రక్తదానం: అర్హులు, ప్రయోజనాలు మరియు అపోహల గురించి సంక్షిప్త సమాచారం

పరిచయం

మనిషి బ్రతకడానికి ప్రాణవాయువు ఆక్సిజన్ ఎంత అవసరమో రక్తం కూడా అంతే అవసరం. రక్తం, శరీరంలోని ప్రతి కణంతో అనుక్షణం అనుసంధానమై ఉండే కీలక ద్రవం. జీవులన్నీ రక్తం మీదనే ఆధారపడి జీవిస్తాయి. శరీరంలోని అన్ని అవయవాలకు ప్రాణవాయువుతో (O2) సహా అవసరమైన పోషకాలను రవాణా చేయటంలో రక్తం ప్రధాన పాత్ర వహిస్తుంది. మన శరీరంలో 4.5 నుంచి 5.5 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. ఇది శరీర సాధారణ బరువులో 7 శాతం. దాదాపు రక్తంలో 60% ద్రవ భాగం, 40% ఘన భాగం ఉంటాయి. ప్లాస్మా 90%, నీరు 10% పోషకాలు, హార్మోన్లతో ఉంటుంది. కానీ, ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్స్‌లో ఉండే ఘన భాగం పోతే యథాతథంగా రావడానికి అంత సులువు కాదు. అప్పుడు కొరత ఏర్పడుతుంది. అలాంటి సమయంలోనే రక్తం కృత్తిమంగా ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కృత్తిమ పద్దతిలో కూడా సరైన సమయానికి రక్తం ఎక్కించుకోకపోతే ప్రాణాలు కూడా పోవచ్చు. ప్రమాదాలకు గురైన వారికి, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు, సంక్లిష్ట సర్జరీలు చేయించుకునే వాళ్లకు, రక్తహీనత సమస్య ఉన్న వాళ్లకు శరీరంలోని పాత రక్తం అంతా అయిపోయి కొత్త రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

మనిషి సాటి మనిషికి ఇచ్చే వెలకట్టలేని బహుమతి- రక్తం. దానివల్ల ప్రాణాలనే నిలబెట్టవచ్చు. ఒక్కరి ప్రాణమే కాదు, దాన్ని ఎర్రరక్తకణాలు, ప్లాస్మా తదితర భాగాలుగా విడగొట్టడం ద్వారా ఒక యూనిట్‌ రక్తంతో ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు. రక్తాన్ని మనం కృత్రిమంగా తయారుచేయలేము. ఎట్టి పరిస్థితుల్లోనూ మనుషులు స్వచ్ఛందంగా వారి శరీరం నుంచి దానం చేయవలసిందే. కానీ, ఒక వ్యక్తి తన జీవిత కాలం మొత్తం దాదాపు 168 సార్లు రక్తదానం చేయవచ్చు. సాధారణంగా, ఒక యూనిట్ రక్తాన్ని దానం చేసినప్పుడు, అది శరీరంపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు. దీనివల్ల బలహీనంగా కూడా అనిపించదు. ఒక యూనిట్ రక్తాన్ని (సుమారు 300-350 మి.లీ) ఒకేసారి ఇవ్వవచ్చు. మానవ శరీరానికి చాలా సామర్థ్యం ఉంది, ఒక యూనిట్ రక్తాన్ని దానం చేస్తే రెండు రోజుల్లో దానిని భర్తీ చేయవచ్చు.

రక్తదానం చేయడానికి ఎవరు అర్హులు?

