మోకాళ్ల నొప్పుల గురించి పూర్తి సమాచారం

మోకాళ్ల నొప్పుల గురించి పూర్తి సమాచారం

మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి?

ప్రస్తుతం జీవన విధానంలో వచ్చిన మార్పులతో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మోకాళ్ల నొప్పులకు గురవుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు కూర్చోవడం, నడవడం, నిలబడడంలో కష్టపడటమే కాక రోజువారీ పనులు చేసుకోవడంలో కూడా ఇబ్బంది పడుతుంటారు. సాధారణంగా ఎముకల్లో గట్టిదనం లేకపోవడం మరియు కీళ్లు బలహీనంగా మారడం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయి. ఈ సమస్య పురుషుల కంటే మహిళ్లల్లోనే ఎక్కువ. మోకాళ్ల నొప్పులు ఉన్నవారిలో మొదట కీళ్లలో వాపు, మోకాలు ఎర్రబడటం, ఆ తరువాత భరించలేని నొప్పి మోకాలు మొత్తం వ్యాపిస్తుంది. ఈ ప్రక్రియ సుమారు 2-5 సంవత్సరాల కాలంలో జరుగుతుంది.

మోకాళ్ల నొప్పికి గల కారణాలు

అధిక బరువును (ఊబకాయం) కలిగి ఉండడం మోకాలి నొప్పికి ప్రధాన కారణం. వీటితో పాటు:

  • వయస్సు పెరగడం
  • సరైన వ్యాయామం లేకపోవడం
  • ఎక్కువసేపు నిలబడి ఉండడం మరియు మోకాళ్లపై కూర్చోవడం
  • శరీరానికి కావాల్సిన విటమిన్ డి3 లేకపోవడం 
  • కీళ్లపై తీవ్రమైన ఒత్తిడి, గాయాలు మరియు బెణుకులు
  • ఆర్థరైటిస్, గౌట్ మరియు ఎముక నొప్పి వంటి అంతర్లీన కారణాలు కూడా మోకాలి నొప్పులకు కారణం కావొచ్చు

మోకాళ్ల నొప్పులు తగ్గించుకునేందుకు పాటించాల్సిన ఆహార నియమాలు

మోకాళ్ల నొప్పులు ఉన్న వారు సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

  • రోజు వారి ఆహారంలో తాజా కూరగాయలు మరియు అన్ని రకాల పండ్లను తీసుకోవాలి
  • పాలిష్‌ చేసిన తెల్ల బియ్యం, బేకరీ ఫుడ్స్‌, వేపుళ్ళు, స్వీట్లు, పంచదార, టీ మరియు కాఫీలు వంటి వాటిని పరిమితంగా తీసుకోవడం మంచిది
  • కొవ్వు అధికంగా ఉండే మాంసాహారాలను తక్కువ మోతాదులో తీసుకోవాలి
  • ఒమేగా-3 అధికంగా మరియు కొవ్వు తక్కువ ఉండే చేపలు, అవిసె, ఆక్రోట్‌ గింజలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి

మోకాళ్ల నొప్పుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Need To Know About Knee Pain-telugu1

మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవాలంటే సాధ్యమైనంత వరకు శరీర బరువును అదుపులో ఉంచుకోవడంతో పాటు:

  • రోజూ వారీగా సరైన సమతుల్య పోషకాహారం తీసుకోవడం
  • వైద్యులు సూచించిన వ్యాయామాలు చేయడం
  • ఉదయం సూర్యరశ్మి మోకాలిపై పడేలాగా చూసుకోవాలి
  • స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు కూడా మోకాళ్ల నొప్పుల నివారణకు మంచిది
  • మెట్లెక్కడం, ఎత్తుగా ఉన్న ప్రదేశాలలో నడవడం వంటివి మానుకోవాలి
  • ఏరోబిక్స్, జుంబా వంటి వ్యాయమాలు చేయకపోవడం మంచిది
  • బరువులు ఎత్తడం వంటి నొప్పిని పెంచే కార్యకలాపాలను నివారించుకోవాలి
  • మోకాళ్ల నొప్పులకు డాక్టర్ సూచించని మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు 

పై చర్యలను పాటించడం వల్ల మోకాలి చుట్టూ ఉండే కండరాలు బలపడి మోకాళ్ళ పై కొంతమేర ఒత్తిడి తగ్గి నొప్పి నుంచి బయటపడవచ్చు. 

