ఆటిజం: రకాలు, కారణాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు

ఆటిజం: రకాలు, కారణాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు

ప్రస్తుత కాలంలో మానసిక ఎదుగుదల లోపం కారణంగా చాలా మంది పిల్లలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అందులో ఆటిజం అనే సమస్య కూడా ఒకటి. వయస్సుకు తగ్గట్లు పిల్లల్లో రావాల్సిన మానసిక పరమైన ఎదుగుదల రాకుండా ఉండే పరిస్థితినే ఆటిజం అంటారు. ఈ సమస్య పిల్లల్లో బాల్యంలోనే ప్రారంభమయ్యే జీవితకాల నాడీ సంబంధిత రుగ్మతగా (న్యూరోలాజికల్ డిజార్డర్) కూడా చెప్పవచ్చు. ఆటిజంనే వాడుక భాషలో మందబుద్ది అని కూడా పిలుస్తుంటారు. ఇది చాలా అరుదైన సమస్య, ప్రతి వంద మంది పిల్లల్లో ఒక్కరికి మాత్రమే ఉంటుంది.

ఆటిజం సమస్య గల పిల్లల మెదడులోని కొంత భాగం సరిగా పనిచేయనందున వారు మాములు పిల్లవారిలా వ్యవహరించరు. నిజానికి ఇది పెద్ద ప్రమాదం కానప్పటికీ దీనిని నివారించడంలోనే అనేక సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది. సాధారణంగా ఆటిజం లక్షణాలు మూడేళ్ల వయసు నిండక ముందే కనిపిస్తాయి. ఇది లింగ బేధంతో సంబంధం లేకుండా వచ్చే సమస్య. ఈ సమస్య గల వారు తరచుగా మూర్ఛ, నిరాశ, ఆందోళన, హైపర్యాక్టివిటీ డిజార్డర్ వంటి రుగ్మతలను సైతం కలిగి ఉంటారు.

ఆటిజం రకాలు

ఆటిజం లేదా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) లో చాలా రకాలు ఉంటాయి.

  1. ఆటిస్టిక్‌ డిజార్డర్‌: ఆటిజంలో ఆటిస్టిక్‌ డిజార్డర్‌ ఎక్కువగా కనిపించే సమస్య. ఈ రకమైన ఆటిజంను మగపిల్లల్లో ఎక్కువగా గమనించవచ్చు. 
  2. రెట్స్‌ డిజార్డర్‌: ఇది ఆటిజంలో అరుదైన రకం, ఈ సమస్య ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రకమైన ఆటిజం ఉన్న పిల్లల్లో శారీరక ఎదుగుదల తక్కువగా ఉంటుంది.
  3. చైల్డ్‌హుడ్‌ డిసింటిగ్రేటెడ్‌ డిజార్డర్‌: ఇది ఆటిజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య.
  4. యాస్పర్జస్‌ డిజార్డర్‌: ఈ రకమైన డిజార్డర్ లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు చేసే ప్రత్యేకమైన పనుల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు.

ఆటిజం కు గల కారణాలు

పిల్లల జీవితంలో ఎదుగుదల ఉండాలంటే పుట్టినప్పటి నుంచే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఆటిజం రావడానికి గల ప్రధాన కారణాలు:

  • ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల కూడా వస్తుంది (దీని వల్ల పిల్లల మానసిక ఎదుగుదల సరిగ్గా జరగక సాధారణ జీవితం గడపడం కష్టమవుతుంది).
  • స్త్రీలు గర్భధారణ సమయంలో ఇన్ఫెక్షన్ ల బారిన పడడం మరియు గర్భిణిగా ఉన్నప్పుడు తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం. 
  • మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్‌ వంటి రసాయనాలు తగినంత విడుదల కాకపోవడం.
  • నెలలు నిండకుండా శిశువు పుడితే కూడా ఆటిజానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు మరింత శ్రద్ధ వహించాలి.
  •  తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఈ ఆటిజం సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.

ఆటిజం యొక్క లక్షణాలు

సాధారణంగా శిశువులు ఏడాది వయసులో పాకడం, నడవడం, నవ్వడం, ముద్దు ముద్దుగా మాట్లాడటం మరియు తల్లిదండ్రుల పిలుపునకు బదులివ్వడం వంటివి చేస్తుంటారు. ఈ ఆటిజం సమస్యను కలిగి ఉన్న కొంత మంది పిల్లల్లో ఈ లక్షణాలు ఏవి కనిపించవు. ఈ ఆటిజం లక్షణాలు పిల్లలలో వివిధ రకాలుగా ఉంటాయి.

