Select Page

గ్యాస్ట్రిక్ సమస్య యొక్క లక్షణాలు, కారణాలు మరియు నివారణ చర్యలు

అసౌకర్యానికి గురిచేసే జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన పలు రకాల సమస్యల్లో గ్యాస్ట్రిక్ సమస్య ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న జీవన సరళిలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో గ్యాస్‌ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. మనం తీసుకున్న ఆహారం గొంతు నుంచి ఆహారనాళం ద్వారా పొట్టలోని జీర్ణశయంలోకి చేరుతుంది. అక్కడ ఆహారాన్ని జీర్ణం చేయడం కోసం యాసిడ్స్‌తో పాటు పెప్సిన్‌ వంటి ఎంజైములు ఉత్పత్తి అవుతుంటాయి. ఈ యాసిడ్స్‌ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేకొద్ది కడుపులో గ్యాస్ట్రిక్ సమస్య మొదలవుతుంది.

చాలా మందిలో కడుపుకు సంబంధించి అనేక సమస్యలు సాధారణంగా వస్తుంటాయి. అయితే ఈ గ్యాస్ట్రిక్ సమస్య మొదలైతే చాలు మరెన్నో సమస్యలు చూట్టు ముట్టి అనేక అనారోగ్య సమస్యలకు సైతం దారితీస్తాయి. ఈ గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా ఏదైనా తినాలన్నా భయమే. ఈ సమస్య వల్ల కడుపులో గ్యాస్‌ తయారయ్యి ఛాతీ నొప్పి, కడుపు నొప్పి, మంట వంటి సమస్యలు సైతం వస్తాయి.

గ్యాస్ట్రిక్ సమస్య యొక్క లక్షణాలు

Gastric Problem1

గ్యాస్ట్రిక్ సమస్య యొక్క లక్షణాలు ప్రత్యేకంగా లేనప్పటికీ ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటుందని చెప్పవచ్చు:

  • వికారం మరియు అజీర్ణం
  • ఆకలి లేకపోవడం
  • నోటిలో నీళ్లు ఊరడం మరియు పొట్ట ఉబ్బరంగా అనిపించడం
  • తేన్పులు రావడం
  • ఎక్కిళ్ళు
  • ఆహారం తీసుకున్న తర్వాత ఆయాసం రావడం
  • గుండెలో మంటగా అనిపించి తేన్పు రావడానికి ఇబ్బంది పడడం
  • వాంతి అవుతున్నట్లు అనిపించడం
  • పొత్తికడుపు పైభాగం నిండిన అనుభూతి కలగడం
  • కడుపులో మరియు పొత్తికడుపులో మంట, నొప్పి రావడం వంటివి జరుగుతాయి.

గ్యాస్ట్రిక్ సమస్యకు కారణాలు

ఈ గ్యాస్ట్రిక్ సమస్య 20 సంవత్సరాల వయస్సు పైబడిన వారిలో మరింత ఎక్కువగా ప్రభావితం అవుతుంటుంది.

  • సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం
  • మధ్యపానం, ధూమపానంను ఎక్కువగా సేవించడం
  • కదలకుండా ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో కూర్చోవడం
  • మానసిక ఆందోళనలు, దిగులు, కుంగుబాటు, ఒత్తిడి, అలసటకు గురవుతుండడం
  • టీ/కాఫీ వంటివి అధిక మోతాదులో తీసుకోవడం
  • ఆహారం సరిగ్గా నమిలి మింగకపోవడం
  • చల్లటి పానీయాలు ఎక్కువగా తాగే వారిలోనూ ఈ సమస్య మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది
  • నొప్పి నివారణ మరియు ఇతర్రతా రకాల మందులను అధిక మోతాదులో తీసుకోవడం
  • అధిక బరువు కలిగి ఉండడం, హెచ్ పైలోరీ ద్వారా వచ్చే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఆటో ఇమ్యూన్ వంటి వ్యాధుల కారణంగా
  • సరిగా నిద్రలేనప్పుడు మరియు రాత్రి వేళలా పనిచేసేవారిలో ఈ గ్యాస్‌ సమస్య వస్తుంది
  • కలుషితమైన సీ ఫుడ్స్‌ తినడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది

గ్యాస్ నొప్పి మరియు గుండెపోటు నొప్పి మధ్య తేడా

Gastric Problem2

గుండె దగ్గర వచ్చే నొప్పి అలాగే గ్యాస్ట్రిక్ సమస్య వల్ల వచ్చే నొప్పి దాదాపు ఒకేలా ఉంటాయి. దీంతో చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యతో నొప్పి వచ్చినా అది గుండె నొప్పి ఏమో అని చాలా కంగారు పడుతుంటారు. వీటిని గమనించుకోవడం చాలా ముఖ్యం.

గ్యాస్ట్రిక్ సమస్య లక్షణాలు:

  • గ్యాస్ట్రిక్ సమస్య సాధారణంగా ఆహారం తీసుకున్న తర్వాత వస్తుంది
  • గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారిలో పొట్ట, ఛాతీలో నొప్పి వస్తుంది. ఆ నొప్పి వెన్నెముక వైపుగా వ్యాపిస్తుంది
  • గొంతులో మంట
  • కడుపు మరియు ఛాతీ భాగంలో మండినట్లుగా ఉంటుంది
  • కడుపులో మంట, తెన్పులు రావడం
  • గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వారు నీరసంగా ఉంటారు

గుండెపోటు యొక్క లక్షణాలు:

  • గుండెపోటు సమస్య ఆకస్మికంగా రావడమే కాక, తీవ్రమైన నొప్పి మెడ వరకూ పాకుతుంది మరియు గుండెపోటు లక్షణాల్లో గ్యాస్ట్రిక్ సమస్య లక్షణాలతో పాటు:
  • శరీరం అంతా చెమటలు పట్టి చల్లగా అయిపోతుంది
  • ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు
  • ఛాతీలో నొప్పి ప్రారంభమై ఎడమ చేతి వైపుగా వ్యాపిస్తుంది మరియు కాలి వేళ్ల వరకు ఈ నొప్పి వస్తుంది
  • ఛాతీలో నొప్పి మొదలై ఎడమ వైపు దవడ మరియు కుడి చేతి వరకూ కూడా ఈ నొప్పి వ్యాపిస్తుంది
గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
  • గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వారు రోజుకు 4 లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలి
  • ఒత్తిడికి గురి కాకుండా ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలి
  • మధ్యపానం, కూల్ డ్రింక్స్ మరియు కార్భోనేటెడ్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి
  • ఆహారాన్ని ఒకేసారి ఎక్కువగా కాకుండా తక్కువ మోతాదులో తరచుగా తీసుకుంటూ ఉండాలి 
  • ఆహారాన్ని నెమ్మదిగా తీసుకోవాలి మరియు మెత్తగా నమిలి మింగాలి
  • క్రమం తప్పకుండా ఉదయాన్నే అల్పహారం తినడం మరిచిపోకూడదు
  • పులుపు పదార్దాలు, పచ్చళ్లు, మసాలాలు, ఆయిల్‌పుడ్స్‌, జంక్‌ పుడ్స్‌ వంటివి ఎక్కువగా తీసుకోకూడదు
  • పండ్లు, వెజిటబుల్‌ సలాడ్స్‌, నట్స్‌ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి
  • మైదా, సోయాబీన్స్, పాలు, శనగలు, రాజ్మా, నట్స్, పేస్ట్రీలు వంటి వాటికి దూరంగా ఉండాలి
  • ప్రతి రోజూ క్రమం తప్పక వ్యాయమం చేయడం మంచిది
  • ఫైబర్‌ (పీచు పదార్దాలు), కీర, బీరకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దక సమస్య తగ్గి గ్యాస్‌ సమస్య బారిన పడకుండా ఉంటారు 
  • ఎట్టి పరిస్దితుల్లోనూ మద్యపానం, ధూమపానం జోలికి వెళ్లకూడదు
  • రాత్రి పూట ఆహారాన్ని పడుకునే 2 గంటల ముందు తీసుకోవాలి

