Select Page

ప్లేట్‌లెట్స్ సమస్య ఎందుకు వస్తుంది ? ఎలా నిర్ధారించవచ్చు మరియు చికిత్స విధానాలు

తెల్ల రక్తకణాలు వ్యాధి నిరోధకాలుగా పనిచేస్తూ శరీరం రోగాలమయం కాకుండా కాపాడుతుంటాయి. ఎర్ర రక్తకణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ద్వారా శరీరం మొత్తానికి అవసరమైన ఆక్సీజన్ అందిస్తుంది. ఇక మిగిలినవి ప్లేట్ లెట్స్. శరీరానికి గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి తోడ్పడుతాయి. ఇవి అందరిలోనూ ఒకే విధంగా ఉండవు. సాధారణంగా ఒక వ్యక్తిలో 1.5 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్‌లెట్స్ ఉంటాయి. ప్లేట్‌లెట్స్ కణం 7-10 రోజుల వరకు బతికి ఉంటుంది. ఎముక మజ్జలో ఏర్పడిన కొత్త ప్లేట్‌లెట్స్ మళ్లీ రక్తంలో చేరుతాయి. రక్తాన్ని గడ్డ కట్టించి ప్రాణరక్షణ కలిగించే కీలకమైన కణాలు ప్లేట్‌లెట్స్.

ఎందుకు తగ్గుతాయి?

శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. కొందరికి పుట్టుకతో జన్యు సమస్యల వల్ల ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. మరికొందరికి కొన్ని రకాల మందులు పడకపోవడం వల్ల తగ్గుతాయి. ప్రస్తుత జనరేషన్‌లో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు రక్తం పలుచబడటానికి ఉపయోగించే మందుల వల్ల ప్లేట్‌లెట్స్ సంఖ్య, నాణ్యత తగ్గిపోతున్నాయి. శరీరంలో ప్లేట్‌లెట్స్ మరీ తక్కువగా ఉన్నపుడు ఏ గాయం లేకపోయినా రక్తస్రావం అవుతుంది. ప్లేట్ లెట్స్ సక్రమంగా తమ విధిని నిర్వహించలేకపోతే రక్తస్రావం ఆగదు. దానికి ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోవడం గానీ ప్లేట్‌లెట్ల నాణ్యత తగ్గిపోవడంగానీ కారణం కావచ్చు. ప్లేట్ లెట్లు సాధారణంగానే ఉన్నా అవి నాణ్యంగా లేకపోతే రక్తస్రావం ఆగదు.

Consult Our Experts Now

ఎలా గుర్తించాలి?

సాధారణంగా ప్లేట్‌లెట్ల సంఖ్య పది వేలకు తగ్గే వరకు ఏ లక్షణాలు కనిపించవు. ఒకవేళ అంతకన్నా తక్కువగా పడిపోతే మాత్రం శరీరంలోని వివిధ అవయవాల్లోని లోపలి పొరల్లోంచి రక్తస్రావం మొదలవుతుంది. నోటి లోపలి పొర, చిగుళ్లు, ముక్కు లోపలి పొరల్లోంచి రక్తస్రావం ఏర్పడుతుంది. ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిన ప్రతి ఒక్కరిలోనూ అనారోగ్య లక్షణాలు కనిపించాలని లేదు. కొందరిలో ఏ లక్షణాలూ కనిపించవు. ముఖ్యంగా డెంగ్యూ వస్తే తీవ్ర జ్వరం వస్తుంది. తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు ఉంటే కూడా ప్లేట్‌లెట్స్ తగ్గినట్లు గుర్తించాలి.

ఎవరికి ఎక్కించాలి?

శరీరంలో ప్లేట్‌లెట్స్ ఏమాత్రం తగ్గినా వెంటనే ప్లేట్ లెట్స్ ఎక్కించాలనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అది సరికాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్లేట్‌లెట్లు పది వేలకు తగ్గితేగానీ ఎక్కించకూడదు. ఒకవేళ పది వేల కన్నా ఎక్కువగా ఉండి రక్తస్రావం అవుతుంటే మాత్రం ప్లేట్‌లెట్స్ ఎక్కించవలసి ఉంటుంది. శరీరానికి సహజంగానే తగ్గిపోయిన ప్లేట్ లెట్స్ కణాలను తిరిగి ఉత్పత్తి చేసుకునే శక్తి ఉంటుంది. అందుకే అత్యవసర సమయాల్లో మాత్రమే ప్లేట్‌లెట్స్ ఎక్కించాలి.

Consult Our Experts Now

నిర్ధారణ తప్పనిసరి

శరీరంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య ఎందుకు తగ్గుతుంది అనే అంశంపై సరైన వ్యాధి నిర్దారణ జరిగితే చికిత్స సులువవుతుంది. డెంగ్యూ కారణంగా కొందరిలో ప్లేట్‌లెట్స్ సంఖ్య చాలా వేగంగా పడిపోతు ఉంటుంది.. వీరికి డెంగ్యు చికిత్సతో పాటు అవసరాన్ని బట్టి ప్లేట్ లెట్స్ ఎక్కించవలసి ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ప్లేట్ లేట్ల సంఖ్య పడిపోతే వారం పదిరోజుల్లో నియంత్రణలోకి వస్తాయి. మలేరియా కారణంగా ప్లేట్‌లెట్స్ పడిపోతే అదేచికిత్స అందించాలి. ఏవైనా మందుల కారణంగా ప్లేట్‌లెట్స్ పడిపోతూ ఉంటే డాక్టర్ పర్యవేక్షణలో వాటిని మానేయాలి.

చికిత్సా విధానాలు

గతంలో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గితే ఎక్కువగా చనిపోయే ప్రమాదం ఉండేది. కానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అత్యాధునిక విధానాలతో చికిత్స అందిస్తూ ప్రాణాపాయం నుంచి రక్షించగలుగుతున్నారు. రక్తంలో ప్లేట్ లెట్స్ తగ్గితే దాత నుంచి లేదా సేకరించిన రక్తం నుంచి కేవలం ప్లేట్‌లెట్స్‌ను మాత్రమే వేరుచేసి ఎక్కించే అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. సింగిల్ డోనార్ ప్లేట్‌లెట్స్ (ఎస్‌డిపి), రాండమ్ డోనార్ ప్లేట్‌లెట్స్ (ఆర్‌డిపి) పద్ధతులలో రక్తం నుంచి ప్లేట్‌లెట్స్ ను వేరుచేసి అవసరమైన వారికి ఎక్కిస్తున్నారు. ఎస్‌డిపి విధానంలో దాత నుంచి నేరుగా ప్లేట్‌లెట్స్‌ను సేకరిస్తారు. ఆర్‌డిపి విధానంలో సేకరించిన రక్తం నుంచి ప్లేట్ లెట్స్‌ను వేరుచేస్తారు. అయితే ఎస్‌డిపి విధానంలో ఒకసారి 50-60 వేల వరకు ప్లేట్‌లెట్స్ ను సేకరించే అవకాశం ఉంటుంది.

Consult Our Experts Now

About Author –

Dr. Amit Kumar Sarda, Consultant Physician, Yashoda Hospitals – Hyderabad
MD (General Medicine)

About Author

Yashoda Doctors

Dr. Amit Kumar Sarda

MBBS, MD (General Medicine)

Consultant General Physician & Diabetologist