అల్జీమర్స్ వ్యాధి: లక్షణాలు, నిర్ధారణ మరియు అపోహలు & వాస్తవాలు

పరిచయం

ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నాడీ సంబంధిత రుగ్మతలలో అల్జీమర్స్ వ్యాధి ఒకటి. అల్జీమర్స్ మెదడులో కణాలు చనిపోతుండటం వల్ల వచ్చే నాడీ సంబంధిత వ్యాధి. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్ధ్యం దెబ్బతింటాయి. ఇటీవలి సంఘటనలు, విషయాలను మరచిపోవటంతో మొదలై క్రమంగా పెరిగి చివరకు వ్యక్తి తనెవరో తెలియని స్థాయికి ఈ మతిమరపు విస్తరిస్తుంది. అల్జీమర్స్ వ్యాధి సాధారణంగా 65 ఏళ్ల పై బడిన వారిలో కనిపిస్తుంది. అయితే ఈ వ్యాధి కేవలం వృద్దులకు మాత్రమే పరిమితమైనది మాత్రం కాదు. పలు సందర్భాలలో 40-50 ఏళ్ల వయస్సు వ్యక్తులలో కూడా అల్జీమర్స్ కనిపిస్తున్నది. డౌన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు అల్జీమర్స్ వ్యాధిని అభివృద్ధి చేస్తారు. పురుషుల కంటే స్త్రీలలోనే అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే తలకు తీవ్ర గాయం అయిన వ్యక్తులకు కూడా ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. 

అల్జీమర్స్ వ్యాధి కుటుంబంలో ఎవరికైనా ఉంటే కూడా వంశపారంగా వచ్చే అవకాశం ఉంటుంది. మెదడులో వయస్సు-సంబంధిత మార్పులు, జన్యు సంబంధ, పర్యావరణ విషపదార్థాలు చేరడం, దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులు, జీవనశైలి కారకాలు, రోగనిరోధక పనితీరు తగ్గడం వల్ల వృద్ధులకు అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఉంది. వయసు పెరిగే కొద్దీ మెదడులో వచ్చే మార్పులే ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణం. అయితే మధ్య వయస్కుల్లో కనిపించే అల్జీమర్స్ లక్షణాలను కొంత మంది డాక్టర్లు మధ్యవయస్సు తాలూకు మతిపరుపుగానో లేక ఒత్తిడి, మానసిక కృంగుబాటు, మహిళల్లో అయితే మోనోపాజ్ వంటి లక్షణాలుగా భావించి తేలికగా తీసుకుంటుంటారు. దాంతో వ్యాధి ముదిరి పరిస్థితి దిగజారుతుంది.

అల్జీమర్స్‌ వ్యాధి యొక్క లక్షణాలు

Alzheimer's disease symptoms

అల్జీమర్స్‌ వ్యాధి తీవ్రతను బట్టి లక్షణాలు వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉన్నప్పటికీ సాధారణంగా కనిపించే లక్షణాలు:

  • మాట తడబడడం
  • కదలికలు నెమ్మదించడం
  • ఆలోచన నెమ్మదించడం
  • జ్ఞాపకశక్తి తగ్గడం
  • ఒకే విషయాన్ని పదేపదే చెప్పడం
  • సొంతవారినే గుర్తుపట్టలేకపోవడం
  • రోజువారీ విషయాలను మర్చిపోవడం
  • వస్తువులు ఎక్కడ పెట్టారో గుర్తులేకపోవడం
  • పనిపై ఏకాగ్రత లోపించడం
  • తీవ్రమైన గందరగోళం
  • రాయడం, చదవడం మరియు మాట్లాడడంలో ఇబ్బంది
  • పట్టరాని భావోద్వేగాలకు లోను కావడం
  • సమస్యా పరిష్కార సామర్థ్యం లోపించడం

కొద్ది నిమిషాల కింద జరిగిన విషయాలను కూడా మర్చిపోవడం ఈ వ్యాధి యొక్క లక్షణాలుగా చెప్పవచ్చు.

ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

అల్జీమర్స్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలు

అల్జీమర్స్ వ్యాధి నిర్ధారణ ప్రక్రియలో భాగంగా వైద్యులు అనేక పరీక్షలను సూచిస్తారు. మొదటగా అల్జీమర్స్‌ వ్యాధిని నిర్ధారించడానికి పేషంట్ క్లినికల్‌ హిస్టరీ అంటే వైద్య చరిత్ర, జ్ఞాపకశక్తి పరీక్షలు, న్యూరో ఇమేజింగ్‌ వంటి (X-Ray, CT, MRI స్కాన్‌) పరీక్షలు చేయడం జరుగుతుంది. వాటిలో:

న్యూరోసైకోలాజికల్ పరీక్ష: అల్జీమర్స్ పేషంట్ యొక్క జ్ఞాపకశక్తి మరియు ఆలోచనా నైపుణ్యాలను అంచనా వేయడానికి మరియు పేషంట్ యొక్క స్థితి తెలుసుకోవడానికి ఈ పరీక్ష సహాయపడుతుంది.

