కాలేయ వ్యాధి: లక్షణాలు, కారణాలు మరియు నివారణ చర్యలు

కాలేయ వ్యాధి: లక్షణాలు, కారణాలు మరియు నివారణ చర్యలు

కాలేయం (లివర్) పరిచయం

శరీరంలోనే చర్మం తరువాత కాలేయం (లివర్) అతిపెద్ద అవయవం. ఇది శరీరంలో కుడి వైపున పై భాగంలో పక్కటెముక కింద ఉంటుంది. కాలేయం సాధారణంగా 1.2 kgల నుంచి 1.5kgల వరకు బరువు ఉంటుంది. ఈ పరిమాణం వయస్సు, శరీరం, లింగం ఆధారంగా మారుతుంది. ఇది శరీరానికి అవసరమైన రసాయనాలను సరఫరా చేసే ప్రయోగశాలగా పనిచేస్తుంది. కాలేయానికి ఏదైనా సమస్య వస్తే శరీరంలో అనేక అనారోగ్యకరమైన సమస్యలు వస్తాయి. 

శరీరంలోని ఇతర భాగాలతో పోలిస్తే దెబ్బతిన్న కణాలను తిరిగి అభివృద్ధి చేసుకోగల సామర్ధ్యం ఒక్క కాలేయానికి మాత్రమే ఉంటుంది. అయితే కలుషిత నీరు, ఆహారం, రక్త మార్పిడి తదితర కారణాల వల్ల కాలేయానికి వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే కాలేయం తను చేయాల్సిన పనులు చేయలేకపోతుందో అప్పుడు మనకు కొన్ని రకాల రోగ లక్షణాలు బయటపడుతాయి. కాలేయవ్యాధి వచ్చిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కాలేయం పూర్తిగా దెబ్బతిని ప్రాణాంతక వ్యాధులు సైతం దరిచేరుతాయి.

కాలేయం యొక్క పనితీరు

శరీరంలో జరిగే చాలా రకాల మార్పులకు కాలేయమే ప్రధాన బాధ్యత వహిస్తుంది.  

  • ఆహార పదార్థాలు, గాలి మరియు నీరు ద్వారా శరీరంలోకి వచ్చే కొన్ని రకాల విషవాయువులను తొలగిస్తుంది.
  • శరీరం పనితీరుకు అవసరమైన అమైనో ఆమ్లాలు మరియు ప్రోటీన్ లను సంశ్లేషణ (synthesis) చేస్తుంది.
  • శరీరం యొక్క శక్తి నిల్వ అయిన గ్లైకోజెన్ మరియు చక్కెరలు కాలేయంలోనే నిల్వ చేయబడతాయి.
  • శరీరంలో ఏర్పడే కొవ్వును జీర్ణం చేయడానికి ఉపయోగపడే పిత్తాన్ని తయారుచేస్తుంది.
  • ఏదైనా గాయం అయినప్పుడు రక్తం గడ్డ కట్టించే ప్రోటీన్ లు, త్రోంబిన్‌ ను సైతం కాలేయం ఉత్పత్తి చేస్తుంది.
  • రక్త ప్లాస్మా కోసం ప్రోటీన్‌ను తయారు చేయడం మరియు జీర్ణక్రియలో సహాయపడడం వంటివి చేస్తుంది.

కాలేయ వ్యాధి లక్షణాలు

దాదాపు 70 శాతం మందిలో కాలేయం బాగా చెడిపోయినంత వరకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. 

అయితే సాధారణంగా కాలేయం వ్యాధిగ్రస్తుల్లో కనిపించే లక్షణాలు:

  • ఒక్కసారిగా బరువు తగ్గడం, కామెర్లు రావడం
  • కామెర్లుతో పాటు జ్వరం రావడం
  • వికారం మరియు రక్త వాంతులవ్వడం
  • మూత్రం లేదా మలం రంగులో మార్పు రావడం
  • నోటి దుర్వాసన మరియు పదే పదే కడుపులో నొప్పి రావడం
  • కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారడం
  • కొందరికి వాంతులు, చర్మంపై దురదలు రావడం

పై లక్షణాలతో పాటు కడుపులో మరియు కాళ్లలో వాపు (ఎడెమా) వచ్చిన దానిని కాలేయ వ్యాధి సమస్యగానే గుర్తించాల్సి ఉంటుంది

కాలేయ వ్యాధికి గల కారణాలు

Liver Disease1

కొంతమందికి పుట్టుకతో మరియు జన్యుపరమైన పరిస్థితుల కారణంగా ఈ కాలేయ సమస్యలు వస్తుంటాయి.