  • రక్తాన్ని 18-65 ఏళ్ల వయసువారు ఎవరైనా, ఎప్పుడైనా దానం చేయొచ్చు
  • రక్తదానం చేయాలనుకునే వారు మంచి శరీర సామర్థ్యం కలిగి 45 కిలోల కన్నా తక్కువ బరువు ఉండరాదు
  • రక్తదానం చేయాలనుకునే వారి నాడి నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాలి
  • రక్తపోటు, గుండె సంకోచించనప్పుడు (సిస్టాలిక్‌) 100-180 మి.మీ. వరకు, గుండె వ్యాకోచించినప్పుడు (డయాస్టాలిక్‌) 50-100 మి.మీ. వరకు ఉండాలి
  • హీమోగ్లోబిన్‌ 100 మి.లీ. రక్తంలో 12.5 గ్రాములు ఉండాలి
  • మామూలుగా శరీర ఉష్ణోగ్రత 37.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కంటే ఎక్కువ ఉండకూడదు
  • మూర్ఛ, కిడ్నీ వ్యాధులు, అలర్జీ, అసాధారణ రక్తస్రావ లక్షణాలు, హృదయ సంబంధమైన వ్యాధులు, ఇతర ప్రమాదకరమైన వ్యాధులు ఇది వరకు గానీ ప్రస్తుతం గానీ లేకుండా ఉండాలి
  • టిటానస్‌ (ధనుర్వాతం) డిస్తీరియా (కంఠవాపు) గ్యాస్‌ గ్యాంగ్రీన్‌ కోసం మందులు వాడిన వారు, ఆఖరి మోతాదు (డోస్‌) మందులు వాడిన నాలుగునెలల తర్వాత రక్తదానం చేయడానికి అర్హులు
  • గడచిన ఏడాది కాలంగా పచ్చకామెర్లు వ్యాధి లేనివారు కూడా రక్తదానం చేయవచ్చు

రక్తదానానికి ఎవరు అనర్హులు?

  • ఎవరైనా పెద్ద సర్జరీ చేయించు కున్నట్లయితే 12 నెలలు, చిన్న సర్జరీ చేయించుకుంటే ఆరు నెలల వరకు రక్తం దానం చేయకూడదు
  • పచ్చబొట్టు పొడిపించుకోవటం, చెవులు కుట్టించుకోవటం వంటివి చేస్తే ఆరు నెలల వరకు రక్తదానం చేయొద్దు
  • మలేరియాతో బాధపడుతున్న వ్యక్తి తప్పనిసరిగా మూడు నెలలు రక్తం దానం చేయకూడదు
  • టైఫాయిడ్‌ నుంచి కోలుకున్నాక సంవత్సరం వరకు రక్తం దానం చేయకూడదు.
  • క్షయవ్యాధి వ్యాధి ఉన్న పేషంట్ నయం అయినట్లు నిర్ధారించబడిన తర్వాత 2 సంవత్సరాల వరకు రక్తదానానికి అనర్హులు
  • రుతుక్రమం, గర్భధారణ సమయంలో మరియు కాన్పు అయిన తర్వాత 12 నెలల పాటు మహిళలు రక్తం దానం వాయిదా వేయాలి.
  • అబార్షన్‌ జరిగితే ఆరు నెలలు వాయిదా వేయాలి. బిడ్డకు పాలిస్తున్నంత వరకు తప్పనిసరిగా రక్తదానం చేయకూడదు.
  • మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండెపోటుకు గురైనవారు, గుండెకు సర్జరీ మరియు క్యాన్సర్‌ సర్జరీ చేయించుకున్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ రక్తదానం చేయకూడదు
  • ఎయిడ్స్‌, హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సి, సిఫిలిస్‌ మరియు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి మరియు ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్స్‌ ఉన్నవారు కూడా రక్తదానం చేయకూడదు.

ఎవరు ఎవరికి రక్తం ఇవ్వొచ్చు?

రక్తాన్ని ప్రధానంగా A, B, AB, O అనే గ్రూపులుగా విభజించొచ్చు. వీటిల్లోనూ RH ఫ్యాక్టర్‌ను బట్టి పాజిటివ్‌, నెగెటివ్‌ రకాలుంటాయి. ఇలా మొత్తం మీద 8 రకాల గ్రూపులు ఉంటాయి.

