Categories: Neuroscience

పార్కిన్సన్స్ మరియు వణుకుడు వ్యాధికి ఆధునిక శస్త్ర చికిత్సలతో వైద్యసేవలు

తరగని ఉత్సాహంతో నలభై ఏళ్ల పాటు హైకోర్టు, సుప్రీం కోర్టులో తన వాదనా పఠిమతో న్యాయమూర్తులను మెప్పించి, కేసులను గెలిచి విజయాన్ని తన మారుపేరుగా మార్చుకున్న బలరామ్(67)ఇపుడు సాధారణ సంభాషణల సమయంలోనే వణుకుతూ కనిపిస్తున్నారు. న్యాయవాదిగా అత్యున్నత శిఖరాలు అధిరోహించిన ఆయన క్లిష్టమైన కేసుల తాలూకు వత్తిడిని, ప్రత్యర్థుల ఎత్తుగడల  ఒడిదుడుకులు ఎదుర్కొని  దశాబ్ధాల పాటు స్థిరంగా నిలిచి గెలిచారు.  ఆయన మనో ధైర్యాన్ని వయస్సు ఏమీ హరించలేదు. మరైతే ఇపుడు ఎందుకా వణుకు?ఆయనను నిలువెల్లా కదిలించి వేస్తున్నది పార్కిన్సన్స్ డిసీజ్. సాధారణ భాషలో దీనిని ‘వణుకుడు వ్యాధి’ అంటున్నారు.

 పార్కిన్సన్స్  నరాలకు సంబంధించిన వ్యాధి. మెదడులో డొపమైన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీ కణాలు దెబ్బదినటం, క్షీణించటం కారణంగా ఏర్పడుతుంది. డోపమైన్ మెదడులోని వివిధ భాగాల నుండి శరీరంలోని నాడీ వ్యవస్థకు మధ్య సమాచార మార్పిడి(కమ్యూనికేషన్)కి తోడ్పడే కీలకమైన రసాయనం. దీనిని తయారుచేసే కణాలు క్షీణించటం వల్ల మెదడు దేహంలోని అవయవాలను అదుపుచేయగల సామర్థ్యాన్ని కోల్పోతుంది. దీంతో శరీర భాగాలు ప్రత్యేకించి చేతులు, కాళ్లు, తల  వణుకుతుంటాయి. శరీరంలోని కండరాలు బిగుతుగా తయారవుతాయి. మాట్లాడే విధానంలో తీవ్రమైన మార్పులు వస్తాయి. వ్యక్తి బలహీనంగా తయారవుతారు. ఈ వ్యాధి నెమ్మదిగా పెరుగుతూ తీవ్రస్థాయికి చేరుకుంటుంది. అరవై సంవత్సరాలు పైబడిన వారే ఎక్కువగా పార్కిన్సన్స్ వ్యాధికి గురవుతుంటారు.కొన్ని కుటుంబాలలో మాత్రం వంశపారంపర్యంగా వస్తూ చిన్నవయస్సులోని వారిలో కనిపిస్తుంది.  మనదేశంలో కోటి మందికి పైగా  ఈ వ్యాధితో బాధపడుతున్నారు.

సరైన సమయంలో డాక్టరును సంప్రదించి ఆధునిక ఏర్పాట్లుగల ఆస్పత్రిలో చికిత్సి చేయించుకోవటం ద్వారా దీనిని అదుపుచేసేందుకు వీలుంటుంది. పార్కిన్సన్ వ్యాధి చికిత్స సమూలంగా మారిపోయింది. ఈ వ్యాధిగ్రస్థులు తమను వేధిస్తున్న లక్షణాలను అదుపుచేసుకొని సాధారణ జీవితం గడిపేందుకు ఇదివరకు ఎన్నడూ లేని స్థాయిలో వైద్య(ఔషధ)పరమైన, సర్జికల్ చికిత్సలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. పార్కిన్సన్ వ్యాధి మధ్యస్థాయిలో ఉండి శారీరక పరిమతులు ఎదుర్కొంటున్న వ్యక్తులలో వ్యాధి లక్షణాలను అదుపు చేయటంతోపాటు వాడుతున్న మందుల నుంచి గరిష్ట ప్రయోజనం పొందేందుకు  ఆధునిక చికిత్సలు తోడ్పడుతున్నాయి. మందుల ప్రయోజనం అగుపిస్తున్న, అదృశ్యమౌతున్నస్థితిల మధ్య ఊగిసలాడుతుంటే పార్కిన్సన్ వ్యాధిగ్రస్థులకు అత్యుత్తమ శస్త్రచికిత్సలు ఉపశమనం ఇస్తున్నాయి. శరీరం విపరీతంగా చలిస్తుండే పార్కిన్సన్ పేషంట్లూ వీటి వల్ల ప్రయోజనం పొందగలుగుతున్నారు.

