బ్రెయిన్‌ ట్యూమర్‌: కారణాలు, లక్షణాలు మరియు అపోహాలు & వాస్తవాలు

బ్రెయిన్‌ ట్యూమర్‌: కారణాలు, లక్షణాలు మరియు అపోహాలు & వాస్తవాలు

ఇటీవలి కాలంలో జీవన శైలిలో వచ్చిన అనేక మార్పుల కారణంగా చాలా మందిలో ఈ బ్రెయిన్ ట్యూమర్ (మెదడు కణితి) సమస్యలు వస్తున్నాయి. మెదడు మరియు దాని సమీపంలో (మెదడు, నరాలు, పిట్యూటరీ గ్రంథి, పీనియల్ గ్రంథి) కణాల అసాధారణ పెరుగుదలనే బ్రెయిన్ ట్యూమర్ అంటారు. బ్రెయిన్ ట్యూమర్ అనేది మెదడులోని ఏదైనా భాగంలో కనిపించవచ్చు మరియు ఇది ఏ వయస్సులోనైనా, ఏ వ్యక్తిలోనైనా రావొచ్చు. మెదడు లోపల ట్యూమర్ ఏర్పడితే “గ్లయోమస్” అని, మొదడు పొరల (మినింజెస్) పై ట్యూమర్ ఏర్పడితే “మెనింజియోమస్” అని అంటారు. బ్రెయిన్ ట్యూమర్లు చాలా చిన్న పరిమాణం నుంచి చాలా పెద్ద పరిమాణం వరకు ఉంటాయి. 

శరీరంలో వచ్చే అన్ని రకాల ట్యూమర్లు బ్రెయిన్‌ ట్యూమర్‌లు కావు. అయితే సాధారణంగా మెదడులో వచ్చే ట్యూమర్లను ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. ఈ ప్రాథమిక బ్రెయిన్ ట్యూమర్ లు ఎక్కువగా పిల్లలు మరియు వృద్ధులలో కనిపిస్తాయి. అయితే  కొన్నిసార్లు క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాల నుంచి మెదడుకు వ్యాపిస్తాయి వీటిని సెకండరీ (మెటాస్టాటిక్) బ్రెయిన్ ట్యూమర్లు అంటారు. సెకండరీ బ్రెయిన్ ట్యూమర్‌లు ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ కంటే సర్వసాధారణం. సాధారణంగా స్త్రీలతో పోలిస్తే పురుషుల్లోనే బ్రెయిన్ ట్యూమర్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది.

బ్రెయిన్ ట్యూమర్ కారణాలు

బ్రెయిన్‌ ట్యూమర్స్‌ ఎందుకొస్తాయనే విషయంలో కచ్చితమైన కారణాలు లేనప్పటికీ కొన్ని ప్రత్యేక కారణాలను గమనిస్తే: 

  • రేడియేషన్‌కు గురికావడం
  • పెద్ద వయస్సు (వృద్ధులు మరియు పెద్దలలో బ్రెయిన్ ట్యూమర్లు వచ్చే ఆస్కారం ఎక్కువ)
  • అధిక బరువు లేదా ఊబకాయం (శరీర బరువు కంటే ఎక్కువ బరువును కలిగి ఉన్నట్లయితే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఎక్కువ)
  • వంశ పార్యపరంగా (తల్లిదండ్రులలో ఎవరో ఒకరు గతంలో బ్రెయిన్‌ ట్యూమర్‌ బారిన పడిన పిల్లలకూ కూడా బ్రెయిన్ ట్యూమర్లు రావచ్చు)
  • రొమ్ము, ఊపిరితిత్తులు లేదా పెద్దప్రేగు క్యాన్సర్ వంటి మెదడుకు వ్యాపించే కొన్ని రకాల క్యాన్సర్ల వల్ల కూడా ట్యూమర్స్ వస్తాయి
  • బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ (ఈ రకమైన నిరోధక వ్యవస్థను కలిగి ఉండడం వల్ల కూడా ట్యూమర్స్ వచ్చే అవకశం ఉంటుంది)
  • రోడ్డు ప్రమాదాలు, పర్వతారోహణలో అదుపుతప్పి పడిపోవడం (ఈ సందర్భాలలో తలకు గాయాలు అవ్వడం వల్ల మెదడులో ట్యూమర్లు ఏర్పడే అవకాశం ఉంటుంది)

బ్రెయిన్‌ ట్యూమర్‌ లక్షణాలు

Brain Tumour1

బ్రెయిన్‌ ట్యూమర్‌ లక్షణాలు ట్యూమర్ యొక్క పరిమాణం, రకం మరియు అది వచ్చే స్ధానం బట్టి మారవచ్చు. అయితే సాధారణంగా బ్రెయిన్‌ ట్యూమర్‌ ల వల్ల కలిగే సంకేతాలు మరియు లక్షణాలు: 

  • వికారం మరియు వాంతులు కలగడం
  • వినికిడిలో ఇబ్బందులు
  • తరచుగా తలనొప్పి రావడం మరియు ఉదయాన్నే ఈ నొప్పి తీవ్రంగా ఉండడం
  • నడవడం మరియు మాట్లాడడంలో ఇబ్బందిపడడం
  • కంటి చూపు మందగించడం మరియు చూపు కోల్పోవడం
  • ఒక చేయి లేదా కాలులో కదలికలను కోల్పోవడం
  • శరీర పనితీరుపై నియంత్రణ కోల్పోవడం
  • పనిచేయకున్నా చాలా అలసటగా అనిపించడం
  • రోజువారీ విషయాల్లో గందరగోళం నెలకొనడం
  • వ్యక్తితం లేదా ప్రవర్తనలో మార్పులు రావడం
  • విపరీతమైన ఆకలి మరియు బరువు పెరుగుతున్నట్లు అనిపించడం
  • మూత్రాశయం లేదా ప్రేగు నియంత్రణలతో పాటు కొన్ని రకాల మతిమరుపు సమస్యలు సైతం బ్రెయిన్ ట్యూమర్ గల వారిలో వచ్చే అవకాశం ఉంటుంది