  • ఏ పాజిటివ్‌ గ్రూపు రక్తం వాళ్లు ఏ పాజిటివ్‌, బీ పాజిటివ్‌ వారికి రక్తదానం చేయవచ్చు
  • ఏ నెగటివ్‌ గ్రూపు రక్తం కలిగిన వాళ్లు  ఏ పాజిటివ్‌, ఏబీ నెగటివ్‌, ఏబీ పాజిటివ్‌, ఏ నెగటివ్‌ వాళ్లకు ఇవ్వాలి
  • బీ పాజిటివ్‌ గ్రూపు రక్తం కలిగి ఉన్న వాళ్లు బీ నెగటివ్‌, ఏబీ పాజిటివ్‌ వాళ్లకు ఇవ్వవచ్చు.
  • బీ నెగటివ్‌ గ్రూపు రక్తం కలిగిన వాళ్లు బీ పాజిటివ్‌, బీ నెగటివ్‌, ఏబీ  పాజిటివ్‌, ఏబీ నెగటివ్‌ వాళ్లకు ఇవ్వాలి
  • ఓ పాజిటివ్‌ రక్తం గలవారు ఏ పాజిటివ్‌, బీ పాజిటివ్‌, ఏబీ పాజిటివ్‌ వాళ్లకు ఇవ్వాలి
  • ఓ నెగటివ్‌ రక్తం గలవారు ఏ పాజిటివ్‌, ఏ నెగటివ్‌, బీ పాజిటివ్‌, బీ నెగటివ్‌, ఏబీ పాజిటివ్‌, ఓ పాజిటివ్‌, ఓ నెగటివ్‌ వాళ్లకు ఇవ్వాలి
  • ఏబీ పాజిటివ్‌ రక్తం గల వారు ఏబీ ప్లస్‌ వారికి మాత్రమే రక్తం ఇవొచ్చు
  • ఏబీ నెగటివ్‌ రక్తం కలిగిన వాళ్లు ఏబీ పాజిటివ్‌, ఏబీ నెగటివ్‌ వాళ్లకు రక్తం ఇవాల్సి ఉంటుంది
  • ప్రస్తుతం రక్తం గ్రూప్‌ను త్వరగా తెలుసుకునే పద్ధతులు అందుబాటులోకి రావటంతో ఆయా గ్రూపు రక్తాలను ఎక్కించటానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఏబీ నెగెటివ్‌, ఓ నెగెటివ్‌, బీ నెగెటివ్‌, ఏ నెగెటివ్‌ గ్రూప్‌ రక్తం దొరకడం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా ఏబీ నెగెటివ్‌, ఓ నెగెటివ్‌ రక్తం కావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది

రక్తం దానం చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • రక్తదానానికి ముందు రోజు సరిపోయినంతగా నిద్ర పోవాలి
  • రక్తదానానికి ముందు ఆరోగ్యకరమైన భోజనం తినాలి
  • రక్తదానానికి ముందు పుష్కలంగా నీరు తాగాలి
  • రక్తం దానం చేసే ముందు పైకి చుట్టుకోగలిగే స్లీవ్‌లతో కూడిన చొక్కా ధరించడం ఉత్తమం
  • మీరు తీసుకుంటున్న లేదా ఇటీవల తీసుకున్న ఏవైనా మందులు రక్తదానం చేయకుండా మిమ్మల్ని నిరోధిస్తాయో లేదో తనిఖీ చేయించుకోవాలి  ఉదాహరణకు, మీరు ప్లేట్‌లెట్‌ దాత అయితే, మీరు దానం చేయడానికి రెండు రోజుల ముందు తప్పనిసరిగా ఆస్పిరిన్‌ తీసుకోకూడదు. రక్తదానం చేయడానికి ఏదైనా మందులు తీసుకోవడం ఆపడానికి ముందు మీ ఆరోగ్య సంరక్షణ బృందంలోని సభ్యునితో మాట్లాడాలి.

రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయెజనాలు

రక్త దానం చేయడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని, రక్తం తగ్గి నీరసంగా మారిపోతామని ఎంతో మంది భావిస్తారు. దీని వల్ల అత్యవసర సమయంలో కూడా రక్త దానం చేయకుండా వెనక్కి తగ్గుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అలాంటి వారు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు.

