నోటి క్యాన్సర్‌: దశలు, లక్షణాలు, కారణాలు, చికిత్స మరియు నివారణ చర్యలు

నోటి క్యాన్సర్‌: దశలు, లక్షణాలు, కారణాలు, చికిత్స మరియు నివారణ చర్యలు

మాట్లాడటానికి, తినటానికి మరియు ముఖం అందంగా కనిపించటానికి నోరే కీలకం. శరీర పోషణకు అవసరమైన ఆహారం, పానీయాలు లోపలికి చేరేది కూడా నోటి నుంచే. తిన్న ఆహారం లాలాజలంతో కలిసి జీర్ణక్రియ ఆరంభమయ్యేదీ కూడా ఇక్కడే. ఇంత కీలకమైనది కాబట్టే నోటికి ఏ సమస్య వచ్చినా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నోటిలోని వివిధ రకాల కణాలను ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్ నే నోటి క్యాన్సర్ (Oral Cancer) అంటారు. ఈ నోటి క్యాన్సర్ అనేది పెదవుల దగ్గరి నుంచి నాలుక, నాలుక కింది భాగం, చిగుళ్లు, దంతాలు, లోపలి బుగ్గలు, గొంతు మొదలైన వాటిల్లో ఎక్కడైనా రావొచ్చు. 

స్త్రీలతో పోలిస్తే పురుషులకు నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఏ వయస్సులోనైనా నోటి క్యాన్సర్ అభివృద్ధి చెందవచ్చు. 45 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిలో ఈ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా నోటి క్యాన్సర్‌ పుండుగానే మొదలవుతుంది. అయితే ఈ నోటి పుండ్లను పెద్దగా పట్టించుకోకుండా అదే తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యం చేస్తుంటారు. దీంతో చాలామందిలో ముదిరిన తర్వాతే ఈ క్యాన్సర్ బయటపడుతోంది. మనదేశంలో 85-90% నోటి క్యాన్సర్ లు పొగాకు, మద్యం మొదలైనటువంటి దురలవాట్లతో రావడం జరుగుతుంది.

నోటి క్యాన్సర్‌ లక్షణాలు

నోటి క్యాన్సర్ లక్షణాలు అనేవి క్యాన్సర్ వ్యాప్తి యొక్క దశ, ప్రభావిత భాగాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మొదటి రకం నోటి క్యాన్సర్ లో పుండ్లు ఏర్పడి చాలా వారాల వరకు నయం కావు. వీటితో పాటుగా గొంతు భాగంలో కూడా తెలుపు లేదా ఎరుపు పూతలు రావడం వంటివి జరుగుతాయి. 

