కొలనోస్కోపీ ఎందుకు & ఎవరికి చేస్తారు? చికిత్స విధానాలు మరియు ప్రయోజనాలు

కొలనోస్కోపీ ఎందుకు & ఎవరికి చేస్తారు? చికిత్స విధానాలు మరియు ప్రయోజనాలు

పెద్ద ప్రేగు అనేది జీర్ణవ్యవస్థలో ఒక ప్రధాన భాగం. ఇది శరీరంలో చాలా ముఖ్యమైన విధులు నిర్వహిస్తుంది. ఇది ఆహారంలోని నీటిని, పొటాషియమ్ వంటి లవణాలను, కొవ్వులో కరిగే విటమిన్లను గ్రహించి శరీరానికి అందించడమే కాక శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపటంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. పెద్ద ప్రేగును వైద్యపరిభాషలో కోలాన్ అని అంటారు. సాధారణ నీళ్ల విరోచనాలు మొదలుకొని ప్రమాదకర క్యాన్సర్ల వరకు ఎన్నో సమస్యలు పెద్ద పేగులో కనిపిస్తాయి. 

పెద్దప్రేగు మరియు పురీషనాళం లోపలి భాగాన్ని మరియు జీర్ణవ్యవస్థలోని ప్రధాన భాగాలను  పరిశీలించడానికి ఉపయోగించే వైద్య ప్రక్రియనే కొలనోస్కోపీ అంటారు. కొలనోస్కోపీ జరిపే సమయంలో పెద్దప్రేగు లోపలి భాగాలను చూడడానికి ఫ్లెక్సిబుల్ ట్యూబ్‌ చివరి అంచున లైట్ & కెమెరాతో కూడిన పొడవైన ట్యూబ్‌ని పాయువు నుంచి పురీషనాళం ద్వారా పెద్దప్రేగులోకి పంపిస్తారు. దీని ద్వారా పెద్దప్రేగు లోపలి భాగాలను చూసిన తరువాత ట్యూబ్‌కి ఉన్న కెమెరా తన ఫీడ్‌ను మానిటర్‌కు పంపుతుంది. ప్రధానంగా కోలనోస్కోపీ పక్రియను కొలొరెక్టల్ క్యాన్సర్, పాలిప్స్ (గడ్డలు) మరియు ఇతర జీర్ణశయాంతర సమస్యల వంటి స్క్రీనింగ్ మరియు రోగనిర్ధారణ పరిస్థితులను తెలుసుకోవడం కోసం ఉపయోగిస్తారు.

కొలనోస్కోపీ మరియు ఎండోస్కోపీ మధ్యగల తేడా

కొలనోస్కోపీ అనేది ప్రధానంగా పెద్దప్రేగు మరియు పురీషనాళానికి సంబంధించిన రోగనిర్ధారణ మరియు స్క్రీనింగ్ కోసం ఉపయోగించే ఒక ప్రక్రియ.

కొలనోస్కోపీ లాగానే ఎండోస్కోపీ పరీక్షలో కూడా కడుపులోని వివిధ సమస్యలను తెలుసుకోవడం కోసం ఉపయోగిస్తారు. ఎండోస్కోపీలో ఒక చిన్న మైక్రో కెమెరా కలిగిన ట్యూబ్‌ను కడుపు లోపలికి పంపించి అంతర్గత అవయవాల (అన్నవాహిక, జీర్ణకోశం, పెద్ద, చిన్న పేగులు, పైత్యరసవాహిక) పనితీరును తెలుసుకోవడం జరుగుతుంది. తద్వారా ఆ ట్యూబ్ కి ఉన్న కెమెరా కడుపులోపలి చిత్రాలను తీసి కంప్యూటర్‌కు పంపిస్తుంది. ఈ చిత్రాల ఆధారంగా పాడైపోయిన శరీర అవయవ భాగాలకు చికిత్స చేస్తారు.

