యువతలో గుండె జబ్బులకు గల కారణాలు, లక్షణాలు & నివారణ చర్యలు
గుండె మన శరీరంలో అత్యంత కష్టపడి పనిచేసే కండరాల్లో ఒకటి. శరీరంలో గుండె అనే అవయవం ఛాతీ, ఊపిరితిత్తుల మధ్య ఉంటుంది. ప్రతి నిమిషానికి 4-5 లీటర్ల రక్తాన్ని గుండె మొత్తం శరీరానికి సరఫరా చేస్తుంది. ఇది ఆక్సిజన్, పోషకాలని రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకి పంపుతుంది. శరీరం నుంచి కార్బన్ డయాక్సైడ్, ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించే పని చేస్తున్నందునే మనిషి ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాడు.
గుండెపోటు రావడానికి గల కారణాలు ?
గుండెకు రక్తాన్ని సరఫరా చేయడానికి మన శరీరంలో కరోనరీ ధమనులు, అనేక రక్తనాళాలు ఉంటాయి. ఈ ధమని గోడల లోపల కొవ్వు నిక్షేపాలు ఏర్పడినప్పుడు ధమని రక్త ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. ఈ విధమైన పక్రియను అథెరోస్క్లెరోసిస్ అంటారు. ఇది కరోనరీ ధమనులలో సంభవించినప్పుడు, గుండెకు తగినంత రక్తం లభించదు. ఈ పరిస్థితిని కరోనరీ గుండె వ్యాధి లేదా లేదా గుండె రక్తనాళాల్లో రక్తం అడ్డుకోవడం అంటారు. ఈ విధమైన పక్రియ వల్లే అన్ని రకాల గుండెజబ్బులకు దారి తీస్తుంది.
అపోహ : గుండె జబ్బు అనేది వృద్ధాప్యంలోనే వచ్చే వ్యాధి.
వాస్తవం : మానవ జీవితంలో 10 సంవత్సరాల వయస్సులోనే శరీరంలో కొవ్వు నిల్వలు ప్రారంభమవుతాయి. ఇందులో కొన్ని కారకాలు కొవ్వులను శరీరంలో పేరుకునేటట్లు చేయడం వల్లే చిన్న వయస్సులోనే గుండె జబ్బులు వస్తున్నాయి.
యువకులలో గుండె జబ్బులకు గల ప్రమాద కారకాలు
సవరించలేని ప్రమాద కారకాలు (ఈ విధమైన కారకాలను ఎవరు మార్చలేరు)
- వయస్సు (వయస్సు పెరిగే కొద్దీ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది)
- లింగం (సాధారణంగా ఆడవారితో పోలిస్తే మగవారిలో ఈ గుండెకు సంబంధించిన ప్రమాదాలు ఎక్కువ )
- కుటుంబ చరిత్ర (మీ మొదటి తరం బంధువులలో ఎవరికైనా చిన్న వయస్సులో గుండె జబ్బులు వస్తే, మీలో కూడా ఈ గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్లు అర్దం చేసుకోవాలి)
సవరించదగిన ప్రమాద కారకాలు (ఈ కారకాలపై ఎవరికి వారు నియంత్రణలను కలిగి ఉంటారు)
- అధిక రక్తపోటు ఉన్నవారు
- మధుమేహం వ్యాధిగ్రస్తులు
- ధూమపానం చేసేవారు
- అధిక చెడు కొవ్వు వల్ల కలిగే ఊబకాయం (అధిక శరీర బరువు)
- శరీరాన్నిఎల్లప్పుడూ ఉత్సహంగా ఉంచుకోకపోవడం
- ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వారిలో కూడా అనేక రకాల గుండె జబ్బులు వస్తాయి.
ఒక వ్యాధితో బాధపడుతున్న పేషంట్లో కంటే అనేక రకమైన వ్యాధులను కల్గి ఉన్న వారిలోనే ఈ తరహా ప్రమాద కారకాలు అనేకం ఉత్పన్నమవుతామయి.
గుండెపై కొవ్వు యొక్క ప్రభావాలు
కొవ్వు అనేది శరీరంలో చాలా కీలకమైన పనితీరును అందిస్తుంది. శరీరంలో చాలా ఎక్కువగా చెడు కొవ్వు ఉండడం వల్ల అది ధమనులలో పేరుకుపోయి రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. దీంతో గుండె పనితీరు కాస్త నెమ్మదించి గుండెపోటు రావడానికి ఈ చెడు కొలెస్ట్రాల్ కారణమవుతుంది.
కొవ్వు యొక్క మూలాలు ఏమిటి ?