శారీరక మరియు నాడీ సంబంధిత పరీక్ష: ఈ పరీక్షలో కండరాల టోన్ మరియు బలం, గది అంతటా నడిచే సామర్థ్యం, ​​సమతుల్యత, ఆలోచనలు మరియు చర్యల సమన్వయం మరియు చేతులు మరియు కాళ్ళ యొక్క ప్రతిచర్యలు, దృష్టి మరియు వినికిడి వంటివి తెలుసుకోవడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయి.

మెదడు ఇమేజింగ్ పరీక్షలు: MRI, CT మరియు PET స్కాన్ వంటి పరీక్షల ద్వారా   బ్రెయిన్ స్ట్రోక్‌లు, మెదడులో గడ్డలు కనిపించే సంకేతాలతో మెదడు యొక్క అసాధారణతలను తెలుసుకోవడం జరుగుతుంది.

అల్జీమర్స్‌ చికిత్స విధానాలు & మందులు

అల్జీమర్స్‌ వ్యాధి తీవ్రత మరియు సంబంధిత లక్షణాలను బట్టి చికిత్స చేస్తారు. అయితే ఈ వ్యాధిని తొలిదశలో గుర్తించి మందులు ఇవ్వడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించుకోవడమే కాక వ్యాధి ముదరకుండా చూసుకోవచ్చు. అల్జీమర్స్‌ వ్యాధి ముదిరేకొద్దీ పేషంట్ తినడానికి, స్నానం చేయడానికి, మందులు తీసుకోవడానికి, బయటకు వెళ్లడానికి కూడా కుటుంబసభ్యుల మీద ఆధారపడిపడడం జరుగుతుంది. తద్వారా పేషంట్ కి అనుకూలంగా ఉంచడానికి ఇంటిలో ఎన్నో మార్పులు చేయాల్సి స్థితి ఏర్పడుతుంది. అంతే కాకుండా విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్ మరియు వాలెట్‌ను ఒకే స్థలంలో ఉంచడం.

  • వైట్‌బోర్డ్‌ను ఉపయోగించడం ద్వారా సాధారణ చర్యలు మరియు కార్యకలాపాలను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది.
  • రోజులను గుర్తు పెట్టుకోవడానికి సరైన క్యాలెండర్‌ ఉంచడం, సమయాన్ని గుర్తుంచుకోవడానికి గడియారాలు, న్యూస్‌ పేపర్లు వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 
  • పేషంట్ గదిలో సరైన వెలుతురు వచ్చేలా చూసుకోవడం ద్వారా పగలు, రాత్రితో పాటూ సమయం మరియు రోజులు గుర్తుంచుకోవడానికి వారికి వీలు కలుగుతుంది. 
  • డాక్టర్‌తో క్రమం తప్పకుండా అపాయింట్‌మెంట్ తీసుకోవడం ద్వారా పరిస్థితిని అదుపులో  ఉంచుకోవచ్చు.
  • ఇక మందుల విషయానికొస్తే మందుల డబ్బాలపై పెద్దగా కనపడేలా వాటి పేర్లు, తీసుకోవాల్సిన సమయం, మోతాదు,వంటివి రాసిపెట్టడంతోపాటు వాటిని తీసుకొంటున్నారో లేదో గమనిస్తూ, మరచిపోతే అందించడం ఎంతో అవసరం. లేకుంటే వారు అసలు వేసుకోకపోవడం లేదా ఎక్కువ డోసు వేసుకోవడం వంటివి చేయవచ్చు. అలానే ఈ రోగులు బయటకు వెళ్లాలంటే తప్పనిసరిగా తోడు ఉండేలా చూడాల్సి ఉంటుంది. ఇలాంటి రోగులు ఒంటరిగా బయటకు వెళ్లడం లేదా వాహనాన్ని నడపడం చేయకుండా చూడాలి. అంతేకాకుండా ఇంట్లో కూడా ఒంటరిగా వదలకూడదు. 

అల్జీమర్స్ వ్యాధి కోసం ఆమోదించబడిన ఫార్మకోలాజికల్ చికిత్సలు వ్యాధి యొక్క లక్షణాల నియంత్రణకు ప్రత్యేకంగా పని చేస్తాయి.

