కళ్లకలక (కంజెక్టివైటీస్‌): రకాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు

కళ్లకలక (కంజెక్టివైటీస్‌): రకాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు

దగ్గు, జలుబు మాదిరి సీజనల్‌గా వర్షాకాలంలో వచ్చే సాధారణ వ్యాధుల్లో కళ్లకలక ఒకటి. కళ్లకలక సమస్య స్టాఫిలోకాకల్‌ బ్యాక్టీరియాల ద్వారా గానీ లేదా హెర్పిస్‌ సింప్లెక్స్‌, హెర్పిస్‌ జోస్టర్‌, అడినోవైరస్ ల వంటి అలర్జీల మూలంగా వస్తుంది. కళ్లకలక సోకినవారిలో కళ్లు ఎరుపుగా గులాబి రంగులోకి మారుతాయి. వైరస్ లు మరియు బ్యాక్టీరియాల ద్వారా వచ్చే కళ్లకలకలు ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. అలర్జీల వల్ల కలిగే కళ్లకలక తక్కువ సమయంలో తీవ్రమైన లక్షణాలను చూపి అంతే త్వరగా తగ్గిపోతుంది. అయితే సాధారణంగా ఈ కళ్లకలక సమస్య నివారణకు ఎన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ 4- 7 రోజుల పాటు ఉంటుంది.

ఈ కళ్లకలకలు వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంటాయి, అయితే వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండడం చేత ఈ వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తుంది. కళ్ల కలక ఉన్న వారి కళ్లలోకి చూడడం ద్వారా ఈ సమస్య వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. చేతులతో లేదా నీటితో వైరస్ కళ్లకు అంటుకుంటే తప్ప కళ్లకలక సోకదు. అంటే ఇన్ఫెక్షన్ ఉన్న వారు తెలిసి తెలియక కళ్లలో చేతులు పెట్టుకుని అదే చేత్తో ఏదైనా వస్తువులు లేదా ఇతరులను తాకినప్పుడు ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంతే కాకుండా, ఒక వ్యక్తి ముక్కులో లేదా సైనస్ లో ఉండే వైరస్ మరియు బ్యాక్టీరియా వంటివి ఇతరుల కళ్లలోకి చేరడం వల్ల కూడా ఈ కళ్లకలక వస్తుంది. కళ్లకలక సాధారణంగా చిన్న సమస్యే అయినప్పటికీ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో ఈ వ్యాధి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది.

వైరస్ ల ద్వారా ఏర్పడే కళ్లకలకలు రకాలు

వైరస్ ల ద్వారా ఏర్పడే కళ్లకలకలు 3 రకాలు, అవి:

  1. ఎపిడమిక్‌ కెరటోకంజెక్టివైటీస్‌ (EKC): కళ్లకలకలో ఇది తీవ్రమైన సమస్య. ఇది ఒకరి నుంచి మరొకరికి తేలికగా మరియు అతివేగంగా వ్యాపిస్తుంది. ఈ రకమైన కళ్లకలక సాధారణంగా ఒక కంటికి వచ్చిన వారం రోజుల తర్వాత రెండవ కంటికి కూడా వ్యాపిస్తుంది. ముఖ్యంగా జన సమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ వైరస్ యొక్క తీవ్రత అధికంగా ఉంటుంది.
  2. ఫెరింగోకంజెంక్టివల్‌ ఫీవర్‌: ఇందులో జ్వరం, గొంతు నొప్పి మొదలైనవి కళ్ల కలక యొక్క ప్రారంభదశలో వచ్చే అవకాశం ఉంటుంది.
  3. ఫాలిక్యులర్‌ కంజెక్టివైటీస్‌: ఇది సాధారణ సమస్య. ముఖ్యంగా ఇందులో కళ్లు ఎర్రబడడం, నీరు కారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కళ్లకలకకు గల కారణాలు

కళ్లకలకలు రావడానికి ప్రధాన కారణం వాతావరణ పరిస్థితుల్లోని మార్పులు; వీటితో పాటుగా,

