హెపటైటిస్‌: రకాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు

మన శరీరంలో కాలేయం అనేది చాలా ముఖ్యమైన అవయవం. ఇది శరీరానికి అవసరమైన రసాయనాలను సరఫరా చేసే ప్రయోగశాలగా (రక్తాన్ని వడబోత చేయడం, అంటువ్యాధులు సోకకుండా రక్షణ కల్పించడం) పనిచేస్తుంది. కలుషిత నీరు & ఆహారం, రక్త మార్పిడి తదితర కారణాల వల్ల ప్రస్తుతం కాలేయ జబ్బులు ఎక్కువ అవుతున్నాయి. హెపటైటిస్‌ అనేది జబ్బు కాదు గానీ కొన్ని ఇన్ఫెక్షన్ల సమాహారం. కొన్ని రకాలైన వైరస్ ల కారణంగా కాలేయానికి ఇన్ఫెక్షన్ వచ్చి హెపటైటిస్ వ్యాధికి దారితీస్తుంది. అయితే చాలా మందికి అసలు తాము ఈ వైరస్ ల బారిన పడ్డామన్న విషయమే తెలియకపోవచ్చు. హెపటైటిస్ వైరస్ ల గురించి అవగాహన లేని కారణంగా ప్రపంచవ్యాప్తంగా HIV, TB, మలేరియా వంటి జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య కన్నా ఈ ప్రాణాంతక వైరల్ ఇన్ఫెక్షన్లకు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్యనే అధికంగా ఉంటుంది. ముఖ్యంగా హెపటైటిస్‌ వైరస్ లు కలుషిత ఆహారం & నీరు, వ్యాధి ఉన్న రక్తాన్ని మార్పిడి చేయడం ద్వారా సోకుతాయి. రక్తం, లాలాజలం, వీర్యం, యోని ద్రవం లాంటి పదార్థాలలో ఈ వైరస్ ఉంటుంది. తల్లుల నుంచి పిల్లలకు, శిశువు నుంచి శిశువుకు మరియు అసురక్షితమైన లైంగిక సంపర్కం వల్ల కూడా ఇది సంక్రమిస్తుంది. 

హెపటైటిస్‌లు ప్రధానంగా ఎ, బి, సి, డి, ఇ అనే 5 రకాలుగా ఉన్నాయి. వీటిలో హెపటైటిస్ బి, సి  ప్రమాదకరమైనవి కాగా, హెపటైటిస్ ఎ, ఇ వైరస్‌లు అంత ప్రమాదకరమైనవీ కాదు. హెపటైటిస్ ఎ మరియు హెపటైటిస్ ఇ స్వల్పకాలిక వ్యాధులను, అలాగే హెపటైటిస్ బి, సి, డి దీర్ఘకాలిక వ్యాధులను కలిగిస్తాయి. ఈ వైరస్‌లు శరీరంలోకి చేరిన తరువాత ముందుగా ఎలాంటి లక్షణాలు  కనబడవు, క్రమంగా దీర్ఘకాల ఇన్ఫ్‌క్షన్‌ లుగా మారి కాలేయాన్ని దెబ్బతీస్తాయి. ఈ సమస్యకు సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోతే కాలేయం దెబ్బతిని గట్టి పడడమే కాక కొందరిలో లివర్‌ క్యాన్సర్‌ మరియు సిర్రోసిస్‌ అనే ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయి.

హెపటైటిస్ యొక్క రకాలు

హెపటైటిస్‌ వైరస్ లు ఎ, బి, సి, డి మరియు ఇ అనే 5 రకాలు, వీటిలో ఒక్కో రకం హెపటైటిస్ ఒక్కో వైరస్ వల్ల వస్తుంది.  

