ధూమపానం, పొగాకును మానేయడం ఎలా? ధుమపానం మానేసిన తర్వాత శరీరంలో సంభవించే మార్పులు

ధూమపానం, పొగాకును మానేయడం ఎలా? ధుమపానం మానేసిన తర్వాత శరీరంలో సంభవించే మార్పులు

పరిచయం

ధూమపానం, పొగాకు తీసుకోవడం ఒక శారీరక వ్యసనం మరియు ఒక మానసిక అలవాటు. సినిమాలు, టీవీలు, కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రభావంతో అనేక మంది చిన్నతనంలోనే ఈ ధూమపానం, పొగాకుకు బానిసలవుతున్నారు. తొలుత సరదాగా స్నేహితులతో దమ్ము కొట్టినా చివరికి అలవాటు కింద మారుతోంది. సిగరెట్, సింగార్, బీడీ, తంబాకు, గుట్కా ఇలా ఏ రూపంలో తీసుకున్నా అది శరీరానికి హానికరమే. 

సిగరెట్ల నుంచి వచ్చే నికోటిన్ ఒక తాత్కాలికమైన మరియు వ్యసనాత్మక-ఉత్తేజాన్ని అందిస్తుంది కనుక అనేక మంది దీని యొక్క ప్రభావానికి లోనవుతున్నారు. ధూమపానం మెదడు మీద ప్రభావం చూపే నికోటిన్ యొక్క ”మంచి అనుభూతి” కారణంగా అలాగే ఒత్తిడి, నిరాశ, విసుగుదలను ఎదుర్కోవడానికి కూడా అనేక మంది దీనికీ బానిస అవుతున్నారు. అలా మొదలైన ఆ అలవాటు జీవితంలో దినచర్య లాగా మారిపోతుంది. అనేక మందికి ఉదయం కాఫీతో పాటు లేదా పని వేళల్లో కాస్త విరామం తీసుకుంటున్నప్పుడు మరియు వారి ప్రయాణ సమయంలో ఒక సిగరెట్ త్రాగడం అనేది అలవాటుగా ఉంటుంది. 

ధూమపానం నుంచి బయటపడటానికి పాటించాల్సిన చిట్కాలు:

  • ధూమపానం చేయడం అనేది తీవ్రమైన సమస్య. ఇది శరీరాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది కావున మొదటగా ధూమపానంను వదిలివేయాలని మిమ్మల్ని మీరు నిర్ణయించుకోండి.
  • ధూమపానం, పొగాకును మీరు మానేస్తున్నట్లు మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు చెప్పండి.
  • మీరు ఎందుకు ధూమపానంను వదిలివేయాలనుకుంటున్నారో రాత పూర్వకంగా వ్రాయండి. 
  • మీరు ధూమపానం వదిలివేస్తున్న తేదీని ఖరారు చేసుకుని ఏ రోజు వరకు ఆ అలవాటును వదిలేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. మీరు అనుకున్న తేదీని వాయిదా వేయవద్దు మరియు ధూమపానం చేయని వ్యక్తిలా ఉండాలని బలంగా మరియు ప్రేరణతో ఉండండి. 
  • ధూమపానం మానేయడానికి ప్రయత్నిస్తున్న మరొకరి గురించి తెలుసుకోవడం మంచిది ఎందుకంటే ఒకరినొకరు సానుకూల పదాలతో సహాయం చేసుకోగలరు. అలాగే మీరు ఎందుకు పొగాకును మానేయాలనుకుంటున్నారో మీకు మీరే గుర్తు చేసుకుంటూ ఉండండి.    

ధూమపానం నిష్క్రమించే ముందు పాటించాల్సిన నియమాలు:

 మీరు తాగుతున్నా సిగరెట్ యొక్క పరిమాణాన్ని రోజు రోజుకు తగ్గించండి మరియు మొదట తక్కువ సిగరెట్లను కొనండి.

  • ధూమపానం చేస్తున్నప్పుడు పఫ్‌ల సంఖ్యను మరియు పొగాకు నమిలేవారైతే నమలడం యొక్క సంఖ్యను తగ్గించుకోవాలి.
  • ధూమపానం చేస్తున్నప్పుడు లోతుగా ఊపిరి పీల్చుకోవద్దు.
  • మీరు సాధారణంగా సిగరెట్లు/బీడీలు కొనుగోలు చేసే దుకాణం వైపుకు వెళ్లకుండా ఉండండి.

ధూమపానం మానేసిన తర్వాత శరీరంలో ఎలాంటి ప్రభావాలు కనిపిస్తాయి?

మీరు ధూమపానంను మానేసిన వెంటనే మీ శరీరంలో చాలా మంచి ప్రభావాలు కనిపిస్తాయి. అవి:

ధూమపానంను మానేసిన 20 నిమిషాల్లోనే హృదయ స్పందన రేటు సాధారణ స్దితికి వస్తుంది.

12 గంటల్లో: కార్బన్ మోనాక్సైడ్ లెవల్స్‌ సాధారణ స్థాయిలోకి పడిపోతాయి.
1- 9 నెలల్లో: శ్వాసలోపం మరియు దగ్గు తగ్గుతుంది. ఊపిరితిత్తుల పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది మరియు ఇన్ఫెక్షన్ ల నుంచి వచ్చే పలు రకాల ప్రమాదాలు కూడా తగ్గుతాయి.
1 సంవత్సరంలో: గుండె జబ్బులు వచ్చే ప్రమాదం సగానికి పైగా తగ్గుతుంది.
5 సంవత్సరాల్లో: స్ట్రోక్ వచ్చే ప్రమాదం బాగా తగ్గుతుంది.
10 సంవత్సరాల్లో: ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు సగానికి పైగా తగ్గుతుంది.
15 సంవత్సరాల్లో: గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎప్పుడూ ధూమపానం చేయని వారి మాదిరి వలే సమానంగా ఉంటుంది.