  • ఒక వ్యక్తి ముక్కులో లేదా సైనస్‌లో ఉండే వైరస్‌, బ్యాక్టీరియా వంటివి కంటి స్రావాలు, చేతులు లేదా కళ్ల ద్వారా ఇతరులకు వ్యాపించడం
  • కాంటాక్ట్ లెన్స్ వాడే అలవాటు ఉన్న వారు వాటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం మరియు సరైన లెన్స్ వాడకపోవడం
  • అలర్జీ, దుమ్ము-ధూళి, రసాయనాలు, వాహనాల పొగ, పలు రకాల సౌందర్య ఉత్పత్తుల వాడకం వల్ల కూడా కళ్లకలక వచ్చే అవకాశం ఉంటుంది

కళ్లకలక (కంజెక్టివైటీస్‌) లక్షణాలు

Conjunctivitis Symptoms

  • కళ్లు ఎర్రగా మారి నొప్పిగా ఉండడం
  • కళ్లలో వాపు, దురద మరియు చికాకు
  • కళ్లలో నుంచి నీరు కారటం మరియు మంట పుట్టడం
  • కంటి లోపల ఏదో గుచ్చుకుంటున్నట్లు అనిపించడం
  • ఎక్కువ వెలుతురు చూడలేకపోవడం
  • నిద్రించినప్పుడు కనురెప్పలు అతుక్కుపోవడం
  • ఉదయం లేవగానే ఊసులతో కళ్లు అంటుకోవడం

కొన్ని సార్లు చిన్నపిల్లల్లో జలుబు, జ్వరం వంటి లక్షణాలు సైతం కనిపిస్తాయి. అంతే కాకుండా, కళ్లకలక సమస్యను నిర్లక్ష్యం చేస్తే కళ్ల నుంచి చీము కూడా కారుతుంది.

కళ్లకలక నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మొదటగా కళ్లకలక సమస్యకు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి, వీటితో పాటు

  • కళ్లకలక లక్షణాలు కనిపించినప్పుడు కళ్ళు నలపడం, కంట్లో చేతులు పెట్టడం వంటివి చేయకూడదు
  • ఇంట్లో కళ్లకలక బారిన పడిన వ్యక్తి యొక్క టవల్‌, సబ్బు, ఇతరత్రా వస్తువులను వాడరాదు
  • చేతులను తరచూ సబ్బుతో శుభ్రం చేసుకుంటూ ఉండాలి
  • ఉతికిన టవల్స్‌ మరియు కర్చీఫ్‌లను మాత్రమే వినియోగించాలి
  • కళ్ళల్లో కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునే వారు వెంటనే వాటిని వాడడం ఆపేయాలి
  • ఎక్కువగా జనవాసంలోకి వెళ్లడం చేయకూడదు
  • కళ్లకలకలు త్వరగా వ్యాపిస్తాయి కనుక తగ్గే వరకు నల్ల కళ్లద్దాలు (ఇతరులకు అంటుకోకుండా నిలువరిస్తుంది) ధరించాలి
  • గోరు వెచ్చని నీటిలో కాస్త దూదిని ముంచి కళ్లను వీలైనంత మృదువుగా శుభ్రం చేసుకోవాలి

ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా వ్యాపిస్తుంది. కావున, తగు జాగ్రత్తలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండడం అవసరం. మరి ముఖ్యంగా చిన్నపిల్లలకు గనుక కళ్లకలక వ్యాపిస్తే తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తప్పక పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్లకలక సోకిన వారు సొంత వైద్య పద్దతులతో ఆలస్యం చేయకుండా సమస్య చిన్నగా ఉన్నప్పుడే వైద్యుల సలహా మేరకు లూబిక్రేటింగ్‌ ఐ డ్రాప్స్‌ మరియు యాంటీ ఎలర్జిక్‌ వంటి కంటి మందులను తీసుకోవడం చాలా మంచిది. కళ్లకలక సమస్యను నిర్లక్ష్యం చేసినట్లయితే కార్నియా ఇన్ఫెక్షన్‌కు గురై కంటిచూపు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది.

About Author –

Dr. Ankita Rachuri, Consultant Ophthalmologist, Cataract & LASIK Surgeon, Yashoda Hospital, Hyderabad
MS (Ophth), FIAS (Aravind Eye Institute)

About Author

Dr. Ankita Rachuri | yashoda hospitals

Dr. Ankita Rachuri

MS (Ophth), FIAS (Aravind Eye Institute)

Consultant Ophthalmologist, Cataract & LASIK Surgeon