  • రక్తదానం చేయడానికి ముందు రక్తదాత యొక్క పల్స్, రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత, హిమోగ్లోబిన్ స్థాయిలతో సహా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేసి హెల్త్‌ ప్రొఫైల్‌ తెలుసుకుంటారు. దీంతో ఎప్పటికప్పుడు రక్తదాత ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలుసుకునే అవకాశం ఉంటుంది.
  • రక్తం దానం చేయగా జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి నాలుగు రోజుల సమయం పడుతుంది. ఆ సమయంలో దాత రక్తవ్యవస్థ పునరుద్ధరణ జరుగుతుంది
  • రక్తదానం చేయడం గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తదానం చేయడం రక్త ప్రవాహాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది
  • రక్తంలో అధిక ఇనుము పేరుకుపోతే హిమోక్రోమాటోసిస్కు అనే పరిస్థితికి దారితీస్తుంది. ఇది గుండె, కాలేయం వంటి అవయవాలకు నష్టం కలిగిస్తుంది. మనం క్రమం తప్పకుండా రక్తదానం చేసినప్పుడు, అదనపు ఇనుము తగ్గుతుంది. ఇది మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తుంది
  • రక్తదానం చేసిన తరువాత, తిరిగి రక్తాన్ని భర్తీ చేయడానికి శరీరం పనిచేస్తుంది. ఇది కొత్త రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. కొత్త కణాలను ఉత్పత్తి చేయడానికి, పనులను సమర్థవంతంగా చేయడానికి శరీర సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది
  • మనం దానం చేసిన రక్తం ఒకరి జీవితాన్ని కాపాడగలదు. ఆ విషయం మన మెదడుకు అర్థం అవుతుంది. అది మానసికంగా ఉత్సాహాన్ని, ఆనందాన్ని అందిస్తుంది.

రక్తదానం చేసిన తర్వాత పాటించాల్సిన సంరక్షణ సూచనలు

  • రక్తదానం చేసిన తరువాత 3 రోజుల వరకు సాధారణం కంటే ఎక్కువ ద్రవాలు తీసుకోవాలి
  • రక్తదానం చేసిన అరగంట పాటు ధూమపానం మరియు 24 గంటల పాటు ఆల్కహాల్ వంటి వాటిని తీసుకోకూడదు
  • రక్తదానం చేసిన తరువాత మీకు మూర్ఛ లేదా మైకము అనిపిస్తే, వెంటనే మీ మోకాళ్ల మధ్యలో తలపెట్టి ఉంచండి, కొద్దిసేపటికి కూడా లక్షణాలు అలాగే కొనసాగితే బ్లడ్‌ సెంటర్‌లోని వైద్యుడిని సంప్రదించండి.
  • రక్తదానం చేసిన 30 నిమిషాల విశ్రాంతి మరియు రిఫ్రెష్‌మెంట్ తర్వాత మీరు అన్ని రకాల పనులను తిరిగి ప్రారంభించవచ్చు, మీరు మెషినరీని నడుపుతున్నప్పుడు లేదా ఎత్తులో పని చేస్తున్నట్లయితే, ఒక రోజు సెలవు తీసుకోవడం కూడా ఉత్తమం.
  • రక్తదానం చేసిన తరువాత  మీకు అసౌకర్యంగా లేదా తల తిరగడంగా అనిపిస్తే మీ వాహనం నడపడం మానుకోండి.
  • రక్తదానం చేసిన 5-6 గంటల తర్వాత బ్యాండేజ్‌ని తీసివేయవచ్చు. వెనిపంక్చర్ చేసిన తరువాత పంక్చర్ సైట్ నుంచి రక్తస్రావం అవుతున్నట్లు అయితే, చేతిని పైకెత్తి, ఒత్తిడిని వర్తింపజేయండి, రోజంతా చేతిని ఎక్కువగా ఎత్తడం మరియు శ్రమతో కూడిన పనిని చేయడం మానుకోండి.
  • మీరు పూర్తి రక్తదానం చేసి ఉంటే 3 నెలల తర్వాత వరకు రక్తదానం చేయలేరు. అదే అఫెరిసిస్ ప్లేట్‌లెట్ దానం చేసి ఉన్నట్లయితే 48 గంటల తర్వాత మరియు వారానికి 2 సార్లు, నెలకు 2 సార్లు అలాగే సంవత్సరానికి 24 సార్లు ప్లేట్‌లెట్లను దానం చేయవచ్చు.

