మలబద్ధకం..వదిలించుకోండి!

మలబద్ధకం..వదిలించుకోండి!

శుభ్రంగా పెట్టుకుంటేనే ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. బద్ధకించి ఒక్కరోజు ఊడ్వకపోయినా చిందరవందరే. మున్సిపాలిటీ డంప్‌యార్డే! శరీరమూ అంతే. మనలోపలి చెత్తను ఎప్పటికప్పుడు బయటికి పంపేయాలి. బద్ధకిస్తే .. దేహం డస్ట్‌బిన్‌లా తయారవుతుంది. దురదృష్టవశాత్తు, చాలామందిలో విసర్జక వ్యవస్థ బద్ధకిస్తోంది. దాంతో పొట్టలు చెత్తబుట్టలైపోతున్నాయి. ఒంట్లోని బద్ధకాన్ని వదిలించుకోవడానికి, ఆహారపు అలవాట్లను మార్చుకోవడమే ఉత్తమ మార్గం.

మన ఆహార అలవాట్లను బట్టే జీర్ణప్రక్రియ, విసర్జన వ్యవస్థల పనితీరు ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోతే మలబద్ధకం రూపంలో అవస్థ తప్పదు. తినడానికి కూడా సమయం దొరకనంత వేగంగా మనం పరుగులు తీస్తున్నాం. శరీరానికి నష్టం కలిగించే పిచ్చి తిండ్లన్నీ తింటున్నాం. జీర్ణ వ్యవస్థను సజావుగా నడిపించే పీచుపదార్థాలను, పోషకాలను తగినంతగా తీసుకోవడం లేదు. దాంతో కడుపుబ్బరం, గ్యాస్‌ సమస్య, మలబద్ధకం లాంటివి జీవితంలో భాగమైపోతున్నాయి.

మలబద్ధకానికి కారణాలు

  • సాధారణంగా మలబద్ధకానికి మన జీవనశైలి, అలవాట్లే కారణం. చాలామంది పిజ్జాబర్గర్లకు అలవాటు పడుతున్నారు. పాశ్చాత్య ఆహారంలో ఫైబర్‌ తక్కువ. పనిలో పడిపోయి తాగాల్సినన్ని నీళ్లు కూడా తాగడంలేదు. కూర్చున్న చోటునుంచి కదలడం లేదు.  శారీరక శ్రమ అస్సలు ఉండటం లేదు.  
  • సరైన టాయిలెట్‌ సదుపాయం లేకపోవడం వల్లనో, పని ఒత్తిడి వల్లనో విసర్జన కార్యక్రమాన్ని వాయిదా వేస్తుంటారు కొందరు. అది పేగులకూ అలవాటై మలబద్ధకంగా మారుతుంది. 
  • ఆధునిక జీవనశైలి వల్ల ఇరిటబుల్‌ బొవెల్‌ సిండ్రోమ్‌ (ఐబిఎస్‌) అనే సమస్య రావొచ్చు. నాడీ సంబంధ వ్యవస్థ సరిగా లేకపోవడం, ఇంటెస్టినల్‌ హైపర్‌సెన్సిటివిటీ వల్ల విరేచనాలు లేదా మలబద్ధక సమస్య రావడమే ఐబిఎస్‌. 
  • జీర్ణవ్యవస్థలో ఉండే హార్మోన్లలో సమతౌల్యం దెబ్బతినడం వల్ల కూడా మలబద్ధకం రావచ్చు. 
  • కొందరిలో థైరాయిడ్‌ లాంటి సమస్యలు కూడా విసర్జక వ్యవస్థ మీద ప్రభావం చూపవచ్చు. 
  • మలవిసర్జన సాఫీగా జరగాలంటే పేగులు, మలద్వార కండరాల మధ్య సమన్వయం ఉండాలి. విసర్జన సమయంలో ఈ కండరాలతో పాటు మలద్వారం దగ్గర ఉండే స్పింక్టర్‌ వ్యాకోచించాలి. కాని పెల్విక్‌ ఫ్లోర్‌ డిజార్డర్ల వల్ల ఇవి రిలాక్స్‌ కావు. దాంతో మలబద్ధకం వస్తుంది. ఇలాంటప్పుడు పెల్విక్‌ వ్యాయామాలు చికిత్సగా ఉపయోగపడతాయి. 
  • పుండు, ఫిషర్స్‌లాంటివి ఏర్పడినప్పుడు మలద్వారం దగ్గర వాచిపోతుంది. దాంతో స్పింక్టర్‌ గట్టిగా పట్టేస్తుంది. ఫలితంగా మలం ఆగిపోతుంది. ఫిషర్స్‌, పైల్స్‌, ఫిస్టులా నొప్పి కారణంగా విసర్జన సాఫీగా జరుగదు. 
  • బినైన్‌ ట్యూమర్లు లేదా పెద్దపేగు, మలద్వార క్యాన్సర్లు  ఉన్నప్పుడు కూడా మలబద్ధకం వస్తుంది.

