అల్జీమర్స్ వ్యాధి గురించి అపోహలు, అనుమానాలు మరియు విలువైన సమాచారం

అల్జీమర్స్ వ్యాధి  గురించి అపోహలు, అనుమానాలు మరియు విలువైన సమాచారం

ప్రముఖ క్రిమినల్ లాయర్ చక్రపాణి (పేరు మార్చాం) చరిత్రాత్మక తీర్పులతో సహా న్యాయశాస్త్ర రంగానికి చెందిన అనేక పరిణామాలను పొల్లుపోకుండా చెప్పటానికి పేరుపొందారు. అటువంటి వ్యక్తి ఇటీవలి కాలంలో చిన్నచిన్న సంఘటనలు కూడా మరచిపోతున్నారు. గడిచిన డిసెంబర్ నెలలో 75 పుట్టిన రోజున బంధుమిత్రుల సమక్షంలో బర్త్ డే కేకును కట్ చేసి స్వయంగా ముక్కలు పంచిన వ్యక్తి డిన్నర్ చేస్తూ మన ఇంటికి ఇంతమంది ఎందుకువచ్చారని ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లటానికి బదులు లాయర్ కోటుతో గుడికి వెళ్లటం, ఇంటికి వచ్చిన తన చిరకాల సహచరుడైన న్యాయవాదిని గుర్తించలేకపోవటం కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి.  ఆయన సూచనమేరకు ఫ్యామిలీ డాక్టరుకు మరియు ప్రధాన ఆస్పత్రిలోని నాడీవైద్య నిపుణులకు చూపించారు. నడిచే న్యాయశాస్త్ర విజ్ఞాన సర్వస్వంగా పేరుబడ్డ ఆయన మతిమరుపునకు కారణం అల్జీమర్స్ వ్యాధి అని చెప్పిన వైద్యనిపులు కొన్ని సూచనలు చేశారు.

అల్జీమర్స్ మెదడులో కణాలు చనిపోతుండటం వల్ల వచ్చే నాడీ సంబంధిత వ్యాధి. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్ధ్యం దెబ్బదింటాయి. ఇటీవలి సంఘటనలు, విషయాలను మరచిపోవటంతో మొదలై క్రమంగా పెరిగి  చివరకు వ్యక్తి తనెవరో తెలియని స్థాయికి ఈ మతిమరపు విస్తరిస్తుంది. అల్జీమర్స్ నిర్ధారణ అయ్యిందనగానే పేషంట్ల కుటుంబ సభ్యులు వారి సన్నిహితులు అల్జీమర్స్, ఆ వ్యాధి లక్షణాలు, రోజువారీ జీవితం పై వాటి ప్రబావం గూర్చి అపోహలు, అనుమానాలతో ప్రశ్నిస్తుంటారు. వైద్యనిపుణుల అనుభవం, ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయనాలు నిర్ధారించిన నిజాలు తెలుసుకోవటం ద్వారా  అల్జీమర్స్ వ్యాధిని సరిగ్గా అర్థంచేసుకునేందుకు, తమ కుటుంబసభ్యులు, ఆప్తులు ఆ వ్యాధి బారిన పడుతున్న పక్షంలో ప్రాధమిక దశలోనే గుర్తించి  దానిని ఎదుర్కోవటానికి సంబంధించి అందుబాటులో ఉన్న వైద్యం  నుంచి పూర్తి ప్రయోజనం పొందేందుకు  అవకాశం కలుగుతుంది.

అపోహ: అల్జీమర్స్ వృద్దులోనే కనిపిస్తుంది.