ఈ విధంగా పై నియమాలను క్రమం తప్పకుండా పాటించినట్లు అయితే గ్యాస్ట్రిక్ సమస్య నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

కడుపులో పేగులు ఎందుకు అరుస్తాయి?

కొన్ని సార్లు మన పేగుల్లో నుంచి శ‌బ్దాలు వస్తుంటాయి. అందుకు ప్రధాన కారణం పేగుల్లో ఆహారం క‌ద‌లిక‌లు జరుగుతున్నపుడు గ్యాస్ ఏర్ప‌డడం వల్ల మన కడుపులో నుంచి ఈ శబ్దాలు వస్తాయి. 

వీటి వల్ల ఎలాంటి హాని ఉండదు కానీ, అస‌లు పేగులో శ‌బ్దాలు రానివారు మాత్రం మ‌ల‌బ‌ద్ద‌క సమస్యతో బాధ‌ప‌డుతున్న‌ట్లు అర్థం చేసుకోవాలి. ఇక పేగుల నుంచి ఎక్కువ‌ శ‌బ్దాలు వ‌స్తుంటే మాత్రం గ్యాస్ట్రిక్ లేదా విరేచ‌నాల స‌మ‌స్య ఉంద‌ని తెలుసుకోవాలి. 

అలాగే వికారం, వాంతులు అయ్యే వారికి, అవ‌బోతున్న వారికి కూడా పేగులు అరవడం సాధారణం. అయితే పేగుల్లో శ‌బ్దాలు అస‌లు రాక‌పోయినా, మ‌రీ ఎక్కువ‌గా వ‌స్తున్నా తప్పనిసరిగా ఒక సారి వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

శరీరానికి మేలు చేసే ఆహారంతోనూ గ్యాస్ట్రిక్ సమస్య ఉండటం సాధారణమే అయితే జీర్ణ శక్తిని పెంచుకోవడం వల్ల ఈ బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు. జీర్ణశక్తి ఎంత బాగా మెరుగుపడితే గ్యాస్ట్రిక్ సమస్య బాధ అంతగా తగ్గిపోతుంది. ఈ సమస్యతో బాధపడేవారు ప్రోబయాటిక్, ప్రిబయాటిక్ ఆహార పదార్థాలు తీసుకోవడం మరియు సరైన సమయానికి భోజనం తీసుకుంటూ ఉండడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ సమస్య బారిన పడకుండా చూసుకోవచ్చు.

ఉదరంలో వచ్చే సమస్యలు, ప్రేగు సంబంధిత ఇన్ఫెక్షన్లు మరియు ఇంటెస్టినల్ బ్లాక్స్, IBS (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్) వంటి మొదలైన వ్యాధులతో కూడా రావచ్చు. వెంటనే వైద్యుడిని సంప్రదించి తగు రకాలైన చికిత్సలను పొందగలరు.

 

About Author –

Dr. D. S. Sai Babu, Senior Consultant Surgical Gastroenterologist and Hepato-Pancreatico-Biliary-Surgeon , Yashoda Hospitals – Hyderabad
MS, FSGE, FMAS, FBMS (Bariatric & Metabolic), FAIAS

About Author

Yashoda Doctors

Dr. D. S. Sai Babu

MS, FSGE (NIMS), FMAS, FBMS, Dip. MAS (Minimal Access Surgery), FACS (USA)

Senior Consultant Surgical Gastroenterologist, Hepato-Pancreatico-Biliary Surgeon, Laparoscopic, Bariatric & Metabolic Surgeon