  • అల్జీమర్స్ వ్యాధికి అందుబాటులో ఉన్న ఉత్తమ మందుల్లో మెమంటైన్ మరియు డోపెజిల్ ప్రధానమైనవి. ఇవి ఆలోచనా సామర్థ్యాన్ని, ప్రవర్తనను లేదా పనితీరును మార్చటానికి ఉపయోగపడతాయి
  • విషయాలను మర్చిపోవడం & జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి లక్షణాలను మెరుగుపరుచుకునేందుకు కోలినెస్టరేస్ ఇన్హిబిటర్స్ (ACHEIలు) మరియు మెమంటైన్ అనే మందులు ఉపయోగపడతాయి
  • యాంటికోలినెస్టరేస్ ఇన్హిబిటర్లు మరియు యాంటీ-గ్లుటామినెర్జిక్స్ రోగలక్షణ ఉపశమనాన్ని అందించగలవు.
  • FDA ఆమోద చికిత్సలు: అడుకానుమాబ్ మరియు లెకానెమాబ్ అనే రెండు మోనోక్లోనల్ యాంటీబాడీస్ (mAbs) అల్జీమర్స్ వ్యాధి యొక్క పురోగతిని మందగించే చికిత్సలు (DMTలు) గా వర్గీకరించబడ్డాయి.

అల్జీమర్స్ వ్యాధికి చికిత్సలు మాత్రలు, పాచెస్, ద్రవాలు లేదా కషాయాల రూపాల్లో ఇవ్వడం జరుగుతుంది.

మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఉన్నారా?

అల్జీమర్స్‌ వ్యాధి యొక్క నివారణ చర్యలు

కేవలం మందులు & చికిత్సల ద్వారానే అల్జీమర్స్ వ్యాధిని అరికట్టలేము కావున ఈ క్రింది నివారణ చర్యలను పాటించడం కూడా చాలా అవసరం.

  • ఇక వ్యాధి నివారణా చర్యలలో ప్రధానంగా చేయాల్సినది జీవనశైలిలో మార్పులతో పాటు మంచి ఆహారం మంచి ఆరోగ్యానికి మొదటి సంకేతం
  • అల్జీమర్స్ రోగులు కేలరీలు, విటమిన్లు, మినరల్స్ మరియు ప్రోటీన్లు అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి
  • ఒత్తిడిని తగ్గించుకోవడం
  • ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించడం
  • నడక, స్విమ్మింగ్ లాంటి ఏరోబిక్ వ్యాయమాలు చేయడం
  • తగినంత సేపు నిద్ర పోవడం 
  • ధూమపానం మరియు మద్యపానం కి దూరంగా ఉండడం 
  • శరీరపు బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల అల్జీమర్స్ వ్యాధితో సంబంధం ఉందని భావించే గుండె జబ్బులు, డయాబెటిస్ వ్యాధుల నుంచి నివారించుకోవచ్చు.
  • ఒత్తిడిలో ఉంటే మెదడుకు హాని కలుగుతుంది కాబట్టి యోగా, ధ్యానం లాంటివి చేయడం
  • వంట అవసరాల కోసం ఎక్కువ కాలంగా వాడుతున్న నూనెలను తిరిగి వంట అవసరాలకు వాడకూడదు.
  • శారీరక వ్యాయామం మరియు నడవడం, ఫిజియోథెరపీ వల్ల కండరాల కదలిక అయి మెదడుకు సంక్రమించిన దుష్ఫలితాలతో కొంత వరకు కోలుకునే అవకాశం ఉంటుంది.

చురుకైన సామాజిక సంబంధాలు కొనసాగించటంవల్ల మెదడులోని నాడీకణాల మధ్య సంబంధాలను బలపడి మెదడు చురుకుగా పనిచేస్తుంటుంది. ఇది వ్యక్తి ఆలోచనా శక్తి దెబ్బతినకుండా ఉండటానికి తోడ్పడుతుంది.

 అల్జీమర్స్ కు సంబంధించిన సాధారణ అపోహలు & వాస్తవాలు

అపోహ 1: అల్జీమర్స్ వృద్దులోనే కనిపిస్తుంది.

వాస్తవం: కొంతవరకు నిజమే. అల్జీమర్స్ కు వయస్సు పై బడటానికి నేరుగా సంబంధం ఉంది. అల్జీమర్స్ వ్యాధి సాధారణంగా 65 ఏళ్లపై బడిన వారిలో కనిపిస్తుంది. అయితే కేవలం వృద్దులకు మాత్రమే పరిమితమైనది మాత్రం కాదు. పలు సందర్భాలలో 40-50 సం. వయస్సు వ్యక్తులలో కూడా అల్జీమర్స్ కనిపిస్తున్నది. 

