వేరికోస్‌ వీన్స్‌(Varicose Veins)

వేరికోస్‌ వీన్స్‌(Varicose Veins)

ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిల్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్నవాళ్లకు వేరికోస్‌ వీన్స్‌ సమస్య వస్తుంది. ఐటి ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, ట్రాఫిక్‌ పోలీస్‌లు, టీచర్లు, సెక్యూరిటీ గార్డుల వంటి ఉద్యోగాల్లో ఉండేవాళ్లకు వేరికోస్‌ వీన్స్‌ వచ్చే అవకాశం ఎక్కువ. 

ఎందుకొస్తుంది?

సిరల్లో రక్తం గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా శరీరం కింది భాగం నుంచి పై భాగానికి ప్రయాణిస్తుంది. అందుకే రక్తం తిరిగి కిందికి రాకుండా ఉండడం కోసం సిరల్లో కొన్ని కవాటాలు ఉంటాయి. ఈ కవాటాలు డ్యామేజి అయినప్పుడు వేరికోస్‌ వీన్స్‌ సమస్య వస్తుంది. నిరంతరం నిల్చుని, కూర్చుని ఉండేవాళ్లలో ఇలాంటి రిస్కు ఉంటుంది. కొన్నిసార్లు ఈ సమస్య 10 శాతం మందిలో వంశపారంపర్య కారణాల వల్ల కూడా రావొచ్చు. 15 ఏళ్ల కన్నా చిన్నవయసు వాళ్లలో రావడం చాలా అరుదు. 

సమస్యలివీ..

రక్తనాళ సంబంధ సమస్యలు రెండు రకాలు. ధమనుల్లో వచ్చే సమస్యలు, సిరల్లో వచ్చే సమస్యలు. ధమనుల్లో సమస్యలు వృద్ధులైనవాళ్లు, డయాబెటిస్‌ ఉన్నవాళ్లలో ఎక్కువగా కనిపిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో కనిపించే డయాబెటిక్‌ ఫూట్‌ లేదా గ్యాంగ్రిన్‌ సమస్య ఈ కోవలోదే. పెరిఫెరల్‌ రక్తనాళాల్లో (చర్మం కింద ఉపరితల రక్తనాళాల్లో) వచ్చే వేరికోస్‌ వీన్స్‌, కాలు లోపల లోతుగా ఉండే రక్తనాళాల్లో కనిపించే డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌ సమస్యలు సిరల్లో కనిపించే వ్యాధులు.

Consult Our Experts Now

లక్షణాలు

  • కాలు నొప్పి, కాలు వాచిపోతుంది. 
  • మజిల్‌ క్రాంప్స్‌. కండరం లాగినట్టుగా ఉంటుంది. 
  • చర్మంలో మార్పులు వస్తాయి. చర్మం కింద ఉండే రక్తనాళాలు బలహీనమై, ఉబ్బిపోతాయి. అందువల్ల అవి చర్మం పై నుంచి స్పష్టంగా కనిపిస్తాయి. 
  • ఈ లక్షణాల్లో ఏదో ఒకటి ఉన్నా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక నొప్పి, కాలి వాపు, రక్తనాళాలు పైకి కనిపించడం, చర్మంలో మార్పులు, పదే పదే పుండ్లు ఏర్పడి ఎంతకీ తగ్గకపోవడం లాంటి సమస్యల్లో ఏది ఉన్నా వెంటనే డాక్టర్‌ని కలవాలి. నొప్పి ఉన్నా లేకపోయినా డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. 

చికిత్స ఏంటి?

వ్యాధి నిర్ధారణ కోసం ముందుగా క్లినికల్‌గా పరీక్ష చేస్తారు. తరువాత కలర్‌ డాప్లర్‌ స్కాన్‌ చేస్తారు. ఈ స్కాన్‌లో వ్యాధి ఏ దశలో ఉందో తెలుస్తుంది. తొలి దశలో ఉన్నప్పుడు మందులు ఇస్తారు. తరువాతి దశల్లో సర్జరీ, ఇతర చికిత్సలు అవసరం అవుతాయి. వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు సర్జరీ ద్వారా రక్తనాళాలను ఓపెన్‌ చేసి చెడిపోయిన కవాటాన్ని తొలగిస్తారు. ఓపెన్‌ సర్జరీ లేకుండా లేజర్‌ కాంతి పంపించి చెడిపోయిన కవాటం ఉన్నచోట రక్తనాళాన్ని మూసివేస్తారు. గ్లూ ఇంజెక్షన్‌ థెరపీ ద్వారా కూడా ఓపెన్‌ అయిన రక్తనాళాన్ని బ్లాక్‌ చేయడం ద్వారా మూసివేస్తారు. ఓపెన్‌ సర్జరీ అయితే రెండు మూడు రోజులు హాస్పిటల్‌లో ఉండాల్సి వస్తుంది. ఆపరేషన్‌ తరువాత రెండు వారాలు పూర్తిగా విశ్రాంతిగా ఉండాలి. ఈ ఆధునిక చికిత్సలు పూర్తిగా డే కేర్‌ ప్రొసిజర్లుగా చేస్తారు. ఇవి ఓపెన్‌ సర్జరీ కాదు కాబట్టి రక్తస్రావం ఎక్కువగా ఉండదు. వీటికి జనరల్‌ అనెస్తీషియా అవసరం లేదు. లోకల్‌ అనెస్తీషియా చాలు. కాబట్టి చికిత్స తరువాత వెంటనే ఇంటికి వెళ్లిపోవచ్చు. విశ్రాంతి కూడా అవసరం లేదు. కాకపోతే కాళ్ల మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. ఈ చికిత్సల ద్వారా వేరికోస్‌ వీన్స్‌ని పూర్తిగా నయం చేయవచ్చు. అయితే ఆ తరువాత జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోవడం గానీ, నిల్చోవడం గానీ చేయొద్దు. మధ్య మధ్యలో కాళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. లేదా అటూ ఇటూ నడవాలి. పడుకునేటప్పుడు కాళ్ల దగ్గర దిండు పెట్టుకుని దానిమీద కాళ్లు ఉంచాలి. అంటే కాళ్లను కొంచెం పైకి పెట్టుకుంటే కాళ్లలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది.

Consult Our Experts Now

About Author –

About Author

Dr. Prabakar D | yashoda hospitals

Dr. Prabakar D

MS, MCh (Vascular)

Consultant Vascular and Endovascular Surgeon