  • నోటిలో పుండ్లు రావడం: నోటి క్యాన్సర్‌ చాలావరకు పుండుగానే మొదలవుతుంది. ఇది కణితి రూపంలో ఏర్పడటం చాలా అరుదు. ఈ పుండ్లు పెదవులు, నాలుక, అంగిలి, నాలుక కింద, బుగ్గల్లో ఎక్కడైనా ఏర్పడొచ్చు.
  • నోరు సరిగా తెరచుకోకపోవటం: క్యాన్సర్‌ తీవ్రమైతే నోటి కండరాలూ క్షీణిస్తాయి. దీంతో నోరు తెరవటం కష్టమవుతుంది.
  • పళ్ళు వదులవ్వడం: నోటి లోపలి భాగం మరియు చిగుళ్లలో క్యాన్సర్‌ ఉన్నట్టయితే దంతాలు వదులై, కదిలిపోవచ్చు.
  • నోరు దుర్వాసన రావడం: క్యాన్సర్‌ పుండు యొక్క మరో లక్షణం ఎనరోబిక్‌ ఇన్‌ఫెక్షన్‌. దీని నుంచి రకరకాల రసాయనాలు పుట్టుకొస్తాయి. తద్వారా, ముదిరిన దశలో నోటి దుర్వాసన రావొచ్చు.
  • నోటి నుంచి రక్తం రావడం: సాధారణంగా నోటిలో రక్తం అనేది ఏదైనా గట్టి పదార్థాలను నమలడం లేదా మింగడం వంటి సమస్యల వల్ల సంభవిస్తుంది. కానీ నోటి క్యాన్సర్ గల వారిలో నోటి పుండ్లు, చిగుళ్ల వ్యాధి వంటి కారణాల వల్ల గొంతు నుంచి రక్తస్రావం అవుతున్నట్లు అనిపించవచ్చు.
  • నోటిలో లాలాజలం ఊరడం: పుండు మూలంగానో, నొప్పి మూలంగానో సరిగా మింగలేక పోవటం వల్ల లాలాజలం ఊరుతుంది.
  • నొప్పి లేకపోవటం: పుండు అనగానే నొప్పి గుర్తుకొస్తుంది. అయితే క్యాన్సర్‌ ఏర్పడుతున్నప్పుడు దగ్గర్లోని నాడులు క్షీణిస్తాయి కాబట్టి తొలిదశలో నొప్పి తెలియదు. కానీ, క్యాన్సర్‌ ముదురు తున్నకొద్దీ నొప్పి మొదలవుతుంది.
  • నమలడం, మింగడం, మాట్లాడడంలో ఇబ్బంది: నోటిలో మరియు గొంతు భాగంలో పుండ్లు రావడం వల్ల ఆహార పదార్థాలను నమలడం, మింగడం చేయలేరు. అదే విధంగా, మాట్లాడడంలో ఇబ్బంది కూడా వస్తుంది.
  • చెవినొప్పి, దిబ్బడ: గొంతు వెనక మరియు పైభాగంలో క్యాన్సర్‌ తలెత్తితే చెవి దిబ్బడ, నొప్పి వంటి సమస్యలు కలుగుతాయి.
  • గొంతులో మంట మరియు నొప్పి: సాధారణంగా గొంతు నొప్పి, గొంతులో మంట మరియు ఏదైనా మింగినప్పుడు నొప్పి వంటివి తీవ్రతరమవుతాయి. జలుబు, ఫ్లూ మరియు వైరల్ ఇన్‌ఫెక్షన్‌ లు కూడా ఈ గొంతు నొప్పికి కారణం కావొచ్చు.
  • అకస్మాతుగా బరువు తగ్గడం: నోటి క్యాన్సర్ తీవ్రమైన దశలో ఉంటే తినటం కష్టం అవుతుంది, ఆ సమయంలో బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
  • మొద్దుబారటం: నోట్లో నాడులు దెబ్బతింటే నాలుక, దవడ వంటి భాగాల్లో సర్శ లేక రుచి తెలియక మొద్దుబారినట్టు అనిపించవచ్చు.
  • నోరు లేదా గొంతులో నిరంతర గడ్డలు రావడం: కొన్నిసార్లు గొంతులో గడ్డలు మరియు వాపులు సంభవించవచ్చు. పై లక్షణాలతో పాటు నోరు మరియు మెడ భాగంలో నొప్పి మరియు తిమ్మిరిగా కూడా ఉండవచ్చు.

నోటి క్యాన్సర్‌ దశలు

నోటి క్యాన్సర్‌లో 5 దశలు ఉంటాయి, అవి:

స్టేజ్ 0: స్టేజ్ 0 అనేది క్యాన్సర్ ప్రారంభం దశగా చెప్పవచ్చు. ఇది సాధారణంగా నోటి క్యాన్సర్ ప్రారంభం, క్యాన్సర్ యొక్క పురోగతిని సూచిస్తుంది. 

స్టేజ్ I: ఈ దశలో కణితి (ట్యూమర్) పరిమాణం 2 సెం.మీ వరకు పెరుగుతుంది కానీ నోరు లేదా గొంతులో ఒక భాగానికి పరిమితం అయి ఉంటుంది.

స్టేజ్ II: కణితి (ట్యూమర్) అనేది 2-4 సెం.మీ పరిమాణం వరకు పెరుగుతుంది. అదే విధంగా, నోరు మరియు గొంతులోని సమీప భాగాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.

స్టేజ్ III: ఈ దశలో కణితి (ట్యూమర్) 4 సెం.మీ కంటే పెద్దదిగా పెరుగుతుంది. నోరు మరియు గొంతులోని ఇతర భాగాలకు కూడా ఇది వ్యాపిస్తుంది.

స్టేజ్ IV: కణితి (ట్యూమర్) శరీరంలోని ఇతర అవయవాలకు మరియు శోషరస కణుపులకు సైతం వ్యాపిస్తుంది. దురదృష్టవశాత్తూ చాలామంది ఇలాంటి దశలోనే చికిత్స కోసం వస్తుంటారు. 

నోటి క్యాన్సర్ రావడానికి గల కారణాలు

Mouth Cancer Stages_Body 1

నోటి క్యాన్సర్ రావడానికి కచ్చితమైన కారణాలు లేవు. కానీ, కొన్ని రకాల పరిస్థితుల వల్ల ఈ ప్రమాదం మరింతగా పెరుగుతుంది.

