Select Page

నిద్రలేమి: రకాలు, లక్షణాలు, కారణాలు మరియు పరిష్కారాలు

నిద్రలేమి పరిచయం

ప్రస్తుత జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిద్రలేమి. ప్రతి మనిషికి ఆహారం, నీరు, గాలి ఎంత ముఖ్యమైనవో నిద్ర కూడా అంతే ముఖ్యం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే సగటున ఒక రోజుకూ 6 నుంచి 8 గంటల పాటు నిద్ర అవసరం. ఈ నిద్ర సమయం అనేది ఒక్కొక్క వయస్సు గల వారిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. నిద్రలేకపోతే చికాకు, ఏకాగ్రత కోల్పోవడం వంటి అనేక సమస్యలు వస్తాయి.

నిద్రలేమి సమస్యకు కారణం ఏమైనప్పటికీ, శారీరకంగా మరియు మానసికంగా ప్రభావితం చేస్తుంది. నిద్రలేమి ఉన్న వ్యక్తులు బాగా నిద్రపోయే వ్యక్తులతో పోలిస్తే తక్కువ జీవన నాణ్యతలను కలిగి ఉంటారు. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో  కూడా ఈ నిద్రలేమి సమస్య ఆందోళనలను కలిగిస్తుంది.

నిద్రలేమి యొక్క రకాలు

నిద్రలేమి సమస్య అనేక రకాలుగా ఉంటుంది. అయితే అవి సంభవించే కాలం మరియు సమయాన్ని బట్టి మారుతుంటుంది.

  • ప్రారంభ నిద్రలేమి: ఒక వ్యక్తి ప్రతి రాత్రి నిద్రపోవడానికి ఇబ్బందిపడడం.
  • తాత్కాలిక నిద్రలేమి: ఒక నెల కంటే తక్కువ రోజులు ఉండే నిద్రలేమి పరిస్థితి.
  • తీవ్రమైన నిద్రలేమి: దీనినే స్వల్పకాలిక నిద్రలేమి అని కూడా పిలుస్తారు. ఈ సమస్య ఒకటి నుంచి ఆరు నెలల మధ్య వరకు ఉండవచ్చు.
  • దీర్ఘకాలిక నిద్రలేమి: మూడు నెలలు లేదా ఏడాది పాటు ఒక వ్యక్తి నిద్రపోవడానికి ఇబ్బంది పడే పరిస్ధితిని దీర్ఘకాలిక నిద్రలేమి అంటారు . ఈ సమస్య అనేక కారణాలు (అందోళన, ఒత్తిడి, నిరాశ) వల్ల రావచ్చు.

ఒక వ్యక్తి అకస్మాత్తుగా నిద్రలో నుంచి మేల్కొన్న తర్వాత మళ్లీ నిద్రపోవడంలో ఇబ్బంది పడడాన్ని మెయింటెనెన్స్‌ ఇన్సోమ్నిమా (Maintenance insomnia) అంటారు.

నిద్రలేమి లక్షణాలు

  • వికారం
  • రాత్రివేళ నిద్రపోవడానికి ఇబ్బంది పడడం
  • రాత్రి సమయంలో తరచుగా మేల్కొవడం లేదా ఉదయాన్నే త్వరగా లేవడం
  • పగటిపూట అలసటకు గురి కావడం 
  • చిరాకు, నిరాశ లేదా ఆందోళన చెందడం
  • పనులపై దృష్టి, శ్రద్ధ పెట్టలేకపోవడం 
  • జ్ఞాపక శక్తి తగ్గడం మరియు శారీరకంగా చురుకుగా ఉండకపోవడం
  • అన్ని వేళలా నీరసంగా అనిపించడం
  • చిన్న చిన్న విషయాలకే కోపం, చిరాకు రావడం
  • రోజుకు 6 నుంచి 8 గంటలు కంటే తక్కువ పడుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్ధ సమర్ధవంతంగా పనిచేయక అనేక అనారోగ్య సమస్యలు సైతం వచ్చే అవకాశం ఉంటుంది.

నిద్రలేమి సమస్యకు కారణాలు

Insomnia-telugu1

నిద్రలేమికి అనేక సమస్యలు కారణం కావచ్చు లేదా ఇతర పరిస్థితులతో సంబంధం కలిగి ఉండవచ్చు. వీటిలో చాలా సాధారణమైనవి:

ఒత్తిడి: పలు రకాల పనుల వల్ల దైనందిన జీవితంలో చాలా మంది ఒత్తిడికి గురవుతుంటారు. ఈ ఒత్తిడి మానసికంగాను మరియు శారీరకంగాను జీవితంపై ప్రభావం చూపడంతో చాలా మంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటారు.

