పైల్స్ తో మీరు బాధపడుతున్నారా మరియు సర్జరీ కోసం ఆలోచిస్తున్నారా? పైల్స్ సమస్యకు నూతన చికిత్స పద్ధతులు
ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారపు అలవాట్లను పాటించకపోవడం వల్ల ప్రస్తుతం లింగబేధం మరియు వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది పైల్స్ (మొలలు) బారిన పడుతున్నారు. పైల్స్ ను సాధారణంగా వైద్య పరిభాషలో హెమోరాయిడ్స్ అంటారు. మలద్వారం దగ్గర కొంత మందిలో బయట మరియు కొంత మందిలో లోపలి పైల్స్ గా విభజించవచ్చు. కొంత మందిలో ఈ సమస్య వంశపార్యపరంగా కూడా రావొచ్చు. ఒక్కప్పుడు వయస్సు పై బడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉండేది కానీ, ఇప్పుడున్న సమాజంలో 18 నుంచి 80 ఏళ్ల వరకు అన్ని వయస్సు వారిలో పైల్స్ కు సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
పైల్స్ అనేది ప్రతి మనిషిలోనూ మల ద్వారం వద్ద ఉండే అనల్ కుషన్స్ (gatekeepers). వీటి వల్ల మలద్వారానికి సంరక్షణ మరియు లీకేజీ లేకుండా, మోషన్ పడిపోకుండా ఉండడానికి పటుత్వం ఉంటుంది. ఇవి బాగా ఉబ్బినప్పుడు లోపల నుంచి బయటికి వస్తాయి. వీటి మీద గట్టిగా ఒత్తిడి పడినప్పుడు రక్తనాళం పగిలి రక్తం కారడం, నొప్పి రావడం కూడా జరుగుతుంది. ఇలాంటి పరిస్ధితుల్లో కొన్ని సార్లు పెద్ద పైల్స్ బయటికి రావచ్చు లేదా సాగిపోయి లోపలే ఉండవచ్చు. మలద్వారం నుంచి రక్తం రావడం ఒక్కటే పైల్స్ కు సంకేతం కాదు. ఈ కారణం సింపుల్ గా ఫిషర్ మరియు ప్రేగు క్యాన్సర్ కూడా అవచ్చు.
పైల్స్ (మొలలు) లక్షణాలు
పైల్స్ యొక్క సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి:
- మల విసర్జన సమయంలో నొప్పి, రక్తస్రావం
- మలద్వారం వద్ద దురద
- ఆసన ప్రాంతంలో నొప్పి లేదా అసౌకర్యం
- మలద్వారం దగ్గర బాధాకరమైన కురుపులు రావడం
- ఆసన వాపు
పైల్స్ (మొలలు) ద్వారా కలిగే సమస్యలు
రక్తస్రావం: పైల్స్ యొక్క అత్యంత సాధారణ లక్షణం రక్తస్రావం ఒక్కటే కాదు. ఇది సాధారణంగా మలవిసర్జన సమయంలో లేదా తర్వాత వస్తుంది.
రక్తహీనత: పైల్స్ నుంచి దీర్ఘకాలిక రక్తస్రావం వల్ల రక్తహీనతకు (తక్కువ ఎర్ర రక్త కణాల సంఖ్య) గురయ్యే అవకాశం ఉంది.
ప్రోలాప్స్: కొన్ని సందర్భాల్లో, పైల్స్ చాలా పెద్దవిగా మారి మలద్వారం నుంచి బయటకు వస్తాయి, దీనిని ప్రోలాప్స్ అని అంటారు. వీటి వల్ల వచ్చే నొప్పి చాలా బాధాకరంగా ఉంటుంది మరియు రక్తం కూడా కారుతుంది.
ఇన్ఫెక్షన్: పైల్స్ ఇన్ఫెక్షన్ కు గురైతే, నొప్పి, వాపు మరియు ఉత్సర్గకు కారణమవుతాయి. దీనిని థ్రోంబోస్డ్ పైల్స్ అని పిలుస్తారు మరియు వీటికి తక్షణ వైద్య సహాయం అవసరం.
