ఆర్థరైటిస్ (కీళ్లవాతం): రకాలు, కారణాలు, లక్షణాలు & నివారణ చర్యలు

పరిచయం

సాధారణంగా మనకు వచ్చే ఆరోగ్య సమస్యల్లో ఆర్థరైటిస్ (కీళ్లవాతం) కూడా ఒకటి. శరీరంలో ఒకటి కంటే ఎక్కువ కీలు వద్ద నొప్పులు, వాపులు, నడవలేని పరిస్థితినే ఆర్థరైటిస్ అని అంటారు. ఆర్థరైటిస్ కండరాలకు సంబంధించిన వ్యాధి. ఈ సమస్య ఉన్న వారు కూర్చోవడం, నడవడం వంటి చిన్నచిన్న పనులకు కూడా కష్టపడుతుంటారు. సాధారణంగా వయసు పైబడినవారిలో మోకాళ్లు అరిగిపోయి ఆర్థరైటిస్ వస్తుంది.  అయితే ప్రస్తుతం మారిన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల కారణంగా ఇప్పుడు 30 నుంచి 40 ఏళ్లలోపు వారిలో కూడా ఈ సమస్య వస్తుంది. మోకాళ్లు, పాదాలు, తుంటి, మోచేయి, భుజాలు ఇలా తదితర కీలు భాగాల్లో ఈ నొప్పి కలుగుతుంది. ఈ సమస్యతో బాధపడే వారు ఏ పనీ సరిగ్గా చేసుకోలేక ఇబ్బందిపడుతుంటారు. ముఖ్యంగా స్త్రీలలో ఈ ఆర్థరైటిస్ సమస్య మరి ఎక్కువగా ఉంటుంది.  ఈ సమస్య వయసుతో సంబంధం లేకుండా అందరిలో కనిపించినా, ముఖ్యంగా 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సున్న వారిలో ఎక్కువ.

ఆర్థరైటిస్‌ యొక్క రకాలు 

ఆర్థరైటిస్‌లో దాదాపు  100 కంటే ఎక్కువ రకాలు ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రధానమైనవి:

  1. ఆస్టియో ఆర్ధరైటిస్‌: ఆస్టియో ఆర్ధరైటిస్‌ యొక్క అత్యంత సాధారణ రకం. వయసు పెరుగుతున్నకొద్దీ కార్టిలేజ్‌ అరిగిపోవడం వల్ల అస్టియో ఆర్థరైటిస్‌ వస్తుంది. ఎముకల చివరన ఉన్న కార్టిలేజ్‌ అరిగిపోయి, ఎముకలు రెండూ ఒకదానికొకటి ఒరుసుకుపోయి, ఆ భాగాన నొప్పి, వాపు వంటివి కనిపిస్తాయి. దీని వల్ల కూర్చొని లేచినప్పుడు, ఉదయం పూట నిద్ర లేవగానే, కీళ్ళు పట్టేసినట్లుగా అనిపించడం, ముఖ్యంగా నడుస్తుంటే కీళ్లలో టకటకమనే శబ్డం వస్తుంది. కింద కూర్చోవడం, మెట్లు ఎక్కడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువగా మోకాలులో ఈ నొప్పి కనిపిస్తుంది. ఈ సమస్య వృద్ధులలో ఎక్కువగా గమనించవచ్చు.
  2. రుమటాయిడ్‌ ఆర్ధరైటిస్‌: రుమటాయిడ్‌ ఆర్ధరైటిస్‌ అనేది ఒక ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్ (శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల వస్తుంది). ఈ వ్యాధి చేతివేళ్లకు, మోకాలి జాయింట్స్‌కు, మణికట్టు కీలుకు, కాలివేళ్ల కీళ్లకు ఎక్కువగా వ్యాపిస్తుంది. దీని వల్ల ఉదయం పూట నొప్పులు ఎక్కువగా ఉండి, కదల్లేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యాధి ఒక కీలుకు పరిమితం కాకుండా శరీరంలోని అన్ని జాయింట్స్‌కూ విస్తరిస్తుంది. ఇది  వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉంది.