పెద్ద ప్రేగు క్యాన్సర్ కు గల కారణాలు

  • వయస్సు పై బడడం
  • సమయానికి తినకపోవడం
  • బాగా బరువు పెరగడం లేదా స్థూలకాయంగా ఉండటం
  • ధుమపానం మరియు అతిగా మద్యం తీసుకోవడం 
  • నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తినడం
  • పెయిన్‌ కిల్లర్స్‌ను పదే పదే వాడడం
  • వంశపార్యంపరంగా పలు రకాల క్యాన్సర్లు రావడం
  • రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్ ఎక్కువగా తినడం వల్ల కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది

కొలనోస్కోపీ ఎవరికి అవసరం

Colonoscopytelugu1

కొలనోస్కోపీలను వివిధ కారణాల వల్ల నిర్వహిస్తారు. వాటిలో ప్రధమంగా:

  • 2 వారాలకు మించి నిరంతరంగా తీవ్రమైన పొత్తికడుపు (బొడ్డు) నొప్పిని కలిగి ఉండడం
  • ఎక్కువగా తేన్పులు మరియు వాంతులవ్వడం
  • తీవ్రమైన మలబద్దక సమస్యతో బాధపడడం
  • మూత్రం మరియు మోషన్ లో రక్తం కనిపించడం
  • గుండెలో మంటగా అనిపించడం
  • గ్యాస్ ఎక్కువగా పోతూ ఉండటం
  • 100 F (37.8 C) లేదా అంతకంటే ఎక్కువ జ్వరం ఉండడం
  • 2 వారాలకు మించి విరేచనాలు లేదా రక్తవిరేచనాలు అవ్వడం
  • మనిషిలో రక్తం లేకుండా పాలిపోయినట్లు ఉండడం
  • మల విసర్జన తర్వాత కూడా కడుపు ఖాళీ అయినట్లు అనిపించకపోవడం
  • ఒక్కొక్క సారి బినైన్‌ లేదా మాలిగ్నెంట్‌ (క్యాన్సర్) ట్యూమర్స్‌ నిర్థారణ కొరకు కూడా కొలనోస్కోపీ చేయాల్సి ఉంటుంది.
  • వంశపార్య పరంగా ఏ రకమైన క్యాన్సర్ ఉన్నా కూడా కొలనోస్కోపీ చేయాల్సి ఉంటుంది.

కొలనోస్కోపీ యొక్క ప్రయోజనాలు

కొలనోస్కోపీ అనేది ప్రధానంగా పెద్దప్రేగు మరియు పురీషనాళానికి సంబంధించిన రోగనిర్ధారణ మరియు స్క్రీనింగ్ కోసం ఉపయోగించే ఒక ప్రక్రియ. దీని యొక్క ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.

కొలొరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్: మొదటగా కొలొరెక్టల్ క్యాన్సర్ ను గుర్తించడానికి కొలనోస్కోపీని ఉపయోగిస్తారు. జీర్ణశయాంతరంలో ఏమైనా సమస్యలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి కొలనోస్కోపీ చేయించుకున్నట్లు అయితే అన్ని రకాల జీర్ణశయ వ్యాధులను ముందే గుర్తించి నయం చేసుకోవడానికి వీలవుతుంది.

పాలిప్స్ ను గుర్తించడం మరియు తొలగించడం: కొలనోస్కోపీ పక్రియ తో పెద్దప్రేగు లోపలి పొరపై పెరుగుతున్న పాలిప్స్‌ని గుర్తించి వాటిని ముందుగానే తొలగించడం ద్వారా కొలొరెక్టల్ క్యాన్సర్ సమస్యను నివారించడంలో సహాయపడుతుంది.

రక్తహీనత: రక్తహీనత యొక్క కారణాన్ని కనుగొనడానికి కూడా కొలనోస్కోపీని నిర్వహిస్తారు. ముఖ్యంగా జీర్ణశయాంతర ప్రేగులలో రక్తస్రావం ఉన్నట్లు అనుమానం ఉన్నట్లయితే కొలనోస్కోపీ పక్రియను చేస్తారు.

బరువు తగ్గడం: ఒక వ్యక్తి కారణం లేకుండా అకస్మాతుగా బరువు తగ్గినప్పుడు మరియు బరువు తగ్గడానికి దోహదపడే ఏదైనా అంతర్లీన జీర్ణశయాంతర సమస్యలను గుర్తించడానికి కూడా కొలనోస్కోపీని చేస్తారు.