  • వంశపారంపర్యం: క్యాన్సర్ రోగులలో ఎక్కువమందికి వ్యాధి కలిగి ఉన్న క్యాన్సర్ బంధువులు లేరు. అన్ని కేసులలో దాదాపు 5 శాతం నుంచి 10 శాతం వరకు క్యాన్సర్ వారసత్వంగా వస్తుంది. వంశపారంపర్య క్యాన్సర్ అనేది ఒక వ్యక్తి యొక్క DNAలో జన్యు పరివర్తన లేదా మార్పును సూచిస్తుంది. ఇది ఇతరులతో పోలిస్తే క్యాన్సర్‌ను అభివృద్ధి చేయడానికి ఎక్కువ అవకాశం కలిగిస్తుంది.
  • పొగాకు వాడకం: నోటి క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం పొగాకు వాడకం. దీంతో పాటుగా సిగరెట్లు, చుట్టలు, బీడీల వంటివి కాల్చటము, పొగాకు, పొగాకు కట్టలు, జర్దా, గుట్కాలనూ నమలడం వల్ల వీటిలో కలిపే రసాయనాలు క్యాన్సర్‌కు దారితీయవచ్చు.  
  • వక్కలు నమలటం: వక్కలు నమలడం ద్వారా నోటిలో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) మొదలై నోట్లోని జిగురు పొరలు గట్టిపడటం (సబ్‌ మ్యూకోజల్‌ ఫైబ్రోసిస్‌) వలన నోరు సరిగా తెరుచుకోదు. మరోవైపు వీటిని అదేపనిగా నమలటం వల్ల నోట్లో అతి సూక్ష్మంగా పగుళ్లు ఏర్పడి క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది.
  • మద్యం సేవించడం: మద్యం సేవించడం క్యాన్సర్ కు బలమైన కారకం. మద్యం శరీరంలోకి వెళ్లిన తర్వాత ఎసిటాల్‌డిహైడ్‌గా మారుతుంది. దీనికి క్యాన్సర్ ను కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • కొన్ని రకాల జబ్బులు: కొందరిలో నోట్లో తెల్లటి, ఎర్రటి మచ్చలుగా కనిపించే లూకోప్లేకియా, ఎరిత్రోప్లేకియా, లైకన్‌ ప్లానస్‌ & నోటి కణజాలం గట్టిపడటం (ఓరల్‌ సబ్‌ మ్యూకోజల్‌ ఫైబ్రోసిస్‌) వంటి సమస్యలు కూడా క్యాన్సర్‌గా మారవచ్చు.
  • పండ్లకు గాయాలవ్వడం: ఎలాంటి చెడు అలవాట్లూ లేని వారిలోనూ మరియు ముఖ్యంగా మహిళల్లో నోటి క్యాన్సర్‌ రావటానికి ఇదొక ముఖ్య కారణం. కృత్రిమ దంతాలు, కట్టుడు పళ్లు స్థిరంగా లేకపోతే తరచూ బుగ్గలకు తాకి పళ్ల మధ్య చర్మం పడి, పుండు ఏర్పడొచ్చు. ఇవి మానకుండా పెద్దగా అయ్యి, క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంటుంది.
  • నోటి శుభ్రత లోపించడం: నోరు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల దీర్ఘకాలంగా నోట్లో వాపు ప్రక్రియకు (ఇన్‌ఫ్లమేషన్‌) దారితీయడంతో క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది. 
  • హెచ్‌పీవీ: హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (HPV) గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కే కాదు, నోటి క్యాన్సర్‌కు కూడా కారణమే. ఇటీవల ఎలాంటి దురలవాట్లు లేని 18-25 ఏళ్ల యువతుల్లోనూ నోటి క్యాన్సర్‌ కనిపిస్తుండటానికి ఈ వైరసే కారణంగా చెప్పవచ్చు.
  • పర్యావరణ కాలుష్యం: మన శరీరంలో క్యాన్సర్‌ను అడ్డుకునే, క్యాన్సర్‌ను ప్రోత్సహించే జన్యువులు రెండూ ఉంటాయి. ఏదైనా భాగంలో ప్రోత్సహించే జన్యువులు ఉత్తేజితమైతే క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది. పర్యావరణ కాలుష్యం వల్ల ఇలాంటి జన్యుపరమైన మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. 
  • వయసు: వయసు మీద పడుతున్న కొద్దీ క్యాన్సర్‌ను అడ్డుకునే కణాల పనితీరు మందగిస్తుంటుంది. అందుకే వయసు తో పాటు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది.
  • పోషణలేమి: రక్తహీనత, విటమిన్‌ బి12 లోపం, విటమిన్‌ డి లోపం గలవారికీ కొంతవరకూ క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉంటుందని చెప్పవచ్చు. 
  • రోగనిరోధకశక్తి (ఇమ్యూనిటీ) క్షీణించటం: రోగనిరోధక వ్యవస్థ మందగించినవారికి, రోగనిరోధకశక్తిని అణచిపెట్టే మందులు వేసుకునేవారికి కూడా నోటి క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది.
  • సమయానికి ఆహారం తీసుకోకపోవడం: సరైన సమయాల్లో ఆహారం తీసుకోకపోవడం మీ శరీరానికి తీవ్రమైన ఆరోగ్య ముప్పును కలిగిస్తుంది. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచి మీ శరీరాన్ని ప్రభావితం చేసే అనేక వ్యాధులకు కూడా కారణం అవుతుంది. 