Consult Our Experts Now

వ్యాధికి కారణం ఏమిటి?

పార్కిన్సన్స్ వ్యాధి రావటానికి ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూన్నాయి. ఇప్పటి వరకూ జరిగిన అధ్యయనాలు, పరిశీలన ఆధారంగా కొన్ని ప్రాధమిక కారణాలను మాత్రం గుర్తించగలిగారు. అవి: జన్యుపరమైన కారణం – అత్యధిక కేసులలో పార్కిన్సన్స్ వ్యాధి వంశపారంపర్యంగా రావటంలేదు. అయితే వ్యాధికి గురైన వారిలో 15-25 శాతం మంది కుటుంబంలో ఒకరికి ఈ వ్యాధి ఉంటున్నది. వాతావరణ కాలుష్యం -పరిసరాలలోని రసాయనాలు కొన్ని ప్రజలలో డోపమైన్ తయారీ శక్తిని దెబ్బదీస్తున్నట్లు కొందరు శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. డోపమైన లోపం సహజంగానే వణుకుడు వ్యాధికి దారితీస్తుంది. క్రిమి,కీటకనాశనలు – కాయగూరలు, ఆహార పంటలపై చీడ పీడలను అదుపుచేయటానికి వాడే క్రిమి సంహారక మందుల అవశేషాలు ఆహారం ద్వార శరీరంలోకి చేరటం వల్ల మెదడులోని డొపమైన్ ను ఉత్పిత్తి చేసే నాడీ కణాలు చనిపోతున్నట్లు భావిస్తున్నారు. వయస్సు- వణుకుడు వ్యాధికి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న కారణం వయసు పై బడటం. ప్రధానంగా అరవై ఏళ్లు దాటిన వారే ఈ వ్యాధికి గురవుతున్నారు. వీరిలో స్త్రీలతో పోలిస్తే పురుషుల్లోనే వణుకుడు వ్యాధి ఎక్కువగా కనిపిస్తున్నది. తలకు గాయం- తలకు తీవ్రమైన గాయం కావటం పార్కిన్సన్స్ వ్యాధి రావటానికి గల అవకాశాలను గణనీయంగా పెంచివేస్తున్నది. లోహపు గనుల్లో పనిచేస్తుండటం – మనదేశంలో మాంగనీస్ గనులలో పనిచేసిన కార్మికులలో ఎక్కువ మంది పార్కిన్సన్స్ వ్యాధికి గురయినట్లు గుర్తించారు.

పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు

వ్యాధి ప్రారంభంలో ఆహార పదార్థాల రుచి, వాసన గుర్తించటంలో లోపం ఏర్పడుతుంది. ఇదివరలో ఎంతో ఇష్టంగా తిన్న వంటల పట్ల ఇపుడు ఆసక్తిపోతుంది. రుచిని, పరిమళాన్ని గుర్తించలేని స్థితిలో ఆహారం రుచించదు. ఆపైన ముకవళికలు మారిపోతాయి. ఇదివరలో చిరునవ్వు చిందిస్తూ కనిపించిన వ్యక్తి ముఖం ఎన్నడూలేనంత గంభీరంగా తయారవుతుంది. దీనినే  ఫెషియల్ మాస్కింగ్ అంటున్నారు. శరీరం కాస్తవంగిపోతుంది. కదలికలు నెమ్మదిగా, బిగుతుగా మారతాయి. వ్యాధి ముదరుతుండటంతో చేతివెళ్లతో వణుకు మొదలవుతుంది. ఆపైన చేయి, కాలు వణుకుతుంటాయి. ఏ పనీచేయకుండా ఉన్న సమయంలో చేతివేళ్లు, చెయ్యి, కాళ్లు,  సెకనుకు నాలుగైదు సార్లు వణుకుతుంటాయి. అదే విధంగా చూపుడువేలు, బొటనవేలు లయబద్దంగా రాపిడికి గురవుతుంటాయి. చేతులు, కాళ్లు వణికే ఈ పరిస్థితిలో నడవటం చాలా ఇబ్బందికరం అవుతుంది. ఈ పరిస్థితిలో వ్యక్తి తన అవయవాలపై అదుపుకోల్పోతున్నట్లు గుర్తించగలుగుతారు. ఈ రకమైన లక్షణాలు కనిపించిన వారిలో దాదాపు 70 శాతం మందికి సంబంధించి అవి  పార్కిన్సన్స్ వ్యాధి ప్రారంభంగా డాక్టర్లు గుర్తించారు. ఈ వ్యాధి నిర్ధారణకు ఖచ్చితమైన పరీక్షలు అంటూ ఏమీ లేవు. డాక్టర్లే ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా, లక్షణాలను అడిగితెలుసుకోవటం ద్వారా వ్యాధిని, దాని స్థాయిని గూర్చిన ఓ అవగాహనకు వస్తారు. అయితే పార్కిన్సన్స్ వ్యాధి వల్ల మెదడులోని ఇతర భాగాలకు ఏమైనా ప్రమాదం ఉందా అన్న అంశానికి వారు మెుదట ప్రాధన్యాతను ఇస్తారు. ఇందుకోసం బ్రెయిన్ స్కాన్, ఎం.ఆర్.ఐ. వంటి నిర్ధారణ పరీక్షలుచేసి  అనుమానాలు నివృత్తి చేసుకుంటారు.

చికిత్స

వణుకుడు వ్యాధి చికిత్స ప్రధానంగా వ్యాధి లక్షణాలను అదుపుచేసి, వ్యాధిగ్రస్థులు సాధారణ జీవితం గడిపేట్టు చేసే లక్ష్యంతోనే సాగుతుంది. ఇందుకుగాను వ్యాధి తీవ్రత, రోగి ఆరోగ్యపరిస్థితి – శరీరతత్వాన్ని దృష్టిలో ఉంచుకుని చికిత్సా వ్యూహాన్ని రూపొందించాల్సి ఉంటుంది. ఇందుకు మందులు, ఫిజియో థెరపీ, అవసరాన్ని బట్టి శస్త్ర చికిత్సను ఉపయోగపడతాయి. దాదాపు నాలుగు దశాబ్ధాల క్రితం కనిపెట్టిన ఎల్ డోపా అనే ఔషధం వణుకుడు వ్యాధికి సమర్థంగా పనిచేస్తున్నది. శక్తివంతమైన ఈ మందును డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. లేని పక్షంలో డోసేజ్ మొత్తంలో లోటుపాట్లు ఏమైనా జరిగితే మొత్తంగా మెదడును దెబ్బదిసే ప్రమాదం ఉంటుంది. ఇది మెదడులోని ముఖ్యమైన నాడీకణాలకు సాయపడుతూ డొపమైన్ ఉత్పత్తి జరిగేట్లు చేస్తుంది. దీంతో అవయవాలు బిగుసుకుపోవటం, వణుకుడు తగ్గుతుంది.