మోకాలి నొప్పికి డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి?

సాధారణంగా వచ్చే మోకాలి నొప్పులు శారీరక ఒత్తిడిని బట్టి 1-2 రోజులు ఉంటాయి. అలా కాకుండా మోకాళ్లపై వాపు రావడం, నడుస్తున్నప్పుడు మోకాళ్లలో నొప్పి, మెట్లు ఎక్కలేకపోవడం, దిగలేకపోవడం, కింద కూర్చోలేకపోవడం, ఎక్కువ సేపు నడవలేకపోవడం మరియు కాళ్లు వంకరగా మారడం వంటి సమస్యలు 5-7 రోజుల కంటే ఎక్కువ ఉంటే డాక్టర్ ను సంప్రదించడం ఉత్తమం.

మోకాళ్ల నొప్పికి అందుబాటులో ఉన్న అధునిక చికిత్సలు

హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ లో మోకాళ్ల నొప్పికి అందుబాటులో ఉన్న అధునిక చికిత్స విధానాలు:

ప్లాస్మా థెరపీ (PRP): ప్లాస్మా థెరపీ (ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా) చికిత్సలో పేషెంట్‌ రక్తంలోని ప్లాస్మాను సేకరించి మోకాలి సమస్యతో బాధపడుతున్న వారిలో ప్రవేశపెట్టి చికిత్స చేస్తారు. 

స్టెమ్ సెల్ థెరపి: తుంటి లోపల ఉన్న మూలకణాలను (స్టెమ్ సెల్స్) సేకరించి ఈ పక్రియ చేస్తారు. ఈ విధమైన థెరపీ ద్వారా చేసే చికిత్సకు సక్సెస్‌ రేట్‌ ఎక్కువ. 

మృదులాస్థి (Cartilage) మార్పిడి: మృదులాస్థి మార్పిడి అనేది నేటి కాలంలో మోకాళ్ల మార్పిడి పక్రియలో అవలంబిస్తున్న ఒక కొత్త సర్జరీ విధానం, ఇందులో మృదులాస్థి కణాలను పేషంట్‌ శరీరంలో నుంచి సేకరించి ఉపయోగిస్తారు. 

రోబోటిక్ సర్జరీ: మోకాళ్ల మార్పిడి చికిత్సలో ప్రస్తుతం అత్యాధునికమైన రోబోటిక్‌ సర్జరీ అందుబాటులోకి వచ్చింది. రోబోటిక్‌ సర్జరీ సాధారణ శస్త్ర చికిత్సల కంటే సురక్షితమైంది. ఇందులో “రోబోటిక్ ఆర్మ్” సహాయంతో ఖచ్చితమైన పరిమాణంలో ఎముక కట్‌ చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. దీంతో సర్జరీని మరింత నియంత్రణ మరియు ఖచ్చితత్వంతో చేయడం సాధ్యపడుతుంది.

పాక్షిక మోకాలి మార్పిడి (UKR): పాక్షిక మోకాలి మార్పిడి అనేది కనిష్ట కోతల ద్వారా కీలు అరిగిన వారిలో ఒక భాగాన్ని మాత్రమే మార్పిడి చేసే శస్త్రచికిత్స. ఈ విధమైన చికిత్స ద్వారా చాలా మంచి ఫలితాలు మరియు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

మోకాళ్ల నొప్పులను తొలిదశలోనే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆపరేషన్ అవసరం రాకుండా నివారించుకోవచ్చు. సరైన ఆహారంతో పాటు వ్యాయామం చేస్తే మోకాళ్లు మరియు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

About Author –

About Author

Dr. Kirthi Paladugu | yashoda hospitals

Dr. Kirthi Paladugu

MBBS, MS (Ortho), FIJR

Sr. Consultant Arthroscopy Surgeon Knee & Shoulder (Sports Medicine), Navigation & Robotic Joint Replacement Surgeon (FIJR Germany), Minimally Invasive Trauma, Foot & Ankle Surgeon