిళలు పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తగు జాగ్రత్తలు పాటించడమే కాక అండాశయ తిత్తులను కలిగి ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే గైనకాలజిస్ట్ ను సంప్రదించి తగు చికిత్సలను తీసుకోవడం ఉత్తమం.

About Author –

About Author

Dr. Krishnaveni Nayini

MBBS, DGO, DFFP, MRCOG (UK), FRCOG, CCT (UK)

Senior Consultant Obstetrician & Gynaecologist

Yashoda Hopsitals

Recent Posts

Understanding and Managing Heart Failure: A Comprehensive Guide

Heart failure, also called congestive heart failure, is a condition that arises when the muscles…

2 months ago

Unlocking Heart Health: A Comprehensive Guide to PTCA

Percutaneous Transluminal Coronary Angioplasty, or PTCA, is a minimally invasive surgery that opens blocked or…

2 months ago

Understanding Ankle Ligament Reconstruction Surgery

Ankle ligaments are crucial cords that link foot bones to lower leg bones, ensuring stability…

3 months ago

Which cooking oil should you use?

Supermarkets today are flooded with a variety of cooking oils, each with different characteristics, such…

3 months ago

నోటి క్యాన్సర్‌: దశలు, లక్షణాలు, కారణాలు, చికిత్స మరియు నివారణ చర్యలు

మాట్లాడటానికి, తినటానికి మరియు ముఖం అందంగా కనిపించటానికి నోరే కీలకం. శరీర పోషణకు అవసరమైన ఆహారం, పానీయాలు లోపలికి చేరేది…

3 months ago

Managing Mumps: Symptoms, Treatment, and Prevention

An unexpected mumps outbreak has caused chaos among the populace, with a surge in cases…

4 months ago