డి.బి.ఎస్. సర్జరీ

పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సకు సంబంధించి డి.బి.ఎస్.(డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్) కీలకమైన శస్త్రచికిత్స. పార్కిన్సన్ వ్యాధి పెరుగుదల నిరోధించటంలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డి.బి.ఎస్) శస్త్రచికిత్స ఎంతగానో తోడ్పడుతున్నట్లు గుర్తించారు. ఇది వ్యాధి పెరుగుదలను నియంత్రిస్తుంది. గుండె పనితీరును మెరుగుపరచేందుకు పేస్ మేకర్ అమర్చినట్లుగానే ఈ సర్జరీ ద్వార మెదడులో ఎలక్ట్రోడ్లను అమరుస్తారు. ఇందుకుగాను ముందుగా ఎం.ఆర్.ఐ., సి.టి.స్కాన్ ద్వార వ్యాధిగ్రస్థుల మెదడులో సమస్య ఎక్కడు ఏర్పడింది గుర్తిస్తారు. ఆపైన ఈ చిన్న ఎలక్ట్రోడ్ ను అమరుస్తారు. దీనికి ఓ చిన్న బాటరీ-తీగ ఉంటాయి. మెదడులోని కొన్ని కణాలను తొలగించటం, మరికొన్ని భాగాలకు ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వటం ద్వారా వ్యాధి ముదరకుండా చేయగలుగుతారు. డోపమైన్ తయారీ పునరుద్ధరించగలుగుతారు. పెద్దగా రక్తస్రావం జరగకుండా, ఇన్ఫెక్షన్లకు అవకాశం లేకుండా పూర్తయ్యే ఈ శస్త్రచికిత్స  మెదడు శరీరభాగాలను తన అదుపులోకి తెచ్చుకోవటానికి తోడ్పడుతుంది. ఈ సర్జరీలో మెదడులో రక్తస్రావం లాంటి ప్రమాదాలు 2శాతం కంటే తక్కువ. ఇది పార్కిన్సన్ వ్యాధిని లక్షణాలను తీసివేయలేదు. కానీ వాటిని అదుపులో ఉంచగలదు. ఇది సంక్లిష్యమైన, క్రమం తప్పకుండా న్యూరలాజికల్ ఫాలోఅప్ అవసరమైన సర్జరీ. అయితే ఔషధ చికిత్సచేస్తున్నప్పుటికీ వ్యక్తి జీవననాణ్యత ఏమాత్రం ఆమోదకరం కాని స్థాయికి దిగజారినపుడు డి.బి.ఎస్. ప్రభావశీలమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది.

అయితే  మెదడుకు సంబంధించిన శస్త్రచికిత్స చాలా సున్నితమైనదని, నిపుణులైన సర్జన్లు అత్యాధునిక పరికరాలు, వసతుల మధ్య నిర్వహించవలసిందని యశోద హాస్పిటల్స్ లోని డిపార్టమెంట్ ఆఫ్ న్యూరాలజీ & న్యూరో సర్జరీకి చెందిన వైద్యనిపుణులు చెప్పారు. అందువల్ల పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో భాగంగా డి.బి.ఎస్. సర్జరీ చేయించుకోవలసి వచ్చిన పక్షంలో అందుకు అనుగుణమైన ఏర్పాట్లు ఉన్న ఆస్పత్రిని ఎంపికచేసుకోవటంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

Consult Our Experts Now

డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణియంతో ఇంటర్వ్యూ:

డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణియం సుప్రసిద్ద న్యూరోసర్జన్. యశోద హాస్పిటల్స్(సికింద్రాబాద్) లోని న్యూరోసర్జరీ విభాగంలో సేవలు అందిస్తున్నారు. పార్కిన్సన్స్ తోసహా నాడీమండలపు శస్త్రచికిత్సల విభాగంలో పలు కొత్త మెళకువలను ప్రవేశపెట్టారు.

ప్రశ్న: పార్కిన్సన్ వ్యాధి చికిత్స సర్జరీ మాత్రమేనా?