కొలెస్ట్రాల్ శరీరంలో 2 ముఖ్యమైన వనరుల ద్వారా లభిస్తుంది. వాటిలో ఆహారం తీసుకోవడం వల్ల మరియు శరీరంలోనే తయారయ్యే కొవ్వు. కొలెస్ట్రాల్‌లో 65% మన శరీరంలో తయారవుతుంది. మిగతా 35% శరీరానికి మనం అందించే ఆహార వనరుల నుంచి లభిస్తుంది.
పై రెండు మార్గాల ద్వారానే శరీరంలోని కొలెస్ట్రాల్ రక్తప్రవాహంలోకి చేరుతుంది.
మంచి కొలెస్ట్రాల్ vs చెడు కొలెస్ట్రాల్ అని ఏదైనా ఉందా ?
శరీరంలో LDL కొలెస్ట్రాల్ అనేది చెడు కొలెస్ట్రాల్. ఇది ధమనులను మూసుకుపోయే ఫలకం యొక్క ప్రధాన భాగం కాబట్టి ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే ధోరణిని కలిగి ఉంటుంది.
HDL కొలెస్ట్రాల్ అనేది మంచి కొలెస్ట్రాల్. ఇది ధమనుల నుంచి చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు శరీరానికి తగినంత శారీరక శ్రమను అందించడం ద్వారా కూడా శరీరంలో కొలెస్ట్రాల్ యొక్క స్థాయిని సాధారణంగా ఉంచుకోవచ్చు.
సిగరెట్, ధూమపానం గుండెపై ఎలా ప్రభావం చూపుతుంది?
అనేక మంది యువకులు గుండెపోటుకు గురవుతున్నారంటే ఇందుకు ప్రధాన కారణం ధూమపానం. సిగరెట్ తాగడం వల్ల రక్తపోటు పెరిగి, శరీరంలో మంచి కొలెస్ట్రాల్ శాతం తగ్గి, చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అంతేకాక ధమనుల్లోని కణాలను ఇవి దెబ్బతీసి, ధమనులలో రక్తం గడ్డకట్టేలా చేయడంతో గుండె జబ్బుల ప్రమాదాలు మరింత పెరుగుతున్నాయి.
మధుమేహం
డయాబెటిస్ ఉన్న వ్యక్తులకు గుండెపోటు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదం 2-3 రెట్లు ఏక్కువగా ఉంటుంది. డయాబెటిస్ లేని వ్యక్తి కంటే డయాబెటిస్ ఉన్న వ్యక్తి గుండెపోటుతో చనిపోయే అవకాశం మరింత ఎక్కు. శరీరంలోని రక్తంలో అధికంగా చక్కెరలు ధమనులలో కొలెస్ట్రాల్‌ను నిక్షిప్తం చేసి రక్త ప్రవాహాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాక ధమనుల గోడలలో మంటను కలిగించి అవి దెబ్బతినే విధంగా ఇవి ప్రేరేపిస్తాయి.
గుండె జబ్బులను నివారించడానికి కొన్ని ముఖ్యమైన నియమాలు
నియమం #1
ఆరోగ్యకరమైన ఆహారం
- ఫాస్ట్ ఫుడ్స్, శీతల పానీయాలు వంటి కేలరీలు ఎక్కువగా మరియు తక్కువ పోషకాహారం వంటి వాటిని తగినంత మోతాదులో తీసుకోవాలి
- సంతృప్త కొవ్వు పదార్దాలు మరియు ట్రాన్స్-ఫ్యాట్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం పరిమితం చేయాలి. అలాగే కొవ్వులు అధికంగా లేని & తక్కువ కొవ్వు ఉండే ఉత్పత్తులను తీసుకోవడం ఉత్తమం
- ప్రతిరోజూ వివిధ రకాల పండ్లు మరియు కూరగాయలను తింటూ ఉండాలి. (ఇందులో కొవ్వు తక్కువగా మరియు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి)
- తక్కువ కొవ్వు మాంసాలు ఉన్న ఆహారాలు (చికెన్, చేపలు, లీన్ కట్స్) మొదలైనవి తీసుకుంటూ ఉండాలి
- ప్రతి రోజు మనం తీసుకునే ఆహారంలో రోజుకు 6 గ్రాముల కంటే తక్కువ ఉప్పును తీసుకోవాలి
నియమం #2
వ్యాయామం
- మీరు ఫిట్‌గా ఉండేలా మరియు మీ కేలరీల తీసుకోవడంతో సరిపోయే శారీరక శ్రమస్థాయిని నిర్వహించాలి
- వ్యాయామం స్థూలకాయాన్ని తగ్గించడమే కాక మధుమేహం, రక్తపోటు స్దాయిని నియంత్రించడంలోనూ తన వంతు పాత్ర పోషిస్తుంది
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండెకు వచ్చే ప్రమాదాలను సగానికి పైగా తగ్గించుకోవచ్చు
- ప్రతి రోజు 30-45 నిమిషాలు మితమైన మరియు తీవ్రమైన శారీరక శ్రమను కల్గి ఉండేలా చూసుకోవాలి. వారంలో కనీసం 5 రోజులైనా ఇలా చేయగలగాలి.