బ్రెయిన్ ట్యూమర్ అపోహలు మరియు వాస్తవాలు

బ్రెయిన్ ట్యూమర్‌ల గురించి చాలా మందిలో వివిధ రకాలైన అపోహలు నెలకొని ఉన్నాయి. అయితే బ్రెయిన్ ట్యూమర్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యే కానీ, వాటి చుట్టూ ఉన్న అనేక అపోహలు మరియు వాస్తవాలు అనవసరమైన భయం మరియు గందరగోళానికి గురిచేస్తోంటాయి.

అపోహ 1: మొబైల్ ఫోన్‌లు బ్రెయిన్ ట్యూమర్‌లకు కారణమవుతాయి.

వాస్తవం: మొబైల్ ఫోన్ ల వల్ల బ్రెయిన్ ట్యూమర్‌లు వస్తాయనేది అపోహ మాత్రమే. వాస్తవంగా సెల్‌ఫోన్‌ల వాడకం వల్ల బ్రెయిన్‌ ట్యూమర్‌లు వచ్చే  అవకాశమే లేదు. 

అపోహ 2: మెదడు కణితులు ఎల్లప్పుడూ ప్రమాదకరమైనవి.

వాస్తవం: కొన్ని బ్రెయిన్ ట్యూమర్లు ప్రమాదకరమైనవి, కానీ చాలా రకాల ట్యూమర్లను సర్జరీ, రేడియేషన్ థెరపీ మరియు కీమోథెరపీ (క్యాన్సర్ కణాలను నాశనం చేసే) చికిత్సతో నయం చేయవచ్చు. 

అపోహ 3: బ్రెయిన్ ట్యూమర్లు ఎల్లప్పుడూ క్యాన్సర్‌గా ఉంటాయి.

వాస్తవం: అన్ని బ్రెయిన్ ట్యూమర్లు క్యాన్సర్ కావు. క్యాన్సర్ కానీ కొన్ని బ్రెయిన్ ట్యూమర్లు  కూడా అసాధారణ పెరుగుదలను కలిగి ఉంటాయి.

అపోహ 4: మెదడు కణితులు పెద్దవారిలో మాత్రమే సంభవిస్తాయి.

వాస్తవం: బ్రెయిన్ ట్యూమర్లు పెద్దవారిలో మాత్రమే వస్తాయన్నది నిజం కాదు. వాస్తవానికి బ్రెయిన్ ట్యూమర్లు చిన్న పిల్లలతో సహా అన్ని వయసుల వారిలోనూ వచ్చే అవకాశం ఉంటుంది. 

అపోహ 5: బ్రెయిన్ ట్యూమర్లు ఎల్లప్పుడూ తలనొప్పికి కారణమవుతాయి.

వాస్తవం: తలనొప్పి బ్రెయిన్ ట్యూమర్ యొక్క లక్షణం కావచ్చు, కానీ బ్రెయిన్ ట్యూమర్ ఉన్న రోగులందరికీ తలనొప్పి ఉంటుంద‌న్న‌ది అపోహ మాత్రమే. 

బ్రెయిన్ ట్యూమర్ నివారణ చర్యలు

  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
  • ఫైబర్ అధికంగా ఉండే సమతుల్య ఆహారం మరియు ఆరోగ్యకరమైన మరియు ముదురు ఆకుపచ్చ కూరగాయలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి
  • ధూమపానం మరియు మద్యపానంను మానుకోవాలి
  • ఒత్తిడిని అదుపులో ఉంచుకుని మానసికంగా చురుకుగా ఉండాలి
  • శరీరం రేడియేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి. అతినీలలోహిత కిరణాల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. 
  • బైకు నడుపుతున్నప్పుడు, సాహస క్రీడల్లో పాల్గొంటున్నప్పుడు హెల్మెట్‌ తప్పక ధరించాలి. (దీనవల్ల గాయాలను నిలువరించవచ్చు మరియు ట్యూమర్స్ వచ్చే ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చు)

బ్రెయిన్‌లో ట్యూమర్‌ ఏర్పడినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. ట్యూమర్‌ లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించి తగు పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.   అయితే ప్రస్తుతం బ్రెయిన్‌ ట్యూమర్ల చికిత్సలో ఎన్నో అత్యాధునిక చికిత్సలు (న్యూరోలాజికల్ పరీక్ష, X-ray, MRI లేదా CT స్కాన్, బయాప్సీ, రేడియేషన్‌ థెరపీ, కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్‌ థెరపీ, మినిమల్లీ ఇన్వేసివ్‌ సర్జరీ) అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే కొన్ని రకాల బ్రెయిన్‌ ట్యూమర్లు రాకుండా మనం జాగ్రత్తపడొచ్చు.

About Author –

Dr. Srinivas Botla,Senior Consultant Neurosurgeon, Yashoda Hospitals – Hyderabad
MS, MCh (Neuro), FSFN

About Author

Dr. Srinivas Botla | yashoda hospitals

Dr. Srinivas Botla

MS, MCh (Neuro), FSFN

Senior Consultant Neurosurgeon