Select Page

ఆస్తమా: కారణాలు, లక్షణాలు మరియు చికిత్సా పద్ధతులు

ఆస్తమా పరిచయం

వాతావ‌ర‌ణంలో క్రమ‌క్రమంగా చోటుచేసుకుంటున్న మార్పుల వ‌ల‌్ల చాలా మంది కొన్ని దీర్ఘకాల వ్యాధుల‌తో బాధ‌ప‌డుతుంటారు. అందులో ముఖ్యమైన‌ది అస్తమా (ఉబ్బసం) వ్యాధి. ఇది చిన్న పిల్లల్లో, పెద్దవారిలో వచ్చే శ్వాస సంబంధ వ్యాధి. ఆస్తమా సంభవిస్తే మాత్రం ఊపిరితిత్తుల్లో వాపు వల్ల వాయు మార్గాలు కుంచించుకుపోతాయి. దీని వల్ల శ్వాసకు అడ్డంకులు ఏర్పడి పేషంట్‌ సరిగ్గా గాలి తీసుకోలేక ఇబ్బందిపడతాడు. ఈ వ్యాధిగ్రస్తుల్లో ముఖ్యంగా ఆయాసం, దగ్గు బాగా ఇబ్బంది పెడతాయి.

ముఖ్యంగా వానకాలం, శీతకాలం ఈ సమస్య మరింత పెరుగుతుంది. ఈ రెండు బుతువుల్లో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల విటమిన్‌-డి తగ్గిపోతుంది. దీంతో రోగ నిరోధక శక్తి మరింత పడిపోయి ఆస్తమా తీవ్రరూపం దాల్చుతుంది. పుట్టిన పిల్లల దగ్గర నుంచి 30-35 సంవత్సరాలైనా పెద్దవారిలో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల్లో పుట్టినప్పటి నుంచి ఈ వ్యాధి ఉన్నట్లయితే దానిని చైల్డ్‌హుడ్‌ ఆన్సెట్ ఆస్తమా అంటారు. అదే కొంత మందిలో చిన్నప్పుడు ఆస్తమా లక్షణాలు లేకుండా పెద్దవారిగా ఉన్నప్పుడు అంటే 20 సంవత్సరాల పైబడి ఉన్న వారిలో గనుక ఆస్తమా వస్తే దానిని అడల్ట్‌ ఆన్సెట్ ఆస్తమా అంటారు.

ఆస్తమా రావడానికి గల కారణాలు

ఈ ఆస్తమా వ్యాధి రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ  ముఖ్యంగా:

  • వంశపారంపర్యం, వాతావరణ కాలుష్యం, దీర్ఘకాలిక జలుబు, సైనస్‌ ఇన్‌ఫెక్షన్స్‌, దుమ్ము, ధూళి, బూజు, పెంపుడు జంతువుల వెంట్రుకలు, ఆహార పదార్థాలలోని రసాయనాల వంటి వల్ల ఈ ఆస్తమా వస్తుంది.
  • చర్మ వ్యాధులు ఉన్న చిన్నారులకు ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువ.
  • తల్లిదండ్రులు ఆస్తమా బాధితులు అయితే పిల్లలకు కూడా ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది.
  • జలుబు లాంటి వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఆస్తమా రావచ్చు.
  • వాయు కాలుష్యం, సిగరెట్‌ పొగ, సెంటు వాసనలు, దుమ్ము, ధూళి మూలానా కూడా ఈ వ్యాధి సంభవిస్తుంది.
  • యాస్పిరిన్‌ వంటి నొప్పి తగ్గించే ఔషధాలు, బీపీ నియంత్రణకు వాడే కొన్ని మందులు వాడటం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
  • అజీర్తి, గ్యాస్‌ ట్రబుల్‌, మానసిక ఒత్తిళ్లు మొదలైన వాటి వల్ల కూడా ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంది.

ఆస్తమా వ్యాధి లక్షణాలు

Asthma Causes, Symptoms & Treatment1

ఛాతీ బిగుసుకుపోయినట్లు ఉండడం

  • శ్వాసలో ఇబ్బంది రావడం
  • ఆయాసం రావడం
  • విపరీతమైన దగ్గుతో బాధపడడం
  • ఉదయం, రాత్రి వేళల్లో దగ్గు తీవ్రత పెరగడం
  • విపరీతంగా గురక పెట్టడం
  • ఊబకాయంతో ఇబ్బంది పడడం
  • గొంతులో ఈల వేసినట్టుగా శబ్దం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి

ఆస్తమా వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన ఆహారాలు

ఆస్తమా వ్యాధి ఉన్న వారు ఆహారం విషయంలో తగినంత శ్రద్ధ తీసుకుంటే ఈ వ్యాధి వల్ల కలిగే సమస్య తీవ్రతను కొంత తగ్గించుకోవచ్చు

  1. పాలకూర: మెగ్నీషీయానికి పాలకూర మంచి ఆధారము. ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో ఇది బాగా సహకరిస్తుంది. 
  2. రెడ్ క్యాప్సికం: దీనిలో “సి” విటమిన్‌ (ఎస్కార్బిక్ యాసిడ్) ఎక్కువగా ఉంటుంది. ఎర్ర మిరిపకాయలోని ఎస్కార్బిక్ యాసిడ్ “ఫాస్ఫోడిల్ స్టెరేజ్” అనే ఎంజైమ్‌ ఉతపత్తిని అడ్డుకొని ఆస్తమాను నివారించడంలో ఉపయోగపడుతుంది. 
  3. ఉల్లి: వీటిలో కూడా యాంటీ – ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ అస్త్మాటిక్ ప్రభావాలున్నాయి. 
  4. ఆరెంజ్: కమలా, నారింజ, నిమ్మలలో ఉండే విటమిన్‌ ‘సి’ ఆస్తమా లక్షణాలు తగ్గిస్తుంది. 
  5. యాపిల్: యాపిల్‌ లో ఉండే ‘ఫైటోకెమికల్స్’, యాపిల్ తొక్కలో ఉండే ‘లైకోఫిన్‌’ వంటివి అస్తమాతో ఇబ్బంది పడే వారి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి.