పైల్స్ (మొలలు) నిర్థారణ
మీకు పైల్స్ ఉన్నాయా లేవా అనేది మీరు సంప్రదించిన డాక్టర్ లేదా సర్జన్ కింది పద్ధతులను ఉపయోగించి నిర్ధారణ చేస్తారు:
- మీ వైద్య పరిస్థితిని పూర్తిగా తెలుసుకోవడం
- శారీరక పరీక్ష: బాహ్య పైల్స్ (బయట ఉన్న పైల్స్) నిర్దారించడానికి సాధారణంగా దృశ్య పరీక్ష సరిపోతుంది. అయితే అంతర్గత పైల్స్ (లోపల ఉన్న పైల్స్) నిర్దారించడానికి మలద్వారంలోకి లూబ్రికేటెడ్ వేలిని చొప్పించడం జరుగుతుంది.
- విజువల్/స్కోపిక్ పరిశీలన: లోపల ఉన్న పైల్స్‌ను నిర్ధారించడానికి పెద్దప్రేగు మరియు మలద్వారంలోకి అనోస్కోప్/ప్రోక్టోస్కోప్/సిగ్మాయిడోస్కోప్ వంటి వాటిని ఉపయోగిస్తారు.
పైల్స్ చికిత్స విధానాలు
ప్రస్తుతం మారిన వైద్య విధానంలో పైల్స్ సర్జరీలో చాలా మార్పులు జరిగినవి. ముఖ్యంగా పూర్వకాలంలో ఉన్నట్లుగా అనల్ కుషన్స్ ని తొలగించకుండా పైల్స్ కు సర్జరీ చేయడం అనేది నేటి ఆధునిక కాలంలో జరిగిన ఉత్తమమైన మార్పు. ఎందుకంటే కుషన్స్ అనేవి మలద్వారం యొక్క పటుత్వానికి ఎంతో అవసరం. అయితే పూర్వకాలంలో ఇటువంటి విధానాలు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. దాని వల్ల భయంతో చాలా మంది నాటు వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారు మరియు దారాలు కట్టించుకుంటున్నారు. బయట ఉన్న దారాలు కట్టించుకుంటే లోపల ఉన్న పైల్స్ ఎలా తగ్గుతాయనేది ఇప్పటికి సందేహించదగ్గ విషయం. ఈ విధమైన దారాలు మరియు నాటువైద్యం వల్ల పలు రకాల ఇన్ఫెక్షన్ లు సోకి చనిపోయిన వారు కూడా ఉన్నారు.
అందువల్ల ఈ పైల్స్ కుషన్స్ అలాగే ఉంచి ఆపరేషన్ చేయడానికి ప్రస్తుతం చాలా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పైల్స్ సమస్యకు ప్రస్తుతం లేజర్ సర్జరీలు ఎక్కువగా ప్రాచారం పొందుతున్నాయి. కానీ లేజర్ సర్జరీ చేయటం వల్లనే అశించినంత ఫలితాలు కనిపించడం లేదని చెప్పవచ్చు. నొప్పి లేకుండా తొందరగా కోలుకుని మంచి ఫలితం రావాలంటే లేజర్ సర్జరీతో పాటు హైబ్రిడ్ పద్ధతులు (చివేట్ విధానం (CP) మరియు డాప్లర్ గైడెడ్ హెమోరోహైడల్ ఆర్టరీ లిగేషన్, స్టెప్లర్, స్క్లెరోథెరపీ, స్క్లెరోసెంట్ ఇంజెక్షన్, రబ్బర్ బ్యాడింగ్) కూడా ఖచ్చితంగా అవసరం. హైబ్రిడ్ పద్దతుల్లో సర్జరీ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలను గమనించవచ్చు. ఈ హైబ్రిడ్ విధానం వల్ల నొప్పి కూడా చాలా తక్కువగా ఉంటుంది. హాస్పిటల్ లో ఉండే సమయం తక్కువ మరియు సర్జరీ అయిన ఒక్క రోజులోనే డిశ్చార్జ్ కూడా అవ్వచ్చు. 3, 4 రోజులలోనే రోజు వారి పనులు చేసుకోవచ్చు. మల విసర్జన సమయంలో నొప్పి, రక్తం రావటం మరియు మలబద్దకం వంటి ఏదైనా సమస్యలు ఉన్న వారు వెంటనే జనరల్ సర్జన్ ను లేదా ప్రొక్టాలజిస్ట్ ను కలవడం మంచిది. మరి ముఖ్యంగా 50 సంవత్సరాలు పైబడిన వారు పై సమస్యలను కలిగి ఉంటే కొలనోస్కోపి చేసుకోవడం తప్పనిసరి.
About Author –
Dr. Santhi Vardhani, Consultant General & Laparoscopy Surgeon, Yashoda Hospital, Hyderabad
MS (General Surgery), FMAS, FIAGES