అపోహ 2: జ్ఞాపకశక్తి క్షీణించటం అంటే అల్జీమర్స్ వ్యాధి వచ్చినట్టే.

వాస్తవం: ఇది నిజం కాదు. పలు కారణాల వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోవటానికి అవకాశం ఉంది. వయస్సు పై బడటం కావచ్చు లేదా పోషకాహార లోపం కావచ్చు , విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవటం వల్ల కూడా మతిమరపు పెరగవచ్చు.

అపోహ 3: అల్జీమర్స్ నిర్ధారణ అయితే ఇక ఆ వ్యక్తి జీవితం ముగింపుకు వచ్చినట్టేనా?

వాస్తవం: ఏమాత్రం కాదు. అల్జీమర్స్ సోకినా వ్యక్తి చాలా సంవత్సరాల పాటు అర్థవంతమైన జీవితం గడపవచ్చు. గుండెను ఆరోగ్యకరంగా ఉంచగల ఆహారం తీసుకుంటూ క్రమం తప్పని వ్యాయామం, చురుకైన సామాజిక సంబంధాలను కొనసాగిస్తూ మెదడుకు పనిపెట్టే అలవాట్లను కొనసాగించటం ద్వారా అల్జీమర్స్ వ్యాధి ముదిరే వేగాన్ని తగ్గించవచ్చు. 

అపోహ 4: అల్జీమర్స్ వంశపారంపరంమైన వ్యాధి

వాస్తవం: నిజమే. కానీ ఈ విధంగా వంశపారంపర్య అల్జీమర్స్ వస్తున్నది కొద్దిమందికే. మొత్తం వ్యాధిగ్రస్థుల్లో కేవంల 5శాతం మందికే వంశపారంపర్య అల్జీమర్స్ వ్యాధి సోకినట్లు తెలుస్తుంది.

అపోహ 5: తలకు తగిలిన గాయం అల్జీమర్స్ కు దారితీస్తుంది.

వాస్తవం: తలకు ఒకమోస్తరు, తీవ్రమైన గాయం అయిన పక్షంలో కొద్ది సంవత్సరాల తరువాత అది తీవ్రమైన మతిమరుపు, అల్జీమర్స్ కు దారితీసే అవకాశం ఉందని ప్రారంభంలో జరిగిన కొన్ని అధ్యయనాలలో వెల్లడి అయ్యింది. అదే సమయంలో తలకు  తీవ్రగాయం అయిన ప్రతీ వ్యక్తి అల్జీమర్స్ బారిన పడటం లేదు. 

అపోహ 6: అల్జీమర్స్ వ్యాధిగ్రస్థులు ఆవేశపరులుగా, దూకుడుగా వ్యవహరిస్తుంటారు

వాస్తవం: అల్జీమర్స్ వ్యాధితో కొందరు దూకుడుగా, ఆవేశపూరితంగా మారటం నిజమే. కానీ ఈ వ్యాధి వల్ల అందరూ ఒకేరకంగా ప్రభావితం కారు. వ్యాధి వల్ల  తికమకపడుతుండటం, భయానికి లోనుకావటం, ఆశాభంగం చెందటం వంటి కారణాల వల్ల కొంత మంది దూకుడుగా వ్యవహరిస్తుంటారు. 

అపోహ 7: చికిత్సతో అల్జీమర్స్ తగ్గిపోతుంది.

వాస్తవం: వ్యాధి ప్రారంభంలో గుర్తించినపుడు మందులు, కుటుంబసభ్యుల సేవలు సహకారం వల్ల అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు పెరగటాన్ని, జీవననాణ్యత దిగజారిపోవటాన్ని అదుపుచేయవచ్చు.

అల్జీమర్స్ లక్షణాలు కనిపించినా వెంటనే  వైద్యుడిని సంప్రదించడం ద్వారా సరైన చికిత్సను పొందడంలో సహాయపడుతుంది. అల్జీమర్స్ సమస్యకు న్యూరాలజిస్ట్ ను సంప్రదించి సరైన సమయంలో సరైన చికిత్సను తీసుకున్నట్లు అయితే అల్జీమర్స్ వ్యాధిని నిర్మూలించుకుని సాదారణ జీవితం గడిపేందుకు అవకాశం ఉంటుంది.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262681 మాకు కాల్ చేయగలరు.

About Author –

Dr. G. V. Subbaiah Chowdhary

MD, DM (Neurology)

About Author

Dr. Rama Krishna Chowdhary. Y

Dr. G. V. Subbaiah Chowdhary

MD, DM (Neurology)

Senior Consultant Neurologist & Clinical Director