హెపటైటిస్ ఎ: హెపటైటిస్ ఎ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ (HAV) వల్ల కలిగే తీవ్రమైన మరియు స్వల్పకాలిక సమస్య. ఈ వైరస్ ఎక్కువగా అపరిశుభ్ర వాతావరణంలో నివసించేవారికి, సురక్షిత నీరు అందుబాటులో లేనివారికి, హెపటైటిస్‌ ఎ ఇన్‌ఫెక్షన్‌ గలవారితో జీవించేవారికి మరియు స్వలింగ సంపర్కులకు వచ్చే అవకాశం ఉంటుంది.

హెపటైటిస్ బి: హెపటైటిస్ బి అనేది డీఎన్ఏ వైరస్‌తో సంక్రమించే వ్యాధి. హెపటైటిస్ బి కలుషిత నీరు లేదా మలం ద్వారా వ్యాపించదు. కానీ, శారీరక సంబంధాలు మరియు శరీర స్రావాలు (వీర్యం, యోని స్రావాలు, & మూత్రం) ద్వారా వ్యాపిస్తుంది. అలాగే ఒకరికి వాడిన ఇంజెక్షన్‌ మరొకరు వాడడం, టాటూలు వేసుకోవడం, ముక్కు, చెవులు కుట్టుకోవడం, ఒకే రేజర్ బ్లేడ్‌ను చాలామంది వాడటం, ఇతరుల టూత్ బ్రష్ వాడటం, అసురక్షితమైన రక్త మార్పిడి వంటి కారణాల వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఇది ప్రధానంగా ప్రసవం ద్వారా తల్లి నుంచి బిడ్డకు సంక్రమిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ 6 నెలల కన్నా ఎక్కువగా ఉంటే క్రానిక్‌ (దీర్ఘకాలిక) హెపటైటిస్‌ బి గా భావిస్తారు.

హెపటైటిస్ సి: హెపటైటిస్ సి వైరస్ ఎక్కువగా ప్రత్యక్ష సంబంధం మరియు లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. ఇది చాలా మందిలో దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ గా మారుతుంది. హెపటైటిస్ సి ఉన్న కొందరిలో ఐదేళ్లలోనే కాలేయ సమస్యలు తలెత్తవచ్చు. హెపటైటిస్‌ సితో హెపటైటిస్‌ బి కూడా కలిగి ఉండటం, మద్యం అలవాటు, మరియు ఊబకాయం వంటివి సమస్యలు దీనిని మరింత తీవ్రతరం చేస్తాయి.

హెపటైటిస్ డి: హెపటైటిస్ డి ని డెల్టా హెపటైటిస్ (HDV) అని కూడా పిలుస్తారు. ఇది హెపటైటిస్ బి ఉన్నప్పుడు మాత్రమే సంభవించే ఒక అసాధారణమైన హెపటైటిస్.హెపటైటిస్ బి ఉంటే తప్ప హెపటైటిస్ డి వైరస్ వ్యాపించదు. చాలావరకు హెపటైటిస్ బి/హెపటైటిస్ డి ఇన్‌ఫెక్షన్లు కలిసే ఉంటాయి. హెపటైటిస్‌ బి మాదిరిగానే ఇది కూడా ఇన్ఫెక్షన్ గలవారితో లైంగిక సంపర్కం, శరీర స్రావాలు మరియు ఒకరు వాడిన సూదులను మరొకరు వాడటం వల్ల వస్తుంది.

హెపటైటిస్ ఇ: హెపటైటిస్ ఇ ఎక్కువగా పరిశుభ్రత లేని ప్రదేశాలలో ఉంటుంది మరియు ఇది సాధారణంగా ఇన్ఫెక్షన్ గలవారి మలం ద్వారా గానీ లేదా కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం ద్వారా సంక్రమిస్తుంది. హెపటైటిస్‌ ఇ ఇన్ఫెక్షన్ అనేది చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది.