నియమం # 3
ధుమపానాన్ని ఇప్పుడే మానుకోండి
ధూమపానం మానేసిన 24 గంటల లోపు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గడం ప్రారంభమవుతుంది. అంతేకాక ధూమపానం మానేసిన 2 సంవత్సరాలలో ధూమపానం చేయని స్థాయికి ప్రమాదం చేరుకుంటుంది.
ధూమపానం మానేయడం వల్ల క్యాన్సర్లు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు మరియు ఇతర వాస్కులర్ వ్యాధులను నివారించే దాని కంటే గుండె జబ్బులను నివారించడంలోనే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు.
నియమం# 4
మీ సంఖ్యలను తెలుసుకోండి
ప్రతి వ్యక్తి శరీరంలోని రక్తపోటు(BP) సాధారణ స్థాయి వివరాలు అలాగే రక్తంలో చక్కెర స్థాయి నిల్వలు, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తెలుసుకోవడంతో వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి.
సాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలు
LDL కొలెస్ట్రాల్ – 100 mg/dl కంటే తక్కువ (గుండె జబ్బు ఉన్న రోగులకు – 70 mg/dl కంటే తక్కువ) ఉండాలి.
మొత్తం కొలెస్ట్రాల్ 200 mg/dl కంటే తక్కువగా ఉండాలి మరియు HDL కొలెస్ట్రాల్ 40 mg/dl కంటే ఎక్కువగా ఉండాలి.
పెద్దలందరూ తప్పనిసరిగా తమ కొలెస్ట్రాల్ స్థాయిలను పరీక్షించుకోవాలి & సాధారణ స్థాయి ఉన్నవారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తిరిగి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
వ్యాధి లక్షణాలు అసాధారణంగా ఉంటే, వారు జీవనశైలి మార్పు మరియు అవసరమైన మందులతో వాటి స్థాయిలను అదుపులో ఉంచుకునే విధంగా పనిచేయాలి.
సాధారణ రక్తపోటు: సరైన స్థాయిలు 120/80 mmHg ఉంటుంది
పెద్దలు తమ రక్తపోటును 2 సంవత్సరాలలో కనీసం ఒకసారైనా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. వ్యాధి లక్షనాలు లేనప్పటికీ, సాధారణంగా అధిక BP యొక్క లక్షణాలు లేని విధంగా చూసుకోవాలి.
పైన ఉన్న స్దాయిలు ఎక్కువగా ఉంటే – మీ జీవనశైలిని మార్చుకోండి. అలాగే ఆహారం, బరువు, వ్యాయామం మరియు ఉప్పు తీసుకోవడం వంటి వాటిపై నియంత్రణను కలిగి ఉండాలి. మరియు డాక్టర్లు సూచించిన మందులకు కట్టుబడి ఉండాలి.
రక్తపోటు మీలో సాధారణమైన స్దాయిలో ఉన్నప్పటికీ డాక్టర్ని సంప్రదించకుండా మీ మందులను ఆపవద్దు.
సాధారణ రక్తంలో చక్కెర స్థాయిలు:
ఉపవాసం చేసేటప్పుడు <100 mg/dl
భోజనం తిన్న 2 గంటల తరువాత < 140 mg/dl ఉండాలి.
మధుమేహం యొక్క ప్రారంభ లక్షణాలు లేనప్పటికీ పెద్దలందరూ క్రమం తప్పకుండా వారి రక్తంలో షుగర్ లెవల్స్‌ను తెలుసుకునే పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
మధమేహ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లయితే మీ జీవనశైలిని మార్చుకోవాలి. అంతేకాక బరువు మరియు వ్యాయామం క్రమం తప్పక చేస్తూ ఉండాలి.
ఈ సాధారణ నియమాలను అనుసరించడం ద్వారా మరియు సవరించదగిన ప్రమాద కారకాలను అదుపులో ఉంచుకోవడం వల్ల మీరు చిన్న వయస్సులోనే గుండె జబ్బుల బారిన పడకుండా చాలా వరకు నిరోధించుకోవచ్చు.
పై నియమాలు తప్పక పాటించి, ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపండి.