కిడ్నీ సమస్యలకు కొత్త చికిత్సలు
మన శరీరంలోని మలినాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ, శరీరం ఎప్పుడూ పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేసేవి కిడ్నీలు. ఇవి రోజుకు దాదాపు 2 వందల లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఈ శుద్ధి ప్రక్రియ ఆగిపోతే శరీరం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. విషపదార్థాలతో నిండిపోతుంది. ఫలితంగా అన్ని అవయవాలూ ప్రభావితమై చివరికి మరణానికి దారితీస్తుంది. అందుకే కిడ్నీలకు వచ్చే జబ్బులను అశ్రద్ధ చేయవద్దు. సాధారణంగా కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. నీళ్లు ఎక్కువగా తాగకపోవడం కొందరిలో కారణమైతే, ఏ కారణం లేకుండా కూడా కొందరిలో రాళ్లు ఏర్పడుతాయి.
రాళ్లు తీసే కొత్త పద్ధతులు:
కిడ్నీలో రాళ్లు ఏర్పడటాన్ని నెఫ్రోలిథియాసిస్(nephrolithiasis) లేదా రీనల్ కాలిక్యులై(renal calculi) అంటారు. మనదేశంలో దాదాపు 15కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు అంచనా. ప్రతి వెయ్యిమందిలో ఇద్దరు ఈ వ్యాధికి గురవుతున్నారు. పరిసరాల ప్రభావం, ఆహారపు అలవాట్లు ఈ వ్యాధికి దారితీస్తున్నాయి. దీనికి వంశపారంపర్య కారణాలు కూడా ఉన్నాయి. కొన్ని పదార్థాలు చేరడం వల్ల కూడా మూత్రం చిక్కబడి స్ఫటికాలుగా ఏర్పడుతాయి. ఇవే రాళ్లుగా కనిపిస్తాయి. ఈ రాళ్లు 5 మిల్లీమీటర్ల లోపు పరిమాణంలో ఉంటే మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. ఇలాంటప్పుడు నీళ్లు ఎక్కువగా తాగమని సూచిస్తారు. సైజు ఎక్కువగా ఉంటే మాత్రం మూత్రనాళానికి అడ్డుపడి సమస్య పెద్దదవుతుంది. ఇలాంటప్పుడు సర్జరీ అవసరం అవుతుంది. కిడ్నీలో ఏర్పడిన రాళ్లను తీసేయాలంటే ఇంతకుముందు ఓపెన్ సర్జరీ ఉండేది. 25 ఏళ్ల క్రితం కీ హోల్ సర్జరీ(keyhole surgery) వచ్చింది. ఇప్పుడు కూడా ఈ సర్జరీ మంచి ఫలితాలనే ఇస్తున్నది. ఈ సర్జరీలో కిడ్నీ వెనుక ఒక రంధ్రం పెడతారు. యూరినరీ ప్యాసేజ్(urinary passage) ద్వారా వెళ్లి కిడ్నీలోని రాళ్లను తొలగిస్తారు. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన సర్జరీ పీసీఎన్‌ఎల్ – పర్‌క్యుటేనియస్ నెఫ్రో లిథోటమీ(percutaneous nephrolithotomy). ఇది ఎండోస్కోపిక్ సర్జరీ. ఈ సర్జరీలో రంధ్రం ద్వారా ఎండోస్కోప్ పంపించి రాయిని బ్రేక్ చేస్తారు.
మినీ పర్క్, సూపర్ పర్క్ అనేవి పీసిఎన్‌ఎల్‌లో వచ్చిన కొత్త టెక్నిక్స్:
మినీపర్క్ – ఈ ప్రక్రియలో రంధ్రం సైజు చాలా చిన్నగా ఉంటుంది. 13 ఫ్రెంచ్ కన్నా తక్కువ ఉంటుంది. సూపర్ పర్క్ – ఈ పద్ధతిలో చేసే సర్జరీకి వాడే పరికరానికే సక్షన్ డివైజ్ ఉంటుంది. రాయిని పగులగొట్టిన చేసిన తరువాత దాన్ని బయటకు తీసే ప్రాసెస్ లేకుండా బ్రేక్ చేయగానే అదే పరికరం దాన్ని సక్ చేసేస్తుంది.
రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ (ఆర్‌ఐఆర్‌ఎస్):
దీన్ని కిడ్నీలో ఏర్పడిన రాళ్లు తొలగించడానికి, ట్యూమర్ తీసేయడానికి చేస్తారు. స్కోప్ చివరి భాగం వివిధ రకాల డైరెక్షన్లలో వంగుతుంది. దాంతో రాయిని బ్రేక్ చేయడం సులువు అవుతుంది. పంక్చర్ అక్కర్లేదు. యూరిన్ ప్యాసేజ్ ద్వారా, మూత్రనాళం గుండా కిడ్నీలోకి వెళ్లి రాయిని చిన్న చిన్న ముక్కలుగా పగులగొడతారు. పగిలిన రాయి పొడి (డస్ట్) అంతా యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. దీన్ని ప్రత్యేకంగా సక్ చేసి తీయనవసరం లేదు. రాయిని పగులగొట్టడానికి లేజర్ పంపిస్తారు ఉపయోగిస్తారు. ఇది పదేళ్లుగా అందుబాటులో ఉంది. 5 ఏళ్ల నుంచి మన దగ్గర చేస్తున్నారు.
ప్రొస్టేట్ సమస్యలు(prostate problems):
సాధారణంగా పెద్ద వయసు వాళ్లలో వయసు రీత్యా వచ్చే సమస్యల్లో భాగంగా ప్రొస్టేట్ గ్రంథి వాచిపోతుంది. దీన్ని బినైన్ ఎన్‌లార్జ్‌మెంట్ అంటారు. అరవయ్యేళ్ల వయసు వచ్చేసరికి దాదాపు సగం మందిపురుషులు ప్రొస్టేట్ గ్రంథి వాయడం వల్ల బాధపడుతుంటారు. ఎనభయ్యేళ్లు దాటేనాటికి దాదాపు 90 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతూ కనిపిస్తారు. క్యాన్సర్ వల్ల కూడా ప్రొస్టేట్‌లో గడ్డ ఏర్పడి దాని సైజు పెరుగుతుంది. ప్రొస్టేట్ గ్రంథి యురెత్రా చుట్టూ అతుక్కుని ఉంటుంది. మూత్రాశయం (బ్లాడర్) నుంచి మూత్రాన్ని బయటకు తెచ్చే నాళం యురెత్రా. ప్రొస్టేట్ సైజు పెరిగినప్పుడు అది యురెత్రాపై ఒత్తిడి కలిగిస్తుంది. దాంతో పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. మూత్ర విసర్జన మొదలవడమే కష్టంగా, సన్నని ధారగా అవుతుంటుంది. బినైన్ ఎన్‌లార్జ్‌మెంట్ అయినట్టయితే టియుఆర్‌పి – ట్రాన్స్ యురెత్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రొస్టేట్ ద్వారా చికిత్స చేస్తారు. ఈ ప్రక్రియలో గడ్డను చిన్న చిన్న ముక్కలుగా చేసి సక్ చేసి ఎండోస్కోపీతో తీసేస్తారు .
లేజర్ ద్వారా కూడా పెద్దగా అయిన ప్రొస్టేట్‌కు చికిత్స అందిస్తారు. హెచ్‌ఒఎల్‌ఇపి – హాల్మియం లేజర్ ఎన్యూక్లియేషన్ ఆఫ్ ప్రొస్టేట్ సహాయంతో ట్రీట్ చేస్తారు. ప్రొస్టేట్‌ను మొత్తం తొలగిస్తే అది విడిపోయి బ్లాడర్‌లోకి వెళ్తుంది. మార్సులేటర్ అనే పరికరం ద్వారా దాన్ని బ్లాడర్ నుంచి తొలగిస్తారు. యాంటి ప్లేట్‌లెట్ మందులు, బ్లడ్ థిన్నర్ మందులు తీసుకునేవాళ్లకు ఇది చేస్తారు. గుండెజబ్బులున్నవాళ్లకు ప్రొస్టేట్ సమస్య ఉంటే లేజర్ ద్వారా చేసే ఈ చికిత్స మంచి పరిష్కారం.
క్యాన్సర్లు:
కిడ్నీ, బ్లాడర్, ప్రొస్టేట్, వృషణాలు, పెనిస్‌లలో ఎక్కడ క్యాన్సర్ ఉన్నా మంచి చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
కిడ్నీ, బ్లాడర్, ప్రొస్టేట్ క్యాన్సర్లకు లాపరోస్కోపిక్ సర్జరీ ద్వారా గానీ, రెట్రో పెరిటోనియోస్కోపిక్ సర్జరీ ద్వారా గానీ చికిత్స చేస్తారు. వీటికన్నా మెరుగైన ఫలితాలు రోబోటిక్ సర్జరీ ఇస్తున్నది.
కిడ్నీ చుట్టూ ఉండే ఖాళీ ప్రదేశాన్ని రెట్రో పెరిటోనియమ్ అంటారు. పొట్టకు పక్కవైపున 3 రంధ్రాలు పెట్టి రెట్రోపెరిటోనియమ్ స్పేస్ ద్వారా లోపలికి వెళ్లి సర్జరీ చేస్తే రెట్రోపెరిటోనియోస్కోపిక్ సర్జరీ అంటారు. ఈ సర్జరీ చేసిన తరువాత 24 గంటల్లో డిశ్చార్జి చేస్తారు.
లాపరోస్కోపిక్ సర్జరీ అంటే పొట్ట భాగంలో రంధ్రాలు పెట్టి, వాటి గుండా వెళ్లి కిడ్నీలకు సర్జరీ చేస్తారు.
కిడ్నీ భాగాన్ని తీసేయడాన్ని నెఫ్రెక్టమీ అంటారు. రాడికల్ నెఫ్రెక్టమీ అంటే మొత్తం కిడ్నీ తీసేస్తారు. పార్షియల్ నెఫ్రెక్టమీ అంటే కిడ్నీలో ట్యూమర్ ఏర్పడిన భాగాన్ని మాత్రమే తీసేస్తారు. ట్యూమర్ చిన్నగా ఉంటే పార్షియల్ నెఫ్రెక్టమీ, పెద్దగా ఉంటే మొత్తం కిడ్నీని తీసేస్తారు.
ట్రాన్స్‌ప్లాంటేషన్:
కిడ్నీ మార్పిడి సర్జరీలో కూడా ఆధునిక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఓపెన్ సర్జరీ చేయనవసరం లేదు. కిడ్నీ మార్పిడిలో అటు దాతకు, ఇటు గ్రహితకు ఇద్దరికీ సర్జరీ అవసరం అవుతుంది.
లాపరోస్కోపిక్ డోనర్ సర్జరీ ద్వారా దాత నుంచి కిడ్నీ సేకరిస్తారు. ఈ నెఫ్రెక్టమీ 1995లో మొదటి కేసు చేశారు. ఇంకో పద్ధతి రెట్రో పెరిటోనియోస్కోపిక్ డోనర్ నెఫ్రెక్టమీ. అంటే లాపరోస్కోపీలో పొట్ట నుంచి వెళితే, పక్క భాగం నుంచి రెట్రోపెరిటోనియమ్ స్పేస్‌లోకి వెళ్లి కిడ్నీ తీయడం. ఈ సర్జరీ తరువాతి రోజు డిశ్చార్జి చేస్తారు.
లాపరోస్కోపీ ద్వారా పొట్ట నుంచి కిడ్నీ దగ్గరికి వెళ్తే వేరే అవయవాలకు గాయం అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. కాని రెట్రోపెరిటోనియల్‌గా వెళ్తే అలాంటి సమస్య ఉండదు.
ఇకపోతే కిడ్నీని స్వీకరించే గ్రహితకు కూడా 60లలో ఓపెన్ సర్జరీయే చేసేవాళ్లు. ఆ తరువాత లాపరోస్కోపిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ వచ్చింది. ఇప్పుడు రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తున్నారు.
లావుగా ఉన్నవాళ్లకు పెద్ద ఇన్‌సిషన్ అంటే 15 నుంచి 20 సెంటీమీటర్ల కోత పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల ఇన్‌ఫెక్షన్ల అవకాశం ఎక్కువగా ఉంటుంది. రక్తం ఎక్కువగా పోతుంది. ఇలాంటి వాళ్లకు రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ మంచిది. నాలుగు రంధ్రాలు పెడితే చాలు. కిడ్నీ అమర్చడానికి 5 నుంచి 6 సెంటీమీటర్ల కోత చాలు. ఈ సర్జరీ చాలా కచ్చితత్వంతో చేయవచ్చు. సైడ్ ఎఫెక్టులు తక్కువ.
చిన్నారుల్లో కిడ్నీ సమస్యలకు..
యుపిజెఒ – యురెట్రో పెల్విక్ జంక్షన్ అబ్‌స్ట్రక్షన్ ఉన్నపుడు పైలోప్లాస్టీ చేస్తారు. దీన్ని లాపరోస్కోపీ, రోబోటిక్ ద్వారా చేస్తారు. 3 నుంచి 6 నెలల వయసు అయితే ఓపెన్ సర్జరీ చేస్తారు. అంతకన్నా ఎక్కువ ఏజ్ అయితే లాపరోస్కోపీ, రోబోటిక్ చేస్తారు.
రిఫ్లక్స్ సమస్య బ్లాడర్ దగ్గర వాల్వులో లోపం వల్ల వస్తుంది. ఇలాంటప్పుడు యురెటిక్ రీఇంప్లాంటేషన్ సర్జరీ చేస్తారు. ఇది రోబోతో కూడా చేయవచ్చు.
కొందరు పిల్లల్లో మూత్రం వచ్చే రంధ్రం వేరే చోట ఉంటుంది. దీన్ని హైపోస్పాడియాస్ అంటారు. దీనికి కూడా చికిత్స ఇప్పుడు సులువైంది.
పీయువీ – పోస్టీరియర్ యురెత్రల్ వాల్వ్ సమస్యకు కూడా చికిత్స అందుబాటులో ఉంది.
విల్మ్స్ ట్యూమర్ ఉన్నప్పుడు, ఏ కారణం వల్లనైనా కిడ్నీ పాడైతే చిన్న పిల్లల్లో కూడా కిడ్నీ మార్పిడి చేస్తారు.
రీకన్‌స్ట్రక్టివ్ యూరాలజీ:
కిడ్నీ సంబంధిత నిర్మాణాలు డ్యామేజీ అయితే వాటిని పునర్నిర్మించడం ఇప్పుడు సాధ్యమే. ఇలాంటి సర్జరీలు కూడా ఇప్పుడు చాలా సులభతరం అయ్యాయి. యురెత్రా కుంచించుకుపోవడం (యురెత్రల్ స్ట్రిక్చర్). మూత్రనాళం కుంచించుకుపోవడం (యురెటరల్ స్ట్రిక్చర్) సమస్యలున్నప్పుడు వాటిని రిపేర్ చేయడం కష్టం. అందువల్ల రీకన్‌స్ట్రక్ట్ చేస్తారు. సాధారణంగా ఏవైనా గాయాలు, దెబ్బల వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇలా డ్యామేజి అయినవాటికి ఇంతకుముందైతే ఓపెన్ సర్జరీ ఉండేది. ఇప్పుడు మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలు చేస్తున్నారు. ఈ నాళాల్లో ఏర్పడిన బ్లాక్ చిన్నదే అయితే అక్కడి వరకు కట్ చేసి, ఆ పాడైన భాగాన్ని తీసేసి, మిగిలిన రెండు చివరలను తిరిగి అతికిస్తారు. డ్యామేజి పెద్దదైతే చిన్నపేగు లేదా అపెండిక్స్ నుంచి కొంత భాగాన్ని తీసుకుని గ్యాప్‌ని పూరిస్తారు. యురెత్రాలో సమస్య ఉన్నప్పుడు ఎనాస్ట్రోమోసిక్ యురెత్రోప్లాస్టీ చేస్తారు. చెంపలు, బక్కల్ మ్యూకోసా నుంచి గ్రాఫ్ట్ తీసుకుంటారు.
రోబోటిక్ సర్జరీ
లాపరోస్కోపీ, ఎండోస్కోపీల ద్వారా లోపలి అవయవాలను స్పష్టంగా చూడవచ్చు. అవయవాలను 2 డైమెన్షనల్‌గా చూపిస్తాయి. అయితే వీటికన్నా మరింత స్పష్టంగా చూపించేది రోబోటిక్స్. రోబోకి 3 డైమెన్షనల్ విజన్ ఉంటుంది. అందువల్ల అవయవాలను మరింత స్పష్టంగా చూడవచ్చు. మూడు కోణాల్లో గమనించవచ్చు.
రోబో పరికరం స్ట్రెయిట్‌గా ఉండకుండా అటూ ఇటూ 360 డిగ్రీల కోణంలో తిరగగలుగుతుంది. కాబట్టి కట్ చేయడానికి సులువు అవుతుంది. సంక్లిష్టమైన భాగాల్లోకి కూడా వెళ్లి కట్ చేయడం ఈజీ అవుతుంది. కుట్లు వేయడానికి కూడా కచ్చితత్వంతో వేయవచ్చు. చేతితో కుట్లు వేస్తున్నప్పుడు కొంచె అటూ ఇటూ కదిలే అవకాశం ఉంది. వణికే అవకాశం ఉంది. కాని రోబోటిక్ చేతులతో అలాంటి సమస్య లేదు. కాబట్టి వయసులో పెద్దవాళ్లు కూడా ఏ ఆటంకం లేకుండా చేయవచ్చు. సంక్లిష్టమైన భాగాల్లో కూడా ఇది సరిగ్గా, కచ్చితత్వంతో సర్జరీ చేయగలదు. బ్లాడర్‌కి కూడా రోబో ద్వారా చేస్తారు.
రోబోటిక్ సర్జరీ ప్రయోజనాలు
రోబోటిక్ సర్జరీలో పెద్ద కోత ఉండదు. ఇది మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ
పెద్ద కోత ఉండకపోవడం వల్ల అధిక రక్తస్రావం ఉండదు.
ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా తక్కువ. ఈ సర్జరీ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవు.
సర్జరీ తొందరగా అయిపోతుంది. పూర్తి కచ్చితత్వంతో సర్జరీ చేయవచ్చు.
రోబో ద్వారా చేసే సర్జరీ ద్వారా 3 డైమెన్షనల్ గా లోపలి అవయవాలను చూడవచ్చు. అంతేకాదు.. దీనిలోని కెమెరా పదొంతులు ఎక్కువ మాగ్నిఫికేషన్‌తో అవయవాలను చూపిస్తుంది. అందువల్ల మరింత స్పష్టంగా చూడవచ్చు. కాబట్టి పొరపాట్లు జరిగేందుకు ఆస్కారం ఉండదు.