జవాబు: అదేం కాదు. మందులు కూడా ఉన్నాయి. వ్యాధి ప్రాధమిక దశలో లెవడోపా(సైనోడోపా) తదితర ఆంటీపార్కిన్సన్ మందులు చాలా వరకు మంచి ఫలితాలను ఇచ్చి సాధారణ జీవితం గడిపేందుకు సాయపడతాయి. అయితే వ్యాధి ముదురుతున్న కొలదీ మందులు వ్యక్తి నిత్యజీవితానికి విఘాతం కలిగించే దుష్ఫలితాల(సైడ్ ఎఫెక్ట్స్)ను ఇవ్వటం మొదలవుతుంది. ఎక్కువ కాలంపాటు లెవడోపా వాడటం వల్ల చాలా మంది పేషంట్లలో శరీరం విపరీతంగా కదులుతుండే (డైస్కెనెసియాస్) ఏర్పడుతుంది. అదే సమయంలో మందు ప్రభావం చూపే సమయం ఇదివరకటి కంటే బాగా తగ్గిపోతుంది. ఇది పార్కిన్స్ వ్యాధి తీవ్రత పెరుగుతూ తగ్గుతూ ఉండే హెచ్చుతగ్గుల పరిస్థితిని కలిగిస్తుంది. దీనివల్ల వ్యాధిగ్రస్థ వ్యక్తి నడవగల(మందు పనిచేసినపుడు), అసలు నడవలేని (మందు ప్రభావం తగ్గిపోయినపుడు)స్థితి మధ్య ఊగిసలాడుతుంటారు. మందులతో చికిత్స చేసినపుడు ఈ విధంగా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ సాధారణ జీవితం గడపలేని పరిస్థితిలో చిక్కుకున్నప్పుడు శస్త్రచికిత్సను ఎంచుకోవాలి.

ప్రశ్న: పార్కిన్సన్స్ వ్యాధికి  శస్త్ర చికిత్సలు కొత్తగా వచ్చాయా?

జవాబు: తొలిరోజుల్లో ఇవి మెదడులో థాల్మోటమీ, పాల్లిడోటమీ వంటి శస్త్రచికిత్సల ద్వారా ఈ పార్కిన్సన్స్  వ్యాధికి కారణంగా భావించిన భాగాలను కొంతమేరకు తొలగించేవిగా (ఎబ్లేటివ్ లేదా లీజున్) ఉండేవి. దీనిలో అతిచురుకుగా ఉంటూ పార్కిన్సన్స్ వ్యాధికి కారణమైన మెదడు కణజాలంతో ఖచ్చితమైన భాగాన్ని ఎంచుకుని ఆ భాగాన్నితీవ్రమైన ఉష్ణోగ్రత కలిగిన పరికరంతో నిర్మూలించేవారు. ఈ సర్జరీలు మెదడును శాశ్వతంగా ప్రభావితం చేస్తాయి. కానీ మెదడు రెండువైపులా ఈ శస్త్రచికిత్స చేయటం సురక్షితం కాదు. వ్యాధిగ్రస్థులు కొందరు కోరినపుడు ఇప్పటికీ  ఎబ్లేటివ్ సర్జరీలు చేస్తున్నప్పటికీ సర్జన్లు ఈ పద్దతిని దాదాపుగా వదిలివేశారు.

ప్రశ్న: ఇప్పుడు ఏవిధమైన శస్త్రచికిత్సలు వచ్చాయి?