రక్తదానం పై నెలకొన్న అపోహాలు- వాస్తవాలు

అపోహ– రక్తదానం చేస్తే ఒలహీనపడతారు.

వాస్తవం– ఎలాంటి బలహీనలతా ఏర్పడదు

అపోహ-  కష్టమైన శ్రమతో కూడిన పనులు చేసుకునే వారు ఇంతకు ముందులా పనులు చేసుకోలేరు.

వాస్తవం – రక్తదానం తరువాత మథావిధిగా అన్ని రకాల శ్రమతో కూడిన పనులు చక్కగా చేసుకోవచ్చు.

అపోహ– రక్తదానం చేస్తే నొప్పి ఉంటుంది

వాస్తవం– రక్తదానం సమయంలో ప్రత్యేకమైన సూది గుచ్చేటప్పుడు కలిగే చిన్న పాటి నొప్పి తప్పించి ఎటువంటి తీవ్రమైన నొప్పి ఉండదు.

అపోహ– రక్తదానం వల్ల రక్త హీనత వస్తుంది

వాస్తవం – రక్తదానం ముందు అన్ని పరీక్షలు చేసి పూర్తి ఆరోగ్య వంతుల నుంచి మాత్రమే తీసుకుంటారు. కనుక రక్తదానం తరువాత ఎటువంటి రక్తహీనత ఏర్పడదు.

రక్తదానం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు దానిపట్ల అవగాహన కల్పించడానికి, వారు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ప్రతి ఏడాది జూన్‌ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262681మాకు కాల్ చేయగలరు.

About Author –

Dr. Madhav Danthala, Consultant Hemato-Oncologist and Bone Marrow Transplant Physician, Yashoda Hospitals, Hyderabad

About Author

Dr. Madhav Danthala

MD, DM (Medical Oncology, NIMS), Fellowship in Leukemia and Bone Marrow Transplantation (Canada)

Consultant Hemato-Oncologist and Bone Marrow Transplant Physician

Yashoda Hopsitals

Recent Posts

నరాల సంబంధిత వ్యాధుల రకాలు, కారణాలు, లక్షణాలు & నిర్ధారణ పరీక్షలు

నరాల సంబంధిత రుగ్మతలు అంటే నాడీ వ్యవస్థ మొత్తం మీద ప్రభావం చూపే వ్యాధులు. నాడీ సంబంధిత పరిస్థితులు ఇప్పుడు…

1 month ago

Endovascular Surgery: Minimally Invasive Solution to Vascular Disease

Endovascular surgery is a revolutionary advancement in medical technology wherein doctors can treat almost any…

1 month ago

పల్మోనరీ ఎంబోలిజం: లక్షణాలు, కారణాలు మరియు చికిత్స విధానాలు

పల్మోనరీ ఎంబోలిజం అనేది చికిత్స మీద ఆధారపడిన ఒక తీవ్రమైన పరిస్థితి, ఇది సాధారణంగా ఊపిరితిత్తులకు ప్రయాణించే రక్తంలో గడ్డకట్టడం…

1 month ago

Rhinoplasty: Understanding the Nose Surgery Procedure and Its Benefits

Rhinoplasty is commonly known as a nose job that is usually designed to reshape a…

1 month ago

Is Spine Surgery Safe? Exploring Minimally Invasive Techniques and Recovery

Spine surgery is a source of fear for most people, yet it has undergone significant…

1 month ago

కిడ్నీ వ్యాధి రకాలు, లక్షణాలు మరియు ముఖ్యమైన అంశాల గురించి వివరణ

శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు (మూత్రపిండాలు) ప్రధానమైనవి. ఇవి సక్రమంగా పనిచేస్తే శరీర అవయవాలు కూడా చక్కగా పనిచేస్తాయి. కిడ్నీలకు…

1 month ago