జీర్ణశయాంతర లక్షణాల యొక్క కారణాలను కనుగొనడం: పొత్తికడుపు నొప్పి, ప్రేగు అలవాట్లలో మార్పులు, అతిసారం, మల విసర్జన సమయంలో ఇబ్బంది, మలంలో రక్తం పడడం, పెద్దప్రేగు మరియు పురీషనాళంలో కణితులు, స్ట్రిక్చర్‌లు లేదా ఇన్‌ఫెక్షన్‌లు వంటి అనేక జీర్ణశయాంతర లక్షణాల యొక్క కారణాలను కనుగొనడానికి సైతం కొలనోస్కోపీని ఉపయోగిస్తారు.

ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి (IBD) నిర్ధారణ: క్రోన్స్ వ్యాధి మరియు పెద్దప్రేగు శోథ (Ulcerative Colitis) వంటి పరిస్థితులను నిర్ధారించడానికి కూడా ఈ పక్రియను ఉపయోగిస్తారు.

వర్చువల్ కోలనోస్కోపీ: వర్చువల్ కొలనోస్కోపీని CT కొలోనోగ్రఫీ అని కూడా పిలుస్తారు, ఇది పెద్దప్రేగు యొక్క వివరణాత్మక చిత్రాలను రూపొందించడానికి ఉపయోగించే ఒక రకమైన కొలనోస్కోపీ. సాంప్రదాయ కొలనోస్కోపీకి ప్రత్యామ్నాయంగా కొన్ని సందర్భాల్లో దీనిని ఉపయోగించడం జరుగుతుంది.

కొలనోస్కోపీ ప్రక్రియ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కొలనోస్కోపీ ప్రక్రియ తర్వాత తప్పనిసరిగా జీవన విధానంలో ఈ క్రింది మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

సమతుల్య జీవనశైలి: కొలనోస్కోపీ తరువాత ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి ఒత్తిడికి గురి కాకుండా ఉండడం, తగినంతగా నిద్ర పోవడం, ఆల్కహాల్ మరియు పొగాకు వినియోగాన్ని నివారించడం వంటి నియమాలు పాటించడం ద్వారా జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.

తినే ఆహారం పై అవగాహన: సమతుల్య, ఫైబర్ అధికంగా మరియు తక్కువ కొవ్వు పదార్ధాలు ఉండే ఆహారాలు (పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు) తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం మరియు ఇతర జీర్ణశయాంతర సమస్యలను నివారించవచ్చు.

హైడ్రేషన్: ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు తగినంత నీరు అవసరం. ఇది నిర్జలీకరణాన్ని నివారించడమే కాక జీర్ణాశయం సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. 

క్రమం తప్పకుండా వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లేదా వారంలో కనీసం 5 రోజులు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడి పలు రకాల ఉదర సంబంధ వ్యాధులు దరిచేరవు.

స్క్రీనింగ్‌లు మరియు ఫాలో-అప్‌లు: మీ కొలనోస్కోపీ ఫలితాలపై ఆధారపడి డాక్టర్ రెగ్యులర్ స్క్రీనింగ్‌లు లేదా ఫాలో-అప్ అపాయింట్‌మెంట్‌లను సిఫార్సు చేయవచ్చు.

లక్షణాలపై అవగాహన: మీ జీర్ణక్రియ అలవాట్లలో ఏవైనా మార్పులు లేదా ఏవైనా అసాధారణ లక్షణాలపై శ్రద్ధ వహించడం అవసరం. మీరు ప్రేగు అలవాట్లలో మార్పులు, పొత్తికడుపు అసౌకర్యం లేదా మల రక్తస్రావం వంటి నిరంతర సమస్యలను గనుక గమనిస్తే తప్పక డాక్టర్ ను  సంప్రదించండి.

మందులు మరియు సప్లిమెంట్స్: కొన్ని రకాల మందులు జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి, కావున డాక్టర్ సూచించిన మందులను మాత్రమే వాడాలి.

బరువు నిర్వహణ: తగినంత శరీర బరువును కలిగి ఉండడం జీర్ణశయానికి మంచిది కావున ఎల్లప్పుడు శరీర బరువు నియంత్రణ కోసం సమతుల్య ఆహారం మరియు సాధారణ వ్యాయామలు చేయడం మంచిది.

మీ జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే మాత్రం తప్పకుండా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ని సంప్రదించి స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది.

About Author –

About Author

Dr. Vamsidhar Reddy. V | yashoda hospitals

Dr. Vamsidhar Reddy. V

MD (General Medicine), DM (Gastroenterology)

Consultant Gastroenterologist