వాస్తవం: కొంతవరకు నిజమే. అల్జీమర్స్ కు వయస్సు పై బడటానికి నేరుగా సంబంధం ఉంది. 65 సంల వయస్సు దాటిని ప్రతీ 9 మందిలో ఒకరు ఈ వ్యాధికి గురయ్యే అవకాశం కలిగి ఉంటారు. అల్జీమర్స్ వ్యాధి సాధారణంగా 65 సం. పై బడిన వారిలో కనిపిస్తుంది. అయితే కేవలం వృద్దులకు మాత్రమే పరిమితమైనది మాత్రం కాదు. పలు సందర్భాలలో 40-50 సం. వయస్సు వ్యక్తులలో కూడా అల్జీమర్స్ కనిపిస్తున్నది. అయితే ఇటువంటి  మధ్యవయస్కుల్లో కనిపించే అల్జీమర్స్ లక్షణాలను కొంత మంది  డాక్టర్లు మధ్యవయస్సు తాలూకు మతిపరుపుగానో లేక వత్తిడి, మానసిక కృంగుబాటు, మహిళల్లో అయితే మోనోపాజ్ వంటి లక్షణాలుగా భావించి తేలికగా తీసుకుంటుంటారు. దాంతో వ్యాధి ముదిరి పరిస్థితి దిగజారుతుంది.

అపోహ: అల్జీమర్స్ వ్యాధి ఏమీ కాదు. ఇది వృద్ధాప్యంలో వ్యక్తుల్లో కనిపించే సహజ లక్షణాల సముదాయమే.

వాస్తవం: వయస్సు పై పడిన దశలో జ్ఞాపకశక్తి కొంత మందగించటం సహజమే. కానీ అల్జీమర్స్ లక్షణాలైన రోజువారీ జీవితాన్ని గందరగోళపరచగల మతిపరుపు, దిక్కు తోచనిస్థితిలో చిక్కుకోవటం వంటివి వృద్ధాప్యం వల్లనే వచ్చేవి కావు. తాళం చెవులు ఎక్కడో పెట్టి మరచిపోవటం సాధారణ మతిమరుపు లక్షణమే. కానీ వాహనడిపే విధానాన్ని మరచిపోవటం, దశాబ్దాలుగా తిరుగుతున్న వీధులలో దారితప్పిపోవటం వృద్ధాప్యపు మతిమరుపు కాదు. ఈ రకమైన జ్ఞాపకశక్తి క్షీణత ప్రమాదకరమైన విషయం.

వృద్ధాప్యం వల్ల వచ్చే కొద్దిపాటి మతిమరుపునకు భిన్నమైనది. అల్జీమర్స్ ఇది మెదడులో జరిగే మార్పులు, దానిని దెబ్బదీసే పరిణామాల కారణంగా వస్తుంది. ఈ వ్యాధి ముదిరిన కొలదీ ఆలోచించటం, తినటం, మాట్లాడటం  వ్యక్తి సాధారణ, సహజ సామర్థ్యాలను కోల్పోతారు. వృద్ధాప్యం లక్షణాలు అల్జీమర్స్ కాదు. కానీ వయస్సు పై బడిన కొందరిలో అనివార్యంగా వస్తున్న వ్యాధి అల్జీమర్స్.

అపోహ: జ్ఞాపకశక్తి క్షీణించటం అంటే అల్జీమర్స్ వ్యాధి వచ్చినట్టే.

వాస్తవం: ఇది నిజం కాదు. పలు కారణాల వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోవటానికి అవకాశం ఉంది. వయస్సు పై బడటం కావచ్చు లేదా పోషకాహార లోపం కావచ్చు , విపరీతమైన మానసిక వత్తిడికి లోనవటం వల్ల మతిమరపు పెరగవచ్చు. కానీ జ్ఞాపక శక్తి క్షీణించటం వ్యక్తి రోజువారీ వ్యక్తిగత పనులను అస్థవ్యస్థం చేసే విధంగా, ఆలోచనా శక్తిని దెబ్బదీసే విధంగా, ఇతరులతో సంభాషించటానికి వీలుగాని విధంగా  ఉన్నపక్షంలో మాత్రం దానిని తీవ్రమైన సమస్యగా పరిగణించాలి. అపుడు వెంటనే డాక్టరును సంప్రదించి అల్జీమర్స్ ఉన్నది, లేనిది నిర్ధారింపజేసుకోవాలి.

అపోహ: ఒక వేళ   అల్జీమర్స్ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించితే ఇక ఆ వ్యక్తి జీవితం  ముగింపుకు వచ్చినట్లు భావించాల్సిందే.

వాస్తవం: ఏమాత్రం కాదు. అల్జీమర్స్ సోకినా వ్యక్తి చాలా సంవత్సరాల పాటు అర్థవంతమైన జీవితం గడపవచ్చు. గుండెను ఆరోగ్యకరంగా ఉంచగల ఆహారం తీసుకుంటూ క్రమం తప్పని వ్యాయామం, చురుకైన సామాజిక సంబంధాలను కొనసాగిస్తూ మెదడుకు పనిపెట్టే అలవాట్లను కొనసాగించటం ద్వారా అల్జీమర్స్ వ్యాధి ముదరే వేగాన్ని తగ్గించవచ్చు. అల్జీమర్స్ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించితే వ్యాధి లక్షణాలను అదుపుచేయగల చికిత్సకు  మంచి ఫలితాలను ఇవ్వగల మందులూ అందుబాటులోకి వచ్చాయి. అందువల్ల  అల్జీమర్స్ ను ప్రారంభదశలోనే గుర్తించటం చాలా ముఖ్యం.

అపోహ: తల్లిదండ్రుల్లో ఎవరికైనా అల్జీమర్స్ వ్యాధి వచ్చిందంటే తరువాతి కాలంలో వారి పిల్లలూ ఈ వ్యాధిబారిన పడతారు.

వాస్తవం: నిజమే. కానీ ఈ విధంగా వంశపారంపర్య అల్జీమర్స్ వస్తున్నది కొద్దిమందికే.  మొత్తం వ్యాధిగ్రస్థుల్లో కేవంల 5శాతం మందికే వంశపారంపర్య అల్జీమర్స్ వ్యాధి సోకిననట్లు అధ్యయనాలు వెల్లడించాయి. ఒక వ్యక్తి తల్లిదండ్రులు, తోబుట్టువుల్లో ఎవరికైనా అల్జీమర్స్ వచ్చి ఉంటే ఆ వ్యక్తికీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల్లో ఎవరికైనా వృద్ధాప్యానికి ముందే అల్జీమర్స్ వచ్చి వుంటే ఆ వ్యక్తి కూడా అదే విధంగా వృద్ధాప్యానికి ముందే అల్జీమర్స్ బారినపడతారు.

అపోహ: తలకు తగిలిన గాయం అల్జీమర్స్ కు దారితీస్తుంది.

వాస్తవం: తలకు ఒకమోస్తరు, తీవ్రమైన గాయం అయిన పక్షంలో కొద్ది సంవత్సరాల తరువాత అది తీవ్రమైన మతిమరుపు, అల్జీమర్స్ కు దారితీసే అవకాశం ఉందని ప్రారంభంలో జరిగిన కొన్ని అధ్యయనాలలో వెల్లడి అయ్యింది. అదే సమయంలో తలకు  తీవ్రగాయం అయిన ప్రతీ వ్యక్తి అల్జీమర్స్ బారిన పడటం లేదు. ఇటీవల అధ్యయానాలు ఈ విషయంలో మరింత స్పష్టతను ఇస్తూ తలకు అదే పనిగా దెబ్బ తగలటం(ఫుట్ బాల్, హాకీ, బాక్సింగ్ క్రీడలలో లాగా) వల్ల కొంత కాలానికి వ్యక్తి తీవ్రమైన జ్ఞాపక శక్తి సమస్యలు (క్రానిక్ ట్రామాటిక్ ఎన్సెఫలోపతీ) వంటి వ్యాధులకు మాత్రమే గురికావచ్చునని స్పష్టం చేశాయి.