ఇతర రకాల క్యాన్సర్లకు గురైతే వాటి ప్రభావం ఆధారంగా కూడా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. 

నోటి క్యాన్సర్‌ నిర్ధారణ మరియు చికిత్స విధానాలు

నోటి క్యాన్సర్ చికిత్స అనేది నోటి పరిసర భాగంలో ఏర్పడిన కణితి పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. నోటి క్యాన్సర్ ను నిర్థారించడానికి డాక్టర్ ముందుగా టార్చిలైటు వేసి నోటిని నిశితంగా పరిశీలించి, గ్లౌజులు ధరించిన వేళ్లతో నోటి లోపల తడిమి చూస్తారు. క్యాన్సర్‌ కావొచ్చని అనుమానిస్తే అక్కడి నుంచి చిన్న ముక్కను కత్తిరించి (బయాప్సీ) పరీక్ష చేస్తారు. వీటితో పాటుగా నోరు మరియు గొంతుకు సంబంధించిన ఇమేజింగ్ పరీక్షలు (X-RAY, CT, MRI, PET-CT Scan), ఎండోస్కోపీ, బేరియం స్వాలో వంటి పరీక్షల ద్వారా కూడా నోటి క్యాన్సర్ ను నిర్ధారించడం జరుగుతుంది. అయితే కచ్చితమైన రోగనిర్ధారణకు అన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం రాకపోవచ్చు.  

ప్రారంభ దశలో గుర్తిస్తే నోటి క్యాన్సర్‌ను నయం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే నోటి క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించకపోతే మాత్రం అది శరీరంలోని ఇతర భాగాలకు సైతం వ్యాపించి ప్రాణాంతకం కూడా కావచ్చు. కావున ఒక్కసారి నోటి క్యాన్సర్ వ్యాపిస్తే చికిత్స చేయడం చాలా కష్టతరం అవుతుంది. ఒకటి, రెండు దశల్లో ఉంటే చాలావరకూ సర్జరీతోనే నయం చేయొచ్చు. క్యాన్సర్‌ అనేది బయటకు కనిపించకుండా చుట్టుపక్కల కొంత వరకూ విస్తరించి ఉంటుంది. అందువల్ల పుండు పడ్డ చోటుతో పాటు ఆ భాగాన్ని కూడా అదనంగా కత్తిరిస్తారు. మూడో దశలో శస్త్రచికిత్సతో పాటు రేడియేషన్‌ అవసరమవుతుంది. నాలుగో దశలో సర్జరీ, రేడియేషన్‌తో పాటు మరి కొందరికి కీమో కూడా చేయాల్సి ఉంటుంది. అయితే చికిత్స తరువాత కూడా నోటి క్యాన్సర్ తిరిగి వస్తుందా లేదా అనేది వచ్చిన క్యాన్సర్ రకాన్ని బట్టి ఉంటుంది. 

నోటి క్యాన్సర్‌ నియంత్రణ చర్యలు

  • ధూమపానం మరియు మధ్యపానంను పూర్తిగా మానేయడం
  • సమతుల్య పోషకాహారం తీసుకోవడం
  • ఎల్లప్పుడు నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం
  • క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవడం
  • హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) టీకాలు తీసుకోవడం
  • రోగనిరోధకశక్తిని (ఇమ్యూనిటీ) పెంపొందించుకోవడం

వంశపారంపర్యంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించి తగు పరీక్షలు చేయించుకోవడం మంచిది. లూకోప్లేకియా, లైకన్‌ ప్లానస్‌ వంటి క్యాన్సర్‌కు దారి తీయగల ముందస్తు సమస్యలు గల వారు సైతం 3-4 నెలలకోసారి తప్పనిసరిగా నోటి పరీక్ష చేయించుకోవాలి.

About Author –

About Author

Dr. Chinnababu Sunkavalli | yashoda hospitals

Dr. Chinnababu Sunkavalli

MS (Gen Surg), MCh (Surg Onco), FIAGES, PDCR

Clinical Director-Surgical Oncology, Sr. Consultant Surgical Oncology and Robotic Surgical Oncology