గౌట్‌ : శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ లెవెల్స్‌ పెరిగిపోవడం ఈ రకమైన ఆర్ధరైటిస్‌ రావడానికి ప్రధాన కారణం. ముఖ్యంగా కీళ్ళ దగ్గర చిన్న స్పటికాల మాదిరిగా యూరిక్‌ యాసిడ్‌ పేరుకుపోవడంతో జాయింట్‌లో నొప్పి, వాపు ప్రారంభమవుతుంది. ఆర్థరైటిస్ ప్రభావం మొదట బొటన వేలు జాయింట్‌ల్లో కనిపించి తరువాత కీళ్లు, మణికట్లు, చేతివేళ్లు, మోచేతి ప్రాంతాల్లో జాయింట్లు వాపు, నొప్పితో ఎర్రగా మారుతాయి.

అంకైలోజింగ్‌ స్పాండిలోసిస్‌: అంకైలోజింగ్‌ స్పాండిలైటిస్ (AS) అనేది ఒక రకమైన  తాపజనకమైన ఆర్థరైటిస్, ఇది సాధారణంగా వెన్నెముకలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ముఖ్యంగా దిగువ వీపు మరియు తుంటిలో, అలాగే మోకాలు, చీలమండలు మరియు తుంటి వంటి ఇతర కీళ్లలో నొప్పి ని ప్రేరేపిస్తుంది. ఈ సమస్యకు కారణం తెలియకపోయినా వంశపారంపర్యంగా సంభవించవచ్చునని బావించవచ్చు.

సొరియాటిక్‌ ఆర్థరైటిస్‌: సొరియాసిస్‌ అనే చర్మ వ్యాధి కారణంగా తల, మోచేయి, మోకాలు, మెడ ప్రాంతాల్లో చర్మం పై ఎర్ర మచ్చలు చేతి వేళ్లు, కాలి వేళ్ల దగ్గరకు విస్తరించినపుడు సొరియాటిస్‌ ఆర్థరైటిస్‌ ప్రారంభమవుతుంది. ఈ వ్యాధి రెండు చేతులు, లోని కీళ్లపై ప్రభావం చూపుతుంది.

జువెనైల్ ఆర్థరైటిస్:  జువెనైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్ (JIA) అనేది దీర్ఘకాలిక ఆర్థరైటిస్. ఇది 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మరియు యుక్తవయస్కులలో (గట్టి, వాపు, బాధాకరమైన కీళ్ళు) కలిగించే రుగ్మతల సమూహం. ఇది ప్రతి 1,000 మంది పిల్లలలో ఒకరిని మాత్రమే ప్రభావితం చేస్తుంది.

మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఉన్నారా?

ఆర్థరైటిస్ సమస్యకు ప్రధాన కారణాలు

ఆర్థరైటిస్ reasons

ఆర్థరైటిస్ రావడానికి ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ, ఆర్థరైటిస్ సమస్యను ప్రభావితం చేసే కొన్ని ముఖ్యమైన కారణాలు:

  • వయస్సు పై బడడం
  • క్రమంగా వ్యాయామం చేయకపోవడం

అధిక తీవ్రత గల  వ్యాయామాలలో మరియు ఆటలలో పాల్గొనడం 

  • సరైన పౌష్టికాహారం మరియు కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోకపోవడం 
  • అధిక బరువును కలిగి ఉండడం (అధిక బరువు కీళ్ళపై మరియు మోకాళ్లపై ఒత్తిడిని కలిగిస్తుంది)
  • విటమిన్-D తగినంత లేకపోవడం 
  •   సహజంగా పురుషుల కంటే స్త్రీలు ఈ పరిస్థితికి ఎక్కువగా గురవుతారు
  • కుటుంబంలో ఏ వ్యక్తికైనా కీళ్ళవాతం సమస్య ఉంటే వంశపారంపరంగా కుటుంబ సభ్యులకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది
  • కొన్ని సార్లు ఆటలు ఆడే సమయంలో తగిలే కీళ్ల గాయాలు, తరువాత జీవితంలో ప్రభావితమైన కీళ్ల లో ఆర్థరైటిస్‌కు దారితీయవచ్చు
  • ధూమపానం & మద్యపానం వంటి వ్యసనాలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది మరియు ఇప్పటికే ఉన్న ఆర్థరైటిస్ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి.
  • కొన్ని అంటువ్యాధులు కూడా కీళ్ల వాపుకు కారణమవుతాయి మరియు ఆర్థరైటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి.

ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు

ఈ కీళ్ళవాతం లక్షణాలు సాధారణంగా మణికట్టు, చేతులు లేదా పాదాలలో సంభవిస్తాయి. వీటితో పాటు:

  • కీళ్లలో తీవ్రమైన నొప్పి & వాపు  
  • కూర్చోవడం & మెట్లు ఎక్కడంలో ఇబ్బంది
  • మోకాలు కదిలినప్పుడు శబ్ధం రావడం
  • జ్వరం 
  • అలసట
  • చర్మం రంగు మారడం
  • ఆకలి లేకపోవడం
  • 30 నిమిషాల కంటే ఎక్కువ సేపు నిలబడలేకపోవడం
  • పనితీరు మరియు చలన శీలత కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

ఆర్థరైటిస్ నివారణకై తీసుకోవాల్సిన ఆహారాలు & చర్యలు

పుష్కలంగా నీరు త్రాగడం వల్ల కీళ్ల మంటను తగ్గించుకోవచ్చు

  • ఆకు కూరలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉండే చేపలు మరియు పండ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం
  • కాల్షియం అధికంగా ఉండే (పాలు, పెరుగు, గుడ్డు, కీర, బొప్పాయి, ఆకుకూరలు, పండ్లు) వాటిని ఎక్కువగా తీసుకోవడం
  • శరీర బరువును అదుపులో ఉంచుకోవడం
  • ఎక్కువ  బరువులు ఎత్తడం మరియు నొప్పిని పెంచే కార్యకలాపాలను తగ్గించుకోవడం
  • క్రమబద్దమైన వ్యాయామం చేయడం 
  • ధూమపానం మరియు అధిక మద్యపానానికి దూరంగా ఉండడం
  • గాయాలకు గురికాకుండా చూసుకోవడం 
  • కూర్చోని పనిచేసేవారు కనీసం గంటకో సారైనా లేచి నడవడం వంటివి చేయాలి
  • వ్యాధి నుంచి కోలుకోవడానికి శరీరానికి తగినంత విశ్రాంతి & నిద్ర చాలా కీలకం
  • తెలిక పాటి వ్యాయమంతో  పాటు రాపిడిని తగ్గించే నూనెలను ఉపయోగించడం వల్ల నొప్పిని తగ్గించవచ్చు
  • స్టెరాయిడ్స్, సప్లిమెంట్లు తీసుకోవడం మరియు కండరాలను బలోపేతం చేయడానికి వ్యాయామాలు చేయడం వంటి వాటిని తగ్గించాలి

ఆర్థరైటిస్ సమస్య నిర్ధారణ పరీక్షలు

మీకు ఆర్థరైటిస్ లక్షణాలు కనిపించినట్టైతే, రోగనిర్ధారణ కోసం వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. వైద్యులు పేషంట్ యొక్క మునుపటి అనారోగ్యాలు, గాయాలు, ఆర్థరైటిస్ యొక్క వ్యక్తిగత చరిత్రను సమీక్షిస్తారు. అంతే కాకుండా నొప్పి స్థానం, తీవ్రత మరియు దానిని మరింత తీవ్రతరం చేసే నిర్దిష్ట లక్షణాల గురించి కూడా అడిగి తెలుసుకోవచ్చు. వీటితో పాటు: 

శారీరక నిర్ధారణ: ఈ పరీక్ష సహాయంతో వైద్యులు కీళ్లలో వాపు మరియు నొప్పి వంటి వాటిని పరిశీలించడం జరుగుతుంది. అంతే కాకుండా పేషంట్ యొక్క ఎముక కదలిక పరిధిని మరియు కీళ్ల పనితీరును కూడా అంచనా వేస్తారు. 

రక్త పరీక్షలు: యాంటీబాడీ స్థాయిలు, పూర్తి రక్త గణన, సి-రియాక్టివ్ ప్రోటీన్ మరియు ఎర్ర రక్త కణాల స్థాయిలను తెలుసుకోవడానికి ఈ పరీక్షలు సహాయపడుతుంది.

కీళ్ల పరిశీలన: కీళ్ల మధ్య ఉండే ద్రవం (సైనోవియల్ ద్రవం)పై పరీక్షలు చేయడం. కీళ్లకు సంబంధించిన అసాధారణతలను గుర్తించడానికి ఈ పరీక్షలు చేస్తారు.