అపోహ: అల్జీమర్స్ వ్యాధిగ్రస్థులు ఆవేశపరులుగా, దూకుడుగా వ్యవహరిస్తుంటారు

వాస్తవం: అల్జీమర్స్ వ్యాధితో కొందరు దూకుడుగా, ఆవేశపూరితంగా మారటం నిజమే. కానీ ఈ వ్యాధి వల్ల అందరూ ఒకేరకంగా ప్రభావితం కారు. వ్యాధి వల్ల  తికమకపడుతుండటం, భయానికి లోనుకావటం, ఆశాభంగం చెందటం వంటి కారణాల వల్ల కొంత మంది దూకుడుగా వ్యవహరిస్తుంటారు. వారు ఆ విధంగా మారటానికి కారణాలను సంరక్షకులు అర్థంచేసుకుని పరిసరాలను వారికి అనువుగా మార్చటం, ఆ విషయం తెలియజెప్పటం ద్వారా వారిని శాంతపరచవచ్చు. ఆరకమైన ప్రవర్తన మితిమీర కుండాఅదుపుచేయవచ్చు

అపోహ: చికిత్సతో అల్జీమర్స్ తగ్గిపోతుంది.

వాస్తవం: వ్యాధి ప్రారంభంలో గుర్తించినపుడు మందులు, కుటుంబసభ్యుల సేవలు సహకారం వల్ల అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు పెరగటాన్ని, జీవననాణ్యత దిగజారిపోవటాన్ని అదుపుచేయవచ్చు. ఈ వ్యాధికి సంబంధించి ప్రస్తుతం రెండు రకాల మందులు అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. కోలినెట్రేస్ ఇనిహిబిటర్స్, మెమంటైన్ అనే ఈ రెండు జనరిక్ మందులకు అమెరికా లోని ఎఫ్.డి.ఎ. ఆమోదం  లభించింది. జ్ఞాపకశక్తి క్షీణించటం, తికమకపడటం, హైతుబద్దంగా ఆలోచించలేకపోవటం వంటి అల్జీమర్స్ వ్యాధి లక్షణాలలో కొన్నింటిని అదుపుచేసేందుకు వీటిని సిఫార్సుచేస్తున్నారు. ఇంతకు మించి అల్జీమర్స్ వ్యాధిని తగ్గించే చికిత్సలేవీ ప్రస్తుతం అందుబాటులోకి రాలేదు.

అపోహ: పోషకాలు, ప్రోటీన్లతో కూడిన సప్లిమెంట్స్ తీసుకోవటం ద్వారా అల్జీమర్స్ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు.

వాస్తవం: విటమిన్లు బి, సి, ఇ, ఫొలేట్ వంటితో కూడిన సప్లిమెంట్లను తీసుకుంటూ ఉండటం ద్వార అల్జీమర్స్ వ్యాధి రాకుండా చూసోవచ్చునని ప్రచారం జరిగుతున్నది. దీనిలో వాస్తవాన్ని పరిశీలించేందుకు జరిపిన అధ్యయానాలు ఏవీ ఈ సప్లిమెంట్లు అల్జీమర్స్ వ్యాధి రాకుండా నిరోధించగలిగినట్లు నిరూపితం కాలేదు.  పోషకాలతో కూడిన సప్లిమెంట్లు, ఫలాలు-ఆహారం వ్యక్తి సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందనటంలో సందేహం లేదు. ప్రత్యేకించి వృద్ధులకు ఇవి మరింత మేలుచేసి వ్యాధులకు దూరంగా ఉంచగలుగుతాయి. అయితే సప్లిమెంట్ల వాడక ద్వారా అల్జీమర్స్ ను నిరోధించటం మాత్రం సాధ్యపడదు.

అపోహ: సులభమైన కొన్ని వ్యాయామాలైన టంగ్ ఎక్సర్ సైజ్, బ్రెయిన్ ఆక్టివేటింగ్ ఎక్సర్ సైజ్  చేయటం ద్వారా అల్జీమర్స్ రాకుండా ముందజాగ్రత్తలు తీసుకోవచ్చు.

వాస్తవం: అల్జీమర్స్ వ్యాధికి సంబంధించి చైతన్యం పెరుగుతుండటం, కిందటి తరాలతో పోలిస్తే ఎక్కువ మందికి ఈ వ్యాధి వస్తుండటం అదే సమయంలో ఆధునిక వైద్యంలో దీనికి చికిత్స అంటూ ఒకటి ఇంకా అందుబాటులోకి రాకపోవటంతో టంగ్ ఎక్సర్ సైజ్, బ్రెయిఆక్టివేటింగ్ ఎక్సర్ సైజ్ లాంటి అనేక ‘చిట్కా చికిత్స’లు ప్రచారంలోకి వచ్చాయి. టంగ్ ఎక్సర్ సైజ్ చేయటంతో అల్జీమర్స్ రాకుండా జాగ్రత్త పడటమే కాకుండా ఒక వేల వ్యాధి వచ్చినా ముదరకుండా అదుపుచేయటవచ్చని ప్రచారం జరుగుతోంది. దీనిలో వ్యక్తి ఉదయాన లేవగానే అద్దం ముందు నిలబడి నాలుకను నోటి నుంచి బయటకు పెట్టి కుడివైపునకు, ఎడమ వైపునకు సాగదీయాలి. ఈ విధంగా కనీసం రోజుకు పదిసారు వల్ల మెదడులోని ప్రధాన భాగాలు ప్రేరిపితం అయి అల్జీమర్స్ రాకుండా ఉంటుందన్నది ప్రచారం. ఇక  బ్రెయిన్ ఆక్టివేటింగ్ ఎక్సర్ సైజ్. ఇది కుంజిళ్లు తీయటం. దీనిలో కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని గుంజి పట్టుకుని గుంజిళ్లు తీయాలి. ఈ విధంగా చేయటం  మొత్తం మెదడును చైతన్య పరుస్తుందని, తద్వారా మెదడు అల్జీమర్స్ వంటి వ్యాధులకు దూరంగా ఉండటమే కాకుండా వ్యక్తి మేధస్సు మెరుగు పడుతుందని చెబుతూన్నారు. మన దేశంలో వినాయక చవితి సమయంలో విఘ్నేశ్వరుడి ముందు పిల్లలు పెద్దలు తీసే ఈ గుంజిళ్లను నేర్పించటానికి అమెరికాతో సహా కొన్ని పశ్చిమ దేశాలలో శిక్షణా సంస్థలు కూడా ఏర్పాయ్యాయి. అయితే ఈ రెండింటితోపాటు అల్జీమర్స్ వ్యాధిని నిరోధించగలవని చెప్పిన వ్యాయామాలు ఏవి నిజంగా  ఆ విధమైన ప్రయోజనాన్ని ఇస్తున్నట్లు ఇంతవరకూ నిరూపితం కాలేదు.

అయితే క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయటం, సమతుల్య ఆహారం తీసుకుంటుండటం, శరీరపు బరువును అదుపులో ఉంచటం, ధూమపానానికి దూరంగా ఉండటం వంటి ఆరోగ్యకమైన జీవనవిధానం మెదడును ఆరోగ్యంగా ఉంచటానికి తోడ్పడుతుంది. అల్జీమర్స్  వ్యాధితో సంబంధం పెంచుకుంటాయని భావిస్తున్న గుండె జబ్బులు, డయాబెటిస్ రాకుండా సాయపడుతుంది. చురుకైన సామాజిక సంబంధాలు కొనసాగించటంవల్ల  మెదడులోని నాడీకణాల మధ్య సంబంధాలను బలపడి మెదడు చురుకుగా పనిచేస్తుంటుంది. ఇది వ్యక్తి ఆలోచనా శక్తి దెబ్బదినకుండా ఉండటానికి తోడ్పడుతుంది.

About Author –

Dr. R. N. Komal Kumar, Neurologist, Yashoda Hospitals – Hyderabad
DM, Fellowship in stroke and Neurosonology

He specialized in treating stroke, Alzheimer’s disease, Parkinson’s disease & movement disorders. Over the years he has performed several neurological procedures in critical care neurology and neurosonology.

About Author

Dr. R. N. Komal Kumar | yashoda hospitals

Dr. R. N. Komal Kumar

DM, Fellowship in Stroke and Neurosonology

Consultant Neurologist & Head-Cerebrovascular Unit