 

ఆస్తమాకు చేసే చికిత్సా పద్ధతులు

Asthma Causes, Symptoms & Treatment2

ఆస్తమా నుంచి ఉపశమనానికి 3 చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. 

అందులో ముఖ్యమైనది:

  1. ఇన్‌హెలేషన్‌ థెరపీ: ఇన్‌హెలేషన్‌ థెరపీ అనేది ఆస్తమా వ్యాధికి ప్రపంచ వ్యాప్తంగా ఆమోదం పొందిన అత్యుత్తమ చికిత్సా విధానం. దీని వల్ల నేరుగా మందు వాయు మార్గం నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి తక్షణం పనిచేస్తుంది.

ఇన్‌హేలర్లు 2 రకాలు:

రిలీవర్స్‌: తాత్కాలిక ఉపశమనం కలిగించేవి

ప్రివెంటర్స్‌: దీర్ఘకాలం వ్యాధిని అదుపులో ఉంచేవి

ఇతర ఔషధాలతో పోల్చితే ఈ ఇన్‌ హేలర్స్‌ ద్వారా ఇచ్చే ఔషధాలు చాలా తక్కువ డోసేజీని కలిగి ఉంటాయి. కాబట్టి, నిరభ్యంతరంగా ఈ విధానాన్ని ఎంచుకోవచ్చుని వైద్య నిపుణులు చెబుతుంటారు. 

  1. మాత్రల ద్వారా చేసే చికిత్స: అదే మాత్రల ద్వారా గనుక మందులను తీసుకుంటే  అవి మొదట రక్తంలోకి వెళ్లి చిట్టచివరకు ఊపిరితిత్తులను చేరుకుని పనిచేస్తాయి. అందుకు కొంత ఎక్కువ సమయం పడుతుంది.
  2. ఇంజక్షన్‌ రూపంలో ఇచ్చే వైద్యం: సిరప్‌లు, ఇంజక్షన్లు ద్వారా తీసుకునే మందు మొదట రక్తంలో కలిసి చివరగా లంగ్స్‌పై ప్రభావాన్ని చూపుతాయి. ఈ మందులు రక్తంలో కలవడం వల్ల శరీరంలోని ఇతర భాగాలకు చేరిపోయి దుష్ప్రభావం (side effect) చూపే అవకాశం ఉంది.

ఇన్‌హేలర్‌ థెరపీని ఎవరెవరు తీసుకోవచ్చు?

ఇన్‌హేలర్‌ థెరపీని 3 నెలల పసిబిడ్డ నుంచి పండు ముసలి వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఆస్తమాకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య విధానాల్లో ఇన్‌హెలేషన్‌ థెరపీనే సురక్షిత విధానం. ఈ విధమైన పక్రియ ఆస్తమా వ్యాధిని పూర్తిగా అదుపు చేసి, సాధారణ జీవితాన్ని గడపటానికి వీలు కలుగజేస్తుంది. ఇన్‌హెలేషన్‌ థెరపీని పౌడర్‌ రూపంలో, వాయు రూపంలో తీసుకోవచ్చు. నెబ్యులైజర్‌ ద్వారా కూడా ఈ రకమైన

ముగింపు

ఈ వ్యాధి ఏ దశలో ఉంది మ‌రియు దీని తీవ్రత‌ను నిర్ధారించుకొని దానిక‌నుగుణంగా చికిత్స చేయ‌డం అనేది చాలా ముఖ్యమైన అంశం. కొన్ని ముందస్తు చర్యల వల్ల ఆస్త‌మా వ్యాధిని చాలా సులువుగా నిర్ధారించ‌వ‌చ్చు. ఈ వ్యాధి చికిత్స‌లో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు గురించి కూడా చాలామందికి ఇప్ప‌టికీ పూర్తి అవ‌గాహ‌న లేదు. 

వ్యాధి ల‌క్షణాలక‌నుగుణంగా రోగికి ప్రత్యేక‌మైన చికిత్సను అందించేలా చూసుకోవాలి. వ్యాధి పెరుగుద‌ల యొక్క అంచ‌నా మ‌రియు ఆస్తమా ర‌కాన్ని బ‌ట్టి చికిత్సా విధానం ఆధార‌ప‌డి ఉంటుంది. అవ‌స‌రం లేకుండా స్టెరాయిడ్ల‌ను ఉప‌యోగించ‌కూడదు.

అందువ‌ల‌న ఆస్త‌మా వ్యాధితో బాధ‌ప‌డుతున్న అంద‌రూ ఖ‌చ్చితంగా ఈ వ్యాధి యొక్క లక్ష‌ణాలు మ‌రియు నివార‌ణ చ‌ర్య‌ల గురించి తెలుసుకుని ఈ వ్యాధిని వీలైనంత వ‌ర‌కు నియంత్రించుకునేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

About Author –

Dr. Vamsi Krishna Mutnuri, Consultant interventional pulmonologist, Yashoda Hospital, Hyderabad
MD (Pulmonary Medicine), European Diploma (Respiratory Medicine), RCP (UK) SCE (Respiratory Medicine)

About Author

Yashoda Doctors

Dr. Vamsi Krishna Mutnuri

MD (Pulmonary Medicine), European Diploma (Respiratory Medicine), RCP (UK) SCE (Respiratory Medicine)

Consultant Interventional Pulmonologist