ఇమేజింగ్ పద్ధతులు: X- Ray,  CT & MRI స్కాన్ వంటి అధ్యయనాలు ఆర్థరైటిస్ ను ప్రారంభ దశలోనే నిర్ధారించడానికి మరియు కీళ్ళలో నష్టం, వ్యాధి యొక్క తీవ్రతను అంచనా వేయడానికి సహాయపడతాయి. 

ఆర్థ్రోస్కోపీ: కొన్ని సందర్భాల్లో, వైద్యులు కీళ్ల లోపలి భాగాన్ని నేరుగా పరిశీలించడానికి ఆర్థ్రోస్కోపీని నిర్వహించవచ్చు.

ఆర్థరైటిస్ చికిత్స పద్దతులు

ఆర్థరైటిస్ రకాన్ని బట్టి చికిత్సను వైద్యులు సిపార్సు చేస్తారు. అనేక రకాల ఆర్థరైటిస్ యొక్క లక్షణాలను తగ్గించడానికి మరియు వ్యాధిని నిర్మూలించడానికి సహాయపడే మందులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 

చాలామంది కీళ్ళనొప్పులకు ఆపరేషన్‌ తప్ప వేరొక మార్గం లేదని భయపడుతుంటారు. కానీ ప్రస్తుత ఆధునిక కాలంలో ఆపరేషన్‌ లేకుండానే ఆర్థరైటిస్ సమస్యను నయం చేసుకోవడానికి అనేక నూతన చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. 

అయితే మీకు తీవ్రమైన ఆర్థరైటిస్ మరియు ఇతర చికిత్సలు పని చేయకపోతే సర్జరీ అవసరం కావచ్చు. ఆర్థరైటిస్ సర్జరీలో అత్యంత సాధారణ రకాలు.

జాయింట్ ఫ్యూజన్: సర్జరీ ద్వారా ఎముకలను కలపడం. ఈ రకమైన సర్జరీ పక్రియ వెన్నెముక (స్పైనల్ ఫ్యూజన్ ) లేదా చీలమండలోని ఎముకలకు సర్వసాధారణంగా చేయడం జరుగుతుంది.

జాయింట్ రీప్లేస్‌మెంట్: కీళ్ళు దెబ్బతిన్నట్లయితే లేదా మీరు ఎముక నష్టాన్ని అనుభవించినట్లయితే, మీకు ఆర్థ్రోప్లాస్టీ అవసరం కావచ్చు . మీ సర్జన్ మీ దెబ్బతిన్న సహజ జాయింట్‌ను తీసివేసి, దానిని ప్రొస్థెసిస్ (కృత్రిమ ఉమ్మడి)తో భర్తీ చేస్తారు.

రోబోటిక్ సర్జరీ: ఆర్థరైటిస్ చికిత్సలో ప్రస్తుతం అత్యాధునికమైన రోబోటిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చింది. రోబోటిక్‌ సర్జరీ సాధారణ శాస్త్ర చికిత్సల కంటే సురక్షితమైంది. ఇందులో “రోబోటిక్ ఆర్మ్” సహాయంతో ఖచ్చితమైన పరిమాణంలో ఎముక మార్పిడి చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. దీంతో సర్జరీని మరింత నియంత్రణ మరియు కఠినత్వంతో చేయడం సాధ్యపడుతుంది.

పై చికిత్సలతో పాటు తుంటి ఎముక , యాంకిల్‌ జాయింట్, భుజం కీలు, చేతివేళ్ల జాయింట్ల నొప్పులకు కూడా అనేక అధునాతన చికిత్సలున్నాయి. అంతేకాకుండా 6 నుంచి ఏడాదిలోపు ఇంజక్షన్ల ద్వారా ఈ నొప్పులన్నీ తగ్గిపోతున్నాయి.

చాలా మంది ఈ సమస్య పట్ల సరైన అవగాహన లేకపోవడంతో సమస్య క్షీణించే వరకూ గమనించక ఆర్ధరైటిస్ సమస్యను పెద్దదిగా చేసుకుంటారు. అంతే కాకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు ఉన్నవారు సరైన సమయంలో ఆర్థోపెడిక్స్ ను లేదా రుమాటాలజిస్ట్ ను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు అయితే ఈ వ్యాధి బారిన పడకుండా నివారించుకోవచ్చు.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262681 మాకు కాల్ చేయగలరు..