స్వైన్ ఫ్లూకు చెక్ పెట్టే ఎక్మో ట్రీట్మెంట్ ఇప్పుడు అందుబాటులో ఉంది
స్వైన్ ఫ్లూ పేరు వినగానే వరుస మరణాలు గుర్తుకొస్తాయి. కొన్నిసార్లు ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లలో స్వైన్ ఫ్లూ ప్రాణాంతకం అవుతుంది. ఇలాంటప్పుడు ప్రాణాపాయం నుంచి కాపాడే ఆపద్బాంధవ చికిత్స ఎక్మో ట్రీట్‌మెంట్. ప్రస్తుతం వర్షాకాలం. తర్వాత రాబోయేది చలికాలం. రెండూ స్వైన్ ఫ్లూ వ్యాప్తికి అనుకూలమైన వాతావరణాలే. తేలిగ్గా ఒకరి నుంచి మరొకరికి సోకే ఈ ఇన్‌ఫెక్షన్ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారవచ్చు. జలుబు, ముక్కు దురద, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో మొదలయ్యే స్వైన్ ఫ్లూ లక్షణాలు కొందరిలో ఎక్కువ కాలం పాటు సాగుతాయి. ఐదేండ్ల లోపు పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, బాలింతలు, ఉబ్బసం, మధుమేహ రోగులు, ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, హెచ్‌ఐవి కలిగివున్నవాళ్లు.. ఇలా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లకు ఇది తేలిగ్గా సోకడంతో పాటు మందులకు లొంగక ప్రాణాంతకం అవుతుంది.
వీరిలో స్వైన్ ఫ్లూ లక్షణాలు తగ్గకుండా మరింత పెరిగి, మొదట న్యుమోనియాకు దారితీస్తాయి. ఈ దశలో మందులతో అదుపు చేయవచ్చు. కొందరిలో ఈ దశ కూడా దాటి ఒక ఊపిరితిత్తి నుంచి మరో ఊపిరితిత్తికి న్యుమోనియా సోకడం, ఊపిరితిత్తుల్లోని ప్రతి భాగం వ్యాధిగ్రస్తం కావడం జరుగుతుంది. మరికొందరిలో సమస్య ముదిరి అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్డ్ సిండ్రోమ్‌గా మారుతుంది. ఈ దశకు చేరిన రోగి ఊపిరితిత్తులు పనిచేయడం మానేస్తాయి. వెంటిలేటర్ అవసరం అవుతుంది. అంతర్గత అవయవాలు దెబ్బతిని మల్టిపుల్ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ సిండ్రోమ్‌కు దారితీస్తుంది.
ఇలాంటప్పుడు ఓ పక్క వెంటిలేటర్ సపోర్ట్ ఇస్తూ, స్వైన్ ఫ్లూను అదుపు చేయడం కోసం యాంటీ వైరల్ డ్రగ్స్ ఇవ్వాలి. అదే సమయంలో న్యుమోనియాను తగ్గించడం కోసం యాంటీబాక్టీరియల్ మందులు కూడా ఇవ్వాలి. వీటన్నిటితో పాటు ఇతరత్రా అంతర్గత అవయవాలు ఫెయిల్ అయినప్పుడు వాటిని కాపాడే సపోర్టివ్ కేర్ అత్యవసరం. ఇన్ని రకాల చికిత్సలు ఏకకాలంలో ఇవ్వాలంటే అన్ని రంగాలకు చెందిన వైద్యులు అందుబాటులో ఉండాలి. అత్యాధునిక సదుపాయాలుండాలి. ఇన్‌ఫెక్షన్లు సోకడానికి వీలు లేని సురక్షిత వాతావరణంలో చికిత్స చేయాలి. సాధారణంగా ఇన్ని సౌలభ్యాలు సాధారణ హాస్పిటల్‌లో ఉండవు. అలా ఉండే హాస్పిటల్‌ను ఎంచుకోవడం అవసరం.
రెండురోజుల్లో దగ్గు, జలుబు తగ్గకపోతే స్వైన్ ఫ్లూగా అనుమానించాలి. ఆర్‌టిపిసిఆర్ అనే పరీక్షలో గొంతు పై భాగం లేదా ముక్కు వెనుక భాగంలోని తెమడను సేకరించి స్వైన్ ఫ్లూను కచ్చితంగా నిర్ధారించుకోవచ్చు. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే వాళ్లకు స్వైన్ ఫ్లూ ఉన్నట్టు. చికిత్సలో భాగంగా మందులు వాడితే స్వైన్ ఫ్లూ తగ్గిపోతుంది. మందులతో తగ్గకుండా మరింత ఇబ్బందులను కలిగిస్తుంటే ఆలస్యం చేయకుండా అత్యాధునిక వసతులున్న హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి. అలాంటిచోటే ప్రాణాలు కాపాడే ఎక్మో (ఎక్స్‌ట్రా కార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సిజన్ సపోర్ట్) ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంటుంది.
స్వైన్ ఫ్లూ కారణంగా ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయినప్పుడు బయటి నుంచి ఆక్సిజన్ అందిస్తారు. ఆక్సిజన్ పెట్టినా కొందరు రోగుల పరిస్థితి మెరుగుపడదు. అప్పుడు ఊపిరితిత్తులకు పూర్తిగా విశ్రాంతినిచ్చి, వాటిలోకి చేరుకోవాల్సిన రక్తాన్ని బయట యంత్రంలోకి రప్పించి ఆక్సిజన్‌ను కలిపి తిరిగి గుండెకు పంపించే ప్రక్రియ చేపట్టాలి. ఈ సదుపాయంతో ఊపిరితిత్తులు చేయాల్సిన పని యంత్రం చేస్తుంది. కాబట్టి ప్రాణాపాయం తప్పుతుంది. ఇదే ఎక్మో ట్రీట్‌మెంట్.
About Author –
Dr. Mallu Gangadhar Reddy, Consultant Pulmonologist, Yashoda Hospitals – Hyderabad
MD, DNB (Pulmonology), FCCP (USA)