డాక్టర్‌ని ఎప్పుడు కలవాలి?

మలబద్ధకం అంటే వారానికి రెండు మూడుసార్లు పోవడం మాత్రమే కాదు.. మలం ఏ రకంగా ఏర్పడుతుందనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మలం చాలా గట్టిగా వస్తే కూడా మలబద్ధకం ఉన్నట్టే. జీవనశైలిలో మార్పులు చేసుకుని ఫైబర్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకుంటున్నా సమస్య  తగ్గకపోతే డాక్టర్‌ని సంప్రదించాలి. అయితే మలబద్ధకం చాలా రోజులుగా ఉందా, అకస్మాత్తుగా  వచ్చిందా అన్నది చాలా ముఖ్యమైన విషయం. అకస్మాత్తుగా వచ్చే  మలబద్ధకాన్ని తీవ్ర సమస్యగా భావించాలి. ముఖ్యంగా 40 ఏళ్లు దాటినవాళ్లు.. రెండుమూడు వారాలుగా మలబద్ధకం ఉంటే వెంటనే డాక్టర్‌ని కలవాలి. అంతేగాక మలంలో రక్తం పడుతున్నా అశ్రద్ధ చేయకూడదు. ఇలాంటి లక్షణాల వెనుక తీవ్రమైన సమస్య ఉండొచ్చు. పేగు మూసుకుపోయి మలవిసర్జనకు అంతరాయం కలుగుతుండవచ్చు. కణితులూ ఏర్పడి ఉండవచ్చు. ఇవి పెద్దపేగు, మలద్వార క్యాన్సర్లు అయినా కావొచ్చు.

Consult Our Experts Now

అశ్రద్ధ చేస్తే…

మలబద్ధకం వల్ల మలద్వారంపై ఒత్తిడి పడుతుంది. బాగా ఒత్తిడి  పెట్టడం వల్ల గట్టిపడిన మలపదార్థం మలద్వారాన్ని కోసేస్తుంది. దానివల్ల ఫిషర్స్‌ ఏర్పడతాయి. వీటివల్ల నొప్పి, రక్తస్రావం ఉండొచ్చు. ఇకపోతే మలద్వారంపై ఒత్తిడి కలుగజేయడం వల్ల అక్కడ ఉండే యానల్‌ కుషన్స్‌ కిందికి జారిపోతాయి. వాటితో పాటు రక్తనాళాలు కూడా కిందికి దిగి పైల్స్‌ ఏర్పడుతాయి. వాటివల్ల రక్తస్రావం కావొచ్చు. ఒకవేళ క్యాన్సర్‌ వల్ల మలబద్ధకం ఉన్నట్టయితే, అది మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంది. 

పిల్లల్లో కూడా..

సరైన శిక్షణ లేకపోతే పిల్లలు ఆటలో పడి విసర్జన వాయిదా వేస్తారు. దానివల్ల హ్యాబిచ్యువల్‌ కాన్‌స్టిపేషన్‌ వస్తుంది. ఇది పిల్లల్లో సర్వసాధారణం. అందుకే బాల్యంలోనే ఫలానా టైమ్‌కి బాత్రూమ్‌కి వెళ్లాలని అలవాటు చేయాలి. రెండోది పెద్దపేగులో నరాల సమస్య. పుట్టుకతో వచ్చే నర్వ్‌ డీజనరేషన్‌ సమస్య వల్ల పేగులో కొంత భాగానికి నరాల ప్రసారం ఉండదు. వీళ్లకు సర్జరీ ద్వారా సరిచేయవచ్చు. ఇవేకాకుండా పెద్దవాళ్లలో కనిపించే హార్మోన్ల సమస్యలు, ఐబిఎస్‌ లాంటివి కూడా పిల్లల్లో మలబద్ధకానికి కారణం.

Consult Our Experts Now

1000 సార్లు

మన శరీరంలో గుండె నిరంతరం రక్తాన్ని పంప్‌  చేస్తూ ఉంటుంది. అన్ని శరీర భాగాల నుంచి ఆక్సిజన్‌ లేని చెడురక్తం గుండెకు, అక్కడి నుంచి ఊపిరితిత్తులకు చేరుతుంది. ఊపిరితిత్తుల్లో కార్బన్‌డయాక్సైడ్‌ని వదిలేసి ఆక్సిజన్‌ను తీసుకున్న రక్తం తిరిగి గుండెకు చేరుతుంది. గుండె ఈ మంచి రక్తాన్ని అన్ని శరీర భాగాలకు పంప్‌ చేస్తుంది. ఇలా గుండె – శరీర భాగాలు – ఊపిరితిత్తుల మధ్య రక్తం రోజుకు వెయ్యిసార్లు ప్రయాణిస్తుంది.