  • హెపటైటిస్ ఎ, బీ, సీ వైరల్ ఇన్ఫెక్షన్ మరియు కలుషితమైన ఆహారం, నీరు కారణంగా ఈ కాలేయ వ్యాధులు దరిచేరుతాయి.
  • ఫాస్ట్‌ఫుడ్‌, చక్కెర సంబంధిత ఆహార పదార్థాలను, కొవ్వు పదార్థాలను అధికంగా తీసుకోవడం.
  • ఊబకాయం మరియు టైప్ 2 మధుమేహం కూడా కాలేయ వ్యాధులకు కారణం కావొచ్చు. 
  • ఒత్తిడి కారణంగా కాలేయ పనితీరు మందగించి కాలేయ వ్యాధులు రావొచ్చు.
  • మద్యపానం, ధూమపానం చేయడం (సిగరెట్ లో ఉండే రసాయనాలు కాలేయంలోకి చేరడంతో కాలేయ పనితీరు నెమ్మదిస్తుంది).
  • శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ కొన్ని సందర్భాల్లో కాలేయంపై దాడి చేసినప్పుడు ఆటో ఇమ్యూన్ కాలేయ వ్యాధులు సైతం సంభవిస్తాయి.

కాలేయ క్యాన్సర్ మరియు లివర్ సిర్రోసిస్

కాలేయం యొక్క కణాలపై క్యాన్సర్ కణితి కణాలు వేగంగా పెరిగినప్పుడు వచ్చే సమస్యనే కాలేయ క్యాన్సర్ (హెపాటోసెల్యులర్ కార్సినోమా) అంటారు. ఈ కాలేయ క్యాన్సర్ పురుషుల కంటే మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.

దీర్ఘకాలంగా మద్యం తీసుకోవడం మరియు హెపటైటిస్ బీ, సీ వైరస్‌ ఇన్ఫెక్షన్ కారణాలతో  కాలేయం (లివర్‌) పూర్తిగా దెబ్బతిని తను చేయాల్సిన పనులను ఎప్పుడైతే చేయలేక పోతుందో  అటువంటి పరిస్థితిని లివర్ సిర్రోసిస్‌ అంటారు.

ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఏమిటి?

కాలేయంలోని కణాల్లో అదనంగా కొవ్వు నిల్వ చేయబడడంతో కాలేయం పనిచేయడం కష్టతరమవుతుంది దీనినే ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఈ సమస్య రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. 

అయితే కొన్ని సందర్భాలలో మద్యపానం తీసుకోకుండానే కాలేయంలో కొవ్వు పేరుకుపోయే పరిస్థితిని నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) అంటారు.

కాలేయ సమస్యలకు తీసుకోవాల్సిన నివారణ చర్యలు

  • సమతుల్య ఆహారం మరియు తక్కువ కొవ్వు పదార్ధాలను తీసుకోవాలి (ఫైబర్ మీ కాలేయం సరైన స్థాయిలో పనిచేయడానికి సహాయపడుతుంది).
  • గాలి, దుమ్ము, కలుషిత నీటితో వచ్చే ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండాలి (హానికర సూక్ష్మక్రిములను మింగే మాక్రోఫేజస్‌ కాలేయ పనితీరును తగ్గిస్తాయి).
  • ఎరుపు రంగు మాంసాలకు దూరంగా ఉండాలి (ఇందులో కొవ్వు అధిక మొత్తంలో ఉన్నందున ఊబకాయం, గుండె, లివర్ జబ్బులకి దారితీస్తుంది).
  • నీటిని పుష్కలంగా త్రాగాలి (ఇది నిర్జలీకరణాన్ని నివారించి కాలేయం మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది).
  • శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి (స్థూలకాయం ఉన్న వ్యక్తుల్లో కాలేయానికి నష్టం కావడమే కాక ఫ్యాటీ లివర్ సమస్యలు సైతం కనిపిస్తాయి).
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి (వ్యాయామంతో వ్యాధినిరోధక శక్తి పెరిగి అనేక వ్యాధులు దరిచేరవు).
  • మద్యపానానికి దూరంగా ఉండాలి (కాలేయ స్థితిని బట్టి మద్యపానం,  పొగాకు వంటి వాటికి దూరంగా ఉండాలి).
  • కాలేయ సమస్యలు ఉన్న వారు ఉప్పు పరిమాణాన్ని తక్కువ మోతాదులో తీసుకోవాలి.

ఆరోగ్యకరమైన జీవితం కోసం కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. దినచర్యలో అవసరమైన కొన్ని మార్పులను చేసుకుంటూ ఉండాలి. అలాగే ఎప్పటికప్పుడూ వైద్యుల సలహా మేరకు రక్త పరీక్షలు, LFT టెస్ట్‌ మరియు అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ పరీక్షలు చేయించుకుంటూ కాలేయం యొక్క పనితీరును తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ విధంగా తగు జాగ్రత్తలు పాటిస్తే కాలేయ వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

About Author –

Dr. Krishnagopal Bhandari,Consultant Gastroenterologist, Hepatologist and Interventional Endoscopist, Yashoda Hospitals – Hyderabad
MD (Internal Medicine), DNB (Gastroenterology)

About Author

Dr. Krishnagopal Bhandari | yashoda hospitals

Dr. Krishnagopal Bhandari

MD (Internal Medicine), DNB (Gastroenterology)

Consultant Gastroenterologist, Hepatologist and Interventional Endoscopist