ధూమపానం, పొగాకు నుంచి దూరంగా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలు

How to quit smoking and tobacco1

  • మీకు పొగాకు పట్ల బలమైన కోరిక వచ్చినప్పుడు వాటికి ప్రత్యామ్నాయాలైన (చూయింగ్ గమ్స్/చాక్లెట్లు) వంటివి తీసుకోండి. అంతేకాక మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులైతే మీకు షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ వంటివి కూడా లభిస్తాయి.
  • మీరు నీటిని తీసుకునే పరిమాణం పెంచండి. ప్రతి రోజు సుమారు 8-10 గ్లాసుల నీరు తీసుకోండి. అంతేకాక ధూమపానం చేయాలనే కోరిక చాలా ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న గ్లాస్‌ లో నీటిని తీసుకుంటూ ఉండండి.
  • ప్రతిరోజూ 3-5 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. కొన్నిసెకన్ల పాటు చాలా నెమ్మదిగా మీరు ముక్కు నుంచి ఊపిరి పీల్చుకుంటూ దానిని నోటితో వదలుతు ఉండాలి. అలా రోజుకీ తగినన్నీ సార్లు చేయాలి.
  • యాష్ ట్రేలు, లైటర్లు, అగ్గిపెట్టేలు వంటి వాటిని ఇళ్లలో మరియు మీ పని ప్రదేశాల నుంచి తీసివేయండి.
  • మీకు ధూమపానం చేయాలని కోరిక కలిగితే 5-10 నిమిషాలు సానుకూల ఆలోచనలు మరియు ఆహ్లాదకరమైన పరిస్థితుల గురించి ఆలోచించండి.
  • మీకు దగ్గరైన మంచి స్నేహితుడికి లేదా ఎవరినైనా మీరు బాగా కోరుకునే వ్యక్తికి కాల్ చేయండి లేదా మీ డాక్టర్‌కి కాల్ చేయండి.
  • ఎప్పుడూ బిజీగా ఉండడానికి ప్రయత్నించండి అంతే గానీ విగ్రహాంలా ఒకే చోట కూర్చోవద్దు. శారీరక వ్యాయామాలైన ఈత కొట్టడం, జాగింగ్ మరియు ఆటల్లో పాల్లొనడం, చురుగ్గా నడవడం వంటివి చేయాలి. అంతేకాక సంగీతం వినడం, పుస్తకాలు చదవడం వంటి  కార్యకలాపాలతో కూడా బీజీగా ఉండండి.

ఒక్కసారి ధుమపానం విడిచి పెట్టిన తర్వాత మీరు చేయాల్సినవి:

  • ఇతరులు పొగాకు ఇచ్చినప్పటికీ వద్దు అని చెప్పాలి.
  • ధూమపానంలో ఒక్క పఫ్ కూడా తీసుకోకండి.
  • ఒత్తిడిని ఎదుర్కోవటానికి ఇతర మార్గాలను ప్రయత్నించండి. అనగా, విశ్రాంతి, లోతైన శ్వాస తీసుకోవడం, సంగీతం, వ్యాయామాలు, నడవడం, మాట్లాడటం వంటివి చేయాలి.
  • మీ కారు, ఇల్లు లేదా కార్యాలయల్లో ధూమపాన సంకేతాలను ఉంచవద్దు.
  • తలనొప్పి, చిరాకు మరియు ఏకాగ్రత లోపించడం వంటి ఉపసంహరణ లక్షణాలు మీకు ఉండవచ్చు. ఇవి తాత్కాలికమైనవి మరియు కొన్ని రోజుల్లో అదృశ్యమవుతాయి. ఈ లక్షణాలను ప్రత్యామ్నాయ చికిత్సలు ఉన్నాయి.
  • ఎందుకు ధూమపానం ను వదిలివేయాలి అనుకుంటున్నారో మీకు మీరే గుర్తు చేసుకోండి.

ధూమపానం చేసేవారు వీటిని మాత్రం మర్చిపోవద్దు

  • భారతదేశంలో ప్రతి సంవత్సరం సిగరెట్ తాగడం వల్ల 8,00,000 మరణాలు సంభవిస్తున్నాయి.
  • అంతే కాకుండా 45 లక్షల కార్డియో వాస్కులర్ వ్యాధులు.
  • 1.6 లక్షల కొత్త నోటి క్యాన్సర్లు వస్తున్నాయి.
  • అలాగే ప్రతి సంవత్సరం భారతదేశంలో 39 లక్షల క్రానిక్  ఒబెస్ట్రక్టీవ్ పల్మనరీ వ్యాధులు నమోదవుతున్నాయి.

ఇదే కాక పొగ తాగే వారితో పాటు ఆ పొగ పీల్చే వారిలో కూడా దాదాపు 30 శాతం మందిలో ఊపిరితిత్తుల క్యాన్సర్లు వస్తున్నాయి కావున మీరు ధూమపానం చేయకపోయినప్పటికీ ధూమపానం చేసే వారి దగ్గర ఉండడము ప్రమాదకరమే. మీరు ధూమపానం మానేసి మీ కుటుంబంతో నవ్వుతూ జీవిస్తూ డబ్బును కూడా ఆదా చేసుకోండి.

About Author –

Dr. S Srikanth Raju,Senior Consultant Vascular & Endovascular Surgeon, Foot Care Specialist, Yashoda Hospital, Hyderabad
MBBS, MS (General Surgery), DNB (Vascular Surgery), Department of Vascular & Endovascular Surgery