హెపటైటిస్ యొక్క లక్షణాలు

Hepatitis Types, Symptoms, and Preventive Measures (Telugu)_Body1 (2)

తీవ్రమైన లక్షణాలు కనిపించే వరకు ఒక వ్యక్తికి హెపటైటిస్ సోకినట్లు కూడా తెలియకపోవచ్చు. అయితే హెపటైటిస్ బారిన పడిన వారిలో సాధారణంగా కనిపించే లక్షణాలు:

  • ఆకలి లేకపోవడం
  • ఆకస్మికంగా బరువు తగ్గడం
  • అలసట
  • పొత్తి కడుపు నొప్పి
  • కండరాల నొప్పులు
  • వికారం లేదా వాంతులు
  • లేత రంగులో మలం రావడం
  • కాలేయం వాచిపోవడం
  • ముదురు పసుపు రంగులో మూత్రం రావడం
  • చర్మం మరియు కళ్ళు పసుపు రంగులోకి మారడం 
  • ఫ్లూ వంటి లక్షణాలు సైతం కనిపిస్తాయి

హెపటైటిస్ నివారణ చర్యలు

కొన్ని ముందు జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ హెపటైటిస్ బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

  • తగినంత పరిశుభ్రతను పాటించడం
  • పరిశుభ్రమైన నీటిని తాగడం 
  • వీధుల్లో దొరికే పండ్ల రసాలు మరియు తిను బండరాలకు దూరంగా ఉండడం
  • సెలూన్ లలో ఇతరులకు వాడినవి కాకుండా శుభ్రమైన బట్టలు మరియు బెడ్లను వినియోగించాలి
  • హెపటైటిస్ బీ, సీ వైరస్ లు ఎక్కువగా లైంగిక సంబంధాల వల్ల వస్తాయి కావున లైంగిక సంపర్కంలో తగు జాగ్రత్తలు పాటించడం అనేది తప్పనిసరి
  • ఇంట్రావీనస్‌ ఇంజక్షన్ ల ద్వారా డ్రగ్స్ తీసుకోవడం వంటి వాటిని పూర్తిగా మానేయాలి
  • కాయగూరలను, పండ్లను నీటితో శుభ్రంగా కడిగిన తరువాతనే తీసుకోవాలి
  • ఇతరులు వాడిన ఇంజక్షన్ లు, సూదులు, బ్లేడ్లు, టూత్‌బ్రష్ లు వంటి వాటికి దూరంగా ఉండాలి
  • ఎట్టి పరిస్థితుల్లోనూ రక్తాన్ని తాకకూడదు, ఎందుకంటే ఇది హెపటైటిస్ ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు
  • రక్తం తీసుకోవలసి వస్తే హెపటైటిస్ బి/హెపటైటిస్ సి పరీక్ష చేసిన తరువాతనే తీసుకోవడం మంచిది
  • హెపటైటిస్ వైరస్‌ల నుంచి రక్షణ కోసం టీకాలను తీసుకుంటూ ఉండాలి
  • తల్లికి హెపటైటిస్ బి ఉంటే ప్రసవ సమయంలో పుట్టే పిల్లలకు కూడా సోకవచ్చు. అందువల్ల పుట్టిన 12 గంటల్లోపూ పిల్లలకు హెపటైటిస్ బి టీకా వేయిస్తే సమస్యను నివారించుకోవచ్చు.

కాలేయ పనితీరు పరీక్షలు, వైరస్ పరీక్షలు మరియు అరుదుగా లివర్ బయాప్సీ వంటి కొన్ని పరీక్షలు చేసిన తరువాత వైద్యులు హెపటైటిస్‌ని నిర్ధారిస్తారు. హెపటైటిస్ సమస్యకు తగిన సమయంలో సరైన చికిత్స తీసుకోవడం వల్ల కాలేయ క్యాన్సర్‌కు దారితీసే లివర్ సిర్రోసిస్ వంటి సమస్యలను సైతం నివారించవచ్చు.

About Author –

About Author

Dr. K. S. Somasekhar Rao | yashoda hospitals

Dr. K. S. Somasekhar Rao

MD (Gen Med), DM (Gastro)

Senior Consultant Gastroenterologist, Hepatologist & Advanced Therapeutic Endoscopist