జవాబు: పార్కిన్సన్స్ వ్యాధికి ఇపుడు ఉపయోగకర ఆధునిక సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో మెరుగైన డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్(డి.బి.ఎస్.) సర్జరీ చేస్తున్నారు. డి.బి.ఎస్. సర్జరీలో ఓ సన్నని (నూడుల్ అంత మందంలో ఉండే)ఎలక్ట్రోడును మెదడులో ఎంపికచేసిన భాగాల వద్దకు పంపుతారు. దీనికి ఓ కంప్యూటరైజ్డ్ పల్స్ జనరేటరును జతచేసి చాతీ ప్రాంతంలో చర్మం కింద అమరుస్తారు. గుండెకు అమర్చే పేస్ మేరకర్ లాగానే ఈ స్టిమ్యులేటర్ తాలుకూ తీగలు కూడా పైకి కనిపించకుండా మొతం చర్మం కిందనే ఉండేట్లు ఏర్పాటుచేస్తారు. తాజాగా స్టెమ్ సెల్ ఇంప్లాంట్ వంటి పునరుద్ధరణ(రిస్టోరేటివ్) చికిత్సలు అందుబాటులోకి వచ్చినప్పటికీ అవి ఇంకా స్థిరపడలేదు.  ప్రధానంగా ప్రయోగాత్మకంగా వాడి చూడటానికే పరిమితం అవుతున్నాయి. పైగా వ్యాధిగ్రస్థులకు సురక్షితం, ప్రయోజనకరం అని  ఎఫ్.డి.ఎ.(అమెరికా) లాంటి ప్రభుత్వ నిర్ధారణ సంస్థల  ఆమోదం ఇంకా పొందలేదు.

ప్రశ్న: డి.బి.ఎస్. ఎలా పనిచేస్తుంది?

జవాబు: డి.బి.ఎస్. సర్జరీ పనిచేసే విధానానికి సంబంధించి 1980, 1990 దశకం ప్రారంభంలోనే వెలుగులోకి వచ్చింది. పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్థులలో డొపమైన్ ను ఉత్పత్తి చేసే కణాలు అంతరించటం వల్ల  మెదడులోని గ్లోబస్ పాల్లిడస్ (జిపిఐ), సబ్ థాల్మిక్ న్యూక్లియస్(ఎస్.టి.ఎన్.) లలో అసాధారణమైన చర్యలు మొదలవుతాయి. పేసింగ్ ద్వారా  వీటికి నిరంతరాయంగా, నిర్ధిష్ట ఫ్రీక్వేన్సీలలో విద్యుత్తును అందిచటం ద్వారా అసాధారణ చర్యలను అదుపుచేయగలుగుతాం. అందువల్ల డి.బి.ఎస్. నేరుగా డోపమైన్ తయారుచేసే కణాలపై పనిచేయదు. మెదడులో డొపమైన్ పరిమాణాన్ని ప్రభావితం చేయదు. అందుకు బదులుగా డొపమైన లోపం వల్ల జిపిఐ, ఎస్.టి.ఎన్ లలో  ఏర్పడిన విపరీత విద్యుత్ విడుదలపరిస్థితిని మారుస్తుంది. నిర్ధిష్ట ఫ్రీక్వెన్సీలో విద్యుత్తు ప్రేరణను అందించటం వల్ల మెదడులోని పరిసర కణాలపై ఎటువంటి ప్రభావం ఉంటుందో మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు.

Consult Our Experts Now

Sekhar Bonagiri

Recent Posts

Pericarditis: Causes, Symptoms, Diagnosis, and Treatment

Chest pain can be a cause for alarm, sending our minds racing with worries about…

11 months ago

The Most Common Waterborne Diseases: Understanding and Prevention

Waterborne diseases, caused by harmful microorganisms and contaminants in water, pose a significant and urgent…

12 months ago

ఆటిజం: రకాలు, కారణాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు

ప్రస్తుత కాలంలో మానసిక ఎదుగుదల లోపం కారణంగా చాలా మంది పిల్లలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అందులో ఆటిజం…

12 months ago

Robotic Surgery Unmasked: Understanding the Facts Behind the Myths

Robotic surgery has grown in popularity, with modern technology and robotic equipment assisting surgeons in…

1 year ago

Epidural Steroid Injections: Say Goodbye to Pain!

Are you suffering from back pain, leg pain, or arm pain? If yes, then you're…

1 year ago

బ్రెయిన్‌ ట్యూమర్‌: కారణాలు, లక్షణాలు మరియు అపోహాలు & వాస్తవాలు

ఇటీవలి కాలంలో జీవన శైలిలో వచ్చిన అనేక మార్పుల కారణంగా చాలా మందిలో ఈ బ్రెయిన్ ట్యూమర్ (మెదడు కణితి)…

1 year ago