ప్రయాణం లేదా పని వేళల్లో మార్పు: అనుకోని సమయాల్లో ప్రయాణాలు చేయడం మరియు ఆలస్యంగా లేదా ముందుగానే పని షిప్ట్ లు చేయడం వంటి కారణంగా కూడా నిద్రలేమి సమస్య వస్తుంది. 

రాత్రి భోజనం ఆలస్యంగా తినడం: సాయంత్రం లేదా పడుకునే ముందు ఎక్కువగా ఆహారం తినడం వల్ల కడుపులో అసౌకర్యం మరియు గుండెలో మంట వచ్చి నిద్రలేమి సమస్యకు దారితీయవచ్చు. 

పగటి నిద్ర: కొందరికి పగటి సమయంలో నిద్రపోవడం అలవాటుగా ఉంటుంది. పగటి సమయంలో విశ్రాంతి తీసుకోవడం వల్ల రాత్రి సమయంలో నిద్రపట్టకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.

కొన్ని రకాల మందులు: కొన్ని రకాల యాంటిడిప్రెసెంట్స్ మరియు ఉబ్బసం లేదా రక్తపోటు, నొప్పి నివారణ, బరువు తగ్గించే మందులు వాడకం కూడా నిద్రకు ఆటంకం కలిగిస్తాయి.

మానసిక ఆరోగ్య రుగ్మతలు: పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, ఇతర మానసిక ఆరోగ్య రుగ్మతలు కూడా నిద్రలేమి సమస్యకు కారణం కావచ్చు. వీటితో పాటు ఆస్తమా, శ్వాససంబంధ సమస్యలు ఉన్నవాళ్ళలో నిద్రలేమి సమస్య ఎదురవుతుంది.

ఇతర కారణాలు: గురకపెట్టడం, నిద్రపోయే వాతావరణం సరిగ్గా లేకపోవడం, గదిలో సరిపడినంత గాలి ప్రసరణ లేకపోవడం కూడా నిద్రలేమి సమస్యకు కారణాలుగా చెప్పవచ్చు. 

నిద్రలేమి సమస్యకు పరిష్కారాలు

  • సమతుల్య పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఈ నిద్రలేమి సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు.
  • పడుకునే ముందు శరీరాన్ని మరియు మనసును ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల నిద్ర సమయం మరింత మెరుగవుతుంది.
  • నిద్ర వేళల్లో సమయపాలన పాటించాలి (నిద్రపోవడం మరియు నిద్ర లేవడం) .
  • నిద్రపోయే రెండు గంటల ముందు కంప్యూటర్లు, టీవీలు, వీడియో గేమ్‌లు, స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించే అలవాటును మానుకోవాలి.
  • నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే ఉదయాన్నే లేచి కొంత సమయం ఎండలో గడపడం కూడా ఉత్తమమైనది.
  • ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం వలన నిద్రలో నుంచి తరచుగా మేల్కొవడం వంటి వాటిని నివారించుకోవచ్చు.
  • పడుకునే ముందు ఎట్టి పరిస్ధితుల్లోనూ టీ, కాఫీలను తీసుకోకూడదు (అందులోని కెఫిన్ రాత్రిపూట నిద్రకు భంగం కలిగించవచ్చు).

అన్నిటికి మించి ఎక్కువ ఆలోచనలు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలను చాలా రోజులపాటు ఎదుర్కొంటున్నా కూడా నిద్రలేమి మరియు ఇతర నిద్రసంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. 

నిద్రలేమి సమస్యకు స్లీపింగ్ టాబ్లెట్ (నిద్ర మాత్రలు) కొద్దికాలం పాటు సహాయపడవచ్చు కానీ, ఎక్కువ కాలం తీసుకోకూడదు. కావున దీర్ఘకాలక నిద్రలేమి సమస్య ఉన్నవారు తక్షణమే వైద్యులను సంప్రదించి తగు పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవడం ఉత్తమం. ఈ సమస్య ఉన్న వారు తగిన జాగ్రత్తలు పాటిస్తే మానసిక ఆరోగ్య పరిస్థితుల నుంచి తక్షణమే బయటపడి ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు.

About Author –

Dr. Mohan Krishna Narasimha Kumar Jonnalagadda, Consultant Neurologist, Yashoda Hospitals – Hyderabad
MBBS, MD (Internal Medicine), DM (Neurology)

About Author

Yashoda Doctors

Dr. Mohan Krishna Narasimha Kumar Jonnalagadda

MBBS, MD (Internal Medicine), DM (Neurology)

Consultant Neurologist