  • వయస్సుకు తగ్గట్లు మానసిక పరిపక్వత లేకపోవడం
  • ఎవరితోనూ కలవకుండాఒంటరిగా ఉండడం
  • నేరుగా కళ్ళల్లోకి చూడలేకపోవడం మరియు మాట్లాడలేకపోవడం
  • ఇతరులతో కలవడానికి ఇష్టపడకపోవడం
  • చేసిన పనులనే మళ్లీ మళ్లీ చేస్తుండడం
  • ఎలాంటి అనుభూతిని కూడా తెలపలేకపోవడం
  • గాయాలు తగిలినా తెలుసుకోలేకపోవడం
  • శబ్ధాలను పట్టించుకోకపోవడం 
  • సరిగా మాట్లాడలేక పోవడం మరియు కారణం లేకుండా ఏడుస్తూ ఉండడం
  • పిలిచినా మరియు ఎవర్నీ చూసినా పట్టించుకోకపోవడం వంటి లక్షణాలను కలిగి ఉంటారు

తల్లిదండ్రులు పిల్లల ఎదుగుదలకు ఇవ్వాల్సిన ఆహారాలు

పిల్లల ఎదుగుదల విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. 

  • ప్రధానంగా పిల్లలకు పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు శిశువుకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి.
  • చిన్నవయస్సు నుంచే పిల్లలు ఆరోగ్యవంతంగా ఎదగటానికి పౌష్టికాహారం అందించడం చాలా ముఖ్యం. (దీంతో పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి పెరిగి మానసిక, శారీరక ఎదుగుదలకు అవకాశం ఉంటుంది)
  • రోజువారి ఆహారంలో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ తగిన మొత్తంలో ఉండేలా చూసుకోవాలి. 
  • పిల్లల్లో కండరాలు బలంగా ఉండడానికి జింక్‌, ఐరన్‌ ఉండే ఆహారాలను ఎక్కువగా ఇవ్వాలి. 
  • కాలీఫ్లవర్‌, బ్రొకోలీ, బెల్‌పెప్పర్స్‌ మరియు పచ్చని ఆకుకూరలు, కూరగాయలతో పాటు గుమ్మడి విత్తనాలు, గుడ్డు, మాంసాహారం వంటివి పిల్లల ఎదుగుదలకు తోడ్పడతాయి.
  • నారింజ, బత్తాయి, పైనాపిల్‌, జామ, స్ట్రాబెర్రీ, బొప్పాయి మరియు ఇతర రకాల పండ్లను ఇస్తుండాలి.
  • సెలెనియం ఎక్కువగా ఉండే బీన్స్‌, చిక్కుడు, పుట్టగొడుగులు మరియు పొద్దుతిరుగుడు విత్తనాలను చిన్నారులకు ఇవ్వాలి.
  • యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్‌-E ఎక్కువగా ఉండే ఆహారాలను  పిల్లలకు ఇవ్వడం ద్వారా  వారి నరాల వ్యవస్థ బలోపేతం అవడమే కాక వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
  • విటమిన్‌- K2 కలిగిన ఆహారాలను ఇవ్వడం వల్ల పిల్లల ఎముకలు మరింత బలోపేతంగా తయారవుతాయి.

ఆటిజంను అధిగమించే మార్గాలు

తల్లులు తమ పిల్లల్లో ఆటిజంను నివారించడానికి అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 

  • ఆటిజం సమస్యలను ముందుగానే గుర్తించడానికి సాధారణ ప్రినేటల్ చెక్-అప్‌లు చేయించుకోవడమే కాక క‌డుపులోని బిడ్డ ఎదుగుద‌లను కూడా నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి.
  • గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవ‌డంతో పాటు, ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామాలు వంటివి చేయాలి.
  • ధూమపానం, ఆల్కహాల్, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
  • తల్లులు నిర్దిష్ట పోషకాలు, సప్లిమెంట్లను డాక్టర్ సూచన మేరకు తీసుకోవడం వల్ల వారి పిల్లలలో ఆటిజం ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
  • గర్భధారణ సమయంలో వాయు కాలుష్యం, పర్టిక్యులేట్ పదార్థాల ప్ర‌భావానికి గురికాకుండా చూసుకోవాలి.
  • గర్భిణీలు కొన్ని రకాల‌ అనారోగ్యాలను నియంత్రించే టీకాలు సైతం తీసుకుంటూ ఉండాలి.
  • శిశువు కదలికలకు సంబంధించి ఏవైనా అనుమానిత ల‌క్షణాలను గమనించినట్లు అయితే ఆలస్యం చేయకుండా డాక్టర్ ని సంప్రదించడం ఉత్తమం.

వీటితో పాటు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను నిరంతరం గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఆటిజం వ్యాధి విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారు సాధారణంగా ప్రవర్తించకపోతే వెంటనే అప్రమత్తం కావడం కూడా చాలా ముఖ్యం. పిల్లలకి ఆటిజం ఉన్నట్లు నిర్ధారణ అయితే, కొన్ని ప్రత్యేక ముందస్తు చ‌ర్య‌ల ద్వారా వారిలో సామాజిక నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలి. వైద్యుల సలహాల మేరకు ఆటిజంకు చికిత్స తీసుకుంటూ మరిన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య నుంచి పిల్లలను కాపాడుకోవచ్చు.

About Author –

Dr. D. Srikanth, Sr. Consultant Pediatrician & Neonatologist, Yashoda Hospitals – Hyderabad
MD (Pediatrics), PGPN (Boston, USA)

About Author

Dr. D. Srikanth | yashoda hospitals

Dr. D. Srikanth

MD (Pediatrics), PGPN (Boston, USA)

Sr. Consultant Pediatrician & Neonatologist