కండరాలు బిగుసుకుపోతున్నాయి… ఏం చేయాలి?

కండరాలు బిగుసుకుపోతున్నాయి… ఏం చేయాలి?

రోజూ గంటల తరబడి బస్సులో కూర్చోవడం లేదా నిల్చోవడం, ఆపైన ల్యాబ్‌లో ఎక్కువసేపు నిలబడడం కాలి కండరాలపైన తీవ్రమైన ఒత్తిడి కలిగిస్తున్నాయి. నిద్ర, విశ్రాంతి వల్ల కండరాలు కోలుకుని సాధారణ స్థితికి చేరుకుంటాయి. అయితే సరిపడే నిద్ర, ఆహారంలో పోషకాలు లోపిస్తే ఈ కోలుకునే ప్రక్రియ జరుగదు. అలా కండరాలు అలసి, బిగుసుకుపోతాయి. దాంతో నొప్పి కలుగుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ హఠాత్ కండర సంకోచం తాలూకు నొప్పి విపరీతంగా ఉండి, రోజువారీ కార్యకలాపాలకు తీవ్రమైన ఆటంకం కలిగిస్తుంది. కండరాలు ఒక్కసారిగా గుంజుకుపోవడం రోజులో ఎప్పుడైనా జరగవచ్చు. నిద్ర పోయినప్పుడు కండరాలు బిగుసుకుపోతే ఆ నొప్పికి వెంటనే మేల్కొంటారు. లక్షణాలనుబట్టి చూస్తే మీరు మజిల్ క్రాంప్స్ రుగ్మతతో బాధపడుతున్నట్టు తెలుస్తున్నది. ఈ విధంగా కాలి కండరాల్లో వచ్చే భరింపలేని మజిల్ క్రాంప్స్‌ను చెర్లీ హార్స్ అంటారు. మన ప్రమేయం లేకుండా ఉన్నట్టుండి కండరాలు సంకోచిస్తాయి. కొద్దిసేపటివరకూ అలాగే ఉండిపోతాయి. వృత్తి, వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా ఈ విధంగా జరుగుతుంటుంది. మెలకువగా ఉన్నప్పుడు, నిద్రలో, వ్యాయామం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా జరగవచ్చు. బిగుసుకుపోయిన కండరాలు మామూలుకంటే గట్టివిగా ఉండటమే కాకుండా కొన్నిసార్లు వడితిరిగి కనిపిస్తాయి. విపరీతమైన అలసట, డీహైడ్రేషన్, కొన్నిమందుల వాడకం వంటి కారణాల వల్ల మజిల్ క్రాంప్స్ రావొచ్చు. మజిల్ క్రాంప్స్ రావడానికి ప్రత్యేక కారణాన్ని నిర్ధారించలేం. కండరాలు విపరీతంగా అలసిపోవడం, వ్యాయామానికి ముందు తగినంతగా స్ట్రెచ్ చేయకపోవడం, రక్తంలో ఎలక్ట్రోలైట్స్ పరిమాణం పడిపోవడం వంటివి ఇందుకు దారితీస్తాయి. పోషకాహారం, తగినంత వ్యాయామం-విశ్రాంతి, వ్యాయామం ప్రారంభించడానికి ముందు స్ట్రెచింగ్ వంటి జాగ్రత్తలే మజిల్ క్రాంప్స్‌ను నివారిస్తాయి. అయినా కండరాలు బిగుసుకుపోతే మొదట ఆ కండర భాగంలో నెమ్మదిగా మర్దన చేయాలి. ఎలక్ట్రొలైట్స్ కలిపిన మంచినీళ్లు లేదా పండ్లరసాన్ని తీసుకోవాలి. అయినా తరచు మజిల్ క్రాంప్స్ వస్తుంటే ప్రథమ చికిత్స లాంటి ఉపశమన చర్యలు తీసుకోవాలి. అయినా ఫలితం లేకుంటే డాక్టర్ ను కలవాలి. 

About Author –

Dr. Devender Singh, Consultant Vascular & Endovascular Surgeon, Yashoda Hospital, Hyderabad
MS,DNB (Vascular)

About Author

Dr. Devender Singh | yashoda hospitals

Dr. Devender Singh

MS, DNB (Vascular Surgery)

Consultant Vascular & Endovascular Surgeon