గర్భిణులు:

గర్భంతో ఉన్నప్పుడు కడుపుబ్బరం, గ్యాస్‌, మలబద్ధక సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. గర్భిణులలో ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. దీని ప్రభావం వల్ల పేగుల కదలికల్లో మార్పులు వస్తాయి. గర్భిణుల్లో మలబద్ధ్దకానికి హార్మోన్‌ మార్పులే ప్రధాన కారణం. కడుపులో బిడ్డ ప్రెషర్‌ వల్ల కూడా మలవిసర్జన సాఫీగా జరుగదు. 

జీవనశైలే ప్రథమ చికిత్స:

మల బద్ధకానికి ఇతర వ్యాధులేవైనా కారణం అయినట్టయితే.. వాటికి చికిత్స చేస్తే ఈ సమస్య కూడా తగ్గిపోతుంది. అలా కాకుండా సాధారణ మలబద్ధకమే అయితే జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటప్పుడు ఆహారంలో తాజా కూరగాయలు, ఆకుకూరలు, గింజల లాంటివి తీసుకోమని చెప్తాం. పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లు తినాలి. రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. అయినా తగ్గకపోతే మందులు ఇస్తారు.

Consult Our Experts Now

నిర్ధారణ ముఖ్యం:

సాధారణ జీవనశైలి సమస్యలే మలబద్ధకానికి కారణమని భావించి చికిత్స అందిస్తే, కొన్నిసార్లు సమస్య జటిలం కావొచ్చు. పైల్స్‌ లాంటి కారణాలైతే పరవాలేదు. కానీ ఏ క్యాన్సర్‌ వల్లనో మలబద్ధకం వచ్చి ఉంటే, సరైన చికిత్స అందేలోగా వ్యాధి ముదిరిపోవచ్చు. అందువల్ల రక్తస్రావం పైల్స్‌ వల్ల వస్తుందా, క్యాన్సర్‌ వల్ల వస్తుందా అనేది నిర్ధారణ చేసుకోవాలి. ఇందుకోసం క్లినికల్‌ హిస్టరీ తెలుసుకోవడంతో పాటుగా కొలనోస్కోపీ, సిగ్మాయిడోస్కోపీ అనే టెస్టులు అవసరం అవుతాయి. లక్షణాన్ని బట్టి ఏ టెస్టు చేయాలన్నది నిర్ణయిస్తారు. హార్మోన్ల సమస్యల వల్ల వచ్చిన మలబద్ధకమా అన్నది తెలుసుకోవడానికి రక్తపరీక్ష చేస్తారు. పెల్విక్‌ ఫ్లోర్‌ డిజార్డర్లను, యానల్‌ నర్వ్‌ స్పింక్టర్స్‌ బాగా పనిచేస్తున్నాయా లేదా తెలుసుకోవడానికి.. యానల్‌ మానోమెట్రీ అని చేస్తారు. పిల్లల్లో అయితే బేరియం ఎనీమా టెస్టు చేస్తారు. 

Consult Our Experts Now

సొంతవైద్యం వద్దు:

చాలామంది మలబద్ధకం ఉన్నప్పుడు ఆహారంలో మార్పులు చేసుకోకుండా లాక్జేటివ్‌ (మలవిసర్జన ప్రేరకాలు) మందులను మెడికల్‌ షాపులో తెచ్చుకుని వాడుతుంటారు. ఇది అస్సలు మంచిది కాదు. కొన్ని రకాల మందులు అలటుగా మారతాయి. అంటే ఆ టాబ్లెట్‌ వేసుకుంటే తప్ప వాళ్లకు మలవిసర్జన జరుగదు. కొన్నింటిని వాడుతుంటే రాను రాను వాటి మోతాదు పెంచితే తప్ప పనిచేయవు. చివరికి ఏ మందూ పనిచేయని స్థితి రావొచ్చు. ఏ మందులు ఎలాంటివో మనకు తెలియదు. అందుకే, మలబద్ధకం విషయంలో ఆహారపు అలవాట్లు మార్చుకోవడమే ఉత్తమం. సొంతంగా మందులు వాడకూడదు.

Read more about Constipation symptoms, causes and treatment

If you find any of the above mentioned symptoms of Constipation then
Book an Appointment with the best gastroenterologist in hyderabad

About Author –

Dr. TLVD. Prasad Babu, Consultant Surgical Gastroenterologist, Yashoda Hospitals – Hyderabad
M.S, M.Ch. (Cardio – Thoracic & Vascular Surgery) FIACS

About Author

Dr. TLVD. Prasad Babu | yashoda hospitals

Dr. TLVD. Prasad Babu

MS, MCh (GI Surgery)

Senior Consultant Surgical Gastroenterologist, Hepato Pancreatic Biliary, Colorectal, Bariatric & Advanced Laparoscopic Surgeon, HOD-Department of Surgical Gastroenterology